కొందల నుండి ఈ జనువు కోరి యొనర్చిన చిన్ని పున్నెపున్
సందడులెంచి సౌరవిధు చారుదృగంచల దీప్తమూర్తి నీ
సందిట జేరనెంచితి ప్రసన్నుడవై కయిదండనిమ్ము నా
యందున నీ మనోజ్ఞ దరహాసము వెన్నెలలావరించుతన్
తుదకీ కర్మము త్రోవ యెట్టిదగునో దుర్భేద్య మీ యెల్ల నీ
పదమం దర్పణ జేసెదన్ మదిని మీ భావంబున న్నిల్పేదన్
విదితంబైన భవత్పదార్పితము సర్వేహాతిరిక్తంబు నీ
సదనద్వారమునన్ పరీమళిత పుష్ప శ్రేణి గా మారగన్
భావము చిత్తమం దణగి పాపము పుణ్యము లుప్తమై కవి
త్వావృతి సర్వజీవన రసాకృతిగైకొని వాక్కు కప్పురం
బై వృషవాహ నీ సముఖమందున ప్రజ్వలనంబు చెంది నా
త్రోవల దీప్తియౌత నతదుఃఖఝరీ నృహరీ ప్రమాఝరీ!
భోగంబేటికి, సౌఖ్యమేమిటికి, నా మోహంబు నష్టంబుగా
ఈ గీర్వాణ పథాన సాగెదను, మన్నింపంగదే పుత్రునిన్
యోగాగ్నింబడి దగ్ధమయ్యెదనొ నన్నున్మత్తుగా నెంచి యి
ట్లాగం బేల యొనర్ప లోనికిని బోనై చిత్పదం బానెదన్
మున్వెనుకల్ గణింపక ప్రముగ్ధుడ క్రిందును మీరు చూడలే
కన్వడి నింద్రియార్థముల కారడవిన్‌బడి చిక్కినాను నా
కన్వితమయ్యే నంధుని ప్రయాతి దివాంధుని వెంట, దివ్య గం
ధాన్విత చారులోచన వియన్నదిచూడ! విపన్ను గావవే
నిడువగు నూరుపుల్ పలుక నేరని గాధలు రుద్ద కంఠమై
తడబడు మాటలున్ పదును తగ్గని గుండియవ్రీల్చు గాయముల్
విడువగరాని బంధములు వేడ్కల వెంబడి వెక్కిరింత లీ
తడవున చుట్టుముట్టె, నివి దాటుటలెట్లు కృపాపయోనిధీ
తనువు సగమ్ము దేవికయి దాన మొనర్చిన చంద్రచూడ ఈ
తనువది రోగ సంకులము దారుణ తామస పంకమగ్నమున్
తనువిది వేరుకోరెదరు దారి వెలింగెడు దాక స్వామి నా
యునికికి సార్థకంబయి ప్రయోజితమయ్యెద నీ మహాగ్నికిన్
గంగామజ్జనమాచరించు తమి వేగన్ కాలుషీ వాహినిన్
క్రుంగన్ మేనిదియెల్ల దోషముల బర్వున్ మోయు సంభావనల్
సంగాతంబులు కామదూషితము లచ్చంబైన పెంజీకటుల్
పొంగన్, మారిన ఘీంకృతి స్వనము పోబో క్రొత్తయై భీతియై
ప్రాయశ్చిత్తము లేదొ, చండకిరణ స్పర్శంబు నే నొందగా
జేయంబోవదో స్వచ్ఛ వాయు పథముల్ శ్రీమంతముల్ క్రమ్మవో
ప్రేయస్సంపుటి సంకెలల్ విడువవో శ్రీనాథ భావప్రియా!
నీయొడ్డోలగమందు నిల్పుకొనవా నిర్మాల్యముల్ మోయగన్
చాలుంజాలును తప్త లోహముగ నీ చక్కిన్ ద్రవంబైతి రూ
పోలింగోల్పడి సంకరంబయితి నా ఊహా ప్రసారంబునన్
నాలో నేనెవరో ఎరుంగను మహైనస్సంతతిన్ జిక్కితిన్
కేళీమోహన! చిత్త భంగము సుదీర్ఘేచ్ఛా ప్రపంచంబునన్
బంధురకీర్తి కొల్లలయివచ్చెను నిండిన చాంద్రరోచియై,
అంధువులోన బడ్డయటు లాంధ్యము సార్థక మావరించె, నీ
బంధము కూర్పనెంతు ప్రభు ప్రార్థితు దైన్యము తెంపివేయవే
అంధకవైరి మృత్యుభయ మావల త్రోయవె క్రొత్తవెల్గువై
నిరయ పథంబునన్ జనేడు నేమములొక్కెడ పూర్వజన్మలం
దొరలిన పాప సంఘముల త్రొక్కిడులన్‌బడు టొక్కవైపుగా
గురుడయి వచ్చి ఈ బ్రతుకు కోసల పుణ్యము మూట గట్టి తా
తిరిపెము పెట్టు, నింతఘము తేలికగా వహియించు నేటికై
ఆపదలేమి కావలయు నల్లుకువచ్చుచు నున్న విట్లు నీ
ప్రాపకమంది ప్రేయములు ప్రాప్తములౌనని తుష్టినందగా
ఈ పదబంధమేమిటికొ ఎంతయు విప్పుకొనంగరానిదై
ఓపిక కోలుపోయితి ప్రభూ తొలగింపవె క్లిష్ట సంగతుల్
ఓటమి క్రమ్ముకున్న జను వుండకతప్పదు క్లేశభంగముల్
పాటిలు వేసటల్ కలత పట్టులు వర్షము తోడి ఎండలై
ఏటికి భీతి చక్రములు నీ తిరుగాటలు గౌరవంబులున్
తేటపడంగనిమ్ము సుకృతీశ్వర, కల్మషముల్ దొలంచుచున్