Site icon Sanchika

అశ్రుభోగ-2

ఈ కావ్యం.. దుఃఖం అంటే ఏమిటో తెలుసుకొనే ప్రయత్నం చేసింది. దీనిలో ప్రజ్ఞావాదం లేదు. ‘నష్టోమోహః స్మతిర్లబ్దా’ అన్న దశ లేదు. ‘అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యష్యామి’ అనే జగద్గురువు అభయహస్తం కోరుకుంటున్నారు కవి కోవెల సుప్రసన్నాచార్య.

ఎన్నో నిచ్చెనలెక్కి వచ్చితిని నే, నీ వింత వైకుంఠ పా
ళి నిర్మించిన ధాత ఎంత గడుసో, లీలా వశుండో, తుదిన్
మన్నింపం డొక పెద్ద గ్రాహము నసామాన్యంబు నన్ మ్రింగె నే
నెన్నో లోతుల జారి పాపమయ సంధిన్ జేరితిన్ భీతుడన్

ఇతరుల పీడలందెలిసి ఏ విధినైనను వాని బాపగా
జతన మొనర్చు వైష్ణవుల సంతతి జన్మమునొంది పాపపుం
బ్రతుకుల మధ్యమం దిరికి ప్రాణము లల్లలనాడ నిట్టి వి
చ్యుతిగలిగెస్ ప్రభూ ఎడద తొక్కిన భ్రాంతి తొలంగుటెప్పుడో

జీవుని పెళ్లగించి తన చిత్తములోనికి చేర్చు నూరుపుల్
పూవులు జల్లునట్లు తనువున్ పులకింపగ జేయు చూపులున్
పావురమేమొ నా గగన భాగము తానయినట్టి రాకడల్
ఏ విది? నన్ను గ్రమ్మితి సఖీ మదనాంబక జాల వల్లరీ

విలువలు నిల్పలేని తనువిచ్చి వచస్సున మాధురీ రసాం
చలము పికీరవంబొలికి సర్వజనున్ పరిపాకమిచ్చి న
ట్లలమినదాన! ధర్మమనియాడవు ప్రేమమొ కామమో వెలుం
గులో మరి యిర్లొ నా బ్రతుకు కొంగుల యీ విచికిత్స గూర్చితే

ఎంగిలి తీపియంచు మది నెంచిన జీవితమెల్ల చేదు, స్త్రీ
సంగమే మన్కి లక్ష్యమని చాటిన బోధయే ఆగమంబుగా
ప్రాంగణమెల్ల స్త్రీకలిత రమ్య విలాసమే భావుకత్వమై
దొంగిలితిన్, భవం బిది విదూరముగా పరతత్త్వ సన్నిధిన్

ఆసురసంధ్య యేదొ మనమందునక్రమ్మిన యట్టులుండే భృం
గీసమ వాగ్విలాస మన కేవల సంగతి యందు చిక్కెనో
ఈ సముదాత్త కావ్యజగ మింతటి వాగ్వనితా సమర్చ నీ
దోసిట నొల్క బోసితినొ దుర్భర వేదన లావరింపగా

పాపము పున్నెమున్ తెలియబట్టని లోకముతీరు వేరు ఈ
పాపము పున్నెమున్ మనసు బంటిగ నేర్చిన నాటి కార్య సం
దీపిత మింద్రియార్థముల నేరుపు తీరులు వేరు లోకమా
దాపరికమ్ము చిత్తమున తప్పదు కాదిడె సర్పదంష్ట్రయై

ఇది లాక్షాగృహమం చెరింగి బ్రతుకిందే బుగ్గి మౌనేమొ, సం
పదలున్ సౌఖ్యములంచు తీక్ష్ణ సుఖ విభ్రాంతిన్ విమోహంబునన్
సుదతిన్ తన్‌బడి వచ్చితిన్, విఫలుడై శోభా దరిద్రుండ న
న్నదలింపన్ బనియేమి – ఈ విషమ చిత్రావర్తమం దొక్కడన్
తుదకీ గీమె తొలంగునేమొ నిజబంధూ! తత్కథాంతంబుగన్

గడచిన కాలమందెపుడో క్రమ్మిన కల్మష వేళ యిప్డు న
న్నడలగజేయుచున్నది రహస్సుల నేకతమున్న వేళలన్
పిడికిట బట్టి నన్ను భయపెట్టును కర్మ ఫల ప్రదాత నీ
కడ శరణంటి నన్ సుకృత గాంగజలంబుల ముగ్గజేయవే

నీ దంష్ట్రల్ విరజిమ్ము నగ్ను, లఘముల్ నిశ్శేషముంజేయు, నా
మోదించున్ నను దివ్యమార్గమున నిర్మోహున్ భవత్సన్నిధిన్
వేదారణ్యగుహాశ్రయా! నరహరీ! వృత్త్యగ్రదీపప్రభా!
ఛేదింపంగదే నా అహంతను మహర్షి నీ నఖాగ్రంబునన్

తామయి గుండె చీల్చుకొని దాన ప్రవేశము జేసి, నా వచ
స్తోమము నర్చిరధ్వమున చొక్కగ జేసిన సద్దురూ! కృపా
ధామ! నివేదితం బఘవితానము కాల్పవె, నిత్య భావనా
శ్రీమహిత ప్రకాశ! రస సింధు పరిష్కృత నిత్య యాత్రికా

అందరిలోన నొక్క శిశు వాడును సృష్టికి క్రొత్త దివ్వెయై
అందరిలోన నొక్క పశువాడును జీవుని జారుబండయై
అందరిలోన కొం తఘము లాపయి పుణ్యములున్ ఘటించు నిం
పొందని మన్కి వేదనల పొంగులు తప్పవు, చిత్త విచ్యుతుల్

గురువనుకొంచు జారిపడి కోర్కెల పంకములోన చిక్కితిన్
బరువయి మానసంబు శరపంజరమందున చిక్కి పోవదో
హరిహరి ఎంత దుఃఖమిది ఆ క్షణ మెంతటి పాప దష్టమో
కొరత తొలంపవే బ్రతుకుక్రొన్నెలవంక ధరించు వేలుపా

నీ దయ వేల్పుటేరగుచు నెత్తిన దూకదొ, పుట్టువుల్ వ్యధా
పాదులు నన్ను వీడ్కొనునొ, భక్తులు నన్ దరిచేర వత్తురో
పాదుతొలంచి నా యెడద పట్టున నీవయి నిల్చి పోదువో
శ్రీదయితామనోరమణ! చిత్తసరోరుహసూర్యతేజమా!

కొందల నుండి ఈ జనువు కోరి యొనర్చిన చిన్ని పున్నెపున్
సందడులెంచి సౌరవిధు చారుదృగంచల దీప్తమూర్తి నీ
సందిట జేరనెంచితి ప్రసన్నుడవై కయిదండనిమ్ము నా
యందున నీ మనోజ్ఞ దరహాసము వెన్నెలలావరించుతన్

తుదకీ కర్మము త్రోవ యెట్టిదగునో దుర్భేద్య మీ యెల్ల నీ
పదమం దర్పణ జేసెదన్ మదిని మీ భావంబున న్నిల్పేదన్
విదితంబైన భవత్పదార్పితము సర్వేహాతిరిక్తంబు నీ
సదనద్వారమునన్ పరీమళిత పుష్ప శ్రేణి గా మారగన్

భావము చిత్తమం దణగి పాపము పుణ్యము లుప్తమై కవి
త్వావృతి సర్వజీవన రసాకృతిగైకొని వాక్కు కప్పురం
బై వృషవాహ నీ సముఖమందున ప్రజ్వలనంబు చెంది నా
త్రోవల దీప్తియౌత నతదుఃఖఝరీ నృహరీ ప్రమాఝరీ!

భోగంబేటికి, సౌఖ్యమేమిటికి, నా మోహంబు నష్టంబుగా
ఈ గీర్వాణ పథాన సాగెదను, మన్నింపంగదే పుత్రునిన్
యోగాగ్నింబడి దగ్ధమయ్యెదనొ నన్నున్మత్తుగా నెంచి యి
ట్లాగం బేల యొనర్ప లోనికిని బోనై చిత్పదం బానెదన్

మున్వెనుకల్ గణింపక ప్రముగ్ధుడ క్రిందును మీరు చూడలే
కన్వడి నింద్రియార్థముల కారడవిన్‌బడి చిక్కినాను నా
కన్వితమయ్యే నంధుని ప్రయాతి దివాంధుని వెంట, దివ్య గం
ధాన్విత చారులోచన వియన్నదిచూడ! విపన్ను గావవే

నిడువగు నూరుపుల్ పలుక నేరని గాధలు రుద్ద కంఠమై
తడబడు మాటలున్ పదును తగ్గని గుండియవ్రీల్చు గాయముల్
విడువగరాని బంధములు వేడ్కల వెంబడి వెక్కిరింత లీ
తడవున చుట్టుముట్టె, నివి దాటుటలెట్లు కృపాపయోనిధీ

తనువు సగమ్ము దేవికయి దాన మొనర్చిన చంద్రచూడ ఈ
తనువది రోగ సంకులము దారుణ తామస పంకమగ్నమున్
తనువిది వేరుకోరెదరు దారి వెలింగెడు దాక స్వామి నా
యునికికి సార్థకంబయి ప్రయోజితమయ్యెద నీ మహాగ్నికిన్

గంగామజ్జనమాచరించు తమి వేగన్ కాలుషీ వాహినిన్
క్రుంగన్ మేనిదియెల్ల దోషముల బర్వున్ మోయు సంభావనల్
సంగాతంబులు కామదూషితము లచ్చంబైన పెంజీకటుల్
పొంగన్, మారిన ఘీంకృతి స్వనము పోబో క్రొత్తయై భీతియై

ప్రాయశ్చిత్తము లేదొ, చండకిరణ స్పర్శంబు నే నొందగా
జేయంబోవదో స్వచ్ఛ వాయు పథముల్ శ్రీమంతముల్ క్రమ్మవో
ప్రేయస్సంపుటి సంకెలల్ విడువవో శ్రీనాథ భావప్రియా!
నీయొడ్డోలగమందు నిల్పుకొనవా నిర్మాల్యముల్ మోయగన్

చాలుంజాలును తప్త లోహముగ నీ చక్కిన్ ద్రవంబైతి రూ
పోలింగోల్పడి సంకరంబయితి నా ఊహా ప్రసారంబునన్
నాలో నేనెవరో ఎరుంగను మహైనస్సంతతిన్ జిక్కితిన్
కేళీమోహన! చిత్త భంగము సుదీర్ఘేచ్ఛా ప్రపంచంబునన్

బంధురకీర్తి కొల్లలయివచ్చెను నిండిన చాంద్రరోచియై,
అంధువులోన బడ్డయటు లాంధ్యము సార్థక మావరించె, నీ
బంధము కూర్పనెంతు ప్రభు ప్రార్థితు దైన్యము తెంపివేయవే
అంధకవైరి మృత్యుభయ మావల త్రోయవె క్రొత్తవెల్గువై

నిరయ పథంబునన్ జనేడు నేమములొక్కెడ పూర్వజన్మలం
దొరలిన పాప సంఘముల త్రొక్కిడులన్‌బడు టొక్కవైపుగా
గురుడయి వచ్చి ఈ బ్రతుకు కోసల పుణ్యము మూట గట్టి తా
తిరిపెము పెట్టు, నింతఘము తేలికగా వహియించు నేటికై

ఆపదలేమి కావలయు నల్లుకువచ్చుచు నున్న విట్లు నీ
ప్రాపకమంది ప్రేయములు ప్రాప్తములౌనని తుష్టినందగా
ఈ పదబంధమేమిటికొ ఎంతయు విప్పుకొనంగరానిదై
ఓపిక కోలుపోయితి ప్రభూ తొలగింపవె క్లిష్ట సంగతుల్

ఓటమి క్రమ్ముకున్న జను వుండకతప్పదు క్లేశభంగముల్
పాటిలు వేసటల్ కలత పట్టులు వర్షము తోడి ఎండలై
ఏటికి భీతి చక్రములు నీ తిరుగాటలు గౌరవంబులున్
తేటపడంగనిమ్ము సుకృతీశ్వర, కల్మషముల్ దొలంచుచున్

అసమ నినీష జీవితమునందున నన్ని పథాల ముద్ర వే
య సమజ వృత్తిలోగొని వియత్తల మంచున త్రోసివేసి నా
దెస కనకుండ బోయితివి ధిక్కృతిలోపల దాచి భ్రష్టతా
భ్యసనము వృత్తియయ్యె విషయానుగమై భ్రమ చెందినానిటన్

దుఃఖముతో నొడంబడికతో బ్రతుకీడ్చుచున్నయప్డు శ్రే
యః ఖని తాను కెంజివురుకన్నుల లోకములేలు తల్లి స్వాం
తఃఖనితంబుగా భువి సుతారపు మిన్నుల చంద్రవంకయై
స్వఃఖగముంబొనర్చి భవసంగతి త్రెంచుము గోటి యంచునన్

అనిరుద్ధంబులు తీవ్ర వృత్తులకు లోనై దారులం గోలుపో
యి నిషిద్ధంబులు త్రోవలన్ బడలి సాధింపంగ సౌభాగ్య చిం
తన తీరంబుల సాగి పోవవలె ఆర్తత్రాణ జీవాతువా!
నిను సేవించెద నిన్ దలంచెద భవానీనాథ రక్షింపవే

కామము కొల్లగొట్టును వికాసము క్రోధము చిత్త విభ్రమ
ఫేమము, లోభమోహములు చేర్చును నిర్ల కొటారు, నింద్రియ
గ్రామము బంది సేయు విషగర్తమునన్ కృతదోష బంధమై,
శ్రీమహితానుభావమును చెందిన వెల్లుల జల్లు చిందవే

ఒక మూసంబడి యేగుచున్కి యిది ఏదో నెత్తిపై బడ్డ పి
డ్గు కృపావర్షము వెల్లువెత్తినపు డీఘోరం బిదేలాటిదో
బకవద్ధ్యానము లేమి సేయు, వికట ప్రారంభముల్ క్రమ్మ నా
నికటంబందున చేరరావొ నను మన్నింపంగ సౌగంధివై

గరవడియున్న మన్కి కినకాంతులు విప్పుకొనంగజేయవే
పరిణతి గల్గ దీ యుపల భావము లెన్నియుగాలు సాగునో
నిరతము నిన్ దలంచుటయే నీ మధురాగమనంబు వేచుటే
హరిహరి రామచంద్ర పరియాచకమేల వ్యధార్తుతోడుతన్

కొబ్బరి పాలవంటి పలుకుల్ వెలయించెడువారు లేరు ఇం
తబ్బురమైన ప్రజ్ఞగని అచ్చెరువొందెడువారు లేరు, నన్
ప్రబ్బిన ప్రీతి పొంగులను పంచుకొనంగలవారు లేరు
ఈ దబ్బర లోకమందు నమృతంబులు చిల్కెడువారు కల్గరున్

ఎన్నొ అళీకముల్ పలికి, ఎంతటి అర్థము మూటగట్టి రా
జాన్నము మ్రింగి మ్రింగి, తనువంటిన ఆమయముల్ తపింప జే
య న్నిరయంబు త్రోవల వ్యధావధి దేహములేక యేడ్చుచున్
తెన్నులెరుంగ లేని పరిదేవన మెవ్వని విన్కి కెక్కెడున్

ఎదిరి ఎవండొ నేనెరుగ నింతకు స్వీయుడెవండొ, గుండెలో
పదునగు వెల్లుటంగడుల భావమునందున నిల్వజాలకన్
తుదకు నొకండనై పృథివి తొల్చుచు బోదునొ, అగ్ని జొత్తునో,
వెదకుచు వచ్చు నాపదల వెంబడి యాతనలస్ భరింతునో

ఇది మృత్యధ్వము పారిపోవుటకు లేనేలేదు, ఈ మన్కికిన్
తుది తా నిశ్చితమై కనంబడును, ఎంతో దవ్వొ చెప్పంగ జా
లను, జీవావళి మ్రింగు గ్రాహమిది, లీలాడోల ఈ సృష్టికిన్
పదునౌ ఖడ్గము చిత్త జాగృతియె నిల్పంజాలు ప్రజ్ఞానమున్

ఈ దేహంబును వార్ధకంబె తొలుచున్ బీభత్సతల్ కూర్చు రో
గాదుల్ చీల్చును, దీని వెంటపడి చేతోహంకృతుల్ పేల్చు, ఓ
ర్పేదన్ చిత్తము చాల కోరుకొను అంభోర్చిర్ధారా వాయువుల్
సేదన్ దేరగనీవు ఏ క్షణము లక్షించున్ దురంత స్థితిని

ఒక పదియేండ్ల మున్ను తనయుండరిగెన్ సురలోకవీధి చే
రిక యయి రెండునేండ్లకును ప్రేముడి చెల్లియు స్వర్గవాసియై
సుకృతి పితృవ్యు డచ్యుతుని చోటికి చేరె, మరొక్కయేటికిన్
ప్రకటిత కీర్తి గౌరిపద పద్మము జేరెను తన్వి యొంటిగా

ఎనుబది రెండునేండ్లు చనె నిప్పటి కీ వ్యథ చాలనట్లుగా
మనసున కొత్త ఘాతము అమాంతము మృత్యువు చిన్నకూతు భ
ర్తను దిగమ్రింగె, రాయినయి రాపిడి పొందనులేక చావు తా
డనమున ప్రాణమందదుపు డాబు చెలంగదొ భగ్న చిత్తమై

ఏడ్పిది జన్మలె న్ననుభవించిననైనను పోదు పాపపుం
గాడ్పిది భావగంధమయి ప్రల్లదమై ఎద నావరించుబో
వీడ్పడినట్టి సంగతిని వెఱ్ఱి  చికాకులు క్రమ్మునీ భువిన్
తడ్పని మేఘమై మనికి దారుల గ్రీష్మము నిండిపోయెడున్

(సశేషం)

Exit mobile version