అష్టావక్ర నాయికలు – పుస్తక పరిచయం

0
2

[dropcap]అ[/dropcap]త్తలూరి విజయలక్ష్మి గారి ‘అష్టావక్ర నాయికలు’ అన్న రచన తెలుగు టీవీ సీరియల్స్ తీరుతెన్నులపై ఎక్కుపెట్టిన వ్యంగ్యాస్త్రం.

ఇప్పుడు బుల్లితెర మీద కనిపించే ఆధునిక అత్తగార్ల చేతిలో ఏకంగా యాసిడ్‌ సీసాలు, కాలకూట విషాలు, చిటికె వేస్తే రివ్వున వాలిపోయే వందమంది రౌడీలు, కళ్ళల్లో పగ, కసి, క్రౌర్యం, నీచత్వం…!

కోడళ్ళు తక్కువ తిన్నారా! బుర్రనిండా చూసేవాళ్ళ బుర్ర తిరిగిపోయేలాంటి ఎత్తులు, జిత్తులు… ఇంక ఆడపడుచులు, సవతులు, వియ్యపురాళ్ళు, పక్కింటివాళ్ళు, పనివాళ్ళు… బాప్‌రే.. ఒకళ్ళను మించి ఒకళ్ళు…

ఒంటిమీద డిజైనర్‌ జాకెట్లు, అరచేతి మందాన మేకప్పులు, పెదాలనిండా లిప్‌స్టిక్‌లతో బహు సుందరంగా కనిపించే ముద్దుగుమ్మలు…

ఇలాంటి అష్టావక్ర నాయికలను గూర్చి పాఠకులు ఈ పుస్తకంలో తెలుసుకుంటారు.

***

“మనలో చాలామందికి చాలా ఆశలుంటాయి… కొన్ని ఆశయాలు ఉంటాయి. కొందరు కలెక్టర్ కావాలి అనుకుంటారు. కొందరు లాయర్ కావాలి అనుకుంటారు… కొందరు డాక్టర్ కావాలి అనుకుంటారు….. మరి కొందరు యాక్టర్ కావాలి అనుకుంటారు. కానీ మన సుబ్బలక్ష్మిగారు మాత్రం రచయిత్రి కావాలి అని ఆశపడ్డది. ఆశపడడమేనా! పెళ్లి అయిన దగ్గరనుంచి భర్తగారి ప్రోత్సాహంతో పట్టువదలని విక్రమార్కుడిలా, పట్టు పరిశ్రమ స్థాపించి, ఆ పరిశ్రమలో పుంఖానుపుంఖాలుగా రచనలు వండి వార్చింది. భర్తగారు ఎంతో సహనంతో అవిడ రచనలు ప్రతి రోజు ఆఫీస్‌కి వెళ్తూ, వెళ్తూ కొరియర్‌లో పంపడం, అయన ఆఫీస్ నుంచి తిరిగి వచ్చేసరికి ఆ రచనలు కూడా తిరిగి రావడం జరుగుతుంది.

తన ప్రాణానికి ప్రాణం అయిన భార్య సుబ్బలక్ష్మి ఒడిలో తలపెట్టుకుని పడుకోవాలని కలలు కన్న బాలకృష్ణ తన కలలన్నీ ఆవిడ రచయిత్రిగా పేరు గడించాకే తీరేది అని డిసైడ్ అయి ఎలాగైనా ఆవిడని రచయిత్రిని చేయాలన్న బాధ్యత భుజాల మీద పెట్టుకుని ఆవిడకి ఓ సలహా ఇచ్చాడు.

ఇంతకీ ఆ  సలహా ఏంటి? ఆవిడ కల నెరవేరిందా… సుబ్బలక్ష్మి ‘రచయిత్రి సుబ్బలక్ష్మి’ అనిపించుకున్నదా… తెలుసుకోవాంటే ఈ నవ్వుల గంపలో దూరాల్సిందే” అన్నారు రచయిత్రి అత్తలూరి విజయలక్ష్మి ‘నా మనసులో మాట’లో.

***

“తెలుగు టీవీ సీరియల్స్ లక్షణాల భిత్తిక మీదే, వాటి ‘భరతం’ పట్టేందుకే అన్నట్లుగా – అత్తలూరి విజయలక్ష్మి భరతుని అష్టవిధ నాయికల్లా – ఈ ‘అష్టావక్ర నాయికలు’ సృష్టించి, ‘దృశ్య, మాధ్యమ మీడియా’పై తన కలంతో ‘దాండియా’ ఆడుతోంది.

ఈ నాయికల స్వరూప స్వాభాలు, వ్యవహార సరళి, ఆ పాత్రల మధ్య పరస్పర సంబంధాలు, ఆయా పాత్రల విశిష్టతలు, విలక్షణతలు ఇవన్నీ తెలుసుకోవడానికి విధిగా ఈ రచనను చదవాలి. చదివినకొద్దీ చదవాలనిపించేలా చవులూరుస్తూ – హాస్యరసానికి ఆలవాలమై, వ్యంగ్యం చిప్పిల్లుతూ, చదువరికి చిరునవ్వులనూ, టీవీ సీరియళ్ళ నిర్మాతలకూ, వీక్షకులకు వ్యంగపు చరుపులనూ ప్రసాదిస్తూ పరిఢవిల్లుతున్న ప్రయోగాత్మక రచన ఇది.

బంగారానికి తావి అబ్బినట్లుగా ఈ రచనకు ‘సరసి’గారి బొమ్మలు సమకాలీనంగానూ, అలరించేవిగా వున్నాయి!

నిశిత పరిశీలనం గల సామాజిక రచయిత్రి కనుకనే, నాటకీయత పండించగల నేర్పరి కనుకనే అత్తలూరి విజయలక్ష్మి ఈ ‘అష్టావక్ర నాయికలు’తో తెలుగు టీవీ సీరియల్స్‌పై ఇంతటి వ్యంగ్య రచన చేయగలిగారు” అన్నారు సుధామ ‘టీవీ సీరియల్స్‌పై ‘వ్యంగ్యలక్షణ’ గ్రంథం’ అనే ముందుమాటలో.

***

అష్టావక్ర నాయికలు
అత్తలూరి విజయలక్ష్మి
ప్రచురణ: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, విజయవాడ
పేజీలు : 142, వెల: ₹ 120.00
ప్రతులకు:
విశాలంధ్ర బుక్ హౌస్ వారి అన్ని శాఖలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here