అసూయ

0
6

[‘అసూయ’ అనే పిల్లల కథ అందిస్తున్నారు డా. కందేపి రాణీప్రసాద్.]

[dropcap]అ[/dropcap]డవిలో ఒక గున్నమామిడి చెట్టు ఉన్నది. ఆ చెట్టు చాలా గుబురుగా ఉన్నది. చాలా పక్షులు నివాసం ఉంటున్నాయి. ఒక కోయిల కుటుంబం కూడా నివసిస్తోంది. ఉదయాన్నే కోయిలలు కమ్మగా రాగాలు తీస్తుండేవి. మిగతా పక్షులన్నీ చక్కని పాటలు వింటూ పనులు చేసుకునేవి. కోయిలలు అంటే అందరికీ ఎంతో ఇష్టం.

కోయిలలు చాలా మంచివి. ఎవరికి సహాయం కావాలన్నా ముందుండేది. ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే కష్టపడి ఆహారాన్ని తెచ్చిచ్చేవి. వాళ్ళింటి పనులన్నీ చేసి పెట్టేవి.

ఆ చెట్టు మీద ఒక కాకి కుటుంబం కూడా నివసిస్తోంది. చెట్టు మీద అన్ని రకాల పక్షులు గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్‌మెంట్స్ లాగా రకరకాల భాషలతో కలిసి ఉండేవి.

కోయిలలు ఉదయం లేవగానే అందర్నీ చక్కగా పలకరించేవి. ఎక్కడ కనిపించినా చక్కగా నమస్కారం పెట్టేవి. ఎంతో మర్యాద, మన్నన తెలిసిన కుటుంబమని పేరు పొందాయి. మంచి సంగీత పరిజ్ఞానం గల పక్షులని పేరు తెచ్చుకున్నాయి.

వీటికిలా పేరు రావడం కాకికి అస్సలు నచ్చలేదు. ఎక్కడ చూసినా కోయిల పేరు వినబడడంతో కాకి మనసు రగిలిపోయేది. కోయిల ఏమీ చేయక పోయినప్పటికీ కాకికి కోయిల నచ్చేది కాదు. కోయిల కన్న అద్భుత గాత్రం చూసి వళ్ళంతా కారం రాసుకున్నట్లుగా ఉండేది. కోయిల కాకికి సహాయం చేసి పెట్టినా ఒక్కసారి కూడా థాంక్యూ అనేది కాదు. అయినా కోయిల ఏమీ పట్టించుకునేది కాదు. కాకి సరిగా మాట్లాడకపోయినా కోయిల మాత్రం ఎంతో ప్రేమగా పలకరించేది.

ఒక రోజు సింహం అడవిలో ఆటాపాటా ఏర్పాటు చేద్దామని అనుకున్నది. పాటాలు పాడేవాళ్ళనీ, నాట్యం చేసే వాళ్ళనీ పిలవమని నక్కకు చెప్పింది. నెమలి బాగా నాట్యం చేస్తుందని అందరూ చెప్పటంతో నెమలిని పిలిచింది. అలాగే “పాటలు ఎవరు బాగా పాడుతారు” అని నక్క వెతకసాగింది. అంతలో కాకి కనిపించింది. “మీ చెట్టు మీద చాలా పక్షులుంటాయి. కదా! ఎవరైనా పాటలు పాడతారా” అని వాకబు చేసింది. కాకి గతుక్కుమన్నది. కోయిల సంగతి తెలుసా? అనుకున్నది. అయినా సరే చెప్పకూడదనుకుంది. “ఎవరూ లేరు” అన్నది కాకి వెంటనే. సరేలే అని వెళ్లిపోయింది నక్క. హమ్మయ్య కాకి ఊపిరి పీల్చుకుంది. కోయిలకు పేరు రాకుండా చూశానని సంబరపడింది.

అడవిలో కార్యక్రమం అయిపోయింది. కోయిల పాట పాడలేదు. కాకి మనసులో చాలా ఆనందించింది. అందరూ వేడుకల్లో పాల్గొని ఇంటికి తిరిగి వచ్చారు. తను అబద్ధం చెప్పిన విషయం ఎవరికైనా తెలుస్తుందేమోనని కాకి మథన పడుతూ ఉంది. ఎవరికైనా తప్పు చేస్తే మనసులో సంతోషం ఉండదు కదా! అదీకాక ఎవరు తెలుసుకుంటారో అని దిగులు. ఈ దిగులు ఆలోచనల వల్ల కాకి సరిగా తినలేకపోయింది.

కోయిల మాములుగానే ఉన్నది. ఇవన్నీ తెలియవు కదా! కాకి మాత్రం సంతోషంగా ఉండలేకపోతుంది. కాకికి  లోపల ఏం జరుగుతుందో తెలియడం లేదు. సరే అనుకుంటూ ఇంటికి వెళ్ళిపోయింది.

అర్ధరాత్రికి కాకికి కడుపులో మంట వస్తుందని పించింది. గుండెలో భుజాల్లో నొప్పి పెరుగుతున్నట్లుగా అనిపించి అరుద్దామనుకుంది.నోరు పెగల్లేదు. స్పృహ కోల్పోయింది.

కాకి మరల కళ్ళు తెరిచేసరికి నెమలి గారి వైద్యశాలలో ఉన్నది. పక్కనే భార్య కూతురు ఉన్నారు. వాళ్ళిద్దరూ ఏడుస్తూ నిలబడి ఉన్నారు. నాకేమైంది? అని కాకి అడిగింది. “అంతా బాగానే ఉంది. ఎక్కువగా మాట్లాడకు” అని నెమలి భుజం మీద చెయ్యేసి అన్నది.

తర్వాత కాకి భార్య విషయమంతా చెప్పింది. అర్ధరాత్రి కాకి స్పృహ తప్పగానే వైద్యశాలకు తిసుకెళ్ళడానికి ఎవరూ రాలేదు. కోయిల ముందుకొచ్చి కాకికి ఆసుపత్రికి తీసుకువచ్చింది. అంతేకాక కాకి కుటుంబానికి ధైర్యం చెబుతూ మనోస్థైర్యాన్ని నింపింది. నెమలిని నిద్ర లేపి విషయమంతా వివరించింది.

కాకి మనసు పశ్చాత్తాపంతో నిండిపోయింది. తాను కోయిలకు పేరు రాకుడదని ప్రయత్నించినా కోయిల మాత్రం కాపాడింది. ఛీ నా మనసు ఎంతా ఈర్ష్యగా మారిపోయింది. ఈ ఈర్ష్యను వదిలించుకోవాలి. తన మనసు చేస్తున్న ఘోషను వినకుండా ఇలాగే ఉంటుంది.

వెంటనే కోయిలను క్షమించమని అడిగింది. తను చేసిన తప్పును చెప్పి పశ్చాత్తాప పడింది. కోయిల క్షమించేసింది. “నీవు చేసిన తప్పు తెలుసుకున్నావు. అదే చాలు” అని కోయిల నవ్వి ఊరుకున్నది. కాకి కోయిలకు నమస్కరించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here