Site icon Sanchika

అసూయ

[dropcap]క[/dropcap]మనీయంగా వినిపిస్తున్న హనుమాన్ చాలీసాను, రాగయుక్తంగా పాడుతున్న తన శ్రీమతి సుందర రూపాన్ని తలచుకుంటూ ఒళ్ళు విరుచుకున్నాడు శ్రీకాంత్. తనొక పెద్ద నాస్తికుడు. శ్రీదేవికేమో దేవుడులన్నా, దేవతలన్నా ఎంతో భక్తి. ఈ విషయం గురించి రోజుకొక్కసారి అయినా చర్చించుకోకుండా ఉండరు. లేపటమే ప్రారంభం, ప్రసాదం తినేదాక చంపుతుంది. ప్రసాదం నోట్లో పడ్డాకా ఒక్క నిముషం కూడా మంచం పైన ఉండనివ్వదు. ప్రసాదం తప్పితే ఏదీ తిననివ్వదు బ్రష్ చేసుకోకుండా.

శ్రీదేవి ముఖారవిందం మాత్రమే తాను కళ్ళు తెరవగానే చూడాలి. అప్పుడు గానీ తనకు తృప్తిగా ఉండదు. మళ్ళీ నిద్రపోయే వరకూ తానున్నంత సేపు తన తోనే ఉండాలి. శ్రీదేవి తనతో కాక ఎవరితోనయినా అయిదు నిముషాలు మాట్లాడినా అతను ఓర్వలేడు. ఎప్పుడూ తనతో మాట్లాడుతూ ఒక్కసారి అదీనూ అవసరమయినపుడు మాట్లాడినప్పుడు బాధపడటం అనేది చాలా తప్పు అని అతనికి తెలుసు. కానీ ఆ నిముషాన అలా అనకుండా ఉండలేడు. పది నిముషాలు కంటే ఎక్కువ మాట్లాడుతున్నట్లు అనిపిస్తే తనకు తెలియకుండా తనే పిలిచేస్తాడు “దేవీ” అంటూ. “వారు పిలుస్తున్నారు” అని వాళ్ళను పంపేసి వచ్చేస్తుంది. వెంటనే దేవి అంటుంది –

“ఏంటండీ అలా పిలిచేస్తారు. వచ్చింది నా బెస్ట్ ఫ్రెండ్ నీలిమ. ఎంతో దూరం నుంచీ అది కష్టపడి వచ్చింది. నన్ను చూడాలని నాతో మాట్లాడాలని. దానికి ఎన్నో సార్లు చెప్పా. మీరు లేని సమయంలో వస్తుండమని. కానీ కుదరదు అది ఆఫీసుకు వెళ్ళాలి. అందుకని ఇప్పుడు వచ్చింది. మీరేమో..” అంటూ బంగమూతి పెడుతుంది. శ్రీకాంత్ అంతకంటే జాలిగా ముఖం పెట్టేస్తాడు. “నేను పిలవాలనుకోలేదు. చాలా సేపటి నుంచీ మాట్లాడుతున్నావనిపించింది. ఏ గంటో అయిపోయిందనుకున్నాను. నిజంగా, అందుకే పిలిచాను” అని చెప్పగానే అంతటి కోపం ఐస్‍లా కరిగిపోయేది దేవికి. అది అంతే తన మీద ప్రేమ చేతనేనని తలుచుకుని ఆనందంతో పొంగిపోయేది. కానీ మరుక్షణం తనకేమయినా అయితే శ్రీకాంత్ ఏమయిపోతాడో.. అని క్రుంగిపోయేది. అనే విషయం మాత్రం అప్పట్లో శ్రీకాంత్‌కి తెలియదు. అతనికి తెలిసినది ఆమెను పిచ్చిగా ఆరాధించటం. ఆమె ఏదైనా అడిగితే నోట్లోంచి వస్తుండగానే తెచ్చి పెట్టడం. అది ఎంత కష్టమైనది అయినా. ఒకసారి శ్రీదేవి సరదాగా “సాయంత్రం మల్లెపూలు తీసుకు రండి” అని చెప్పింది. ఆఫీస్ అయ్యాక చూస్తే ఆ రోజు మల్లెల గంపలు ప్రక్క వూరి నుంచీ ఒక్కటి కూడా రాలేదని తెలిసింది. వెంటనే ప్రక్క ఊరికి వెళ్ళి పూలు కొనుక్కొని ఇంటికి వచ్చాడు, రెండు గంటలు ఆలస్యంగా.

విషయం విన్న శ్రీదేవికి నవ్వాలో, బాధపడాలో తెలియలేదు. అయిదింటికి రావాల్సిన భర్త ఇంతవరకు రాలేదని ప్రక్కింటి వాళ్ళతో ఫోను చేయించింది. వెళ్ళిపోయారని తెలిసింది. ఎటువంటి వార్త వినవలసి వస్తుందో అని ప్రాణాలు అరచేత పెట్టుకొని కూర్చుంటే చివరకు తెలిసింది. తను కోరిన కోరిక కారణంగా భర్త ఆలస్యంగా వచ్చాడని. అప్పటి నుంచీ ఏది అడగాలన్నా తగని భయం. కానీ తన భార్య కోరిక తీర్చానన్న తృప్తి శ్రీకాంత్ కళ్ళలో చూసి ఎంతో ఆశ్చర్యపడింది. ఎంత ఆనందం ఆ కళ్ళలో ఇంత చిన్న కోరిక తీర్చినందుకేనా? ఇది ఈనాటి బంధం కాదేమో! అపురూపంగా చూస్తాడు తన వైపు. రవ్వంత సేపు కనుమరుగై కనిపిస్తే ఎన్నేళ్ళో విరహాన్ని అనుభవించిన వాడిలా దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకుంటాడు. గాలికి కూడా తావివ్వడు. ఆ బిగి కౌగిలి తన కిష్టమయినా ఎముకలు విరిగిపోతాయేమో అని భయపడుతుండేది అప్పుడప్పుడు. అయిదు నిముషాలు తరువాత తృప్తిగా తనను వదిలేవాడు. తనను వదిలి ఒక్క నిమిషం కూడా ఉండడు. ఆఫీసుకు వెళ్ళే వరకు తన చుట్టూ తిరుగుతూ ఉంటాడు, తల్లి కొంగు పట్టుకొని తిరిగే పిల్లవాడిలా. మరి ఆఫీసులో ఎలా ఉంటారో? ఒకసారి అనుకోకుండా వచ్చేశాడు. అదేమిటి ఈ టైమ్‌లో వచ్చారు అంటే “నువ్వు గుర్తు వచ్చావు, చూడాలనిపించి వచ్చేసాను” అన్నాడు. పని లేకపోతే శ్రీదేవి గుర్తు వస్తుందని రేపటికి చెయ్యాల్సిన వర్క్ అంతా ముందురోజే రడీ చేసుకొని ఊపిరి సలపని పని వర్కు చేసి తిరిగి వచ్చేవాడు. అందుకే ఆఫీసులో పెండింగ్ అనే పదానికే తావు ఉండేది కాదు. “అంత వర్క్ చేస్తే మీ ఆరోగ్యం దెబ్బతింటుంది. కొంచెం నన్ను గుర్తు తెచ్చుకోకుండా ఉండటానికి ప్రయత్నించండి” అని శ్రీదేవి ఎంత మొత్తుకున్నా “అది అసాధ్యం దేవీ! నా దేవి లేని ఆలోచనలు నాకుండవు. అరవై నిముషాలలో యాభై ఎనిమిది నిముషాలు నీ గురించే ఆలోచిస్తాను అంటే నువ్వు నమ్మలేవేమో. అందులోనే నాకు ఆనందం ఉంది కూడా. నాకు ప్రాణప్రదమైన నువ్వు చెప్పినా నేను నిన్ను ఆలోచనలలోంచి దూరం చేయలేను. అది నేను బ్రతికుండగా చేయలేని పని” అనేవాడు. చప్పున నోరు మూసేది – అలాంటి మాటలు వద్దు లెండని. అలా అయితే ఇలా సలహాలు ఇవ్వవద్దనే వాడు. తప్పని సరిగా నోరు మూసుకునేది. మరో గత్యంతరం లేదు కదా!

శ్రీకాంత్‌కి దేవుడంటే అసలు ఇష్టం లేదు. కానీ శ్రీదేవిని గుడికి తీసుకువస్తాడు, వెళదామంటే. తాను మాత్రం బయటే ఉండిపోతాడు. ఒక వేళ రమ్మంటే ఆమె కోరిక మీద వచ్చినా దేవుణ్ణి పూంజించలేడు. ఆ పని చేయింలేక బయటే ఉంచుతుంది. తొందరగా దేవుడికి దణ్ణం పెట్టుకొని వచ్చేయమంటాడు. ప్రదక్షిణలు వద్దంటాడు. అంత కొద్ది సేపు కూడా తనను విడిచి ఉండలేనంటాడు. కనిపించిన ప్రతి వస్తువు కొనిపెడతానంటాడు. వద్దులేండి అని శ్రీదేవి చెప్పినా వినిపించుకోక కొనేసేవాడు. అలా కొని పెట్టడం శ్రీకాంత్ సరదా. చూడడం శ్రీదేవికి సరదాగానే ఉండేది. ఒక్కొక్కసారి మందలించేది, అలా అన్నీ కొనడం ఎందుకని. తన మందలింపులు గాలిలోనే కలిసిపోయేవి.

“మీకు నేనంటే అంత ప్రేమ గదా మరి పెళ్ళి కాకముందు ఎలా ఉండేవారు” అని అడిగింది.

“అప్పుడు నువ్వేవరో నాకు తెలియదుగా అందుకు. నిన్ను చూపిన వారం రోజులలోనే పెళ్ళి, కార్యం అన్నీ జరిపించేసుకుని నా దగ్గరకు రప్పించేసుకున్నాను. నిన్ను చూసిన క్షణం అంత మధురమైనదన్నట్లు. నువ్వు ప్రక్కనే ఉన్నా మళ్ళీ వెళతావేమో అని భయం. అందుకే పట్టుకునే కూర్చుంటూ వుంటాను” అన్నాడు.

శ్రీకాంత్ కళ్ళలో అమాయకత్వం వద్దన్నా కనిపిస్తూనే ఉంటుంది. పెళ్ళి అయ్యాక శ్రీదేవిని ఒక్కదాన్ని ఎక్కడకూ పంపిచేవాడు కూడా కాదు. “అమ్మను చూడాలనిపిస్తోంది” అంటే ఎక్కడ భార్య అక్కడ ఉండిపోతుందో అని తనే తీసుకొచ్చి రెండు రోజులలో మళ్ళీ తీసుకెళ్ళిపోయేవాడు. భార్య వెళ్ళింది తన అమ్మను చూడటానికి, చెల్లెళ్ళతో, తమ్ముళ్ళతో మాట్లాడటానికి అని తెలిసి కూడా కదలనిచ్చేవాడు కాదు. బాగుండదని వెళ్ళినా, తరువాత శ్రీకాంత్‌ని బ్రతిమాలాడి మామూలు మనిషిని చేయటానికి గంటకి పైగా పట్టేది. అటు అమ్మ వాళ్ళ సరదా తీరేది కాదు, ఇటు భర్తకు కోపం వచ్చేది. అందుకే ఇంటి మీద బెంగను కొంచెం కొంచెం తగ్గించుకుంది శ్రీదేవి, అంత కన్నా చేసేది లేదు కనుక. ఏదైనా పండుగలకు వెళ్ళేది. ఆ హడావిడిలో శ్రీదేవి తమతో కలవలేదన్న విషయం పెద్దదిగా ఇంట్లో కనిపించేది కాదు. కానీ ఇదీ ఒకందుకు మంచిదే అయింది, తన జీవితంలో. కానీ ఒక్కోసారి అదే చాలా పెద్ద లోటులా అనిపించేది. కానీ భర్త అపురూప ప్రేమను తలచుకుని సర్ది చెప్పుకొనేది. అన్నిటికి ఈ ‘ప్రేమ’ అనే పదాన్నే మందులా ఉపయోగించుకొనేది శ్రీదేవి.

హాయిగా సాగిపోతున్న నదీ ప్రయాణంలోకి తుఫాను వచ్చినట్లు వాళ్ల జీవితంలోకి కష్టాలు వచ్చాయనే చెప్పాలి. ప్రతి భర్త మొదటిసారి తండ్రి అవుతున్నాడన్న వార్త వినగానే పొంగిపోతాడు. భార్యను అపురూపంగా చూసుకుంటాడు. కాని అదే శ్రీదేవి జీవితంలో తిరగపడింది. సంతోషంతో వెలిగిపోవాల్సిన ఆ ముఖాన్ని ఆముదం త్రాగినట్లు చేదుగా పెట్టాడు శ్రీకాంత్. ఆశ్చర్యంగా చూసింది. ఏమీ మాట్లాడకుండా లోపలకి వెళ్ళిపోయాడు. ఆ రోజు చాలా సేపు బాధపడ్డాడు. ఎప్పుడూ లేనిది, ముభావంగా కూడా ఉన్నాడు. ఎందుకనేది అర్థం చేసుకోవటం శ్రీదేవికి కష్టమే అయింది. అతనలా ముభావంగా ఉంటే శ్రీదేవికేమీ నచ్చలేదు. చాలా సేపు బ్రతిమాలించుకొని మాట్లాడాడు. ఏదో మాటలు చెప్పి నవ్వించగలిగింది కానీ కారణం మాత్రం చెప్పించలేకపోయింది. మరునాడు వారి మాటలలో, చేతలలో ఎంతో తేడా కనిపించింది. ఆ మధ్యాహ్నం “దేవీ! మనకు ఇప్పటి నుంచే పిల్లలు ఎందుకు? కొన్నాళ్ళు ఆగితే బాగుంటుంది కదా! కొన్నాళ్ళు పోతే, వీళ్ళు మనకి జంఝాటంలా తగిలారు అని అంటావేమో” అని అన్నాడు. “ఛ! ఛ! అవేం మాటలండీ? పిల్లలంటే ఇష్టమై, వాళ్ళు కావాలని కంటూ ఉండి వాళ్ళను ఎందుకు తిట్టకుంటాం? అందులో నాకు పిల్లలంటే చాలా ఇష్టం కూడా!” అని అంది శ్రీదేవి. “ఒక్క సంవత్సరం ఆగితే బాగుంటుందేమో” అని అడగలేక అడిగినట్లు అన్నాడు శ్రీకాంత్.

“ఇది ముందు ఆలోచించవలసిన విషయం. నాలో బాబో/పాపో పెరుగుతున్నాడని తెలిసాక ఇంకేం చేయలేం కదా” అని – భర్త అసలు ఉద్దేశం తెలుసుకుందామని ప్రశ్నించింది.

“ముందు అంతగా ఆలోచించలేదు. అదే నే చేసిన పొరపాటు. అయినా మూడు నెలలే కదా అయింది. అబార్షన్ చేయించుకుంటే.. ఇక నుంచీ మళ్ళీ ఇలాంటి అవసరం రాకుండా నేను చూసుకుంటాను” అన్నాడు లో-గొంతుతో.

అది విన్న శ్రీదేవి అదిరిపడింది. “నా కిష్టం లేదు” అంది. “దేవుడిస్తున్న బిడ్డలను చంపేంత క్రూరత్వం లేదు” అంది. “అసలు అలా అడగటానికి మీకు మనసెలా ఒప్పుతోంది” అని అవేదనగా అడిగింది.

అప్పటిదాకా మనసును చంపుకుని అడుగుతున్న శ్రీకాంత్ ఒక్కసారి భార్యను దగ్గరకు తీసుకుని తల నిమురుతూ “ఇంకెప్పుడూ నిన్నిలా ప్రశ్నించి బాధపెట్టనులే” అని అన్నాడు.

‘నా బాధకు ఉపశమనం లబించింది’ అనుకుంది శ్రీదేవి. కానీ అది తాత్కాలికమని తరువాత తెలిసింది.

ఆరు నెలల దాకా మాములుగానే ఉన్నా, తరువాత నుంచి తమ ఇద్దరి మధ్య సాన్నిహిత్యాన్ని పుట్టబోయే బాబే హరిస్తున్నాడు, హరిస్తాడు అనే ఊహలోకి వచ్చేసాడు. అప్పటి నుంచీ ప్రారంభమయింది అసలు యుద్ధం. శ్రీదేవి దిగులుగా కనిపిస్తే దగ్గరకు తీసుకుని తల నిమురుతూ ఆప్యాయతనైతే చూపించేవాడు, కానీ కడుపు వైపు చూసిన మరుక్షణం అతని మొఖంలో భావాలు మారిపోయేవి. వెంటనే లేచి వెళ్ళిపోయేవాడు. అది శ్రీదేవికి చాలా బాధ అనిపించేది. ఒక్కొక్కసారి శ్రీకాంత్ చెప్పినట్లు అబార్షన్ చేయించుకున్నా బాగుండేది అనిపించేది. అదీను అప్పుడప్పుడు. మానసికంగా ఏదో ఊహించుకొని కృంగిపోతున్న తన ప్రాణమైన భర్తను చూసినపుడు మాత్రమే!

ఎలాగో మూడు నెలలు గట్టెక్కాయి. బిడ్డ కోసం ప్రత్యేక శ్రద్ధ కాకపోయినా, భార్యకేమయినా అవుతుందేమో అని చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు. ‘ఈ అపురూపం బిడ్డను చూసిన తరువాతైనా కలగాలిరా భగవంతుడా’ అని మనసులోనే దేవుణ్ణి ప్రార్ధించుకునేది శ్రీదేవి. కానీ ఆ దేవుడు తన మొర ఆలకించలేదు. మొదటిసారి తండ్రి నయ్యానని ఉత్సాహంగా ఉప్పొంగిపోవల్సిన శ్రీకాంత్ ప్రసవం అయ్యి భార్య క్షేమమని తెలిసినంతనే వెళ్ళిపోయాడు. ఆ వార్త విని డాక్టర్‌లు, నర్సులు, ఆశ్చర్యపోయారు – ఇంతసేపు ఎంతో ఆతృతగా విషయం వినాలని ఎదురు చూసిన అతను ఎందుకు వెళ్ళిపోయాడా అని. దురదృష్టం తనను మరోసారి వెక్కిరిస్తోందని అర్థమయిపోయింది శ్రీదేవికి. ఎవరిని దూషించాలో తెలియక తన్ను తానే దూషించుకుంది.

బాబుతో ఇంట్లో అయితే ప్రవేశించగలిగింది కానీ భర్త హృదయంలో బాబుకు మాత్రం స్థానం కలిగించలేక పోయింది. చంటి పిల్లాడు ఏ నిమిషములో ఏం చేస్తాడో, ఎక్కడ పడిపోతాడో అనే తాపత్రయం ప్రతి తల్లికి ఉంటుంది. అలానే శ్రీదేవికినూ. భర్త ఆఫీసుకు వెళ్ళేలోపు చాలా టైమ్ వాడికే సరిపోయేది. అది శ్రీకాంత్‌కి మరింత కోపాన్ని పెంచేది. శ్రీదేవి ఏం చెయ్యగలదు? ‘అరేయ్ నాన్నగారూ ఆఫీసుకెళ్ళాకే నువ్వు నిద్రలేవరా, అప్పుడే పాలు కావాలని ఏడవాలిరా అని చెప్పాలా వాడికి? అయినా చెప్పినా అర్థం చేసుకొనే వయసా? బుద్ధి, జ్ఞానం, వయసు, అన్నీ ఉన్న ఆయనే ఇంత సంకుంచితంగా ఆలోచిస్తుంటే నా బాబెంత’ అనుకుంది.

అప్పటికీ భర్తకు సర్ధి చెప్పడానికే ప్రయత్నించేది “ఇంకొంచెం వాడిని పెరగనివ్వండి. అప్పుడు వాడు ఆటలకు వెళ్ళిపోతాడు. మీ ఇష్టం వచ్చినట్లు నేనుంటాను” అని. ఒప్పుకొవాలా, వద్దా అనే సందిగ్ధావస్థలోనే గడిపేవాడు శ్రీకాంత్. కాని ఊ అనే వాడు కాదు. బాబుకి పాలసీసా అందించి భర్త పని చూసేది. ఆ పాలు అవగానే నిద్రపోవాల్సిన బాబు ఏ కారణంగానైనా ఏడిస్తే తన మనసు లబలబలాడేది. చెయ్యి నొక్కి పెట్టి భార్యని కదల్నిచ్చేవాడు కాదు శ్రీకాంత్. నిముషనిముషానికి తారస్థాయి నందుకుంటున్న బాబు ఏడుపు శ్రీదేవిని ఉండనిచ్చేది కాదు. బలవంతంగా చెయ్యి లాక్కుని వెళ్ళి వాడిని ఊరుకోబెడితే శ్రీకాంత్‌కి కోపం వచ్చేది. ఆమె పని బాబు పుట్టినప్పుటి నుంచీ అడకత్తెరలో పోక చెక్కలా ఉంది. ఎంత కోపం వచ్చినా భ్యారను చూడకుండా మాత్రం ఉండలేకపోయేవాడు.

బాబుతో పాటు శ్రీకాంత్ కోపం కూడా దినదినాభివృద్ధి చెందింది. భర్తలో ఎలా ప్రేమను రేకెత్తించాలో శ్రీదేవికి అర్థం కావటం లేదు. ఇప్పుడు బాబుకి నాలుగు సంవత్సరాలు. వయసుకు మించిన తెలివి తేటలు. వాడి చిన్న బుర్రలో ఎన్నో ఆలోచనలు. ఒక రోజు వాడు అడిగిన ప్రశ్నకి ఏం సమాధానం చెప్పాలో ఒక పట్టాన అర్థం కాలేదు శ్రీదేవికి.

“అమ్మా! రాజా వాళ్ళ డాడీ ఎప్పుడూ రాజాతో కబుర్లు చెబుతూనో, ముద్దు పెట్టుకుంటూనో ఉంటారు. మరి మన డాడీ నాతో మాట్లాడరేం? నన్ను ముద్దు పెట్టుకోరేం? నేను రాజాకంటే అందంగా ఉంటానని మా మిస్ కూడా అన్నారు తెలుసా? చెప్పమ్మా! డాడీ నన్ను ముద్దు పెట్టుకోరా?”

అది అమాయకత్వమో, తెలివో తెలుసుకోవాటానికో అర క్షణం పట్టింది శ్రీదేవికి.

“నాన్నగారికి ఆఫీసులో బోలెడు పనులుంటాయి. అవి అన్నీ చేసి చేసి వస్తారు కదా, విసుగుగా ఉంటుంది. రాజా వాళ్ళ డాడీకి అంత పని ఉండదు. అందుకే వాళ్ళతో ఆడుకుంటారు. నువ్వు బుజ్జిగా ఉన్నప్పుడు మీ డాడీ కూడా ముద్దు పెట్టుకునేవారు. సాయంత్రం డాడీ చేత ముద్దు ఇప్పించే పూచీ నాది” అంది. అప్పటి వాడి బుర్రకి అది సమంజసంగానే ఉంది, వెళ్ళిపోయాడు. ఆ సాయంత్రం భర్తను బ్రతిమాలి వాడికి ముద్దు ఇప్పించింది. మళ్ళీ వాడూ ముద్దు పెట్టాడు. వాడి కళ్ళలో అప్పుడు ఎంత వెలుగో! ఏదో పెట్టమంటే పెట్టాను అన్న భావం తప్ప శ్రీకాంత్‌లో ఏ మార్పూ లేదు.

బాబు రోజు రోజుకూ పెద్దవాడవుతాడు. ఇప్పటి చిన్న ప్రశ్నే మరునాటికి పెద్ద ప్రశ్న కావచ్చు అనే ఊహ శ్రీదేవి మనసును అల్లకల్లోలం చేసి పారేసింది. ఇది జరిగిన మూడు నెలలకు మరో సంఘటన. “మమ్మీ! ఈ రోజు మా మిస్ ఒక పాఠం చెప్పారు. అందులో మనమంటే ఇష్టం లేకపోతే మనల్ని బాగా చూడరు. దూరంగా వెళ్ళిపోతారు. ముద్దు పెట్టుకోరని, ఇలా చాలా చాలా చెప్పారు. డాడీకి నేనంటే ఇష్టం లేదేమో?” అన్నాడు.

‘అయిపోయింది నేననుకున్నంత అయింది. ఇక ఆలోచిస్తూ కూర్చుంటే లాభం లేదు. ఏదో ఒకటి చేయాలి’ అని దృడంగా నిశ్చయించుకుంది శ్రీదేవి. ఆ రోజు నుంచీ ఈ సమస్యకు పరిష్కారం ఏమి చేయాలి అన్నదే ఆమె మెదడులో గిర్రున తిరుగుతుండేది.

ఒకసారి గ్రంథాలయానికి వెళ్ళిన శ్రీదేవి అక్కడ పడి ఉన్న ‘రేపు’ అనే మాసపత్రికను అనాలోచితంగా చూసింది. అందులో ‘మీ సమస్య మా పరిష్కారం’ అన్న అంశం చదివాక ఆమెకు ‘నేను దానికి పంపితే’ అనే ఆలోచన వచ్చింది. అడ్రస్ రాసుకుని వచ్చి విషయాన్ని క్లుప్తంగా రాసి పంపింది. దానికి సమాధానంగా “ఇది అతి ప్రేమ వల్ల వచ్చే ఒక రకమైన జబ్బు. వీలైనంత తొందరలో సైకియాట్రిస్ట్‌ను కలవండి” అని రాసారు. ఇక్కడే ఉన్న ఒక సైకియాట్రిస్ట్‌ పేరు కూడా తెలియజెప్పారు, వాళ్ళు పత్రికా ముఖంగా. శ్రీదేవి వెంటనే సైకియాట్రిస్ట్‌ ‘సైక్రియా’ గారికి అసలు విషయం రాయకుండా – “పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటిని మీరైతేనే పరిష్కరించగలరని నాకనిపిస్తోంది. మీ సలహా తీసుకోవాలని ఉంది. ఎప్పుడు కుదురుతుందో చెప్పగలరని తలుస్తాను” అని రాసి పోస్ట్ చేసింది. మూడు రోజులలోనే సమాధానం వచ్చింది. అందులో, ఏప్రిల్ 10వ తేది పది గంటలకు మీరు రావచ్చని ఉంది.

‘ఈ రోజు ఏప్రిల్ ఫస్ట్ అంటే ఇంక సరిగ్గా పది రోజులుంది. ఆయనను కలవటానికి’ అని ఆలోచనల వరవడిలో కొట్టుకుపోతున్న శ్రీదేవికి కాలింగ్ బెల్ ఎంత సేపటి నుంచీ మ్రోగుతుందో తెలియనే లేదు. వెళ్ళి తలుపు తీసింది. “ఇంత ఆలస్యమయిందేం దేవి? జరిగింది రెండు నిముషాలే అయినా నా మనసు పరిపరి విధాలపోయింది. నీకారోగ్యం బాగా లేదేమో? లేక ఏమైనా త్రొక్కి జారి పడ్డావేమో? ఒక మనిషి తోడు లేకపోతే ఎన్ని బాధలో? ఇలా ఎన్నో ఎన్నో?” బాధగా అంటూ భార్యని దగ్గరకు తీసుకున్నాడు శ్రీకాంత్.

అంతవరకు పడ్డ శ్రమ అంతా భర్త ఓదార్పులో మరిచిపోయి ఎదపై వాలిపోయింది.

“అమ్మా!” బాబు పిలుపు వినగానే అదిరిపడి ఒక్కసారి విడివడింది.

సుందర స్వప్నం చెదిరిపోగా ఆయోమయంగా చూస్తున్నట్లున్న భర్తని చూడగానే తన మనసు వెయ్యి ముక్కలయింది. అసహాయత మరోసారి వెక్కిరించింది. ‘ఎన్నాళ్ళీ బాధ నాకు. తొందరగా నాకు విముక్తి కలగించు తండ్రీ!’ అనుకుంది మనసులో, అంతకంటే చేసేది ఏమీ లేక.

ఒక్క క్షణం అలా చూసి విసుగుగా గదిలోకి వెళ్ళిపోయాడు శ్రీకాంత్.

“ఏమిటి మమ్మీ? అలా నిలబడిపోయావు? నేను వచ్చేటప్పటికి గుమ్మంలో నుంచో లేదేం?”

“పాలు పొంగుతాయేమో అని వెళ్ళేనురా. ఇప్పటిదాకా అక్కడే ఉన్నాను. వెళ్ళి బుక్స్ పెట్టేసుకొనిరా, నీకిష్టమయిన టిఫిన్ చేసానుగా” అని ఉత్సాహాన్ని తెచ్చుకుంటూ చెప్పింది వాడికి. తండ్రి ప్రేమ ఎలాగూ లేదు. తల్లి ప్రేమ కరువు చెయ్యటం ఆమెకిష్టం లేదు.

“ఏం టిఫిన్ అమ్మా” అంటూ బుక్ షెల్ఫ్ దగ్గరకు వెళ్ళాడు కిరణ్.

“జీడిప్పపు ఉప్మా.”

“హయ్ హయ్, మా అమ్మ మంచిది” అంటూ కాళ్ళూ, చేతులూ కడుక్కుంటూ పెరటిలోకి వెళ్ళాడు కిరణ్.

నెమ్మదిగా పడకగది వైపు నడిచింది ఆమె.

ఈ సంభాషణ అంతా వింటూ అసహనంగా దొర్లుతున్నాడు శ్రీకాంత్.

బూట్లు అయినా విప్పుకోలేదు.

బూట్లు విప్పబోతే కాలు లాగేసుకున్నాడు కోపంగా. మళ్ళీ గట్టిగా పట్టుకొని విప్పింది. ప్రక్కనే కూర్చుంటూ ఆప్యాయంగా అతని తల నిమిరింది. వ్రేళ్ళు తలలో దూర్చుతూ “రండి టిఫిన్ చేద్దాం” అంది. “ఏం నీ ముద్దుల కొడుకు సేవలు అయిపోయాయా?” అన్నాడు.

“అదేమిటండీ అలా అంటున్నారు, రండి!”

“నేనేం రాను. వాడికి పెట్టి ఆడుకుందుకు పంపేసిరా. అప్పుడు తిందాం” అంటూ అటు తిరిగి పడుకుంటూ అన్నాడు.

“సరే” అని వెళ్ళిపోయింది.

పడక గదిలోంచి శ్రీదేవి రావటం చూసాడు కిరణ్.

“అమ్మా డాడీ రానన్నారా?” అడిగాడు.

“లేదు బాబూ! డాడీకి తలనొప్పిగా ఉందంట. తరువాత తిందురుగాని అని చెప్పి వచ్చేశాను.”

“మరి అమృతాంజనం రాసావా?”

“లేదురా. నువ్వు తినెయ్. నీకు పెట్టేసి, నేను వెళ్ళి డాడీకి రాసి వస్తాను.”

“ఓ.కె.” తల ఊపాడు, కిరణ్.

“మా కిరణ్ బంగారం” అంటూ నుదిటి మీద ముద్దు పెట్టుకుంది. కాసేపు పాఠాలు చదివించి నిద్ర పుచ్చింది.

మనసులో అశాంతి పొంగి పొర్లి బాధపెడుతున్నా, తను ప్రశాంతత తెచ్చుకొని అడుగుపెట్టింది పడకగదిలోకి – భర్తను మరిపించి మురిపించే అచ్చమయిన స్త్రీ మూర్తిలా.

***

“ఏరా! స్కూలు నుంచీ ఇలాగేనా రావటం. ఆ బట్టలన్నీ ఇలా పాడు చేసుకున్నావేం? నీకు మరీ భయం, భక్తి లేకుండా పోతున్నాయి. నీతో ఎలా వేగాలో తెలియడం లేదు” కోపం ఆపుకోలేని దానిలా దబదబా బాదింది కిరణ్‌ను శ్రీదేవి.

ఆ అరుపులకు అదిరిపడింది శ్రీకాంత్ మనసు. దెబ్బలకు తృళ్ళిపడ్డ మనసును సర్దిపుచ్చుతూ గది బయటకు వచ్చాడు.

కళ్ళ నిండా నీళ్ళతో నుదిటి మీద జట్టును ప్రక్కకి ఎగదోసుకుంటూ వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు కిరణ్. అందమైన వాడి ముఖం కందిపోయి చూపరులకు జాలి గొలుపుతోంది.

మొదటిసారిగా తన కొడుకును పరిశీలనగా చూడటం అదేనేమో. తన ఆలోచనలకు తనే ఉలిక్కిపడ్డాడు.

“ఊఁ! ఆ ఏడుపు ఇప్పుడు అగేది కాదు కానీ వెళ్ళి ముఖం కడుక్కొని స్నానానికి తగలడు. అబ్బబ్బ! ఈ పిల్లలను పెంచటంలో ఇన్ని బాధలున్నాయని ఇప్పటి వరకూ తెలియలేదు” అంటూ వెనక్కు తిరిగిన ఆమె శ్రీకాంత్‌ను చూసింది.

కొత్త మాటలు క్రొత్తగా వింటున్న శ్రీకాంత్ ఆమెను పరిశీలనగా చూస్తున్నాడు.

“ఓ! మీరా ఇక్కడికి వచ్చేసారా. పదండి రూమ్ లోకి. ఇన్నాళ్ళూ మీ మాటలు విననందుకు ఈ రోజు వీడు నాకు బాగా బుద్ధి చెప్పాడు. లేకపోతే వాడి అవతారం చూడండి బిచ్చగాడిలా.”

అర్థం కాని లెక్కను చేయాల్సి వచ్చిన పిల్లవాడిలా సతమతమవుతోంది శ్రీకాంత్ అంతరంగం. అతని ఆలోచనలు అతనికే అర్థం కావడం లేదు. ఆమె ఏమి చెయ్యమంటే అదే చేస్తున్నాడు, అన్యమస్కుడిలా.

ఆ రోజంతా అలాగే గడిపేసాడు.

అలాగే వారం రోజులు గడుచాయి.

“అన్నం పెడతాను రారా కిరణ్!” అంటూ పిలిచింది శ్రీదేవి.

“నాకేం అక్కరలేదు” బింకంగా సమాధానమిచ్చాడు కిరణ్.

“ఏం” కోపం మిళితమైన స్వరంతో ప్రశ్నిస్తున్న శ్రీదేవి గొంతు.

“నన్ను నువ్వు సరిగ్గా చూడడం లేదుగా. నువ్వు పెట్టిన అన్నం కూడా నాకక్కరలేదు” మొండిగా సమాధానమిచ్చాడు.

అదిరిపడ్డాడు ఆ మాటలకు శ్రీకాంత్. ‘వాడికెంత అభిమానం? ఇన్నాళ్ళు వాడే ప్రాణంలా చూసుకున్న శ్రీదేవి ఇలా మారిపోయిందేం? మరి తను ప్రేమించకపోయినా వాడిలా ప్రశ్నించలేదేం? ప్రేమ ఉంటేనే అవి అన్నీ వస్తాయేమో. అంటే తన కొడుకుకు తనంటే ఇష్టం లేదా? తను ఏనాడైనా ఇలా ఆలోచిస్తే కదా! వాడిని దగ్గరకు తీస్తే కదా. వాడికి తండ్రి ప్రేమంటే ఏమిటో తెలియదు. వాడంటే ఇష్టం లేని నేను వాడన్న ప్రతి మాటనూ ఇలా పట్టించుకొని ఆలోచించటం నాకే వింతగా ఉంది’ అనుకున్నాడు.

“వ్రేలెడు లేవు. నన్ను ఎదిరించేవాడివా?” అంటూ ఒక్క దెబ్బ వేసింది.

“శ్రీ! ఏమిటిది? చిన్న పిల్లాడిని పట్టుకొని అలా కొడతావేం” గబగబా వచ్చి ప్రక్కకు లాగాడు.

“మీరడ్డు తప్పుకోండి. ఈ రోజు వీడో, నేనో తేలిపోవాలి. మీ ఇద్దరి మధ్యన నేను విలవిలలాడి పోతున్నాను” చిరాకుగా అంది ఆమె.

“బాబును నేను చూసుకుంటాను. నువ్వు కాసేపు విశ్రాంతి తీసుకో శ్రీ, అలసటగా ఉన్నట్లుంది.”

“నాలుగురోజులు పోతే కడుపు కాలితే వాడే దారికి వస్తాడు. రండి పోదాం.”

“కాదులే శ్రీ నువ్వెళ్ళు నేనిప్పుడే వస్తాగా” అంటూ కిరణ్‌ను దగ్గరకు లాక్కున్నాడు.

ఏడుపు ఆపేసి ఆశ్చర్యంగా చూస్తున్నాడు వాడు.

బుజ్జగించి, తినిపిస్తుంటే ఎవరో పరాయి వాళ్ళబ్బాయి ఏడుస్తుంటే లాలించి మురిపిస్తున్నట్లు భావన. శ్రీకాంత్ తనకు తానే కుంచించుకుపోతుంటే, ఉదయం జరిగిన విషయం జ్ఞాపకానికి వచ్చింది.

కోతి జంట, దాని పిల్ల గోడ మీద కూర్చున్నాయి. పిల్ల కోతి గోడ మీద నుంచి దూకుదామని చూస్తుంది. తల్లి కోతి వద్దన్నట్లు ఉరిమి చూసింది. ఆ మాట వినిపించుకోకుండా దూకిందా పిల్ల. కాలు బెణికి చతికిలపడింది. తల్లి కోతి మాత్రం ధీమాగా కూర్చుంది. తన మాట వినకుండా దూకినందుకు తగిన శాస్తి అయినట్లుగా. తండ్రి కోతి క్రిందకు దూకి దానిని సవరదీసి ప్రక్కకు చిన్నగా తీస్కెకెళ్ళింది. జంతువులు అని మానవులు తీసిపారేసే వాటి దగ్గర తనకు న్యాయం, నీతి లభించింది. బుద్ధి తెచ్చుకున్నాడు. పిల్లలు భార్యాభర్తల మధ్య అడ్డుగోడలు కాదు. అనుబంధ దీపికలని అర్థం చేసుకున్నాడు.

ముద్ద కోసం చూస్తున్న కొడకుని చూసాక వర్తమానంలోకి అడుగు పెట్టాడు శ్రీకాంత్. వారం రోజులలో తండ్రి ప్రేమ అంటే ఎంత తీయనిదో గ్రహించుకున్నాడు కిరణ్. శ్రీదేవి కూడా మామూలుగానే చూస్తోంది. ఆ ఇల్లు స్వర్గంలా తయారయింది.

***

“ఈ ఆదివారం సినిమాకి వెళదామా శ్రీ?”

“ఎప్పుడూ మీరేనా ప్రోగ్రామ్స్ వేసేది? ఈసారి నేను వేస్తాను, మీరు రావాలి.”

“అలానా? ఎక్కడికి?”

“నేను తీసుకవెళతానుగా.”

“సరే.”

సాయంత్రం దాక సస్పెన్స్‌లో ముంచి వారిని తీసుకొని టాక్సీలో కూర్చుని గాంధీనగర్‌కు పొమ్మంది. ఒకింటి ముందు ఆపేయమంది.

వాతావరణం అంతా ప్రశాంతంగా, నిర్మలంగా ఉంది. బొమ్మరిల్లులా ఉన్న గడ్డిపోచతో కప్పున కుటీరం.

అది చూడగానే “హాయ్! అంకుల్ ఇంటికా!” అని లోపలికి పరుగుతీసాడు కిరణ్.

కళ్ళు మూసిన పసికందు చేతులను తీస్తూ “కిరణ్” అన్నారు సైక్రియా.

“ఎలా కనిపెట్టావ్ అంకుల్.”

“అదే తమాషా.”

ఇంతలో శ్రీదేవి, శ్రీకాంత్ వచ్చారు.

“రామ్మా! ఇలా కూర్చోండి.”

“నమస్తే. మీరు మా వారు. “

“ఈయన నాన్నగారి స్నేహితులు. మిస్టర్ సైక్రియా” అంటూ భర్తకు పరిచయం చేసింది.

కాసేపు ఆ మాటలు, ఈ మాటలు మాట్లాడుకున్నారు.

“వేడి వేడిగా ఉప్మా తెస్తాను. కూర్చోండి” అని లేవబోయారు సైక్రియా.

 “మీరు కూర్చోండి. నేను చేస్తానుగా” అంటూ వంటింటి వైపు కదిలింది శ్రీదేవి.

“ఉండమ్మా నేనూ వస్తాను. నీకు ఏ వస్తువు ఎక్కడ ఉందో తెలియదు” అని శ్రీకాంత్ వైపు తిరిగి “మీరు ఈ పుస్తకం చదువుతూ ఉండండి. నేను కాస్త సాయం చేస్తాను మీ మిసెస్‌కి. చెప్పినా వినిపించుకోకుండా వెళ్ళింది.” అన్నారు.

“పరవాలేదు వెళ్ళిరండి” అన్నాడు మొహమాటంగా.

ఆయన వెళ్ళిపోయాడు.

బాబు కోసం చూసాడు. పూల మొక్కల మధ్య తిరుగుతున్నాడు కిరణ్. వాడి ఆసక్తికి అడుగులు వేయిద్దామని అటు వైపు వెళ్ళాడు.

***

“ఏమ్మా! ఏం చేస్తున్నావ్!”

ఆయన గొంతు వినగానే ఆమె వచ్చి అతని పాదాలకు నమస్కరించబోయింది. మధ్యలోనే ఆపి లేవదీస్తూ చల్లగా పది కాలాలు వర్ధిల్లమని ఆశీర్వదించారు.

“మీ దయవలన మేము ఇప్పుడు చాలా అన్యోన్యంగా ఉంటుంటున్నామండీ. మీరన్నట్లుగా కిరణ్‌ను నేను నిర్లక్ష్యం చేసిన కొలదీ ఆయనలో మార్పు చాలా కనిపించేది. దానికి తోడు మీ మాటలు ఆకట్టుకున్న కిరణ్ ఎంత చక్కగా మీరనట్లు నటించాడో తలచుకుంటుంటే నాకిప్పటికీ ఆశ్చర్యమేస్తుంది. పెద్ద పెద్ద నాటాకాల రాయుళ్ళు కూడా వాడి ముందు బలాదూరేమో అని అనిపించేది. చొక్కాకంతా దుమ్ము పూసుకొని వచ్చి మా నాటకం అంతా అయిపోయాకా వంటింట్లోకి వచ్చి, ‘బాగా రాసుకు వచ్చాను కదమ్మా దుమ్ము..’ అంటే ఎలా ఏడ్చానో” అంది శ్రీదేవి.

“అంతేనమ్మా! వచ్చే తరం విజ్ఞానానికి సంబంధించినది. వారి తెలివి తేటలు కొలవలేనివి. నేను ముందే చెప్పాను గదమ్మా. ఇదంతే, తన టైమ్‌ను షేర్ చేసుకోనే మనిషి వస్తున్నాడనే అసూయ తప్ప మరేం లేదని.”

“ఆయన మరోలా భావిస్తారేమోనని మిమ్మల్ని మా నాన్నగారి స్నేహితులుగా పరిచయం చేసాను. తప్పయితే క్షమించండి.”

“దానిలో ఏముంది తల్లీ! ఆ విషయంలో నువ్వేమి బాధపడకు. నిశ్చింతగా ఉండండి. నువ్విలా చెబుతుంటే మరింత ఆత్మీయంగా ఉంది.”

“చాలా సంతోషం.”

టిఫిన్ కార్యక్రమం అయిపోయాక వెళ్ళివస్తామని లేచారు. శ్రీదేవి కళ్ళలో కృతజ్ఞతా భావం వరదలా పొంగుతుంటే వెళతాను అన్నట్లు చూసింది.

“టాటా! అంకుల్!” అంటూ హుషారుగా కిరణ్ తండ్రి చేతిని అందుకున్నాడు.

“వెళ్ళి వస్తాం” అని చెప్పాడు శ్రీకాంత్.

మబ్బు వీడిన ఆకాశంలా ఉన్న ఆ ముగ్గిరిని తృప్తిగా చూస్తూ సెలవు తీసుకున్నారు సైక్రియా.

Exit mobile version