అస్తమించని సూర్యుడు

0
2

[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కొత్తపల్లి రవి కుమార్ గారి ‘అస్తమించని సూర్యుడు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]సా[/dropcap]యంత్రం 5 గంటలవుతోంది. జగన్నాథం పడక కుర్చీలో కూర్చొని పొద్దున్న చదవగా మిగిలిపోయిన న్యూస్ పేపర్ చదువుతున్నాడు. సావిత్రి ఒక కప్పులో టీ తీసుకొచ్చి జగన్నాథం ఎదురుగా ఉన్న టీపాయ్ పై పెట్టింది. టీ తో పాటు మారీ బిస్కెట్లు తినడం జగన్నాథానికి అలవాటు. టీ పక్కన బిస్కెట్లు ఏవని వెతుకుతున్నాడు.

“ఏంటి వెతుకుతున్నారు? లేవని నిన్ననే చెప్పాను కదా! ఈ రోజు ఉదయానికే వస్తాయి, వెళ్ళి తెచ్చుకోండి అంటే బద్ధకించారు. రేపటికయినా కావాలంటే టీ తాగి బయల్దేరండి.” అంది సావిత్రి.

నిన్ననే వెళ్దామనుకున్నాడు. ఒంట్లో కాస్త నలతగా ఉండి వెళ్ళలేదు. టీ తాగి చొక్కా వేసుకుని బయల్దేరాడు జగన్నాథం.

“మళ్ళీ వెళ్ళొచ్చిన తర్వాత అది తేలేకపోయేరా, ఇది తేలేక పోయేరా అని ఏకరువు పెడతావు. తేవాల్సినవి ఏవైనా ఉంటే రాసివ్వు.” అని అడిగాడు జగన్నాథం. సావిత్రి రాసిన సరుకుల లిస్టు తీసుకుని బజారుకి బయల్దేరాడు జగన్నాథం.

సైకిల్ మీద జగన్నాథం రావడాన్ని చూసి “ఒరేయ్! జగన్నాథం మాస్టారు వస్తున్నార్రా! ఆ కుర్చీ ఇలా వేయి!” అని అరిచాడు కిరాణా కొట్టు సుబ్బయ్య.

“కబురు పెడితే నేనే పంపించే వాడినిగా మాస్టారూ! పని కట్టుకుని మీరు ఎందుకండీ రావడం?” అని అడిగాడు సుబ్బయ్య, అప్పుడే వచ్చిన జగన్నాథాన్ని.

“ఏం లేదులే సుబ్బయ్యా! పొద్దుట్నించీ ఇంట్లో కూర్చుని, కూర్చుని విసుగు వచ్చింది. సాయంత్రం అయ్యేసరికి అలా బయటికి వచ్చి చల్లగాలి పీల్చుకుని, ఇంట్లోకి కావాల్సిన సరుకులు కూడా తీసుకెళ్ళొచ్చుగా అని బయలుదేరాను. ఇదిగో లిస్టు. అన్నీ జాగ్రత్తగా కట్టు. లేకపోతే సావిత్రి నన్ను మళ్ళీ నీ దగ్గరకు పంపిస్తుంది.” అని తనతో తెచ్చిన సరుకుల చీటీని సుబ్బయ్య చేతిలో పెట్టాడు జగన్నాథం.

సరుకుల చీటీ తీసుకుని అందులో ఉన్న అన్ని సరుకులు శ్రద్ధగా సంచిలో సర్ది జగన్నాథం చేతికి అందించాడు సుబ్బయ్య.

జగన్నాథం వెళ్ళిపోగానే కిరాణా కొట్టులో పనిచేసే కుర్రాడు “అయ్యగారూ! జగన్నాథం మాస్టారి గారింట్లో ఆయనొక్కరే కదా ఉంటారు. మరి ఇన్ని సరుకులు ఎందుకు తీసుకెళ్తున్నట్టు?” అని అడిగాడు సుబ్బయ్యని.

“పాపం! మాస్టారి గారి భార్య సావిత్రమ్మ గారు పోయినప్పటినుండి ఆయన ఒంటరి జీవి అయిపోయారురా! ఇంకా సావిత్రమ్మ గారు బతికే ఉన్నట్టు, ఈయనతో మాట్లాడుతున్నట్టు ఫీలవుతూ బతుకుతున్నార్రా! ఎవరి నమ్మకాలు వాళ్ళవి. అందరూ ఆయనకి పిచ్చి పట్టిందన్నా, నాకు మాత్రం ఆయన అలా కనపడరురా! మహానుభావుడు. మాస్టారు, సావిత్రమ్మ గారి లాంటోళ్ళు కోటికో, నూటికో ఒక్కళ్ళు ఉంటారు.” అని గాల్లోనే దణ్ణం పెట్టాడు సుబ్బయ్య.

మాస్టారికి అవునో కాదో తెలియదు కానీ మా అయ్యగారికి మాత్రం పిచ్చి పట్టిందనుకున్నాడు ఆ కుర్రాడు.

***

జగన్నాథం మాస్టారు హైస్కూల్ టీచర్‌గా తన సర్వీసుని ఆ ఊళ్ళోనే ప్రారంభించి ఆ ఊళ్ళోనే రిటైరయ్యారు. ఇంచుమించు 50 ఏళ్ళుగా ఆ ఊళ్ళోనే ఉంటున్నారు. అందుకే ఆ ఊళ్ళోనే కాదు, చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళకి కూడా జగన్నాథం మాస్టారు అంటే తెలియని వారుండరు. ఆయన రిటైరయ్యి సుమారు పదిహేనేళ్ళు అవుతుంది. ఆయన దగ్గర చదివిన ఎంతోమంది మన దేశంతో పాటు వివిధ దేశాల్లో ఉన్నత పదవులలో కొలువుదీరి ఉన్నారు. అందులో ఆయన్ని గుర్తుంచుకున్నవారు కొందరు, మరిచిపోయిన వారు మరికొందరు. గుర్తుంచుకుని వచ్చి పలకరించిన వారిని చూసి మురిసిపోలేదు, అలాగని మరిచిపోయిన వారిని తలచుకొని కుంగిపోలేదు. ఎందుకంటే ఆయన్ని మరిచిపోయిన వాళ్ళల్లో ఆయనిద్దరి కొడుకులు కూడా ఉన్నారు కాబట్టి.

***

అవి జగన్నాథం మాస్టారికి ఉద్యోగం వచ్చి ఆ ఊరు వచ్చిన కొత్త రోజులు. అప్పుడు ఆయన జీతం 65 రూపాయిలు. ఆ జీతంలోనే ఆయన చాలా పొదుపుగా ఉండేవారు. అనవసరమైన ఆర్భాటాలకు గానీ, చెడు వ్యసనాల వైపుగానీ ఎప్పుడూ ఆయన పోలేదు. ఎందుకంటే ఆయన పెరిగిన కుటుంబం వాతావరణం అలాంటిది. ఆయన ఒకటే ఫిలసఫీని ఫాలో అయ్యేవారు. “అవసరమైతే లక్ష రూపాయలైనా ఖర్చు చెయ్యి. అనవసరమైతే ఒక్క రూపాయి కూడా తీయకు.”

ఆయన లెక్కల మాస్టారు అవ్వడం, అందరికీ అర్థం అయ్యేటట్టు చెప్పడంతో అందరూ ఆయన దగ్గరకే ట్యూషన్‌కి వెళ్ళేవారు. ఏ రోజు ఎవరినీ ఫీజు కోసం అడిగేవారు కాదు. ఎవరు ఎంత ఇస్తే అంతే తీసుకునేవారు. అలాగని ఫీజు ఇచ్చిన వాళ్ళకి ఒకలాగ, ఫీజు ఇవ్వని వాళ్ళకి ఒకలాగ పాఠం చెప్పేవారు కాదు. కులమత భేదాలు, పేదధనిక ఆంతర్యాలు లేకుండా స్కూల్లో అందరి పిల్లలు ఆయన దగ్గరకే వెళ్ళేవారు. ఆయన పాఠాలు ఎంత బాగా చెప్తారో మార్కుల్లో తేడా వస్తే అలాగే పనిష్మెంట్‌లు ఇచ్చేవారు. అందుకే అందరూ తమ పిల్లలు జగన్నాథం మాస్టారు దగ్గరకు వెళ్తేనే బాగుపడతారు అనే నిశ్చయానికి వచ్చేవారు. ఇదంతా చూసి ఆయనంటే ఈర్ష్య పడినవాళ్ళు కూడా లేకపోలేదు. అలాంటివారు వాళ్ళ సహోద్యుగులలోనే ఉండేవారు. కానీ ఆయన మంచితనానికి, ముక్కుసూటితనానికి ఎవరూ బయట పడేవారు కాదు. అందులో చెప్పుకోదగిన ఒకరు మరో లెక్కల మాస్టారు సుదర్శనరావు. ఈయన పాఠాలు విన్న విద్యార్థులు కూడా జగన్నాథం మాస్టారు వద్దకు వెళ్తున్నారనే ఈర్ష్యతో రగిలిపోయేవాడు. సమయం దొరికినప్పుడల్లా తన ఈర్ష్యను వెళ్ళగక్కేవాడు కూడా.

జగన్నాథం మాస్టారి అర్థాంగి పేరు సావిత్రి. భర్త మనసుని ఎరిగి మసలుకునేది. భర్త లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు సమస్తం సమకూర్చేది, ఆఖరికి బాత్ రూమ్‌లో స్నానానికి నీళ్ళు, టవల్ సిద్ధం చేయడంతో సహా. ఎందుకంటే జగన్నాథం మాస్టారికి కనీసం బిందెలో నీళ్ళు తీసుకుని తాగడం కూడా చేతకాదు. ఏ రోజూ ఆయన జీతాన్ని ఆమె చేతిలో పోయలేదు. ఎందుకంటే తను తెచ్చిన చాలీ చాలని జీతంతో ఆవిడ ఉక్కిరి బిక్కిరి అవుతుందని. ఇంట్లో సరుకులు కూడా ఆవిడ చీటీ రాసిస్తే ఈయన తేవడం అంతే. ఇంటి లెక్కలన్నీ జగన్నాథం మాస్టారే దగ్గరుండి చూసుకునేవారు, చివరికి చాకలి పద్దుతో సహా. అందుకే ఉన్న దాంట్లో చాలా సంతృప్తిగా బతికేవారు.

జగన్నాథం మాస్టారికి ఇద్దరు పుత్రరత్నాలు. పెద్దవాడు సాకేత్, చిన్నవాడు సుందర్. జగన్నాథం మాస్టారికి శ్రీరాముడంటే మహా ప్రీతి. అందుకే ఇద్దరు కొడుకులకి రామనామాలు పెట్టుకుని మురిసిపోయారు. అందరూ ఆయన దగ్గరకే ట్యూషన్‌కి వచ్చేవారు కాబట్టి వీళ్ళిద్దరికీ కూడా అందరితో పాటే పాఠాలు చెప్పేవారు. ఏ రోజూ విడిగా కూర్చోబెట్టి నేర్పలేదు. అందరి పిల్లలలాగే నా పిల్లలు నేర్చుకోవాలనేది ఆయన భావన. అందుకే అందరి పిల్లలలాగే వీళ్ళకీ జగన్నాథం మాస్టారు అంటే చాలా భయం ఉండేది. ఏ చిన్న విషయం చెప్పడానికైనా భయపడేవారు. అందరూ మీ కొడుకులని మరీ కంట్రోల్ లో పెడుతున్నారు అంటే “క్రమశిక్షణ లేని జీవితం దారం తెగిన గాలిపటం లాంటిది” అనేవారు.

కాలంతో పాటు వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు. ఇద్దరూ హైస్కూల్ చదువులకి వచ్చారు. ఇద్దరూ జగన్నాథం మాస్టారు పనిచేసే స్కూల్లోనే చదివేవారు. అందుకే ఇద్దరూ మరింత జాగ్రత్తగా ఉండేవారు. ఏ చిన్న తేడా పని చేసినా జగన్నాథం మాస్టారికి తెలిసిపోయేది. తన పిల్లలని కూడా చూడకుండా అందరిముందే పనిష్మెంట్ ఇచ్చేవారు. అందరి టీచర్లకి కూడా “నా కొడుకులని చూడకండి. అందరి పిల్లలని చూసినట్టే వీళ్ళనీ చూడండి.” అని చెప్పేవారు. అది నచ్చేదికాదు కొడుకులిద్దరికీ. క్రమక్రమంగా నాన్న మీద భయంతో ద్వేషం కూడా పెరిగింది. వాళ్ళ జీవితాల్లో జరిగిన సంఘటనలు కూడా తండ్రి మీద మరింత ద్వేషాన్ని పెంచాయి.

***

జగన్నాథం మాస్టారు పెద్ద కొడుకు సాకేత్, సుదర్శనం మాస్టారి ఒక్కగానొక్క కూతురు స్వాతి క్లాస్‌మేట్స్. ఒకళ్ళ మీద మరొకళ్ళకి ఇష్టం ఏర్పడి అది ప్రేమకు దారితీసింది. వారి ప్రేమ వ్యవహారం స్కూల్లో పిల్లలందరితో పాటు జగన్నాథం, సుదర్శనం మాస్టార్ల చెవిలో కూడా పడింది. జగన్నాథం మాస్టారి గురించి, వారి ఫ్యామిలీ గురించి బాగా తెలుసు గనుక సుదర్శనం మాస్టారు మౌనంగానే వారి ప్రేమను అంగీకరించాడు. కానీ సుదర్శనం మాస్టార్ని, అతని కపటబుద్దిని బాగా తెలుసుకున్నవాడై జగన్నాథం మాస్టారు సాకేత్‌ను ఈ విషయంలో మందలించేవారు. కానీ తండ్రి మాటను పెడచెవిన పెట్టాడు సాకేత్.

***

సాకేత్ పదవతరగతి పబ్లిక్ పరీక్షలు రాస్తున్నాడు. స్క్వాడ్ వచ్చి అందరినీ చెక్ చేస్తున్నారు. సాకేత్ పరీక్ష రాసే రూమ్‌లో ఒక అబ్బాయి స్క్వాడ్ వచ్చిందన్న భయంతో తన కూడా తెచ్చిన స్లిప్పులు ఎవరూ చూడకుండా విసిరేసాడు. అవి సాకేత్ కూర్చున్న బెంచీ వద్దకు వచ్చి పడ్డాయి. స్క్వాడ్ వచ్చి ఆ స్లిప్పులు సాకేత్‌వే అని నిర్ధారించి మాల్ ప్రాక్టీస్ కేసు కింద బుక్ చేసారు. స్క్వాడ్ టీమ్ ప్రిన్సిపాల్ రూమ్‌లో పంచాయతీ పెట్టారు. జగన్నాథం మాస్టారి పెంపకంలో పెరిగిన సాకేత్ ఈ పని చేయడని అక్కడ అందరికీ తెలుసు, జగన్నాథం మాస్టారితో సహా. కానీ తన కొడుకు దగ్గర స్లిప్పులు దొరికేటప్పటికి తలదించుకున్నారు జగన్నాథం మాస్టారు.

“సారీ సార్! మీ అబ్బాయి అని మాకు తెలియదు. మీరేంటో, మీ సిన్సియారిటీ ఏంటో, మీ క్రమశిక్షణ ఏంటో మాకు మాకు బాగా తెలుసు. ఏమీ జరగనట్టు మేము ఉంటాం. మీరూ ఈ సంఘటన మర్చిపోండి. మీ అబ్బాయి యథావిధిగా ఎగ్జామ్స్ రాసే ఏర్పాటు మేము చేస్తాం” అని స్క్వాడ్ టీమ్ జగన్నాథం మాస్టారితో చెప్పారు.

“వద్దు సార్! మీ డ్యూటీ మీరు చేయండి. ఇప్పుడు మీరు వదిలేస్తే అందరికీ నీతులు చెప్పి తన కొడుకు విషయంలో నీతి తప్పాడన్న అపకీర్తి నాకు వద్దు. మీరు చేయవలసిన ప్రాసెసింగ్ మీరు చేయండి.” అని స్క్వాడ్ టీమ్, తోటి టీచర్లు ఎంత చెప్పినా వినకుండా కన్న కొడుకునే డిబార్ చేయించారు జగన్నాథం మాస్టారు.

ఇది సాకేత్ మనసులో చెరగని ముద్ర పడిపోయింది. దీన్నే అదునుగా తీసుకుని సుదర్శనం మాస్టారు స్క్వాడ్ ఆఫీసుకి వెళ్ళి తన పలుకుబడితో ఏదో నచ్చజెప్పి సెప్టెంబరు లోనే ఎగ్జామ్స్ రాసేటట్టు ఆర్డర్స్ పట్టుకొచ్చాడు. ఈ విధంగా సాకేత్ దృష్టిలో జగన్నాథం మాస్టారిని ఒక మెట్టు కిందికి దించి తను ఒక మెట్టు పైకి ఎక్కాడు సుదర్శనం మాస్టారు. ఆ రోజు నుంచి సుదర్శనం మాస్టారికి, వారి కుటుంబానికి, ముఖ్యంగా స్వాతికి మరింత దగ్గరయ్యాడు సాకేత్. ఇలాంటి ఎన్నో సంఘటనలు ఇద్దరు కొడుకులకు జగన్నాథం మీద ద్వేషాన్ని పెంచేలా చేసాయి.

***

ఇద్దరు కొడుకులు బాగా చదువుకుని ప్రయోజకులయ్యారు. పెద్ద కొడుకు సాకేత్ కన్నా చిన్న కొడుకు సుందర్‌కి ముందుగా సెంట్రల్ గవర్నమెంట్ జాబు వచ్చింది. ఉద్యోగ రీత్యా బెంగళూరులో పోస్టింగ్ ఇచ్చారు.

ఇంకా పెద్ద కొడుకు సాకేత్ ఉద్యోగ ప్రయత్నాల్లోనే ఉన్నాడు. ఈ మధ్యనే ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబుకి అప్లై చేసాడు. రిటెన్ టెస్ట్ పాసయ్యాడు. ఇంటర్వ్యూకి రమ్మని కాల్ లెటర్ వచ్చింది. ఆ రోజు జగన్నాథం మాస్టారు మధ్యాహ్నం భోంచేసి పడక కుర్చీలో కూర్చుని ఏదో పుస్తకం చదువుకుంటున్నారు.

సాకేత్ కాల్ లెటర్‌తో వచ్చి “నాన్నా! నేను రిటెన్ టెస్ట్ పాసయ్యాను. ఇంటర్వ్యూకి రమ్మని కాల్ లెటర్ వచ్చింది.” అని చెప్పాడు.

“వెరీగుడ్! ఎప్పుడు ఇంటర్వ్యూ? డబ్బులేమైనా కావాలా?” అని అడిగారు జగన్నాథం మాస్టారు.

“అదీ! అదీ! ఇంటర్వూలో సెలెక్ట్ కావాలంటే రెండు లక్షలు కావాలి” అని తడుముకుంటూ చెప్పాడు సాకేత్.

“ఏమిటి? లంచమా? నేను ఇటువంటి వాటికి దూరమని నీకు తెలియదా?” అని గట్టిగా అడిగారు జగన్నాథం మాస్టారు సాకేత్‌ని.

“లంచమని మీరు అంటున్నారు. ఉద్యోగంలో సెక్యూరిటీ డిపాజిట్ అని నేను అంటున్నాను. ఈసారికి మాత్రం మీరు నాకు ఈ డబ్బు ఇచ్చి తీరాల్సిందే!” అని ఖరాఖండిగా చెప్పాడు సాకేత్. ఈ అరుపులు విని ఎదురింటినుండి పరిగెట్టకు వచ్చాడు సుదర్శనం మాస్టారు. “పోనీలేండి! ఆ డబ్బుతో కొడుకు ప్రయోజకుడవుతున్నాడంటే ఇంక అంతకన్నానా? ఈ సమయంలో ఏ తండ్రైనా డబ్బిచ్చే పంపుతాడు” అన్నాడు సుదర్శనం మాస్టారు.

“సుదర్శనం! ఇది మా కుటుంబ విషయం. ఇందులో నీ జోక్యం అనవసరం” అని గట్టిగా కేకలేసారు జగన్నాథం మాస్టారు.

“ఇన్నాళ్లూ నీతి నిజాయితీ అంటూ వేలాడేరు. ఏమి సాధించారు? మీరు ఇప్పుడు అవునన్నా, కాదన్నా మా అల్లుడికి నేనే ఆ డబ్బు ఏర్పాటు చేస్తాను. తప్పనిసరిగా ఆ ఉద్యోగం వచ్చేటట్టు చేస్తాను. ఇప్పుడు చేజారితే ఇలాంటి బంగారు అవకాశం మళ్ళీ రాదు. మీరే చూస్తారుగా, మీ అబ్బాయి ఏ స్థాయికి వెళ్తాడో?” అని సాకేత్ చేతిలో రెండు లక్షలు పెట్టి ఇంటర్వూకి సాగనంపాడు సుదర్శనం మాస్టారు.

ఈ సంఘటన జగన్నాథం మాస్టారు, సాకేత్ లను మరింత దూరం చేసింది. సాకేత్‌కి జాబు వచ్చి బొంబాయిలో స్ధిరపడ్డాడు. సాకేత్‌కి నేనే జాబు వేయించానని రోజూ జగన్నాథం మాస్టారి ముందు దర్పం వెలగబోసేవాడు సుదర్శనం. కొడుకు వల్ల సుదర్శనం ముందు ఓడిపోయానని జగన్నాథం మాస్టారు కుమిలిపోయేవారు. చేసేదేమీ లేక సాకేత్, స్వాతిల పెళ్ళి చేసారు. ఒక సంవత్సరం తిరిగే లోపే సుందర్ పెళ్ళి కూడా చేసేసారు. ఎవరి జాబులతో వాళ్ళు బిజీగా ఉన్నారు సాకేత్, సుందర్‌లు.

***

ఆ రోజు జగన్నాథం మాస్టారి రిటైర్మెంట్ రోజు. రిటైర్మెంట్ ఫంక్షన్ అంగరంగ వైభవంగా జరిగింది. తోటి టీచర్లు పొగడ్తలతో జగన్నాథం మాస్టారిని ఆకాశానికెత్తేసారు. ఫంక్షన్ తర్వాత భోజనాల ఏర్పాట్లు కూడా ఊహించని విధంగా బ్రహ్మాండంగా ఏర్పాటు చేసారు. కానీ ఒక్కటే పెద్ద లోటుగా కనిపించింది, ఇద్దరు కొడుకులు తండ్రి రిటైర్మెంట్ ఫంక్షన్‌కి రాకపోవడం. మీ అబ్బాయిలు రాలేదేమని ఎవరు అడిగినా సెంట్రల్ గవర్నమెంట్ జాబులు, దూరంలో ఉంటున్నారు, లీవ్ కుదరలేదని సాకులు చెప్పాల్సి వచ్చింది జగన్నాథం దంపతులకి. ఫంక్షన్ అయ్యి పూల దండలతో ఇంటికి వచ్చారు జగన్నాథం, సావిత్రిలు. వారు ఇంటికి వచ్చేటప్పటికి పొద్దు పోయింది. మధ్యాహ్నం తిన్నదే అరగలేదని కొంచెం మజ్జిగ తాగి పడక కుర్చీలో నడుం వాల్చారు జగన్నాథం మాస్టారు. ఆయన పక్కనే గోడకు ఆనుకుని కూర్చుంది సావిత్రి.

“అందరూ ఒకటే అడగడం, మీ అబ్బాయిల్లో ఒక్కడు కూడా రాలేదా అని. నాకు ఏ సమాధానం చెప్పాలో తెలియక తల కొట్టేసినట్టయ్యింది.” అంది బాధపడుతూ సావిత్రి.

“నా విధిగా రిటైర్మెంట్ ఫంక్షన్ గురించి వాళ్ళకు తెలియజేసాను. రమ్మని మరీ మరీ ప్రాధేయపడ్డాను. వాళ్ళ దైనందిన జీవితంలో తండ్రి రిటైర్మెంట్ ఫంక్షన్ తమ విధి కాదనుకున్నారేమో? బాధపడి ఏం ప్రయోజనం? జాబులు వచ్చి, పెళ్ళిళ్ళయి వాళ్ళ రెక్కల మీద బతుకుతున్నారు. మన అవసరం ఇక లేదనుకున్నారేమో? పిల్లల్ని కనగలం గానీ, వాళ్ళ రాతలను కాదుగా సావిత్రీ! దేవుడిని చూడాలని భక్తులకుండాలి గానీ, దేవుడు మాత్రం తలుపులు తెరిచి దేవాలయంలోనే కొలువై ఉంటాడు. అలాగే వాళ్ళు మనల్ని చూడాలని రావాలే గానీ, మన మనసులు, మన ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. కానీ భక్తులు రాని దేవాలయం మనది సావిత్రీ!” అని జగన్నాథం మాస్టారు ఆర్ద్రతతో అంటూ ఉంటే సావిత్రి ఏడుపు ఆపుకోలేకపోయింది. భర్త ఒళ్ళో తలపెట్టి భోరుభోరున ఏడ్చింది. ఎప్పుడూ గంభీరంగా ఉండే జగన్నాథం మాస్టారు కూడా ఏడుపుని ఆపుకోలేకపోయారు.

***

రిటైర్మెంట్ అయిన పదిరోజులకి జగన్నాథం మాస్టారు ఇద్దరు కొడుకులకి ఉత్తరాలు రాసారు. “పది రోజుల్లో నాకు రావాల్సిన అమౌంట్ లన్నీ చేతికందుతాయి. ఇన్నాళ్లూ చెమటోడ్చి సంపాదించినదంతా ఒక్కసారిగా చేతికొస్తోంది. మీరు మీ వీలు చూసుకుని, ఇద్దరూ ఒక మాట అనుకొని ఒక రోజు వస్తే మీ ఇద్దరికీ పంచేసి ఉన్నదాంతో మేము మా శేష జీవితాన్ని హ్యాపీగా గడుపుతాం”. ఇదీ ఆ ఉత్తరం సారాంశం.

ఉత్తరం అందిన పదిహేను రోజులకు ఒక ఆదివారం కొడుకులిద్దరూ వచ్చారు జగన్నాథం మాస్టారి ఇంటికి. అల్లుడితో పాటు తోడుగా సుదర్శనం మాస్టారు కూడా వచ్చాడు, ఎక్కడ తన అల్లుడికి అన్యాయం జరుగుతుందోనని. భోజనాలు అయ్యాక లాయర్‌ని పిలిపించారు జగన్నాథం మాస్టారు.

“ఆ మెరక వీధిలో ఉన్న రెండు ఇళ్ళు చెరో కొడుకు పేరున, అలాగే నాకున్న పొలంలో చెరో నాలుగు ఎకరాలు చెరో కొడుకు పేరున రాయండి లాయర్ గారు. పత్రాలు రెడీ చేసి రేపు రిజిస్ట్రేషన్‌కి ఏర్పాట్లు చేయండి సార్!” అని లాయర్ ని పంపించేసారు జగన్నాథం మాస్టారు.

“ఆస్తుల పంపకాలకు వీలు చూసుకుని వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా సుదర్శనం గారు మీకు మరీ మరీ ధన్యవాదాలు. విన్నారుగా! ఈ బడి పంతులు తన కష్టంతో తిన్నా, తినకపోయినా సంపాదించిన ఆస్తులు. ఇవి గాక నాకు వచ్చిన రిటైర్మెంట్ గ్రాడ్యుటీ, పి.ఎఫ్. డబ్బును మూడు వాటాలుగా వేసి ఉంచాను. చెరో వాటా మీకు ఇచ్చి ఒక వాటా నేను తీసుకుంటున్నాను. మరి మేమూ బతకాలిగా! ఇంత క్లారిటీగా ఎందుకు చెబుతున్నానంటే ఫ్యూచర్‌లో మా నాన్న మమ్మల్ని మోసం చేసాడని నా మీద అభాండాలు వేయకూడదని. ఈ ఒక వాటా డబ్బు, ఇదిగో ఈ ఇల్లు, నెల నెలా వచ్చే పెన్షనే నాకు, మీ అమ్మకు ఆధారం.” అని చెరొక వాటా డబ్బు ఇద్దరు కొడుకుల చేతుల్లో పెట్టారు.

“మీరు అన్నింటిలోనూ పెర్‌ఫెక్టే బావగారూ!” అని అన్నాడు సుదర్శనం మాస్టారు. ఆ పొగడ్తని తృణప్రాయంగా స్వీకరించారు జగన్నాథం మాస్టారు.

తరువాతి రోజు రిజిస్ట్రేషన్స్ అయ్యి కొడుకుల పేర్ల మీదకి ఆస్తులు ట్రాన్సఫర్ అయ్యాయి. రిజిస్ట్రేషన్స్ డాక్యుమెంట్లతో, పంపకాల్లో వచ్చిన డబ్బులతో తమ తమ ఊళ్ళకి బయల్దేరారు ఇద్దరు కొడుకులు.

వెళ్తూ “మీకు చూడాలనిపించినప్పుడల్లా అమ్మను తీసుకు రండి నాన్నా!” అని అన్నారు ఇద్దరు కొడుకులు.

“మీ ఇళ్ళకు మమ్మల్ని రండి అని పిలిచినందుకు చాలా ధన్యవాదాలు. మీరు సుఖంగా ఉండండి.” అని అందరినీ సాగనంపారు జగన్నాథం మాస్టారు.

ఇది జరిగి సరిగ్గా పదిహేనేళ్ళు అయ్యింది. ఈ పదిహేనళ్ళల్లో కొడుకులు వస్తూ, పోతూ ఉన్నారు. పంపకాల్లో వచ్చిన ఇళ్ళు, పొలాలు అమ్ముకుని వాళ్ళు ఉండే ఊళ్ళల్లో ఫ్లాట్లు కొనుక్కున్నారు. జగన్నాథం మాస్టారు దేనికీ అడ్డు చెప్పలేదు. ఎవరిష్టం వాళ్ళదని సరిపెట్టుకున్నారు. జగన్నాథం, సావిత్రమ్మలు మాత్రం కొడుకుల దగ్గరకు వెళ్ళకుండా ఈ ఊళ్ళోనే ఉంటున్నారు. ఏ రోజూ కొడుకుల ఇళ్ళల్లో చేయి కడగలేదు.

జగన్నాథం మాస్టారికి ఇంట్లో పనులు ఒక్కొక్కటి నెమ్మదిగా నేర్పుతోంది సావిత్రమ్మ.

జగన్నాథం మాస్టారు “నాకెందుకే ఈ పనులు, నువ్వు నా పక్కన ఉండగా?” అంటే “మీకు ఏ పనులు రావాయే. కనీసం బిందెలో నీళ్ళు తీసుకుని తాగడం కూడా రాదు. రేపు నేను పోతే ఈ పనులన్నీ మీకు ఎవరు చేసి పెడతారు? కొడుకుల వరస చూస్తే ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుంది” అని బాధపడేది సావిత్రి.

ఇలా కొంత కాలానికి తన పనులు తాను చేసుకునే స్ధాయికి, తనకు తానుగా వంట వండుకుని తినే స్ధాయికి జగన్నాథం మాస్టారిని తీసుకు వచ్చింది సావిత్రమ్మ. ఆయనకి ఒంట్లో బాగోలేనప్పుడు ఆవిడ, ఆవిడకి బాగోలేనప్పుడు ఆయన ఒకరికొకరు సర్దుకుని పనులు చేసుకుంటున్నారు. ఇలా నీకు నేను, నాకు నువ్వు అన్న రీతిన కాలాన్ని వెళ్ళదీస్తున్నారు.

జగన్నాథం మాస్టారికి సావిత్రి అన్ని పనులు నేర్పింది అన్న విషయం తెలిసిందేమో కాలానికి, సావిత్రిని తనతో పాటు తీసుకుని వెళ్ళిపోయింది. సావిత్రి కాలం చేసి ఎనిమిది నెలలవుతోంది. కానీ సావిత్రి తనతోనే ఉంది, తన పక్కనే ఉందన్న భ్రమలో బతికేస్తున్నారు జగన్నాథం మాస్టారు.

***

సుబ్బయ్య కొట్టు నుంచి వచ్చి కాళ్ళు కడుక్కుని లోపలికి వస్తూ “ఏమోయ్ సావిత్రీ! నువ్వు రాసిచ్చిన చీటీలో ఉన్న అన్ని సరుకులు తెచ్చానో లేదో చూడు. మళ్ళీ టీ పెట్టి ఇవ్వవోయ్! ఈసారి మారీ బిస్కెట్లు తింటూ టీ తాగుతాను” అని సరుకుల సంచీ టేబుల్ మీద పెట్టారు జగన్నాథం మాస్టారు.

సరుకుల సంచీ పెడుతుండగా టేబుల్ మీద ఒక కార్డు జగన్నాథం మాస్టారి కంట పడింది. పొద్దున్న పోస్ట్‌మాన్ తెచ్చి ఇచ్చిన కార్డు. పడక కుర్చీలో కూర్చుని కార్డు తీసి చదివారు జగన్నాథం మాస్టారు.

“పూర్వ విద్యార్థుల సమ్మేళనం. మా ప్రియమైన ఉపాధ్యాయులందరికీ నమస్కారాలు. మీ అందరికీ మా పూర్వ విద్యార్థులు చేసే సన్మాన కార్యక్రమం. పూర్వ విద్యార్థులు చదివిన సంవత్సరం, సన్మానం చేసే రోజు” ఉన్నాయి ఆ కార్డులో.

చదివిన సంవత్సరం చూస్తే గుర్తొచ్చింది జగన్నాథం మాస్టారికి , అది సాకేత్ చదివిన సంవత్సరమని. రేపు పూర్వ విద్యార్థుల సమ్మేళనం అనగా సాకేత్ వచ్చాడు వాడి పెళ్లాన్ని, మావగారిని వెంటబెట్టుకుని. అందరూ కలిసి స్కూల్‌కి వెళ్ళారు మరుసటి రోజు.

ఒక్కసారిగా తను పని చేసిన స్కూల్ చూసేసరికి పాత జ్ఞాపకాలన్నీ గుర్తుకు వచ్చాయి జగన్నాథం మాస్టారికి. పువ్వులతో, మామిడి తోరణాలతో పాత స్కూల్‌ని కొత్తగా అలంకరించారు. ఎప్పుడో విడిపోయిన తమ స్నేహ బంధాలు తలచుకొని అందరూ మురిసిపోయారు. టీచర్లందరినీ సన్మానించిన తర్వాత ఒక్కొక్క టీచర్‌ని మాట్లాడమంటున్నారు. ఇప్పుడు జగన్నాథం మాస్టారి వంతు వచ్చింది.

“గౌరవనీయులైన మన లెక్కల మాస్టారు జగన్నాథం గారిని మాట్లాడవలసినదిగా మీ అందరి తరపున కోరుతున్నాను” అని కోయిల కంఠంతో ఒక స్టూడెంట్ సాదరంగా ఆహ్వానించింది జగన్నాథం మాస్టారిని.

అడుగులో అడుగు వేసుకుంటూ నెమ్మదిగా మైకు దగ్గరకు వచ్చారు జగన్నాథం మాస్టారు.

“నా తోటి సహోద్యుగులకు నమస్కారాలు. మమ్మల్ని సాదరంగా ఆహ్వానించిన మీ అందరికీ శుభాభినందనలు. మరిచిపోయిన జ్ఞాపకాలను మరల గుర్తు చేసినందుకు కృతజ్ఞతలు. నేను కొంచెం సూటిగా మాట్లాడినా సహృదయంతో అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఎవరి మనసైనా నొప్పిస్తే నన్ను క్షమించండి.

ఎప్పుడో మీకు చదువులు చెప్పామన్న కృతజ్ఞతతో మాకు ఈ సన్మానం చేస్తున్నారు. బాగానే ఉంది. కానీ ఇందులో ఎంతమంది మాకు మనస్ఫూర్తిగా మాకు సన్మానం చేయాలనుకుంటున్నారు. నిజంగా మీరందరూ మనస్ఫూర్తిగా మమ్మల్ని గౌరవించాలనుకుంటే దీనికి పూర్వ విద్యార్థుల సమ్మేళనం అని కాకుండా మా దేవుళ్ళకి సత్కార సభ అని పేరు పెట్టేవారు. ఏదో మీలో మీరు ఎవరు ఎంత ఎదిగారో తెలుసుకోవడానికో, ఎవరు ఎంత పొజిషన్‌లో ఉన్నామో తెలియడానికో ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పాటు చేసారు.

మిమ్మల్ని చూస్తుంటే మీరందరూ బాగా ఎదిగారని అనిపిస్తోంది. ఎంత బాగా ఎదిగారంటే కన్న తల్లిదండ్రులని చూడలేనంత బాగా ఎదిగారు. మీరు చిన్న పిల్లలగా ఉన్నప్పుడు మిమ్మల్ని మేము ఎలా చూసామో ఇప్పుడు మీ తల్లిదండ్రులను అలా చూస్తున్నారా? ఖచ్చితంగా చూడడం లేదు. మీరు సరిగ్గా చూస్తే మేము పిచ్చివాళ్ళం ఎందుకు అవుతాము. ఈ ఊళ్ళో వాళ్ళందరూ నన్ను పిచ్చివాడయి, పోయిన పెళ్ళాంతో మాట్లాడుకుంటున్నాడు అంటున్నారు. అవును. నేను కొడుకులు వదిలేసిన పిచ్చివాడనయ్యాను. ఈ పిచ్చివాడికి, పోయిన నా భార్యే ఓదార్పు అయ్యింది. నా భార్య సావిత్రి బతికున్నంతకాలం ఒక మాట అనేది. భర్త పోయినా భార్య జీవితాన్ని సాఫీగా లాగగలదేమో గానీ భార్య పోయిన భర్త ఒక్క రోజు కూడా మనశ్శాంతిగా బతకలేడు అని. అందుకే నా భార్య సావిత్రి దేవుడిని ఒక్కటే కోరుకునేది. నా కన్నా నా భర్త ముందు పోవాలని. బహుశా భర్త తన కళ్ళ ముందే పోవాలని, తన మాంగల్యం తెగిపోవాలని కోరుకున్నది ఒక్క నా సావిత్రే కాబోలు. కానీ దేవుడు ఆమె మొర వినలేదు. తననే ముందు తీసుకెళ్ళిపోయాడు.

ఇప్పుడు నేను నా భార్య ఇచ్చిన భరోసాతో బతుకీడుస్తున్నాను. నా భార్య సావిత్రి నాకు ఎలా బతకాలో నేర్పి వెళ్ళింది. నేను నా కొడుకులకి రిటైర్మెంట్ తర్వాత అంతా ఊడ్చి ఇచ్చేస్తుంటే అందరూ ఎందుకండీ మీరు అట్టిపెట్టుకోకుండా అలా ఇచ్చేస్తున్నారు, ఈ లెక్కల మాస్టారి లెక్క తేడా వచ్చిందన్నారు. కానీ నా లెక్క ఎప్పుడూ తేడా రాదు. ఆ రోజు నేను అలాగ పంచి ఇవ్వకపోతే వాళ్ళు ఈ రోజుకు కూడా నన్ను మనశ్శాంతిగా ఉండనిచ్చేవారు కాదు. రాబందుల్లా పీక్కుని తినేవారు. ఆ సతీ సావిత్రి యముడితో పోరాడి మొగుడు ప్రాణాలు కాపాడితే నా సావిత్రి యమకింకరులలాంటి కొడుకుల వద్దకు వెళ్ళకుండా అన్ని పనులు నేర్పింది.

మేము చదువుకున్నాం, మేము బాగా సంపాదిస్తున్నాం అంటున్నారు గానీ దానికి పెట్టుబడి ఎవరిది. మీ తల్లిదండ్రుల కష్టం, చెమట, నెత్తురు. ఇప్పుడు రెక్కలు వచ్చి మేము ఎగిరిపోయాం అనుకుంటున్నారు గానీ ఆ రెక్కలు విచ్చుకోవడానికి మేము ఎన్నిసార్లు డొక్కలు మాడ్చుకున్నామో మీకు తెలుసా? ఇప్పుడు మీరు ఏ స్ధితిలో ఉన్నారో మాకు తెలుసు. ఇద్దరూ సంపాదించినా జీవితం సాఫీగా వెళ్ళని రోజులు. అందుకే మీకు మా దగ్గరున్న సర్వస్వం అర్పిస్తున్నాం. మీరు మాకు డబ్బులు పెట్టక్కరలేదురా! మేము మీ దగ్గరుంటాం అనేది ఏదో మీ మీద పడి ఎగపడి తిందామని కాదు. మేము మీ దగ్గర నుండి కోరుకునేది కేవలం ఆప్యాయత, అనురాగం, ఎలా ఉన్నావు అనే పిలుపు. చిన్న పిల్లలగా ఉన్నప్పుడు మేము మిమ్మల్ని పెంచలేక రోడ్డు మీద వదిలేస్తే మీరు ఎలా బతికేవారురా? ఇప్పుడు మీరు మమ్మల్ని చూడలేక అనాథలుగా వదిలేస్తే మేము ఎలా బతుకుతామనుకున్నార్రా?” అంటూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు జగన్నాథం మాస్టారు.

ఒక్కసారిగా అందరి మనసులు పశ్చాత్తాపంతో బరువెక్కాయి. అందరి కళ్ళల్లోనూ మాస్టారికి ఏమయ్యిందోనని ఆత్రుత ఆవరించింది. ఆసుపత్రికి తీసుకెళ్ళేలోపే జగన్నాథం మాస్టారు సావిత్రమ్మ చేయి అందుకున్నారు. కానీ అస్తమించని సూర్యుడిలా అందరి మనసులలో ఎప్పటికీ వెలుగుతూనే ఉంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here