అశ్వఘోషుడు – బుద్ధ చరిత్ర

0
2

[box type=’note’ fontsize=’16’] మహాకవి, పండితులు అశ్వఘోషుడి ‘బుద్ధ చరితం’ను విశ్లేషిస్తూ శ్రీమతి రాజేశ్వరి దివాకర్ల రచించిన ప్రత్యేక వ్యాసం. [/box]

[dropcap]క[/dropcap]పిలవస్తు పుర శుద్ధోదన మహారాజు, పట్టపురాణి మాయాదేవి దంపతులకు గౌతముడు వైశాఖ పూర్ణిమ నాడు జన్మించాడు. ఆయన యశోధరను వైశాఖ పూర్ణిమ నాడు వివాహం చేసుకున్నాడు. ప్రపంచంలోని దుఃఖాన్ని తొలగింపజేయడం కోసం ఆ రాకుమారుడు వైశాఖ పూర్ణిమ నాడు ఇల్లు వీడాడు. గయలో బోధి వృక్షం నీడలో సిద్ధార్థుడు వైశాఖ పూర్ణిమ నాడు జ్ఞానోదయం పొదాడు. చివరకు బుద్ధుడు నిర్వాణ స్థితికి చేరుకున్నది వైశాఖ పూర్ణిమ నాడే! ఇన్ని విధాలుగా బుద్ధుని జీవితంలో మహత్తరమైన పరిణామాలకు కారణమైన రోజు వైశాఖ పూర్ణిమ- అదే బుద్ధ పూర్ణిమ.

అశ్వఘోషుడు సంస్కృత పండితుడు. మహాకవి. నాటకకర్త. అశ్వఘోషుని సంస్కృత వాఙ్మయంలో తొలి నాటకకర్తగా భావిస్తారు. సర్వ మానవహితమైన బౌద్ధ ధర్మాన్ని ప్రజలలో విస్తృతంగా ప్రచారం చేయడానికి దార్శనికుడైన ఆ కవికి కవిత్వం ఉపకరించింది. అశ్వఘోషుడు రచించిన సంస్కృత గ్రంథాలలో బుద్ధచరితం, సౌందరనందం అనే రెండు మహా కావ్యాలు, సారిపుత్ర ప్రకరణం అనే నాటకం, వజ్రసూచి అనే బౌద్ధ ధర్మ సంబంధమైన గ్రంథం ముఖ్యమైనవి.

అశ్వఘోషుడు రచించిన ‘బుద్ధచరితం’ సంస్కృతంలో మహాకావ్యంగా గుర్తింపు పొందింది. సంస్కృత కావ్యాలలో బుద్ధ చరిత్ర పురాతనమైనది. “బుద్ధ భగవానుని బోధనలను అనుసరిస్తూ లోకం లోని ప్రజలకు హితమూ ఆనందమూ, కలగాలనే ఆశయంతో, బుద్ధ చరితమనే ఈ కావ్యాన్ని వ్రాసాను. ఆ ముని పుంగవునిపై నాకు గల అమితమైన భక్తి భావం వలన దీనిని వ్రాసాను. అంతేగాని, నా పాండిత్యాన్నీ, నా కావ్య కళనూ ప్రదర్శించుకోవాలనే ఉద్దేశంతో కాదు” అనిన అశ్వఘోషుని భావాన్ని సరళమైన తెలుగులో మొదటి సారిగా అర్థ తాత్పర్యాలతో బుద్ధచరితంను తెలుగులో అందించిన భాస్కర్ హనుమత్ కొంపెల్ల గారని (శ్రీ అశ్వఘోష విరచితమ్ బుద్ధచరితమ్ (అర్థ తాత్పర్యములతో) అజో విభో కందాళం ఫౌండేషన్, ప్రచురణ) రచన తెలిపింది. జన్మతః బ్రాహ్మణునిగా పుట్టిన అశ్వఘోషుడు బౌద్ధుడై బ్రాహ్మణ వర్ణాతిశయాన్ని విసర్జించి బుద్ధని బోధనలకు తన సాహిత్యం ద్వారా విస్తృత ప్రచారం కావించాడు.

“He arrived at the principle of equality of human beings in attacking the institution of caste” అని డా. కె.బి. కృష్ణ “పొలిటికల్ అండ్ సోషల్ థాట్ ఆఫ్ బుద్ధిస్ట్ రైటర్స్ “గ్రంథంలో పేర్కొన్నారు.

అశ్వఘోషుడు కుషాన్ సామ్రాజ్యానికి చెందిన కనిష్కచక్రవర్తి కాలం నాటి వాడు. సౌందరనందం కావ్యం చివర 18వ సర్గలో “ఆర్య సువర్ణాక్షీపుత్రస్య సాకేతకస్య భిక్షోరాచార్యస్య భదంతాశ్వఘోషస్య మహాకవేర్మహా వాదినః కృతిరియమ్” అన్న వాక్యాన్ని బట్టి ఆ కవి సాకేత అయోధ్య పురవాసి. తల్లి సువర్ణాక్షి. ఆయన బౌద్ధ ఆచార్యుడు, మహాకవి అని తెలుస్తుంది.

అశ్వఘోషునికి భదంత, ఆచార్య, మహాకవి, మహావాది ఇత్యాది గౌరవప్రద మైన బిరుదులు ఉన్నాయి.

అశ్వఘోషుని మంత్ర పఠన సిద్ధిని పరీక్షించే సందర్భంలో కనిష్కుని మంత్రులు అంతకు ముందే ఆహారం ఇవ్వకుండా ఆరు రోజులు పాటు మాడ్చిన గుర్రాలను అశ్వశాల నుండి సభకు తెప్పించి ఆకలితో నకనకలాడుతున్న ఆ గుర్రాల ముందు మంచి ఆహారం వుంచడం జరిగింది. అశ్వఘోషుని ధర్మ పఠనానికి మంత్ర ముగ్ధులైన ఆ అశ్వాలు తమ ముందు ఆహారం సిద్ధంగా ఉన్నప్పటికీ ముట్టకుండా ఘోషించాయి. నాటి నుండి అతని పేరు ఆశ్వఘోషుడు అని స్థిరపడింది..

తిరుపతి రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం (మంచినీళ్ళ గుట్ట అని ఆ ప్రాంతానికి పేరు) ఆవరణలో చాలాచోట్ల సంస్కృత సుభాషితాలను పలకలపై వ్రాశారు. అందులో ఒకటి ఇది.

“కదళీగర్భ నిస్సారః సంసార ఇతి నిశ్చయః”.

సంసారం అరటిచెట్టు బెరడు లాగా డొల్ల అయినది, అని అర్థం. లోతైన తాత్వికతను అంత సునాయాసంగా శ్లోకరూపాన నిక్షేపించిన కవి అశ్వఘోషుడు.

బుద్ధుని జననం నుంచి నిర్వాణం వరకు గల జీవిత చరిత్రను 28 సర్గలలో సమగ్రంగా వర్ణించే ఈ గ్రంథం సంస్కృతంలో మహాకావ్యంగా గుర్తింపు పొందింది. క్రీ. శ. 10-12 శతాబ్దాలలో కొనసాగిన ముస్లిం దండయాత్రలలో మూల సంస్కృత ప్రతిలోని సగ భాగం ధ్వంసమైపోయింది. సంస్కృత భాషలో కేవలం 14 సర్గలతో మాత్రమే లభ్యమైంది. క్రీ.శ. 5 వ శతాబ్దంలో ధర్మరక్షిత బౌద్ధ పండితుడు చైనా భాషలోనికి పూర్తిగా 28 సర్గలను అనువదించారు. ఈ కావ్యంలో బుద్ధుని మహాభిష్క్రమణం, తపస్సు, మారుని ప్రలోభాలు, మారునిపై విజయం మొదలైన ఘట్టాలు ఉజ్వలమైన, లలితమైన కావ్య శైలిలో నిరూపితం అయ్యాయి.

బుద్ధ చరిత్ర కు ఆధారం ఏమిటో ఎవరూ చెప్పలేక పోతున్నారు. బుద్ధుని జీవితం పై వచ్చిన మొదటి గాథ ‘లలిత విస్తరం’ నుంచి మూల కథను తీసుకొని మార్పులు చేశాడని ఊహ.

తెలుగులో వచ్చిన బౌద్ధ కావ్యాలన్నింటికీ సంస్కృతంలో అశ్వఘోషుడి బుద్ధచరితమే ఆధారం.

తిరుపతి వేంకట కవుల రచన ‘బుద్ధ చరిత్ర’.. తొలి తెలుగు బౌద్ధ వాఙ్మయ గ్రంథం. ఈ చంపూ కావ్యం 1901లో వచ్చింది. ఆంగ్లంలో సర్‌ ఎడ్విన్‌ ఆర్నాల్డ్‌ రాసిన ‘లైట్‌ ఆఫ్‌ ఏసియా’కు ఇది స్వేచ్ఛానువాదం. కొచ్చర్లకోట రామచంద్ర వేంకట కృష్ణారావు అనే పోలవరం జమీందారు కు Sir Edwin Arnold రాసిన “The Light of Asia” అనే పుస్తకం అంటే చాలా ఇష్టం. ఆయన కోరగా, ఒక ఆంగ్ల పండితుడి చేత అర్ధం చెప్పించుకుని రాసారట

అతడింగ్లీషు భాషలో నర్నాల్డు

కవి రచించిన బుద్ధుని కతను దెల్గు

జేసి ….అని చెళ్ళపిళ్ళ వారు జాతక చర్యలో 1934 లో పేర్కొన్నట్లు పండితులు పరిశీలించారు. ఈ కావ్య రచన మీద అశ్వఘోషుడి ‘బుద్ధ చరిత్ర’ ప్రభావమూ ఉంది.

ఇద్ధతేజుఁ డైన బుద్ధదేవు చరిత్ర

నశ్వఘోషముఖుల ననుసరించి

యస్మదంకితముగ నాంధ్రకావ్య మొనర్పుఁ

డనుచు వీడ్యమిచ్చె నాదరమున.

-అని జంట కవులు విన్నవించారు.

యజ్ఞ యాగాది క్రతువుల్లో జీవహింస తగదనీ, ప్రాణి హింస మహా పాతమనీ అహింసయే పరమధర్మమనీ బుద్ధుడు సకల మానవాళికీ సందేశం ఇచ్చాడు. తిరుపతి వేంకట కవుల ‘బుద్ధ చరిత్ర’.. ఆరు ఆశ్వాసాలతో సుమారు వెయ్యికిపైగా పద్య గద్యాలు కలిగిన గ్రంథం. సూక్ష్మ విషయాలని సైతం సరళ పదజాలంతో కూర్చి కావ్య మర్యాదకు భంగం కలగకుండా పండితపామర ప్రియంగా సాగడం ఈ కావ్యం ప్రత్యేకత. ఇందులో భూతదయ గురించి బుద్ధుడు చేసిన దమ్మబోధ విస్మరించరానిది.

బుద్ధుడవై జగముల కవి/రుద్ధంబగు జ్ఞానమిచ్చి ప్రోచుచును, నసం/బద్ధపు మతముల ద్రుంచుచు,/ నిద్ధ చరిత నెగడ పుట్టితీవు మహాత్మా!’’ అంటూ ‘బుద్ధ చరిత్ర’లో తిరుపతి వేంకట కవులు సంభావించారు. సమాజంలోని అసంబద్ధపు మతాల్ని త్రుంచుతూ, పవిత్రమైన జ్ఞానాన్ని ప్రసాదించి, నిర్మలమైన చరిత్రతో ప్రవర్తించడానికి బుద్ధుడు అవతరించాడని ఆ జంటకవుల అభిప్రాయం.

‘‘ప్రాణహననంబు గడు సులభంబుగాని/ ప్రాణమిచ్చుట మనకు సాధ్యంబుకాదు/ ప్రాణరక్షణకై పాటుపడని వారు,/ ప్రాణిపై బ్రేమలేనివారలును గలరె’’ అంటూ నైతిక వర్తనానికి అవసరమయ్యే సంబుద్ధిని కలిగించాడు బుద్ధుడు. జీవహింస మానసిక జీవితాన్ని ఎంత కల్లోలపరుస్తుందో చెబుతూ ‘‘జీవముల యాత్ర సంపూర్తి చేయకుండ/జంపువారికి పాపంబు సంభవించు/జీవహింస యొనర్చెడిచేత సేయు/వారలకు బాపముక్తి చేకూరదెపుడు’’ అంటుంది బుద్ధ వచనం. ఈ చరాచర జగత్తుకు మనం చేయగలిగే మహోపకారం ఏదైనా ఉందంటే జీవుల ఎడ కరుణను కలిగి ఉండటమే. అదే లేని నాడు మానవుడికి ముక్తి కలగదని ఈ కావ్యం చెబుతుంది.

అశ్వఘోష బుద్ధ చరితము ఆంధ్ర వచనానువాదం కావించిన దివాకర్ల వేంకటావధాని గారు “సాంప్రదాయ పండితులైనా అశ్వఘోషుడి జీవితాన్ని నిష్పాక్షికంగా చిత్రించారు. సాంప్రదాయ పండితులెవరూ బౌద్ధుడైన అశ్వఘోషుని కవిత్వ ప్రభావం బ్రాహ్మణ మత కవి కాళిదాసు పై ఉందనే విషయాన్ని అంగీకరించరు. వేంకటావధాని గారు అటువంటి సంకుచిత మత ద్వేషాన్ని విడనాడినట్లు తొలి పలుకు చదువుతుంటే అనిపిస్తుంది” (సాహిత్య అకాడమీ న్యూ డిల్లీ 1975).మహా కవి అశ్వఘోషుడు, మిసిమి 1997 నవంబరు.టి. రవిచంద్).

రాహుల్ సాంకృత్యాయన్ రాసిన ‘ఓల్గా టు గంగా’ కథల సంపుటిలోని పదకొండవ కథ ‘ప్రభ’ ఆధారంగా ఆత్రేయ గారు అశ్వఘోషుడు నాటికను ఆకాశవాణి ప్రసారం కోసం రాశారు. క్రీస్తు పూర్వం ఒకటవ శతాబ్దానికి చెందిన ఆశ్వఘోషుడి చుట్టూ కొన్ని గాథలను సృష్టించి కథను అల్లడం జరిగింది. ఈ కాలంలోనే కాదు, ఆ కాలంలోనే మత, ప్రాంతీయ భేదాలు ఉన్నాయని నిరూపించారు. ఆ కారణాల వల్లే పెద్దలు అడ్డు చెప్పడం వల్ల హిందువైన అశ్వఘోషుడు దత్తామిత్రుడనే గ్రీకు వర్తకుని కూతురు ప్రభని ప్రేమించి, పెళ్ళాడలేక పోతాడు. ఫలితం ప్రభ సరయూ నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంటుంది.

గృహలక్ష్మి స్వర్ణకంకణ గ్రహీత కాంచనపల్లి కనకమ్మ ‘గౌతమబుద్ధ చరిత్ర’ను రచించారు.

బుద్ధుడి జీవితం, అతని బోధనల గురించి తెలుసుకునేందుకు తెలుగులో విస్తృత సాహిత్యం అందుబాటులో ఉంది. తెలుగు కవులు, రచయితలు.. ఎన్నో గ్రంథాలు రాశారు. విభిన్న ప్రక్రియల్లో (పద్య కావ్యాలు, వచన గ్రంథాలు, నాటకాలు, వ్యాసాలు..) పుస్తకాలు ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here