అశ్విన్

0
1

[dropcap]అ[/dropcap]శ్విన్ ఒక గొప్ప డైరెక్టర్. ఇంటి బాధ్యతలు సమర్థవంతంగా చేస్తాడు. అతిథులన్నా, బంధువులన్నా, స్నేహితులన్నా ముఖ్యంగా పిల్లలంటే మహాప్రీతి.

ప్రతి ఆదివారం ఆ ఇంట సంగీతం, సాహిత్యం, విందు. అతని బావగారు గొప్ప ప్లూటు విద్వాంసుడు. కోడలు మంచి రచయిత్రి. రెండో అల్లుడు గొప్ప పేరున్న రచయిత.

సాయంత్రం అందరూ కలిసి సాహితీ విందు, సంగీత విందు అయ్యాక హోటల్‍కి వెళ్ళి భోజనాలు చేస్తారు.

వాళ్ళ పిల్లలంతా ఉద్యోగాల్లో కొందరు, విదేశాల్లో కొందరు సెటిల్ అయ్యారు. పెద్దలంతా మంచి మంచి సాహితీ కార్యక్రమాలకి వెళ్ళడము, సంగీత కచ్చేరీలకి వెళ్ళడమూ చేస్తూ ఉంటారు.

సంక్రాంతి వచ్చిందంటే సిటీ నుంచి పల్లెకు వెళతారు. అక్కడ ఉన్న పెద్ద మేడ దులిపించి, అవసరం అయితే రంగులు వేయించి తోరణాలు పూలదండలతో అలంకరిస్తారు. నాన్నా అమ్మలతో గడుపుతారు. ఊళ్ళో అందరికి ముగ్గుల పోటీలు, బొమ్మల కొలువులు నిర్వహిస్తారు. అమ్మాయిల ఫ్యాషన్ డ్రస్ పోటీలు నిర్వహిస్తారు. అశ్విన్ డైరెక్టర్ గనుక ఇవన్నీ ఒక ఫిలిమ్‍గా తీసి ‘సంక్రాంతి సంబరాలు – మన ఊరి సంబరాలు’ అనే పేరుతో యూట్యూబ్‍లో పెడతాడు. దేశవిదేశాలకి మన సాంప్రదాయాలు- పండుగలు అత్యంత రమణీయంగా ఉంటాయి. వాటిని ప్రపంచమంతా చూపించాలి అన్నదే అశ్విన్ లక్ష్యము.

తాను గొప్ప డైరెక్టర్‍గా ఎన్నో టెలిఫిలిమ్స్ తీశాడు. ప్రతి ఫిలిమ్‍నీ కుటుంబ వాతావరణంలో తీస్తాడు. కుటుంబ కలహాలు, కలతలు వాటిని ఎలా ఎదుర్కోవాలి అన్నదానికి చక్కని సందేశమిస్తూ ఎంతో సృజనాత్మకంగా కళాత్మకంగా తన చిత్రాలు నిర్మిస్తాడు. ఉమ్మడి కుటుంబాలలో ఎంతో ఆనందం ఉంది. అంతేకాకుండా ఛానల్స్‌‌కి సరిపడే గేమ్‍షోలు, మ్యాజిక్‍షోలు బావగార్లతో కలిసి చక్కగా నిర్మిస్తాడు. ఒక వ్యక్తికి ఇన్ని రంగాలలో అత్యంత అనుభవం ఉండటం అత్యంత విలువైనది – అపురూపమైనది. అతని ఆలోచనలు అత్యంత ప్రత్యేకంగా ఉంటాయి. అశ్విన్ భార్య మంచి మనస్తత్వం కలది. ఆడబడుచులు, అన్నగార్లని అందరినీ ప్రేమగా చూస్తుంది. అసలు అందరూ కలసి ఉండాలన్నది ఆమె ధ్యేయం. పిల్లలు ఎక్కడో దూరంగా ఉన్నారు. ఏ వయసుకా సరదాలు. వారికి పెళ్ళిళ్ళు చేసి సెటిల్ చేసేశారు.

కవితకి ఇద్దరు కోడళ్ళు – పెద్దవాళ్ళకి నచ్చినట్లే పెళ్ళిళ్ళూ చేశారు. ఎవరి జీవితం వారిదే అన్నట్లు స్వతంత్రభావాలతో జీవించేటట్లు అన్నీ ఏర్పాట్లు చేశారు. మనవలు సెలవలకి వస్తారు. ఎవరి పిల్లల్ని వారికి నచ్చిన రీతిలో పెంచుతున్నారు. పెద్దవారు ఆంక్షలు కాక ఆకాంక్షలుగా చెప్పారు. తాతా బామ్మ వంతుగా వారు పెట్టాలనుకున్న నగలు చేయించి మనుమలకి పెట్టారు. ఎవరికి తేడా చూపించడం లేదు.

అయితే ఆ ఇంటికళలు వంశపారంపర్యగా వస్తున్నాయి కనుక దగ్గర కూర్చోపెట్టుకుని కళల విలువ తెలుపుతూ పిల్లల్లో కూడా అవగాహన కలిగేలా పెంచుకోమంటారు. బామ్మ మాటకి విలువనిచ్చే మనుమలు. ఒక్కొక్కరికి ముగ్గురు పిల్లలు. మాకు తగిన ఆస్తులు ఉన్నాయి. అందుకు తగినట్లుగా పిల్లల్ని కని మన వారసులుగా వారిని పెంచాలన్నదే వారి ధ్యేయం. కొంతమంది ఈ రోజుల్లో ముగ్గురు పిల్లలా? విదేశాల్లో ఉన్నారు కదా అన్నప్పుడూ నవ్వుతారు. మాకు పిల్లలంటే ఇష్టం అని తేలిగ్గా చెప్పేస్తారు.

నిజానికి పిల్లల్ని పెంచడం ఒక కళ. వారికి తగినట్లుగా విద్య నేర్పించడము, ఉన్నతమైనట్లు జీవితాన్ని ఇవ్వడం, చాలా కష్టము. అయినాసరే, తమ పిల్లల్ని పెంచగలగం అనే కాన్ఫిడెన్స్ ముఖ్యంగా తల్లిదండ్రుల్లో ఉంటే, పిల్లలు చక్కగా పెరుగుతారు. అశ్విన్ డైరెక్టర్ కనుక రకరకాల జీవితాల్ని తన కోణంలో ఆలోచించి కెమెరాలో బంధిస్తాడు.

దానికి కావాల్సిన స్క్రిప్ట్ మొదట కవిత రాసి చూపిస్తుంది. కథ గురించి ఇంట్లో అంతా చర్చించుకుంటారు. దానికి కావాల్సిన యాక్టర్లని, కెమెరామెన్‍లని, అందరిని సెలక్ట్ చేసుకుంటారు. కవిత కూడా అశ్విన్‍తో పాటు ఆఫీసుకు వెళ్ళి కావాల్సిన వర్క్‌కి హెల్ప్ చేస్తుంది.

స్త్రీలకి కూడా వర్క్ నేర్పాలి, స్వేచ్ఛాయుతంగా ఆలోచించాలన్నదే అశ్విన్ అభిప్రాయము. “ఇన్నాళ్ళు పిల్లల పెంపకము, అమ్మానాన్నల బాధ్యత అంతా నువ్వే చూసుకున్నావు. ఇపుడు నీ ఆలోచనలు, నీ ఆనందాలు అన్నీ నీకుంటాయి. సంపూర్ణ స్వేచ్ఛనిస్తున్నాను” అంటాడు అశ్విన్.

కవిత నవ్వుతుంది. “నీ యింట్లోనే నీకు స్వేచ్ఛ లేకుండా కుటుంబాన్ని తీర్చిదిద్దావు. అమ్మానాన్నలకు ప్రేమగా చూసుకున్నావు” అంటుంది.  సంక్రాంతికి అత్తామామలతో, దసరాకి అమ్మానాన్నలతో, వేసవిలో మనుమలతో గడపటం అశ్విన్ ధ్యేయం.

అసలు అశ్విన్ ఎంత మంచివాడంటే అత్తామామల్ని ఎంతో బాధ్యతగా చూసుకునేవాడు. కవిత ఒక్కతే కూతురు. ఆమెకు తల్లిదండ్రి బాధ్యత ఉంది. అవన్నీ అశ్విన్ చూసేవాడు.

అశ్విన్ తీసిన సినిమాలో బాలల చిత్రాలు జాతీయ అవార్డుల పోటీకి పంపారు. సహజంగా బాలల చిత్రాలు చాలా తక్కువ మంది ఉంటారు. అశ్విన్ పిల్లల్ని పెంచడమే గాక బాలల జీవితాలు తీర్చిదిద్దిన విధానం వల్ల జాతీయ అవార్డు పొందారు.

అందుకే ఈ సంక్రాంతికి వాళ్ళు పల్లెల్లో ఫిలిమ్ ఉత్సవాలు మాదిరిగా ఊరివారందరికి ఈ ఫిలిమ్ చూపించడమే గాక, ప్రతి స్కూలుకి ఈ సి.డి పంచాలనే ఉద్దేశంతో భారీ ఏర్పాట్లు చేసి, సంక్రాంతి పండుగ ఏర్పాట్లు చేశారు. చాలామంది డైరెక్టర్స్‌ని, యాక్టర్స్‌ని పిలిచి సినీ ఉత్సవం నిర్వహించాలన్నదే వారి ధ్యేయం. ఈ విధంగా పల్లెల్ని తీర్చిదిద్దితే అంతా ఎంతో ఆదర్శంగా ఉంటారు. ‘పల్లెలే జాతి పట్టుకొమ్మలు కదా!’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here