[డా. సి. భవానీదేవి రచించిన ‘అతని చూపు’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]అ[/dropcap]తనికి కూడా పదవీవిరమణ రోజొచ్చేసింది.
అందరికీ ఏదో ఒకరోజున అది తప్పనిసరయినా
అతనికి మాత్రం ఒళ్ళంతా
నూటయిదు డిగ్రీల జ్వరం
ఆరోజు అసలు సూర్యుడుదయించకపోతే బాగుండు
అయినా.. ఆదిత్యుడొచ్చేశాడు
దుప్పట్లో దూరి నిద్రలేపుతున్నాడు
కోపమొచ్చి అటుతిరగబోయి
మంచంపట్టెమీదికి జారి నేలమీదే
మఠంవేసుక్కూర్చున్న మహామునికి
గురువుగారిమాటల ఙ్ఞాపకాలు
శారీరిక గాయాలు కానందుకు
ప్రత్యేక పూజకి ఇరవైవేలు
కాళ్ళలో వణుకు శరీరమంతా పాములా పాకుతుంటే అది కైంకర్యం
దానికోసం మూడేళ్ళుగా పెండింగ్ఉన్న
వికలాగుల పెన్షన్ పైల్ తగిన వెలతో కదిలింది
ఓటమ్ముకుంటున్నట్లు ఫైల్ కూడా అమ్ముకోవటం
ఉద్యోగుల ప్రాథమిక హక్కుకదా
పూలదండలు.. శాలువాలు.. ఙ్ఞాపికలు..
చప్పట్లు.. ప్రశంసలు.. ఒకచో రుద్ధకంఠాలు..
తనంటే వీళ్ళకి ఇంత గౌరవమా
తన కింది ఉద్యోగుల్ని పురుగుల్లా చూశాడు కదా..
వాళ్ళే ఇంత ప్రేమ చూపటం ఆశ్చర్యం!
గొంతు సవరణ.. వైరాగ్యప్రేమ
అడుగుబొడుగు కోసం వెంపర్లాట
ఉద్యోగజీవితంలోని ఘనవిజయాల చిట్టా
సంతకాల లెక్కల ఏకరువు
కరువుతీరా కుడిచిన కన్నీళ్ళ లెక్కల మాటో
బాధిత ఉద్యోగుల కళ్ళలో
అతని శాడిస్ట్ దాహం తాలూకు నెర్రెలు
సమావేశం చివర శవం ఊరేగింపు లాంటి వీడ్కోలు
తన సీట్లో కూర్చోబోయే తమ్ముని గురించిన తపన
వదిలించుకున్నామనుకుంటూ
తేలిక పడిన తమ్ముళ్ళ భావిగణన
తీరా అంతా ముగిసాక
మరో దృశ్యానికి తెరలేచింది
ఇప్పుడా కుర్చీలో
మరొక వ్యక్తి
అచ్చం అతని చూపుతోనే!!