[box type=’note’ fontsize=’16’] “పంచ తత్త్వాల మయమైన శివుని నాలుగు తత్త్వాలు భూమి, నీరు, అగ్ని, వాయువు లను తీసుకుని నలుగురు నాయకుల కథలు చెబుతాడు దర్శకుడు” అంటూ “అతడే” సినిమాని సమీక్షిస్తున్నారు పరేష్ ఎన్. దోషి. [/box]
[dropcap]మొ[/dropcap]న్నామధ్య వచ్చిన “అ!” తప్పిస్తే మనకు వచ్చిన ప్రయోగాత్మక చిత్రాలు తక్కువే. హిందీలో 2011లో “శైతాన్” తో వచ్చిన బిజోయ్ నంబియార్ తన సత్తా ను బల్ల గుద్ది చాటుకున్నాడు. ఆ తర్వాత “డేవిడ్”, “వజీర్”(అమితాభ్ బచ్చన్) లతో మంచి దర్శకుడుగా స్థిర పడ్డాడు. ఈ యేడు తమిళ, మళయాళంలో “సోలో” పేరుతో వచ్చిన చిత్రాన్ని తెలుగులో “అతడే” గా డబ్ చేసి రిలీజ్ చేశారు. ఇది కూడా వొక ప్రయోగాత్మక చిత్రమే.
ఈ మధ్య కథానికల సంకలనం లాంటి చిత్రాలు బాగానే వస్తున్నాయి. కొన్నిట్లో కథల్లో వొకే అంతస్సూత్రం వుంటే, కొన్నిట్లో వుండదు. ఓనిర్ తీసిన “I am”, కరన్ జోహర్-అనురాగ్ కశ్యప్-దిబాకర్ బనర్జీ-జోయా అఖ్తర్ లు కలిసి తీసిన “బోంబే టాకీస్”, ఆరుగురు దర్శకులు తీసిన పది కథల “దస్ కహానియాన్”, అలాగే ఇటీవల వచ్చిన తెలుగు చిత్రం “మనమంతా” (చంద్ర శేఖర్ యేలేటి) కొన్ని. ఇప్పుడు ఈ ఖాతాలో “అతడే” కూడా వేసుకోవచ్చు.
నాలుగు కథల్లోనూ నాయకుడు దుల్కర్ సల్మానే. నాయికలు వేరువేరు. పంచ తత్త్వాల మయమైన శివుని నాలుగు తత్త్వాలు భూమి, నీరు, అగ్ని, వాయువు లను తీసుకుని నలుగురు నాయకుల కథలు చెబుతాడు దర్శకుడు. వారి ప్రేమ, బాధ, జనన మరణాలు, అవీ. ఇంటర్వల్ ముందు రెండు కథలు, తర్వాత రెండు కథలు. నాలుగింట్లో చివరి రెండు కాస్త మెరుగ్గా వున్నాయి. ఆ మూడో కథ వొక్కటే వొక పూర్తి చిత్రంగా తీయతగ్గ కథ. మొదటి రెంటిలో నిడివి కాస్త తగ్గించి వుంటే అన్నీ సమానంగా నచ్చేవేమో.
మొదటి కథలో శేఖర్ (దుల్కర్) కి నత్తి. దాని కారణంగా కొంచెం ఆత్మన్యూనత. నాయిక రాధిక (సాయి ధన్సిక) గుడ్డిది. ఆమె శేఖర్ స్నేహితుడి దగ్గర అతని గురించిన సమాచారం అంతా తెలుసుకుని, తను అనుకున్నట్టే వున్నాడని గ్రహించి అతనిపై తన ప్రేమను వెల్లడి చేస్తుంది. అయితే ఇరువురి కుటుంబాలు ఇష్టపడవు. ముఖ్యంగా రాధిక అన్న. రాధికకు పదేళ్ళ వయసులో చూపు పోయింది. ఆమె తండ్రి ఆమెను అంటిపెట్టుకునే వుండి కంటికి రెప్పలా చూసుకుంటాడు. అతడే ఆమె బలం. ఇదంతా శేఖర్ కు చెబుతుంది. వొక పాపను కని చనిపోతుంది రాధిక. ఇప్పుడు శేఖర్ తన పదేళ్ళ పాపను రాధిక తండ్రి రాధికను చూసుకున్నట్టు చూసుకుంటాడు. ఇందులో కథ చెప్పేటప్పుడు చాలా సార్లు ముందు-వెనుకలు ప్రయాణిస్తుంది. అలాగే నీటితో నిండివున్న గదిలో రాధిక తన స్నేహితురాళ్ళతో నృత్యం చేసే సీన్లు చాలా అందంగా వచ్చాయి. దుల్కర్ ఈ కథలోనే కాదు అన్నిట్లోనూ చాలా బాగా చేశాడు.
రెండో కథలో అయేషా (ఆరతి వెంకటేష్) కొడైకెనాల్‌లో సైకిల్ మీద వెళ్తుంటే తాగి కార్ నడుపుతున్న తోమస్ (రంజి పనిక్కర్) గుద్దేస్తాడు. అతని అల్లుడు జుస్టిన్ (పాల్) మామగారి ఇష్టానికి విరుధ్ధంగా ఆ అమ్మాయిని కారులో పడుకోబెట్టి ఆసుపత్రి వైపుకు బయలుదేరుతాడు. తాగి కారు నడిపిన గిల్ట్, భయం మామగారికుంటే, మానవతా దృక్పథం వున్న అల్లుడు ఆ వాదనలతో మనసు డోలాయమానం అవుతుంది. ఈ లోగా అయేషా చనిపోయిందని గ్రహించి ఆమెనక్కడే వదిలేసి వెళ్ళిపోతారు. కొన్నాళ్ళకి జస్టిన్ నడుపుతున్న కారు బ్రేకులు ఫేలయ్యి ఏక్సిడెంటవుతుంది. అదృష్టవశాత్తు డాక్టర్ త్రిలోక్ (దుల్కర్) అక్కడే వుండబట్టి అతన్ని కాపాడుతాడు. ఆ తర్వాత వూహించని మలుపుతో ఈ కథ ముగుస్తుంది.
మూడవ కథలో శివ (దుల్కర్) చిన్నప్పుడే అతని తల్లి కుటుంబాన్ని వదిలేసి మరొకతనితో కాపురం చేస్తుంటుంది. శివ రౌడిగా తయారవుతాడు. అతని తండ్రి తన తమ్ముణ్ణి హింసిస్తూ వుంటే తమ్ముణ్ణి కూడా తన కూడా తెచ్చేసుకుంటాడు. ప్రాణాలకు రక్షణలేని పనుల్లో తన భర్త వుండటం శివ భార్యకు నచ్చదు. ఈ లోగా శివ తండ్రి హత్యకు గురికాబడతాడు. తన తండ్రి హత్యకు ప్రతీకారం యెట్లా తీసుకుంటాడన్నది మిగతా కథ.
నాల్గవ కథ లో రుద్ర (దుల్కర్) ఆర్మీ ట్రైనీ. అక్షర (నేహా శర్మ) ను ప్రేమిస్తాడు. కాని మళ్ళీ పెద్దలకు అభ్యంతరం వుంటుంది. అనుకోని పరిస్థితుల్లో అక్షర పై చదువుల కోసం ఆస్ట్రేలియాకెళ్తానంటుంది. తను వచ్చే దాకా ట్రైనింగు పూర్తి చేసుకుంటే, తన చదువయ్యాక పెళ్ళి చేసుకోవచ్చంటుంది. కాని వెళ్ళినప్పటినుంచి అతనితో కనీసం మాట్లాడనూ మాట్లాడదు. చివరికి ఆమె వేరే సంబంధం వొప్పుకుంటుంది. తన స్నేహితుడిలా మసలుకునే తండ్రే కారణం అని తెలిసి శివ రక్తం ఉడికిపోతుంది. దాని వెనక వున్న కారణాలు ఈ కథ చివరి మలుపు.
ఇలా అన్ని కథలూ ఆకట్టుకునేవిగా వున్నాయి. దర్శకత్వం, ఇతర సాంకేతిక అంశాలూ బాగున్నాయి. వేర్వేరు సంగీత దర్శకుల సంగీతం నిజంగానే బాగుంది. కాస్త కర్నాటిక్ సంగీత చాయలు, కాస్త ఆధునిక బీట్లతో. సాహిత్యం డబ్బింగ్ అన్న విషయం గుర్తుపెట్టుకుంటే బాగున్నాయనే చెప్పాలి, ఆ పరిమితుల లోబడి.
రొటీన్ చిత్రాలతో విసిగి వున్న ప్రేక్షకులకు ఇది నచ్చుతుంది.