[‘అధర్వ’ అనే సినిమాని సమీక్షిస్తున్నారు డా. రాయపెద్ది వివేకానంద్.]
అధర్వ (తెలుగు చలన చిత్రం)
అమెజాన్ ప్రైం లో అందుబాటులో ఉంది. నిడివి రెండు గంటలు.
పిల్ల పాపలతో కలిసి సకుటుంబంగా చూడవచ్చు.
—
అద్భుతమైన చిత్రాలు కొన్ని ఎందుకు అనామకంగా ఉండిపోతాయో కద అనిపిస్తుంది కొన్ని సినిమాలు చూస్తే.
డిసెంబర్ 2023లో విడుదల అయిన ఈ ‘అధర్వ’ ఖచ్చితంగా ఒక మంచి చిత్రం.
ఎటువంటి అంచనాలు లేకుండా చూసినా, భారీ అంచనాలతో చూసినా ఈ చిత్రం మిమ్మల్ని ఖచ్చితంగా నిరాశ పరచదు.
—-
కథ విషయానికొస్తే (ఎటువంటి స్పాయిలర్లు లేవు)
కర్ణ (కార్తీక్ రాజు) అనే యువకుడికి కాలేజి చదివే రోజుల నుంఛి పోలీస్ ఆఫీసర్ అవ్వాలనే కల ఉంటుంది. ఆ కలకి ఒక బలమైన సెంటిమెంటల్ కారణం కూడా ఉంటుంది. దర్శకుడు మనకి ఒక దశలో వివరిస్తాడు ఆ సెంటిమెంటల్ కారణాన్ని.
దురదృష్టవశాత్తు ఆ అబ్బాయికి అన్నీ ఉన్నా.. అన్న విధంగా ఆస్త్మా ఉండటం వల్ల ఫిట్‌నెస్ టెస్ట్‌లో ఫెయిల్ అవుతూ ఉంటాడు.
గ్రామంలో అందరూ అతడి అపజయాల్ని వినోదంగా మాట్లాడి గేలి చేసినట్టు పైకి కనిపించినా ఆ గ్రామస్థులందరూ అతన్ని చాలా ప్రేమిస్తారు. ఆ గ్రామంలోనే ఓ పెద్దాయన మధ్యే మార్గంగా కర్ణని క్లూస్ టీంలో చేరమని సలహా ఇస్తాడు.
ఈ అబ్బాయి కష్టపడి చదివి పరీక్షలు వ్రాసి, ఇంటర్వ్యూ పాసై క్లూస్ టీంలో కీలక ఉద్యోగ తెచ్చుకుంటాడు. ఇది కూడా ఒక రకమైన పోలీస్ ఉద్యోగమే కద అని అతను తృప్తి పడతాడు, ఆనందంగా తన వృత్తిని మొదలెడతాడు. మొదటి కేసునుంచే తన తెలివి తేటలు ఉపయోగింఛి, సరైన విధంగా ఆలోచింది తానేమిటో నిరూపించుకుని, పై అధికారుల మన్ననలు పొందుతాడు.
ఇవన్నీ క్షణ భంగురమే అని తెలుస్తుంది.
ఒక సినీ హీరోయిన్, ఆమె ప్రియుడు హత్యకి గురవుతారు. ఆ హత్య కేసుని చిటికెలో పరిష్కరించి పోలీసులు కేస్ క్లోజ్ చేస్తారు.
మన కర్ణకి ఆ కేసులో అనేక లొసుగులు కనిపిస్తాయి.
పోలీసు అధికారులని నిలదీసి ప్రశ్నించి, చొరవ తీసుకుని తన పరిధిని దాటి కేసుని పరిష్కరించే దిశగా అడుగులు వేస్తాడు.
దాంతో సస్పెన్షన్ వేటు పడుతుంది.
అది ప్రారంభం. కీలక మలుపులన్నింటికీ.
ఇక మిగతా కథ ప్రైం లో చూస్తేనే మజా.
—
ఈ సినిమా ఈ విషయంలో కూడా భిన్నమైనదే.
నిజంగానే నేరస్థుడు ఎటువంటి ఆధారాలు వదలడు ఈ సినిమాలో.చాలా పకడ్బందీగా నేరాలు ప్లాన్ చేస్తాడు.
ఇక్కడ పోలీసులు కళ్ళకి కనపడేదే నిజం అనే నిర్ధారణకి వచ్చి కేసుని క్లోజ్ చేస్తారు.
తన మనసు చెప్పే మాటని బలంగా నమ్మిన కర్ణ పై అధికారులతో, విధితో సైతం పోరాడి చిక్కులలో పడతాడు.
అతను సస్పెండ్ అయినప్పటికీ అతని టీం సభ్యులు అతనికి సహకారం అందించిన విధానం మనకు చాలా నచ్చుతుంది. మంచిని చేయాలి అనుకునే వాడికి ఎప్పుడు ఏదో రూపంలో సాయం అంద్తుంది అనే సందేశం ఇక్కడ ప్రేక్షకుడికి వస్తుంది.
ఘటనా ప్రదేశం వద్ద లభించిన ఆధారాల్ని బట్టి విశేష అనుభవమున్న కొమ్ములు తిరిగిన పోలీస్ ఆఫీసర్ సినీ హీరోయిన్ హత్య కేసుని క్లోజ్ చేస్తాడు. ఆమె ప్రియుడే హంతకుడు అని, ఆమెని హత్య చేసి తాను అక్కడికక్కడే ఆత్మ హత్య చేసుకున్నాడని వ్రాసేసి కేసుని క్లోజ్ చేస్తాడు. ఆయనకున్న అనుభవం బట్టి, నిజాయితీపరుడైన ఆఫీసర్ కూడా కావటం వల్ల ఇక ఎవ్వరూ వేరే రకంగా ఆలోచించరు.
పాపం నిజానికి ఆయన నిజాయితీపరుడైనా ఆఫీసరే.
ఇక్కడి నుంచి కథ అనేక మలుపులు తిరుగుతుంది.
—-
యండమూరి వీరేంద్రనాథ్ నవలల్లో హీరోలలాంటి తెలివైన కుర్రాడిలాగా హీరో పాత్రని చిత్రీకరించిన విధానం చాలా బాగుంది.
పైకి కనిపించేది ఒకటి, నిజానికి జరిగేది ఒకటి అని మనకు తెలిసి నిర్ఘాంతపోతాము.
కథకి అనుగుణంగా హైదరాబాద్, వరంగల్, లక్నవరం లేక్, కర్ణాటకలోని రాయచూర్ లలో చిత్రీకరణ చక్కగా ఉంది. కేవలం అయిదు కోట్ల బడ్జెట్ తో చక్కటి అవుట్‌పుట్ తీసుకురాగలిగారు.
మనకి పోలీసు నేపథ్యంలో అనేక సినిమాలు వచ్చాయి కానీ క్లూస్ టీం ఆధారంగా వచ్చిన సినిమాలు తక్కువ. ఈ సినిమాలో క్లూస్ టీం వారు ఉపయోగించే అత్యాధునిక సాంకేతికత గూర్చి, అందులో ఉన్న వివిధ విభాగాల గూర్చి చక్కగా వివరించారు.
—
ఎక్కడా బోర్ కొట్టదు. ఒక చక్కటి అనుభూతిని ఇస్తుంది ఈ సినిమా, ఈ ఆదివారం ప్రైం లో హాయిగా చూసేయవచ్చు మీరు.
దర్శకుడు మహేష్ రెడ్డికి మంచి భవిష్యత్తు ఉంది అని నిస్సందేహంగా చెప్పవచ్చు.
—
కార్తీక్ రాజు (హీరో)
సిమ్రాన్ చౌదరీ (హీరోయిన్)