[box type=’note’ fontsize=’16’] తన గురువు ఆత్మహత్యకి కారణం తెలుసుకోవాలనుకున్న ఓ యువకుడు – ఆయన ఆత్మతో మాట్లాడేందుకు సోది చెప్పే ఆమెని, పాస్టర్‍ని, భూతవైద్యుడిని, ఓ ఫకీర్‍ని కలుస్తాడు. గురువు ఆత్మహత్యకి కారణం ఎలా తెలుసుకుంటాడో “అతిరాత్రం” కథలో ఆసక్తిగా చెబుతారు అనిల్ ప్రసాద్. [/box]
[dropcap]”రే[/dropcap]య్ వికాస్…! ఏంటీ సడన్‌గా? అంతా క్షేమమే కదా?” మా పిన్ని నన్ను చూసి నిజంగానే ఆశ్చర్యపోయింది.
“ఆఁ ! పిన్నీ అంతా బాగే”
“మరి ఏంట్రా చెప్పాపెట్టకుండా ఇలా వచ్చావు?”
“సరే అయితే వెళ్లి, ఉత్తరం రాసి అప్పుడొస్తాలే!” అని వెనుతిరిగాను.
ఈ మధ్య ఇలా మాటకు మాట వెంటనే అంటించడం ‘పంచ్’ పేరుతో బాగా ప్రాచుర్యం పొందింది. ఎవ్వడూ దొరికిన అవకాశాన్ని వదులుకోవడం లేదు, ఎదుటివాడు ఎవరైనా, ఏమనుకున్నా గానీ.
మా పిన్ని మాత్రం నా చేయి పట్టుకొని ఇంట్లోకి తీసుకుపోయింది. మంచినీళ్లు అందించి, “అమ్మమ్మ ఉన్నప్పుడు ప్రతి ఏడాదీ వచ్చేవాళ్ళు. ఆమె పోయాక నా కూతురి పెళ్ళికే నువ్వు మా ఊరు రావడం. 3 ఏళ్ళు దాటిపోయింది. ఈ వేళ గబాల్న ఎదురుగా నిల్చుంటే ఏమైందో అని కంగారుపడి అలా అడిగేసాను అంతే కానీ….”
“అయ్యో పిన్నీ, నేను ఊరికే అన్నాలే. సడన్‌గా వచ్చి నిన్ను సర్‌ప్రైజ్ చేద్దాం అని అమ్మను నీకు చెపొద్దన్నా”
“సరేలే. మీ బాబాయి పొలానికి వెళ్లారు పొద్దునే. భోజనానికి వచ్చేస్తార్లే. ఈ లోగా నువ్వు స్నానం చేసి టిఫిన్ చెయ్యి” అంటూ ఎప్పటిలాగే తన హడావిడి మొదలెట్టింది.
“పర్లేదు పిన్నీ. నేను నీతోనే పని ఉండి వచ్చాను. సాయంత్రానికి వెళ్లిపోతాను. కుదిరితే బాబాయికి కబురు పెట్టు. మధ్యాహ్నం భోంచేసి నేను బయలుదేరతాను”
“నాతోనా? ఏంట్రా?” మళ్ళీ కంగారు పడిందామె.
“చెప్తాలే. నువ్వు నువ్వు టిఫిన్ పెట్టు, నేను స్నానం చేసొస్తా” అని బాత్రూం వైపు నడిచాను.
నాకు మాత్రమే వడ్డిస్తుంటే, బలవంతంగా తను కూడా ప్లేటు తెచ్చుకొనేలా చేసి, ఇద్దరం కలిసి తింటుండగా అసలు విషయం చెప్పనారంబించాను.
“అప్పట్లో ఈ ఊరి చెరువుగట్టు మీద సోది చెప్పే వాళ్ళు ఉండేవాళ్ళు కదా, వాళ్లిప్పుడు ఉన్నారా?”
“సోది చెప్పే వాళ్ళా? ఏమో. ఏమయిందిరా. నిన్ను చూసినప్పటినుంచీ నాకు అనుమానంగా ఉంది. అసలు విషయం ఏంటి?”
“ఓ కంగారు పడకు పిన్నీ. నేను సోది చెప్పించుకోవాలి”
“ఎందుకు”
“నేను ఒక ఆత్మతో మాట్లాడాలి”
“ఆత్మతోనా. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు. అమ్మకు ఫోన్ కలుపు.”
“ముందుగా చెప్పేది విను పిన్ని. మా మాస్టారొకాయన అనుకోకుండా మొన్నామధ్య చనిపోయాడు. అయనకి సంబంధించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అందుకు.”
“ఎవర్రాయన? ఆయనకీ నీకు ఏంటి సంబంధం?”
“సంబంధం ఏమీ లేదు పిన్నీ. నాకు బాగా గుర్తు. చిన్నప్పుడు ఈ ఊరు వచ్చినప్పుడు ఆ చెరువుగట్టు వైపు వెళ్ళవద్దు. అక్కడి జిల్లేడు పాలు తాగి, దెయ్యాలతో మాట్లాడేవాళ్ళు ఉంటారని భయపెట్టేవాళ్ళు. అలాగే చిన్న మామ చనిపోయినప్పుడు తాత వాళ్లనే పిలిపించి సోది చెప్పించడం, అమ్మమ్మ కూడా మేము వచ్చిన ప్రతీసారి ఓ ముసలమ్మ, సూరమ్మ అని గుర్తు, పిలిచి మా అమ్మను సోదిలో కూర్చోబెట్టి చిన మామ గురించీ, తాత గురించి చెప్పించుకోవడం నాకు బాగా గుర్తు”
నేను చెప్పేది అయోమయంగా వింటుంది మా పిన్ని.
“అలాగే ఇప్పుడు మా సార్ గురించి నేను కూడా వాళ్లతో మాట్లాడాలి”
“ఇప్పుడెవరూ సోది చెప్పుతున్నట్టు నాకు తెలియదు. అయినా ఎవరో గురించి నీకెందుకు?”
“నేను ఆయన్ని అడిగి తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి పిన్ని. అందుకే నా తాపత్రయం. ఒక్క సారి వాళ్ళను పిలిపించు లేకపోతే మనమే వెళ్లి కలసొద్దాం”
నేను చాలా సేపు సర్ది చెప్పిన పిమ్మట నన్ను అక్కడకు తీసుకు వెళ్ళడానికి ఒప్పుకుంది మా పిన్ని.
***
“సూరమ్మ ఎప్పుడో సచ్చిపోనాది బాబూ. దాని మేనకోడలు చెప్తాది. అదిగో అదే ఇల్లు” అని దారి చూపించాడు చెట్టుకింద కూర్చుని చుట్ట కాల్చుకుంటన్నాయన.
నల్లగా బలిష్టంగా ఉన్నావిడ, నుదుటన రూపాయి బిళ్ళంత కుంకుమ బొట్టు పెట్టుకొని, గుమ్మడికాయ దొప్పతో తయారుచేసిన తంబురాను ఎడం చేత్తో వాయిస్తూ, కుడి చేతిలో ఒక కర్ర పుల్ల ఒక అంచు తాను పట్టుకొని ఇంకో అంచు నా చేతిలో పెట్టి మొదలు పెట్టింది. “బియ్యం తీసుకురాలేదా?” అడిగింది ఆవిడ.
“డబ్బులు ఇస్తాంలే నువ్వు పెట్టు” అన్నది పిన్ని.
చాటలో కొంచెం బియ్యం వేసుకొచ్చి మా మధ్యన పెట్టింది. తంబురా మోత మొదలయ్యింది. ఆవిడ లయబద్ధంగా ఏవో మంత్రాలు ఉచ్చరిస్తుంది. “పుట్టింటిదా? అత్తింటిదా?” అది కూడా లయబద్ధంగానే అడిగింది. ఏమి చెప్పాలో నాకు తెలియలేదు.
“పంతులుగారు” అన్నా.
“బొట్టంటే ఆడది, గెడ్డం అంటే పోతోయమ్మ”
మేము ఇరువురం చెరో అంచూ పట్టుకున్నా కర్రను నా నుదురుకు, గెడ్డానికీ తాకిస్తూ అన్నది. తంబురా మోగుతుంది. నేను ఆసక్తిగా ఎదురు చూస్తున్నా.
“కొమ్మా….. ఇన్నాళ్లకు గురుతుకొచ్చానా? నన్ను నీవు మరిసినా నేను నిన్ను ఇడవనేదు…. మొన్న శివరాత్రికి నీ ఇంటికొచ్చా…. నీ ఇంట నేను చేయాల్సింది ఎంతో ఉంది… మెల్లగా అన్నీ సక్క దిద్దుతా… నన్ను మొక్కి పని మొదలెట్టు…. నీకన్నా ముందు పోయి నేను అన్నీ సక్క పెడతా. పండక్కు నాకు బట్ట పెట్టాలా…. నా కొమ్మల గురించి నాకు బెంగ ఉండాది… నా భీతి ఇంకా తీరలేదు…. కానీ మీరంతా నన్ను మరసినారు. నన్ను తలసుకొని దండమెట్టి నాకు నచ్చిన కూరెట్టి అందరూ మొక్కండి… మీముందు నేనుండి మీకంతా శుభోజయం కలగజేత్తా…” అని చెప్పి తన చేతిలోని కర్ర అంచుని వదిలేసింది ఆవిడ.
అర్ధం కాక పిన్ని వంక చూసాను. తాను ఆవిడ వంక చూసింది.
“ఎవరు అడగాలా. ఎవరొచ్చారో తెలుసుకోవాలా. సేకపోతే వచ్చినోళ్ళు సెప్పేసి ఎళ్లిపోతారు. తవరు పెశ్నలు అడగాల్నా”
తల ఆడిస్తూ నా వైపు చూసింది పిన్ని. అర్ధమయ్యినట్టు మళ్ళీ కర్ర పట్టుకున్నా. ఆవిడకూడ రెండో వైపు అందుకుంది. మళ్ళీ తంబురా మోత మొదలయింది.
“ఎన్నేళ్లకు గురుతుకొచ్చానా…. అయ్యా…” మొదలుపెట్టింది ఆమె.
“ఎవరు నువ్వు?” అడిగాను నేను.
“నన్ను మరిసిపోయావు అయ్యా మీరు… కానీ నేను మాత్రం మిమ్మల్ని వదలా…”
“నువ్వు ఎవరో చెప్పరాదు?” మా పిన్ని అడగటం మొదలెట్టింది.
“నన్నే ఎరగవా తల్లీ నువ్వు…. నా కడుపున పుట్టిందానివి కాదా నువ్వు?”
“మా అమ్మవా? మరి నా పేరేంటో చెప్పు?”
“నేను పెట్టిన పేరు కాదే నీది. నా పెనిమిటి పెత్తనం చేశాడు”
“ఎంతమందిమి మేము?”
“నలుగుర్ని మోసానే కడుపులో నేను” అని కర్ర నా కడుపుకి తగిలించింది.
“ఆహా! ఇప్పుడెంతమంది ఉన్నారు?”
“అందరున్నారు కానీ దిక్కుకోకరు అయిపోయారే కొమ్మా….. అయినా అందర్నీ దరి చేరుస్తానే. నాకు చీర పెట్టాలా నువ్వు”
“నేనెందుకు పెట్టాలి నీ కొడుకులు లేరా”
“అట్టా అంటావేంటే అమ్మా, నువ్వంటే నాకు శానా పేమ… ఏళ్ళవెళ్ళానీ కొమ్ము కాస్తా ఉంటా…”
ఏదో అడగబోయిన మా పిన్నిని చేయి పట్టి ఆపి “మనకు కావాల్సిన వాళ్లతో మాట్లాడాలి అంటే ఎలా?” అన్నా.
“ఏమోరా! అడుగుతానుండు. నువ్వు కాదు గానీ వీడు ఎవరితోనో మాట్లాడాలని వచ్చాడు. అతన్ని పంపించు”
“మిమ్మల్ని సూసే వచ్చానమ్మ… బొట్టంటే ఆడది – గెడ్డమంటే మొగోడమ్మా”
“మరి నువ్వెవరు” నేనే అడిగాను.
“నేను ఎవరో నీకు ఎరకలేదా…” అని నా నుదుటను కర్ర తాకించింది ఆమె.
“నేను మా మాస్టారుతో మాట్లాడాలి”
“మాటాడు తండ్రి… నాకు అన్ని ఇనపడతన్నాయి…”
“హర్ష… హర్షల్ దివేకర్…. ఆయన పేరు”
“చెప్పు నాయనా…”
“నువ్వేనా?”
“నేనేరా అయ్యా… ఎప్పుడూ నీతోనే ఉన్నా… ఎల్లప్పుడూ నీ త్రోవ సరి చేస్తా ఉన్నా….. నీకెప్పుడు ఏ కష్టమొచ్చినా నన్ను తలసుకో బిడ్డా…. నాకు గారెలు పెట్టాలా…”
ఇలా వచ్చింది ఎవరో తెలుసుకొనే వీలు లేకుండా ఏదేదో చెప్తూ పదినిమిషాలు గడిచాక ఆపింది ఆవిడ.
“నాకు కావాల్సిన వాళ్ళు రాలేదు” నిర్మొహమాటంగా చెప్పేసాను నేను.
“తవరికి అడగడం రాలేదు” ఆవిడా అంతే రీతిన జవాబిచ్చింది.
ఇది ఇక అనవసరం అని కొంత డబ్బు తీసి చాటలో పెట్టి లేచాను. అది చూసినావిడ, “బాబూ గిద్దెడు గింజలు పెట్టి, పది రూపాయలు ఇస్తే మా పెద్దోళ్ళు నేర్పిన ఇదంగా నాకొచ్చింది సెప్తాను అంతే. తవరు ఎందుకొచ్చారో ఆరు రాలేదన్నారు. మావు కూడా ఇప్పుడు పార్ధనలు చేత్తన్నాము. ఆ పాదిరిగారు దెయ్యాలని వదిలిత్తారయ్య” చేతులు జోడించి నేను పెట్టిన డబ్బు తిరిగిస్తూ చెప్పింది ఆవిడ.
“వదిలించడం కాదమ్మా. ఒక ఆత్మతో మాట్లాడాలి” అని ఆ నోటు తీసుకొని చిన్న నోటు ఇచ్చాను. “అదే బాబు… ఆరు బాసలో కూడా ఆతమలతో మాటాడతారు. ఈ ఊళ్ళోనే చెర్సిలో ఉంటారు”
“వద్దులేమ్మా. పదరా పోదాం” అన్నది మా పిన్ని.
“నువ్వు పద పిన్నీ నేను ఒక సారి ఆయన్ని కలిసొస్తా” కోపంగా నా వైపు చూసి వెళ్లి పోయింది పిన్ని.
***
ఉజ్జీవ సభలలో ఉన్న పాస్టర్ గారు ఒక్కొక్కరికి తల మీద చేయి పెట్టి ప్రార్థనలు చేస్తున్నారు. నన్ను తీసుకెళ్లినావిడ ఆయనకేదో చెప్పి పక్కకు తీసుకొచ్చింది.
“వందనాలు బ్రదర్” రెండు చేతులూ జోడించి నిండుగా నవ్వుతూ, “ఏదో పని మీద వచ్చారని తెలిసింది. రండి కూర్చుని మాట్లాడుకుందాం” అంటూ చర్చి వసారాలోకి తీసుకెళ్లారు. నేనూ ప్రతినమస్కారం చేసి ఆయన్ని వెంబడించాను.
“మా మాస్టారొకాయన గత నెలలో… ఆత్మహత్య చేసుకొన్నాడు. ఆయన ఆత్మతో నేను ఒకసారి మాట్లాడాలని ప్రయత్నం”
“ఏం బ్రదర్? ఆ ఆత్మా ఎవరినైనా పట్టుకొందా? కోరికలు తీరక బలవన్మరణాన్ని పొందిన వాళ్ళు ఆలా ఆవహిస్తారు. నా వద్దకు తీసుకురా… ఈ పవిత్ర ఆలయంలో ఉపవాసముండి దేవ దేవుడిని ప్రార్ధిస్తే ఆయనే ఆ ఆత్మను బంధించి మన వాళ్ళని విముక్తులను చేస్తాడు” లెక్చర్ ఇవ్వడం మొదలెట్టాడు ఆయన.
“అది కాదండీ. నేను తనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. కుదురుతుందా?” ఆసక్తిగా అడిగిన నాకు ఆయన మొఖంలోని అయోమయం సమాధానమిచ్చింది.
“ప్రార్థన చేస్తాను” అంటూ కుర్చీలో నుంచి లేచి మోకాళ్ళ మీద నిలుచుని మొదలు పెట్టాడు. పద్దతి కాదని నేను కూడా మోకాళ్ళ మీద కూర్చున్నా. ముందు కొంత ఆశక్తిగా విన్నా పోను పోను నాకు అసలేమీ అర్ధం కాలేదు. కొంత సేపటి తరవాత ఆయన వాళ్లంతా ఊగిపోతూ, గాల్లోకి చేతులు లేపి ఏదో భాషలో ఏదో మాటలాడటం మొదలు పెట్టాడు. నేను లేచి దూరం జరిగాను. కొంత మంది చుట్టూ చేరి “స్తోత్రం” అనడం మొదలు పెట్టారు. “షబలబ లబ లబ..” అంటూ తప్పేట్లు కొడుతూ ఓక పది నిమిషాలు ఊగిపోయిన పాస్టర్ గారు మెల్లగా చల్లబడి కళ్ళు తెరిచారు.
“ధన్యవాదములు బ్రదర్” అని మళ్ళీ నమస్కరించాడు. ఏమనాలో తెలీని నేను “మీరు మాట్లాడింది ఏ భాష?” అని అడిగాను.
“హెబ్రూ. ఆయనే పలికిస్తాడు”
“చనిపోయిన వాళ్ళు ఆ భాష మాట్లాడతారా? ఇప్పుడు మా సారు మీకు కనపడ్డాడా? ఆ భాషలో ఆయన్ని మనమేమైనా అడగొచ్చా?” నేను అడిగింది ఆయనకు ఎంతవరకూ అర్థం అయ్యిందో తెలియదు కానీ ఆయన చెప్పింది మాత్రం నాకేమీ అర్థం కాలేదు.
మనిషిని పంపించి పొలంనుంచి బాబాయిని పిలిపించిన పిన్ని నాకు అన్నం పెట్టి, “అదేం పేరురా ‘అరిసెల్ దేవేటోడా?’ – కొంపదీసి మిఠాయి కొట్లో పంజేసే వంట మాస్టారా?..” అని తిరుగు పంచ్ వేసి, దానితో బాటు నాకు కొంత జ్ఞాన, హిత బోధ కూడా చేసి నేను వెంటనే బయలుదేరి వెళ్లిపోయే ఏర్పాటు చేసింది.
***
“బంటుమిల్లి రోడ్డులో తుమ్మలపల్లి వారి దుకాణం ఒకటి ఉండేది” వరసగా ఉన్న పచారీ కొట్లలో ఒకదానిలోకి ప్రవేశించి, అక్కడ కూర్చుని ఉన్న వ్యక్తిని అడిగాను నేను.
“మాదేనండీ, చెప్పండీ” మర్యాదగానే అడిగాడు అతను.
“సేటు లేడా?”
“నేనేనండీ”
“సేటు రెండో కొడుకు చంద్రశేఖర్, చందూ అని… ”
“అది కూడా నేనే. మీరూ..” నన్ను పోల్చుకొనే ప్రయత్నం చేస్తున్నాడు వాడు.
ఎక్కువ శ్రమ పెట్టక “నేనురా వికాస్‌ని. ఇద్దరం కలిసి వర్లసందులో లిటిల్ సెయింట్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో పది వరకూ చదువుకున్నాం గుర్తుందా?” అన్నాను.
“ఆ… హా…. మొహం ఎక్కడో చూసినట్టుగానే ఉంది కానీ వెంటనే గుర్తు రాలేదు. చాన్నాళ్లకు వచ్చావురా. ఎప్పుడో డిగ్రీ చదివేటప్పుడు కనపడ్డావు. రా.. రా…” అని కుర్చీ చూపించాడు కానీ తాను మాత్రం గల్లాపెట్టె ముందు నుంచి లేవలేదు. తప్పక అక్కడే కూర్చున్నా. “ఇంకేంట్రా చెప్పూ” కొంత సేపు వాడు చెప్పింది విన్నాక అన్నా నేను.
“ఇప్పటిదాకా నేనే చెప్పాను. ఏం పని మీద వచ్చావు? ఈ ఊర్లో ఉండటం లేదు కదా మీరు” ఆపుకోలేక అడిగేశాడు.
“ఆఁ. ఇక్కడ ఉండటంలేదు. నీతో పనుండి వచ్చాను” ఒక్కసారిగా ఎలర్ట్ అయిపోయాడు వాడు, నేను కొంత సంశయించాను.
కానీ చల్లకొచ్చి ముంత దాచడం ఎందుకని కాస్త మొహమాటంగానే, “అప్పట్లో మనం హాస్టల్‌లో ఉన్నప్పుడు, రాత్రులు ఒక గేమ్ ఆడుకొనేవాళ్ళం గుర్తుందా?” మరింత అయోమయంగా చూసాడు వాడు.
“అదేరా క్యాండల్ వెలిగించి – a, b, c, d లు రాసిన ఒక అట్ట మీద రూపాయి బిళ్ళ పెట్టి – అందరం చుట్టూ కూర్చొని- ఒక ఆత్మను పిలిస్తే-అది వచ్చి మనం అడిగిన ప్రశ్నలకి రూపాయి బిళ్ళను కదిపి జవాబు చెప్పేది కదా గుర్తుందా?”
వెంటనే నవ్వేసాడు వాడు. “గుర్తుంది రా. అయితే ఇప్పుడు అది ఆడుకోడానికి వచ్చావా?”
“నాకింకా జ్ఞాపకముంది. నువ్వు బాగా ఆడేవాడివి, నాకో సాయం చెయ్యి. నేనొక ఆత్మతో మాట్లాడాలి. ఈ రాత్రికి మనం ఆ ఆత్మను పిలవాలి”
“ఎందుకు?”
“నేను తనతో మాట్లాడాలి”
“ఏం మాట్లాడాలి?”
“ఒక విషయం అడగాలి”
హేళనగా నవ్వాడు వాడు.
“పోరా. అదేదో చిన్నప్పుడు మనకు పాఠాలలో ఉండే వాళ్ళ గురించి తెలిసిన విషయాన్నే ఆ రూపాయి బిళ్ళను కదిపి, లేకపొతే జరిపి ఏదో అప్పటికప్పుడు చెప్పేవాడిని. నేనేమీ మాంత్రికుడిని కాదు. మంచిగా నవ్వించావు. ఇక నన్ను వదిలెయ్యి. వ్యాపారం చేసుకొనే టైము” ఇంకా వెళ్ళు అన్నట్టు లేచాడు వాడు.
ఎంత బతిమాలాడినా నాకెటువంటి సహాయం చెయ్యడానికి ఒప్పుకోలేదు. నిరాశగా వచ్చేస్తుంటే, వాడే నా వెనుక వచ్చి తన అత్తగారి ఊరిలో ఒక భూత వైద్యుడు ఉన్నాడని అతను శకునం చెప్తాడని, బహుశా అక్కడికి వెళ్ళితే ఏదైనా ఫలితం ఉంటదని అడ్రస్సు ఇచ్చాడు.
***
దేవాలయం దగ్గర ఎంత హంగామా ఉంటదో అంతే రీతిలో భూత వైద్యుడి ఇంటి వద్దా హడావిడిగా ఉంది. నిమ్మకాయలు, కొబ్బరికాయలు, ఎర్రని, నల్లని రాళ్లు, కోళ్లు వంటి సరంజామా అంతా అక్కడ అమ్మకానికి పెట్టారు. బయట ఉన్న సిబ్బంది నాతో కొంత సామగ్రి కొనిచ్చారు. తర్వాత లోపలికి పంపిస్తున్నారు, అంతా గుంపులుగా వెళుతున్నారు. నేనొక్కడినే ఒంటరిగా లోపలికి అడుగు పెట్టాను. సినిమాలలో ఆర్టు డైరెక్టర్లు చూపించేది ఎంత నిజమో అక్కడ పరిస్థితి చూసాకే నాకు అర్థం అయ్యింది. ఒక్కటే తేడా లోపల ట్యూబు లైట్లు దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. గెడ్డం పెంచుకొని, నుదుటున కుంకుమ బొట్టు పెట్టుకొని, కొంచెం ఎత్తు పీటమీద కూర్చొని ఉన్న స్వామి ముందు ముగ్గు వేసి ఉంది. ఆయనకి మాత్రమే గాలి వచ్చేలాగ స్టాండు ఫ్యాను ఏర్పాటు చేశారు. ముగ్గు కిరువైపులా చాపలు పరిచి ఉన్నాయి. నమస్కరించి, “నేను ఒక ఆత్మతో మాట్లాడాలి” అన్నా.
“ఏదైనా ఆత్మా ఆవహించిందా? నేను రక్ష వేస్తాను. నీకు కల్లో కూడా కనపడదు మళ్ళీ. భయం లేదు” ఆయన అన్నాడు.
“అలా కాదు. మా మాస్టారు గత నెల్లో ఆత్మహత్య చేసుకొన్నాడు. ఒక్కసారి నేను ఆయనతో మాట్లాడాలి వీలవుతుందా?”
పేరు (చనిపోయిన వారిది), ఊరు, వయసు, సమయం వంటి వివరాలు అడిగాక తన ముందు ఉన్న ముగ్గు అంచులలో నేను కొనుక్కెళ్ళిన నిమ్మకాయల్ని పెట్టాడు, ప్రతి దానిమీద మళ్ళీ నేనే లోనికి తీసుకెళ్లిన కుంకుమ మెల్లగా చల్లాడు. కర్పూరం వెలిగించి ముగ్గు మధ్యలో పెట్టి – మంత్రాలు చదవనారంభించాడు. నేను ఆసక్తిగా చూస్తున్నా.
“ఎంతో బాధ అనుభవించి చివరికి ఉరేసుకున్నాడు. ఇద్దరు మడుసులు అందుకు కారణం. ఒక ఆడది ఓ మాగాడు నాకు అగుపడతన్నారు. ఆళ్ళే చేతబడి చేయించారు. ఎక్కడో పూజ చేయించి, ఆ బొమ్మను తీసుకెళ్లి ఆయనింట్లో పెట్టారు. అందుకే నాలుక బయటకు పెట్టి చచ్చిపోయాడు. ఇంకా ఆ బొమ్మ అక్కడే ఉంది. ఆ ఇంట్లో ఇంకా రెండు జీవాలు లేవాలి. భయపడమాకా, నేను ఇరుగుడు చేత్తాను. మీ ఇంట్లో పూజ చేసి ఆ బొమ్మ తీసేత్తే ఆ దెబ్బకు అది చేయించినోళ్ళు నెత్తురు కక్కుకు చత్తారు. కానీ నువ్వు తొందర పడాలా. వారం రోజుల్లో ఇది చెయ్యాలా” సీరియస్‌గా చెప్పుకు పోతున్నాడు ఆయన. బహుశా మాస్టారి మరణం గురించి ఏదైనా అనుమానంతో వెళ్లి ఉంటే ఆయన మాటలు నమ్మేసే వాడినేమో కానీ నా సంకల్పమే వేరు అందుకే ఆ మాటలను నేను పట్టించుకోలేదు.
“అవన్నీ వద్దులెండీ. నేను ఆ చనిపోయినాయన ఆత్మతో మాట్లాడాలి. మీరు చెయ్యగలరా?”సూటిగా అడిగాను.
“నేను ఇప్పుడు నాను సెప్పినాయన్ని నాకెవురు చెప్పారనుకున్నా? ఆ ఆత్మే కదూ? ఇప్పటిదాకా ఈ ముగ్గులో కుసునుండలా? నీకు అగుపడదు. మళ్ళీ పిలవాలా?” అయన జంకలేదు.
“హా..! పిలవండి. నేను మాటలాడొచ్చా? లేకపోతే నేను చెప్పేది అడగండి. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో కనుక్కోండి” ఆశగా చెప్పాను నేను.
“చెప్తా ఉండాగా ఎవురో చేతబడి చేశారు. అయినా మళ్ళీ పిలత్తా ఆగు. ఈ సారి మొత్తం ఇవరాలు అడుగుతా” అని మళ్ళీ ముందు తంతు మొదలెట్టాడు. నేను ఆశక్తిగా చూస్తున్నా. ఐదు నిమిషాల తరవాత చెప్పడం మొదలెట్టాడు. “ఆ యమ్మికి ఈ మడిసికి పొసగలా. అందుకే పగబట్టి చేతబడి సేయించింది. ఆయమ్మకు ఓ మగాడు తోడున్నాడు. ఇప్పుడు కూడా ఆళ్ళు పూజ చేయిత్తన్నారు. కాబట్టి నువ్వు వచ్చిన దారిన తిరిగెళ్ళటాక…” అంటూ ఏదో చెప్తున్న అయ్యాన్ని ఆపి…
“అవన్నీ కాదండీ. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో అడగండి” అన్నా.
“సెప్పినానుగందా. ఆ బొమ్మ ఇంట్లో ఉండి ఉరేసుకొనేలా చేసింది” అని ఆయన జవాబు చెప్పడం నేను లేచి నిలబడటం రెండూ ఒకేసారి జరిగాయి.
“ఆగవయ్యా. నాను సెప్పేది ఇను. ఆ శక్తి ఇంకా ఇంట్లోనే ఉండాది. ఇరుగుడు చెయ్యాల”
“ఉరేసుకోలేదండీ. విషం తిని…” అని నిమ్మకాలకి కూడా కలిపి అడిగినంత డబ్బు ఇచ్చి, వెనుతిరిగాను.
“ఏంటి ఇషయం? ఏటైనా కాయితాలు అగుపడనేదా? ఏ వస్తువైనా ఎక్కడ దాచాడో కనిపెట్టాలా? సెప్పూ నాను అంజనం యేసి సూపిచ్చేత్తాను” ఏమాత్రం తగ్గకుండా చెప్పుకుపోతున్నాడు.
నేను లొంగలేదు.
“గురుతెట్టుకోండి వచ్చిన దారిలో మాత్రం ఎళ్ళద్దు. ఆళ్ళు పూజ చేయించారు” ఆయన చూపుడు వేలు చూపిస్తూ జాగ్రత్త చెప్పాడు. నేను నవ్వుకుంటూ వచ్చేసాను.
***
బందరు పక్కనే ఉన్నా పల్లెటూరు బైరాగిపాలెం మా పూర్వికులది. ఎక్కడినుంచో వచ్చి ఓ ముస్లిం ఫకీరు అక్కడ స్థిరపడ్డాడని మా ఊరికి ఆ పేరొచ్చిందని చెప్తారు. ప్రస్తుతం ఆ మతస్థుల జనాభా తక్కువే అయినా ఇప్పటికీ పీర్ల పండుగా వంటివి ఊర్లో అందరూ కలిసే జరుపుకుంటారు. మా తాతయ్యకు నలుగురు కొడుకులు అంతా ఉద్యోగ రీత్యా వేరే ఊర్లలో స్థిరపడ్డారు. కానీ ఆయన బ్రతికున్నంత కాలం అందరూ సెలవులకి అక్కడికి చేరుకొనేవాళ్ళం. మా నాయనమ్మ మాకు పిండివంటలతోపాటు తాతయ్యతో మసీదులో ఉండే మస్తాన్ సాహెబ్ దగ్గర్నుంచి తెప్పించిన మంత్రించిన తాయత్తులు కూడా సిద్ధం చేసేది. ఊర్లో వాళ్ళ కళ్ళు మంచివి కావని, నజర్ తగులుతుందని పిల్లలకి, దుష్టశక్తుల నుంచీ కాపాడుతుందని పెద్దలకి కట్టేది. ఆ మస్తాన్ సాహెబ్ శక్తుల గురించి చిన్నప్పుడు ఎన్నో కధలు వినేవాళ్ళం.
“ఆయన ఎప్పుడో చచ్చిపోయాడన్నా. ఇప్పుడున్న సాహెబు అంత సీను లేదు” ఇంకా ఆ ఊర్లోనే ఉన్నా మా తాతయ్య తమ్ముడి సంతతిలో, నాకు తమ్ముడి వరస అయ్యే పెదనాన్న కొడుకు చెప్పాడు.
“ఒక్కసారి ట్రై చేద్దాంరా!” ఆశగా అన్నా నేను.
“ఆడి కంటే పెడన పెద్ద మసీదులో ఒక పెద్దాయన ఉన్నాడంట. ఈ మధ్య ఇలాటి విషయాల్లో ఆయన గురించే చెప్పుకొంటున్నారు. ఆడికి పోదాం” అని తీసుకుపోయాడు.
సరే ఎలాగోలా నా పని అయితే చాలని నేను అనుకొన్నా.
“ఈ నీళ్లు మక్కా నుంచీ తెచ్చాయి. ఇంటి చుట్టూ చల్లుకొంటే ఏ ఆత్మలు రావు” తెల్లటి పొడవైన గెడ్డం, తలపైన నల్లటి టోపీ, లోపల లాల్చీ పైజామా లాంటి డ్రెస్‌ను మొత్తం కప్పేసిన బుడిద రంగు అంగీతో మసీదు ద్వారం ముందు కుర్చీలో కూర్చొని చేతిలోని నల్లని గుండ్రపు పూసల మాలను తిప్పుతూ నాకు ఓ బాటిల్ అందించాడు సాయిబుగారు.
“కాదు సాహెబ్, నేను ఒక ఆత్మతో మాటలాడాలి. ముఝే బాత్ కర్నా హై” నేను మళ్ళీ చెప్పాను.
ఆయన నన్ను తీక్షణంగా చూసి “షైతాన్ సే బాత్ కర్తా? హిమ్మత్ హై?” అన్నాడు.
స్థిరంగా తలూపాను నేను. నన్ను లోపలికి తీసుకు పోయి ఒక గదిలో పరుపు మీద కూర్చోమన్నారు. ఫకీర్ గారు నా ఎదురుగా కూర్చొని, ఒక చెంబులో నీళ్లు తెప్పించి మా మధ్య పెట్టించారు.
“దేఖ్. మామూలు పసుపు నీళ్లు. నీ మాస్టార్ పేరు చెప్పూ. నేను మంత్రం వేసి పిలుస్తా. వాడు ఇక్కడికి వస్తే ఈ చెంబులో నీళ్లు మరుగుతాయ్. అదే గుర్తు. అప్పుడు అడుగు. మధ్యలో భయం వేస్తే, ఈ ఉప్పు ఆ చెంబులో వేసేయ్. డర్నా నహీ. సరేనా?”
నేను మా తమ్ముడూ చెరో గుప్పిళ్లలో ఉప్పు పట్టుకొని కూర్చున్నాం. ఫకీరుగారు మంత్రాలు చదవడం మొదలు పెట్టారు. దాదాపు పావుగంట తరవాత చెంబులో కొద్దిగా అలికిడి కనిపించింది. మెల్లగా నీళ్లు మరగనారంభించాయి. “లే ఓ ఆగయా” అన్నాడు ఫకీరు. “సార్….. నేనూ…. ఒకటి అడగాలి మిమ్మల్ని” మాట తడబడుతుంది నాకు.
చెంబు వంకా మంత్రాలు చదువుతన్న సాయిబు వంకా మార్చి మార్చి చూస్తున్నాడు మా వాడు.
కానిమ్మని చేతితో సైగ చేశాడు ఫకీరు నాకు.
“సార్… అదీ… నేను తెలుసుకదా మీకు…. మీరు… మీరేనా?… అసలు మీ పేరేంటి?……”
చెంబు ఊగిపోతోంది. బదులు లేదు.
నేను ఫకీర్ వంక చూసాను. “బోల్. సైతాన్. మాటాడు” అంటూ తన చేతిలోని పొడిని చెంబు వైపు గాల్లోకి చల్లాడు. అయినా ఫలితం లేదు.
మళ్ళీ అడగమన్నాడు, “మీరెందుకు ఆత్మహత్య చేసుకున్నారు?” అనడిగా, జవాబు లేదు. మంత్రాలు చదివాడు ఫలితం లేదు. ఈ తంతు ఒక గంటవరకు కొనసాగింది. నేను ఏదో అడగడం, సాయిబుగారు బెదిరించడం ఇలా. చివరికి నీళ్లు చల్లబడిపోయాయి.
“అది నీతో మాట్లాడదు” అని, నా చేతికి ఒక తాయత్తు కట్టి, నేనిచ్చిన డబ్బు సున్నితంగా తిరస్కరించి “అల్లా భలా కరేగా” అని ఆశీర్వదించి పంపేశాడు ముసలాయన.
***
“మార్నింగ్ వికాస్. హౌ ఆర్ యూ ?”
“వెరీ గుడ్ మార్నింగ్ సార్. యామ్ పైన్… మీరెలా ఉన్నారు?”
“ఆ… హా… హా… అసలు బ్రతికే లేనివాడిని ఎలాగున్నారు అని అడుగుతున్నావే” నవ్వేసారు ఆయన.
తనకు ఇష్టమైన పసుపు రంగు షర్ట్, నీటుగా టక్ చేసుకొని, ఎప్పటిలాగే పాలిష్ చేసిన బూట్లు వేసుకొని వచ్చి నా గదిలో కుర్చీలో కూర్చున్నారు హర్షల్ దివేకర్ గారు.
నాకు నవ్వు రాలేదు. “ఎందుకు సార్… ? ఎందుకిలా చేశారు?” అడిగేసాను.
కాసేపు శూన్యంలోకి చూస్తూ ఉండిపోయిన ఆయన మెల్లగా రిక్త హస్తాలను చూపిస్తూ, “తట్టుకోలేకపోయాను వికాస్. ఒంటరితనం, చుట్టాల దెప్పిపొడుపులు భరించలేకపోయాను”
“అవన్నీ అర్థం చేసుకోగలను సార్. కానీ పిల్లల్ని ఎందుకు తీసుకెళ్లారు? ఈ కోర్టు విడాకులు మంజూరు చేసినా పై కోర్టుకెళ్లి కనీసం ఒక్క పిల్లాడినన్నా మీ వద్దకు తెచ్చుకొనే వీలుండేది. అదీ కాకపొతే, మేడం పిల్లల్ని బాగానే చూసుకొనే వాళ్ళు కదా? వాళ్లకు ఏదైనా లోటు జరిగితే నా లాటివాళ్ళు చూస్తూ ఊరుకునే వాళ్ళం కాదు కదా అండీ. అన్నింటికీ మించి మీ అమ్మగారు ఇంకా బ్రతికే ఉన్నారు, ఆవిడ వాళ్ళను వదిలిపెట్టేది కాదు. మీకు ఉన్నాది వాళ్ల చదువులకీ, దేశీయ క్రయోజెనిక్ ఇంజిన్ అభివృద్ధిలో ఉపయోగపడిన మీ పేటెంటు ఫార్ములాని వాడుకున్నందుకు ఇస్రో మీకు చెల్లిస్తున్న రాయల్టీ మొత్తం వాళ్ళ జీవితానికి సరిపోయేది. రీసర్చ్ కోసం మీ దగ్గర చేరిన నాటినుంచీ, ఆ పసి వాళ్ళని ఈ చేతులతో ఎత్తుకొని ఆడించాను. మీ మరణం కన్నా, ఆ చిన్నారులు దూరం అవ్వడమే నన్ను ఎక్కువ బాధిస్తుంది సార్. ఎందుకు చేసారిలా?” అన్నాను.
తల ఆడిస్తూ లేచి గదిలో అటూ ఇటూ తిరుగుతూ, “నిజమేనోయ్! మా పెద్దమ్మాయి పుట్టిన ఏడాదే నువ్వు నా దగ్గరకొచ్చావు. రోదసి యాత్రలో దేశానికి ఎదురవుతున్న సవాళ్ళను అధిగమించడానికి రేయింబవళ్లు కష్టపడి ఆ ఫార్ములాను కనుగొనే ప్రయత్నంలోనే నేను నా భార్యను నిర్లక్ష్యం చేశానని తనకు అనిపించింది. అలా ఆమె నాకు దూరం జరుగుతూ పోయింది. నా పని హడావిడినంతా తను నాకు వ్యతిరేకంగా ఎత్తి చూపిస్తూ కోర్టుకెక్కింది. విడాకులు ఇచ్చేసారు. పేటెంటు దక్కింది, పెళ్ళాం – పిల్లలు దూరమయ్యారు. వారాంతంలో రెండు గంటలు నా కూతురూ, కొడుకు నన్ను కలిసేది. మా అమ్మా, నేనూ అసలు బయటవారిని ఎదుర్కోలేక పోయేవాళ్ళం. కాలేజీ నుంచి ఇంటికొస్తే ఒంటరితనం వెక్కిరించేది” అని చెప్పుకు పోతున్నాయన్ని నేను మధ్యలోనే ఆపి వేసి
“మీరు మళ్ళీ అదే చెప్తున్నారు. కానీ ఏమీ ఎరగని ఆ పిల్లల్ని ఎందుకు…?” అన్నాను.
“అదే చెప్తున్నానయ్యా. శాస్త్రీయ సమస్యల్ని పరిష్కరించినట్టు నా జీవిత వైఫల్యాన్ని కూడా సరిదిద్దుకుందామని ఎంతో ప్రయత్నం చేసాను. మీ మేడమ్‌ని ఎన్నో విధాల వేడుకున్నా కానీ ఆమె మనసు కరగలా. ఎక్స్‌పరిమెంటు ఒకసారి ఫెయిల్ అయితే మళ్ళీ కొన్ని పారామితులు మార్చి యత్నించినట్టు శతథా ట్రై చేసాను. ప్చ్… ఇక ఈ జీవితం అనవసరమనిపించింది… ముగించేద్దామనుకున్నా. ఆ శనివారం సాయంత్రం నా పిల్లలతో గడిపి… వెళ్ళిపోదాం అని నిర్ణయించేసుకున్నా. ఎందుకంటే తర్వాతి రోజు ఆదివారం ప్రపంచమంతటికీ సెలవు. కాలేజీ ఉండదు. నీలాటి శిష్యులు మీ మీ కుటుంబాలతో గడపడానికి వెళతారు. నేను మాత్రం ఒక్కడినే….”
“మీ మదర్ ఉన్నారు కదా సార్!”
“ఆ ఆలోచన రాలేదు వికాస్. పిల్లల్ని చివరిసారి అమ్మకు చూపించాలని కూడా నాకు తోచలేదు. ఎందుకంటే నాకు వాళ్ళను తీసుకెళ్లే ఉద్దేశం లేదు”
“యెస్… నాకు తెల్సు సార్… మీరు అలా చెయ్యరు. మరి ఏం జరిగింది. ఎవరు చేశారు ?”
“నేనే వికాస్… నేనే. నా చేతులతో…”
“ఇప్పుడే ఆ ఉద్దేశం లేదన్నారు కాదా?”
“ముందు లేదు. కానీ అప్పటికప్పుడు పుట్టింది.”
మౌనం కాసేపు మా మధ్య తల దూర్చింది.
“ఇప్పుడు నువ్వు నన్ను ఎందుకు మాట్లాడించావు?” ఆయనే ప్రశ్నించాడు.
“మీరంటే గౌరవం కాబట్టి. మీ మీది ఈ అపప్రద చెరిపివెయ్యాలని” నిజంగానే చెప్పాను నేను.
“అదే.. అదే…. గౌరవమో, ఇష్టమో ఉంటే ఆ వస్తువో, మనిషో దూరం అయితే బాధ కలుగుతుందని అప్పుడే తెల్సుకున్నా. అందుకే అలా చేశా…” అర్ధం కాలేదు నాకు.
మాస్టారు మాత్రం కొనసాగించారు, “ఒక వారం ఎంట్రన్సు పేపర్ సెట్ చెయ్యడానికి వెళ్ళాను. ఒక వారం అయినవాళ్ల పెళ్ళికి వేరే ఊరెళ్ళాను. నాకు ఉన్నది వారాంతంలో రెండు గంటలే కదా! మధ్యలో వీలు లేదు (వత్తి పలికారు). ఫోన్ చేస్తే ఆవిడ ట్యూషన్ అనో, ఆడుకుంటున్నారనో చెప్పేది. అలా మూడు వారాల తరవాత నేను నా పిల్లల్ని కలిసాను. మీ మేడం మళ్ళీ రెండు గంటల్లో తీసుకొచ్చేయ్యాలని గుర్తు చేసి మరీ నాతో పంపింది” పళ్ళు కొరుకుతూ చేతిని గోడకు కొట్టారు.
“అప్పుడు కూడా మళ్ళీ నా దగ్గరకొచ్చేయ్యమని బ్రతిమాలాను కానీ ఆ రాతి గుండె కరగలేదు. కారు ఎక్కిన వెంటనే మా చిన్నాడు ఐస్‌క్రీం అడిగాడు. నీకు తెల్సు కదా వాడికి ఐస్‌క్రీం అంటే ఎంతిష్టమో. వెంటనే కొన్నా. అమ్మాయి బిర్యాని కావాలన్నది. పారడైస్ బిర్యాని తనకు బాగా ఇష్టమైనది. వెళ్లి తీసుకున్నాం. పూర్తిగా వెజిటేరియన్‌గా మారిపోయిన అనిత (మా మేడం) పిల్లకి అసలు మాంసం వాసన కూడా చూపించడంలేదట. ముక్కు ఎప్పుడూ కారుతుందని స్కూల్ టీచర్ చెప్పిందని చిన్నాడికి ఐస్‌క్రీం దూరం చేసింది. వాళ్ళకి ఇష్టమైనవి దొరకక వాళ్ళు పడే బాధ నాకు వాళ్ళు మమ్మీ మీద చెప్పిన చాడీలలో కనపడింది. ఆ క్షణం నాకు అనిపించింది, ఆ బాధ చిన్న పిల్లలకేనా…? ఇష్టం అయిన వాళ్ళు దూరం అయితే పెద్దాళ్ళకి మాత్రం ఉండదా?… అంతే నేను నిశ్చయించేసుకున్నా. మళ్ళీ ఐస్‌క్రీం కొన్నా. సిటీ సరిహద్దులలోకి కారు పోనిచ్చా. అప్పటికే నాకోసం సిద్ధం చేసుకున్నా విషాన్ని ముందు బిర్యానీలో కలిపా. నా కూతురు అడిగింది వికాస్, ‘డాడీ అదేంటని’ టెస్టు కోసం కలిపే ప్లేవర్ అని చెప్పా. ఆబగా రెండు ముద్దలు తిని…. తల వాల్చేసింది. ఇదేమీ పట్టించు కోకుండా ఐస్‌క్రీం తింటున్నా చిన్నాడికి ‘నీకూ ఫ్లేవర్ కలుపుతా’ అని కోన్‍లో కొంచెం పోసా. రుచి చూసి ‘ఏం బాలేదని’ బయటకి విసిరేసాడు. కానీ వాడి నాలుక్కి తగిలిన విషం వెంటనే నాడీ వ్యవస్థని స్తంభింప చేసింది.
అప్పుడు నేనూ కొంచెం బిర్యానీ తినీ….. నాకు ఇష్టమైన కుటుంబం దూరం అయితే నాకు బాధ వేసింది. వాళ్లకు నచ్చినవి దొరక్కపోతే పిల్లలు బాధ పడ్డారు. తన పిల్లలు దూరం అయితే అనితకు బాధ కలుగదా? అప్పుడైనా తను నా బాధ అర్ధం చేసుకుంటదని” ఆయన్ని పూర్తిచెయ్యనివ్వకుండానే నేను అందుకున్నా, “ఎంతో చదువుకున్నారు. ఎంతో జీవితాన్ని చూశారు. కానీ క్షణికమైన క్రోధావేశాల్ని మాత్రం అదుపుచేసుకోలేపోయారు. ఇప్పటికీ నా రూంలో మీ ఫోటో ఉంది. కాలేజీ కమిటీతో మాట్లాడి మీ నిలువెత్తు విగ్రహం మన డిపార్ట్‌మెంట్ బిల్డింగు ముందు పెట్టిద్దామని నిర్ణయించాము. కానీ రేపు ‘ఈ మేధావి జీవితం ఎలా అంతమయ్యిందని?’ ఏ విద్యార్థి అయినా అడిగితే, మీ ఫోటో చూసిన వెంటనే మీ పిల్లలు నాకు గుర్తొస్తే – మాకు మీ పట్ల ఎటువంటి గౌరవం కలగదు సార్. మీరు పోయిన రోజు మేడం మీ అమ్మ గారిని, ‘నువ్వు పాముని కన్నావే, అందుకే వాడు తన పిల్లల్ని తానే మింగేశాడు’ అని నిందిస్తుంటే, ఆమె ఏమనలేక తల దించుకుంది సార్. షార్ నుంచి వచ్చిన ప్రత్యేక పుష్పగుచ్చాన్ని చూపి ఆ రోజు మీ గొప్పతనం చాటాను. కానీ ఇక పై మీ మీద నాకు ఏ గురుభావం ఉండదు. అరిషడ్వార్గాలని అదుపు చేసుకోలేని మీరు మాలాటి వారికి ఎన్నటికీ ఆదర్శం కాలేరు. చరిత్ర సృష్టించే సత్తా ఉన్నా చేతులారా చరిత్రలో ఓ మచ్చగా మిగిలిపోయారు మీరు. వెళ్లిపోండి, వెళ్లి ఆ చీకటిలోనే కలిసిపొండి” అంటూ అరిచాను నేను.
“ఒరేయ్ వికాస్… లెగూ. ఏంటా కలవరింతలూ? హనుమాన్ చాలీసా తలగడ కింద పెట్టుకోలేదా? వెదవ తిరుగుళ్ళు తిరగడం, లేని పోనివి నెత్తినేసుకోవడం” అమ్మ నన్ను తట్టి లేపుతుంది.
కళ్ళు తెరిచి చూసిన నాకు వెలుగు రథంపై చీకట్లను చీల్చుకుంటూ వస్తున్న ప్రభాత సూర్యుడు కనిపించాడు.