[భానుశ్రీ తిరుమల గారు రచించిన ‘అతిథేయి దేవో భవ!’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]“అ[/dropcap]రరే బాబాయ్! ప్లేటు మీరు తీయ్యెద్దు, నేను తీస్తానుగా” అంటూ రమేష్ చేతి నుండి ప్లేట్ తీసుకుని సింక్‍లో పెట్టింది భవాని.
అయినా సరే దాన్ని కడిగి పెడదామని రమేష్ వెల్లబోతుంటే చేయి పట్టి ఆపి “వద్దు బాబాయ్, దాన్ని అలా వదిలేయండి, నేను తరువాత కడుగుతాను” అని వారించింది భవాని.
“ఫరవాలేదమ్మ నన్ను కడగనియ్యి, మా ఇంటి దగ్గర కూడా నా ప్లేట్ నేనే కడుక్కుంటాను. వేళ కాని వేళలో వద్దు వద్దంటున్నా, భోజనం చేసేసాను అని అన్నా విని ఊరుకోకుండా, నా కోసం ప్రత్యేకంగా వంట చేసి మంచి భోజనం పెట్టావు, అది చాలదా! నా ప్లేట్ నేను కడుక్కోలేనా? నాకే ఏదో ఇబ్బందిగా ఉందమ్మ!” అన్నాడు రమేష్.
“అయ్యో, ఎంత మాట అనొద్దు బాబాయ్, మీరలా చేస్తే నాకు కష్టంగా ఉంటుది!” అని సర్థి చెప్పింది భవాని.
రమేష్‌ది భవానీ వాళ్ల సొంత ఊరికి పక్క ఊరు. దూరపు బంధువు కూడా. ఈ మధ్యే భవానీ భర్త ఈ సిటీకి బదిలి మీద వచ్చాడు.
రమేష్ ఏదో పనిమీద సిటీకొచ్చి, భవాని వాళ్లని చూసిపోదామని వచ్చాడు.
రమేష్‍కి చిన్నప్పటి నుండీ తన తిన్న ప్లేట్ తాను తీసి పక్కన పెట్టడం తెలియదు, కడిగిపెట్టడం మాట దేవుడెరుగు. కానీ ఈ మధ్యనే ఓ మంచి అలవాటు చేసుకున్నాడు తను తిన్న ప్లేటు తను తీసి పక్కన పెట్టడం.
బహుశా, భోజనం చేసిన వెంటనే ఓ పది అడుగులు వేస్తే మంచిదని, ఇంట్లో ఆడవాళ్లకు కూడా కొంత సౌకర్యంగా ఉంటుందని కూడా ఓ చిన్న ఆరోగ్య, సామాజిక సూత్రం ఒంటపట్టించుకున్నట్టున్నాడు.
అందువలన బైట ఎవరింటిలో భోజనం చేసినా అదే పధ్ధతి అనుసరిస్తాడు. కొంత మంది వారిస్తారు, కానీ ఎక్కవ మంది మెదలకుండా ఊరుకుంటారు, తిన్నవాడే ప్లేట్ తీసుకోవడం కనీస ధర్మం అన్నట్లు.
ఈ మంచి అలవాటు కాక ముందు ‘నా ఆ అనాగరిక చర్య వలన, ఇంతకు ముందు భోజనం పెట్టిన వాళ్లు ఎంత మంది ఇబ్బంది పడి ఉంటారో కదా!’ అనుకుంటూ ఉంటాడు రమేష్.
చిన్నప్పడు, రమేష్‌కే కాదు అతని కుటుంబ సభ్యులెవ్వరికీ తాము తిన్న ప్లేటును తీసి వేరేగా పెట్టడం అలవాటే లేదు. పైగా చేతులు కూడా ప్లేట్ లోనే కడిగే అలవాటు. అందరూ తిన్న తరువాత ఇంట్లో ఆడవాళ్లో లేదా సహాయకురాలో ఆ ప్లేట్లు తీసి కడిగేవారు. రమేష్ వాళ్లు ఎవరైనా బంధువులు, స్నేహితుల ఇళ్లలో భోంచేసినా, వారూ ప్లేట్లు తీయనిచ్చే వారు కాదు.
అలాగే రమేష్ వాళ్లింటికి ఎవరొచ్చి భోజనం చేసినా వారి ప్లేట్లను తన ఇంటివారు తీయడమే తప్ప వాళ్లకు ఆ అవకాశమే ఇచ్చే వారు కాదు.
రమేష్‍కి ఆ దురలవాటు(ట) యాభై సంవత్సరాల వయసు వరకూ ఉండేది. ఎదుగుతున్న కొద్దీ, ప్లేటులో చేతులు కడగకూడదని, భోజనం తర్వాత ఓ నాలుగడుగులు వేయటం జీర్ణక్రియకు మంచిదని ఎక్కడో చదవటం వలనేమో, సంవత్సరాలుగా పాటిస్తున్న పాత పధ్ధతికి అతి కష్టంగా స్వస్తి చెప్పి, కొత్తగా ప్లేటును సింక్‍లో పెట్టి చేతులు వేరుగా కడుగుకోవటం అలవాటు చేసుకున్నాడు.
బహుశా ఈ పద్ధతి పాటిస్తే నాగరికత తెలిసినట్టు అని ఓ బలమైన నమ్మకానికొచ్చాడు రమేష్. అందుకే ఎవరింటిలో భోజనం చేసినా ఆ మంచి పధ్ధతిని పాటిస్తూనే ఉంటాడు. అప్పుడు ఆ అతిథేయి చూసే ఓ అభినందనా పూర్వకమైన చూపు ఏదైతో ఉందో, అది భోజనం చివర తిన్న స్వీటంత ఆనందాన్ని కలిగిస్తుంది రమేష్‌కు.
కానీ రమేష్‍కు భవాని ఆ పూట భోజనంలో స్వీటైతే పెట్టింది గానీ, తన ప్లేట్ తాను తీసుకునే సదవకాశాన్ని తనకి ఇవ్వలేదు.
అయితే రమేష్ భవానీ, అతిథి పట్ల కనబరిచిన మర్యాదకి లోలోన అభినందించాడు.
భోజనం చేసి కూర్చున్న రమేష్‌కి టీవీ రిమోట్ చేతికిచ్చింది భవానీ టీవీ చూస్తుండమని.
టీవీ ఆన్ చేసిన వెంటనే చాగంటి వారి ప్రసంగం ఏదో వస్తోంది.
యాదృచ్ఛికంగా ఆ ప్రసంగం కూడా, ఇంటి కొచ్చిన అతిథులను ఎలా గౌరవించాలనే అంశం మీద. తాను ఇంతకు ముందు ఆ ప్రసంగం విన్నాడు, మళ్లీ వినాలని ఉన్నా అది సంధర్భం కాదని, పైగా ఆ ప్రసంగం ఈ ఇంటి వారికి వినిపించాల్సిన అవసరం లేదనుకొని చానల్ మార్చేసాడు.
ఇంతలో కాలింగ్ బెల్ మోగుతుందని లేచి రమేష్ వెళ్లి తలుపు తీయబోతే, ఈ లోగ భవానియే వచ్చి ముఖ ద్వారం తెరిచి భర్తని, పిల్లలని చూస్తూ చిరునవ్వుతో నిలుచుంది.
పిల్లలతో రమేష్‍కి అంతగా పరిచయం లేదు కానీ, భవాని వాళ్ల ఆయన వచ్చి”ఏమండి బాగున్నారా..” అని పలకరించి పక్కన కూచుని క్షేమ సమాచారం అడిగి తెలుసుకున్నాడు.
ఈలోగా భవాని ఏదో చిరు తిండి తయారు చేసి పిల్లలకిచ్చి, భర్తకి, రమేష్‌కి రెండు ప్లేట్లలో సర్ది తీసుకువచ్చింది. “ఇప్పుడే భోజనం చేసాను కదమ్మా, నాకు ఇంకేమీ వద్దు, కొంచెం టీ ఇస్తే చాలు” అన్నాడు రమేష్.
ఇంకా బలవంత పెట్టకుండా “అలాగే బాబాయ్” అంటూ భవానీ టీ తీసుకు రావడానికి లోపలికి వెళ్లింది.
స్నాక్స్ తిన్న తరువాత అందరూ ప్లేట్లతో సహా సింక్ దగ్గరకు వెళ్లి శుభ్రంగా వాటిని కడిగి పెట్టారు.
ఇదంతా రమేష్ గమనిస్తునే ఉన్నాడు. అంటే తనలాగే వీళ్లు కూడా ఇంట్లో ఎవరి ప్లేటు వారే కడుగుకుంటారు గానీ ఎవరైన అతిథి వస్తే మాత్రం ‘అతిథి దేవో భవ’ అన్నట్టు గౌరవిస్తారన్న మాట అనుకున్నాడు.
రమేష్ వాళ్ల ఇంట్లో కూడా ఇదే అనుసరిస్తారు. తాను అనుసరించడం రమేష్‌కి పెద్ద ఆశ్చర్యం అనిపించలేదు, ఎందుకంటే ఓ మధ్యతరగతి పల్లెటూరి ఆసామి తను.
కానీ పట్టణంలో పెద్ద ఉద్యోగంలో చేస్తూ, రెండు చేతులా సంపాదిస్తూ, దేనికీ లోటు లేకుండా, సకల ఆడంబరాలతో సౌకర్యాలు అనుభవిస్తూ, నాగరీకులైన కూడా ఎటువంటి భేషజాలు లేకుండా ఇంటికి వచ్చిన అతిథికి గౌరవం ఇవ్వటం, రమేష్‍౬కు ఒకింత ఆశ్చర్యం, ముచ్చట కలిగించింది.
“అమ్మా! భవాని నేనిక బయలుదేరుతా, ఈసారి మీరు ఊరొస్తే మళ్లీ కలుద్దాం” అంటూ వారి దగ్గర శెలవు తీసుకుని, భవాని భర్తతో సహా గేటు దాకా సాగనంపగా ఆటో ఎక్కి బస్సుస్టాండ్‌కి బయలుదేరాడు రమేష్.
అతిథి గొప్పా, అతిథేయి గొప్పా? రమేష్‌కి మనసులో ఓ చిన్న తర్జన భర్జన జరుగుతోంది.
అతిథేయిని ఇబ్బంది పెట్టకూడదని తాను పాటించాలనుకున్న నియమం కన్నా, అతిథి, ఆతిథ్యం పట్ల భవాని కనబరిచిన శ్రధ్ధే గొప్పదనిపించింది రమేష్‌కి.
ఆటో లోపల రాసున్న ‘అతిధి దేవో భవ..’ అన్న వాక్యం, ‘అతిథేయి దేవో భవ!’.. లా అ(క)నిపించి చిరునవ్వుతో ఆటో దిగి బస్ వైపు నడిచాడు రమేష్.