Site icon Sanchika

అతిథి

[కన్నడంలో శ్రీమతి ఇందిరా నాడిగ్ రచించిన ‘కరెయదె బంద అతిథి’ అనే కథని అనువదించి అందిస్తున్నారు శ్రీ కల్లూరు జానకిరామరావు.]

[dropcap]ఈ[/dropcap] జీవన గమనమే ఓ విచిత్రమైనది. ఈ జీవన పయనంలో కొందరు ఆహ్వానించనిదే ఆగమిస్తారు. వచ్చినంత వేగంగానే నిష్క్రమిస్తారు. వచ్చిన వాళ్లెవరు? ఎందుకొచ్చారు? ఉద్దేశమేంటో, కారణం తెలీకుండానే నిష్క్రమిస్తారు. వారికీ మనకీ ఉండే సంబంధమేమిటో? – ఈ ప్రశ్నలన్నీ ఆ పిమ్మట మన మనస్సుల్లో ప్రతిధ్వనిస్తునే ఉంటాయి – నిశ్చలమైన తటాకంలో రాయి బెడ్డ పడి, తటాకాన్ని కల్లోలపరచినట్లు. ఆ ఘటనలు గుర్తుకొచ్చి మనోకాసారాన్ని కల్లోల పరచి వేస్తుంటాయి.

శ్రీహరి మితభాషి, హాస్యప్రియుడు. నవ్వుతూ నవ్విస్తూ వుండేవారు. కృష్ణుడి రంగు. పౌరోహిత్య కుటుంబంలోంచి వచ్చిన సాంప్రదాయపు పిల్లవాడు. చదువులో ఆసక్తి కలిసినవాడు. అందరి తోనూ పొందుకు పోయే స్వభావం వున్నవారు. ఆంధ్ర, కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన ఓ కుగ్రామం నుండి బెంగుళూరికి వచ్చారు.

బెంగుళూరు వేంకటేశ్వర కాలేజీలో ఇంజనీరింగ్ స్టూడెంటు. రాఘవేంద్రస్వామి మఠంలో, వంటపని చేస్తూ, సంసారాన్ని కొనసాగిస్తున్న దూరపు బంధువు వేంకటరమణ అనే వారింట్లో, ఓ గదిలో శ్రీహరి తన ఇంజనీరింగ్ చదువు కొనసాగిస్తూ, రెండు సెమెస్టర్లు పూర్తి చేశాడు. రానురాను, చదువు కొనసాగించటానికి శ్రీహరికి ఇబ్బందు లెదురైనాయి ఆ ఇంట్లో. వేంకటరమణకి ఇద్దరు పిల్లలు. ఎప్పుడూ టి.వి. చూడటం, ఆటలాడటం, అల్లరి చేయటం ఇదే వాళ్ళ పని. వీరి గోలతో శ్రీహరి చదువుకు ఆటంకం ఏర్పడింది. అంతేకాక వేంకటరమణ భార్య లలితమ్మకు, ఆమె వంటపనుల్లో శ్రీహరి సహాయ పడవలసి వచ్చేది. వడ్డించటం, కూరగాయలు తరిగి ఇవ్వటం, నీళ్లు పట్టడం లాంటి పనుల తోటే కాలం గడిచిపోయేది. పరీక్షల సమయం లోనూ శ్రీహరికి చదువుకోవటానికి సమయం దొరకక పోయింది. తన ఇబ్బందు లన్నింటినీ తన స్నేహితుడైన విజయ్‌తో పంచుకునే వాడు.

ఇల్లాంటి పరిస్థితుల్లో హరికి సహాయంగా నిల్చున్న వాడు నా కొడుకు విజయ్. ఓ రోజు ఇంటికి వచ్చీ రాగానే “అమ్మా! నా ఫ్రెండ్ హరి, వారి బంధువుల ఇంట్లో ఉండికూడా చదువుకి ఇబ్బంది పడుతున్నాడమ్మా, అక్కడ రాత్రికి చదువుకోటానికి సమయం దొరకటం లేదు. వాళ్లింట్లో వాళ్ల పనులకి సహాయపడటం తోటే సమయం గడిచి పోతుందట. పాపం చాలా మంచి పిల్లాడమ్మా. నీవు సరేనంటే వాణ్ణి మనింట్లో..” అని అన్నాడు. నేను మౌనంగా వుండిపోయాను. దూరపు పిల్లాడు. ఎక్కడి వాడో ఏమిటో.. మా ఇంట్లో ఉంచుకోవడమంటే.. “మీ ఇద్దరే తీర్మానానికి వస్తే సరా. వాళ్ల ఇంట్లో వాళ్లు ఎవరూ లేరా? అమ్మా.. నాన్నా.. వద్దురా, లేని పోని సమస్యలు మనకెందుకు?” అని అన్నా.

రోజులు గడిచాయి. వారాలు గడిచాయి. రోజూ నాతో మా వాడు శ్రీహరిని గురించిన చర్చే. “మమ్మీ, ప్లీజ్. ఇంకో మూడు నెలలు.. సెమెస్టర్ ముగియగానే వూరెళ్లి పోతాడు. అమ్మా, ప్లీజ్” అని ప్రాధేయపడ్డాడు. అయినా నేను మౌనంగానే ఉండిపోయా.

ఆ రోజు విజయ్ కాలేజి నుండి మధ్యాహ్నం వేళ ఇంటికొచ్చాడు. వస్తూ, వస్తూ ఓ కుర్రాణ్ణి వెంటబెట్టుకొచ్చాడు. వాడి చేతిలోని లగేజ్, ఇంజనీరింగ్ చదివే విద్యార్థుల సరంజామా  చూచి, వాడు శ్రీహరి అని నిర్ధారించుకున్నా.

“అమ్మా! వీడే శ్రీహరి. పిల్చుకొచ్చేశా. కాదు, కూడదు అని మాత్రం అనకమ్మా!” అని అన్నాడు దీనంగా. శ్రీహరిని చూచాక అయ్యో పాపం అనిపించింది. మా వాడి మనసు ఎందుకు నొప్పించాలని, “పోనీ లేరా! ఇంటికి పిల్చుకునే వచ్చేశావు. కాదని నేనెలా అనగలను. శ్రీహరిని నీ గదికి పిల్చుకెళ్లు” అని శ్రీహరి మా ఇంట్లో వుండటానికి అంగీకారాన్ని తెలిపా.

మావారు స్వర్గస్థులై ఏడేళ్లయింది. బెంగుళూరు అనే ఈ మాయా నగరంలో, భర్తను పోగొట్టుకుని, విజయ్, అజయ్ అనే ఇద్దరు పిల్లల్తో, మావారు అప్పుచేసి కట్టించిన ఇంట్లో చాలా లెక్కాచారంగా జీవనాన్ని కొనసాగిస్తున్నా. ఇలాంటి పరిస్థితిలో మా విజయ్ తీసుకున్న నిర్ణయం ఇబ్బంది కలిగిస్తుందో ఏమో ననే ఆలోచనతోటే; శ్రీహరిని ఆహ్వానించలేకపోయాను. అయితే ఋణానుబంధం అంటారు కదా. నా లెక్కాచారమంతా తలక్రిందులై అతిథిగా మా ఇంట్లో కాలూనాడు శ్రీహరి.

తనేమిటో తనపనేమిటే చేసుకుంటూ ఉండిపోయిన శ్రీహరి, రాను రాను ఇంట్లోవాళ్లతో కల్సిపోయారు. ఉదయం స్నానం ముగించుకొని సంధ్యావందనం చేయటం, అల్పాహారం ముగించిన తర్వాత నేను వారించినా, నా పనుల్లో తానూ సహాయపడుతూ ఉండేవాడు. నా ఇద్దరు కొడుకులతో పాటు వాడూ మూడో కొడుకయ్యాడు.

మూడవ సెమెస్టర్ ముగియగానే శ్రీహరి తన ఊరు వెళ్లిపోయాడు. వాడు లేని కొఱత ఇంట్లో కొట్టవచ్చినట్లు కన్పించసాగింది. మూడు నెలల పాటు మాత్రం ఇంట్లో ఉంచుకోడానికి అంగీకరించిన నేను ఇకముందు ఉంచుకోవల్సి వస్తుందో ఏమో ననే ఆలోచనలో పడ్డాను.

నా ఆలోచనలు అలా వుంటూ వుండగానే, ఇలా లగేజ్‌తో పాటు దిగేశాడు శ్రీహరి. తాను వస్తూన్నానని గాని, ఇకముందు ఇక్కడే ఉండిపోతానని గాని ముందస్తుగా ఒకమాటైనా చెప్పినవాడు కాదు. నేరుగా లగేజ్ పాటు దిగేసిన శ్రీహరి నడవడి నాకు కోపం తెప్పించింది. అయితే విజయ్ మధ్యలో కలుగజేసుకుని “పోనీలేమ్మా. ఓ క్షణం ఓపిక పట్టు. ఇప్పుడేమీ అడగవద్దు” అని వాణ్ణి తన గదిలోకి పిల్చుకెళ్లాడు. సరే. ఇప్పుడు మాటాటడం మంచిది కాదనిపించి మౌనంగా వుండిపోయాను.

వారం రోజులు గడిచింతర్వాత అడిగా, “ఏరా హరి – ఏంటి నీ సంగతి? ఎక్కడుండాలి అని అనుకుంటున్నావు?” అని.

“ఇక్కడే ఆంటీ. ఇక్కడే మీ ఇంట్లోనే. మీకేమైనా ఇబ్బందిగా ఉందా ఆంటీ?” అన్నాడు.

“ఆహా! అలాంటిదేమీ లేదురా! చూడు. నీకు తెల్సుగా ప్రొద్దుటే నే పనికి పోయేముందు మీ అందరికి టిఫిన్, భోజనం అన్నీ సమకుర్చి పోవడమంటే కొంత ఇబ్బంది. నా పిల్లలంటే – నే చేసిందేదో తిని వెళతారు. వాళ్లతో ఇబ్బంది లేదు. నీవూ ఇక్కడే వుంటే ఇబ్బంది కదా. నా సంపాదనంతా ఇంటి పైన చేసిన అప్పులు తీర్చడానికి సరిపోవటం లేదు. ఇక నీవు కూడా మాతో వుంటే కష్టంగా ఉంటుంది కదా.”

నా మాటలు విని విచలితుడు కాలేదు శ్రీహరి. కొంచం కూడా సంకోచం లేకుండా, “ఆంటీ! నేను మీ ఇంట్లోనే వుండదలచాను, ఇక్కడే నాకు అన్ని విధాలా సౌకర్యంగా వుంది; సంతోషంగా వుంది. మా నాన్నగారితో చెప్పాను విషయాలన్నీ. ఇక నుంచి నెలనెలా కొంత ఖర్చులకై నాన్నగారు పంపడానికి ఒప్పుకున్నారు. వద్దని అనకండి ఆంటీ. విజయ్, అజయ్‌తో పాటు నేనూ ఇక్కడే ఉండిపోతాను, కాదనకండి ఆంటీ” కన్నీళ్ల పర్యంత మయ్యాడు వాడు.

“అలా కాదు శ్రీహరి, కొంచం ఆలోచించి చూడు”, వాడి ముఖంలోకి చూస్తూ అన్నా.

“నేను మీ కొడుకు లాంటి వాణ్ణే కదా ఆంటీ! ప్లీజ్.. ఇంకో రెండేళ్లకి ఇంజనీరింగ్ పూర్తి చేసి, ఉద్యోగం చూసుకుని, ఈ ఊళ్లో ఓ ఇల్లు చూసుకుంటాను. కాదనకండి ఆంటీ” అంటూ ప్రాధేయపడ్డాడు. కాదనలేకపోయాను. ఇంతకీ శ్రీహరి అమ్మానాన్నల గుఱించి కాని, వాడి గుఱించి ఇతర విషయాలేమో తెల్సుకునే ఆసక్తి లేకపోయింది మాకెవ్వరికీ.

***

‘మల్లెతీగ వాడి పోగ మరల పూలు పూయనా’ అనే పాటతో ఉలిక్కిపడి లేచింది శాంతమ్మ. 15 ఏళ్లు కలలా గడిచి పోయాయి. ఘటనలెన్నో జరిగిపోయాయి ఈ 15 ఏళ్ళ కాలంలో. ఈ రోజు ఎందుకో శ్రీహరి జ్ఞాపకాలే వెన్నాడుతున్నాయి ఆమెను.

మనువడు అభిజిత్, “శాంతవ్వా రా ఆడుకొందాం” అంటూ తన బొమ్మ కారును తీసుకొచ్చాడు. అయినా వాడితో అన్యమనస్కంగానే ఆటలాడింది.

కొడుకు విజయ్ ఆక్సెంచర్‍లో చేరి ఐదేళ్ళు గడిచి పోయాయి. పదిహేనేళ్ల క్రితం తన ఇంటికి చేరిన శ్రీహరి జ్ఞాపకాలే ఆమెను వెంటాడుతున్నాయి.

ఆ రోజు ఎప్పటివలెనె శ్రీహరి కాలేజీకి వెళ్లి వచ్చి విజయ్‌తో కేరం ఆడుతూ కూర్చున్నాడు. శాంతమ్మ అప్పుడే ఆఫీస్ పని ముగించుకొని వచ్చింది. శ్రీహరి వెంటనే వంటంట్లోకెళ్లి  కాఫీ కాచి తీసుకొచ్చి ఆమెకిస్తూ, “ఆంటీ! మా నాన్నగారు వెంటనే ఊరికి రమ్మంటున్నారు. వెళ్లి ఓ వారం పాటు వుండి వచ్చేసా. మీకు ఎలాగూ మూడు నెలల పైకం ఇవ్వాల్సి వుంది. ప్లీజ్ ఏమీ అనుకోకండి ఆంటీ. రేపు పొద్దుటే వెళ్లి వచ్చేస్తా” అన్నాడు.

“కాదురా హరి, పరీక్షలు ఇక కొద్ది రోజులేగా వుంది. చదువుకోక ఎందుకు వెళ్లడం; చదువుకో, డబ్బు ఆ తర్వాత ఇవ్వవచ్చులే” అని అంది శాంతమ్మ.

“లేదు. ఆంటీ, నేవెళ్లాలి. నాన్నగారు రమ్మన్నారు” అని అన్నాడు హరి.

ఓ వారం రోజుల్లో తిరిగి రాగలనని చెప్పిన శ్రీహరి తిరిగి రాకపోవటం శాంతమ్మను ఆశ్చర్యానికి గురిచేసింది. వారం గడిచిపోయినా శ్రీహరి తిరిగి రాలేదు. పరీక్షలు దగ్గర పడుతున్నా వీడెందుకు రావటం లేదు! ఎవర్ని అడగాలి? వాటిని గుఱించిన వివరాలని ఎప్పుడూ ఎవ్వరం ఆరా తీయలేకపోయాం. నాన్నగారు బడిపంతులుగా పని చేసేవారు, కొద్దిగా భూ ఆస్తి వున్నదని మాత్రమే అప్పుడప్పుడు చెబుతూ వుండేవాడు. విజయ్‌కి కూడా ఇది అంతుబట్టని వ్యవహారమే అయింది. పరీక్షలు ప్రారంభమయ్యే రోజు వచ్చేసింది.

⋆⋅☆⋅⋆

పరీక్షలు ముగిశాయి. రోజులు దొర్లిపోయాయి. కాలచక్రం బిరబిరా తిరిగిపోయింది. కాలచక్రం గిర్రున తిరిగినా, శ్రీహరి జ్ఞాపకాలు మాత్రం శాంతమ్మను వదిలి పోలేదు. ఓరోజు సాయంత్రం ఇంటికొచ్చిన విజయ్‌ని అడిగింది “ఒరే విజయ్, శ్రీహరి గురించి ఏమైనా తెలిసిందేమిట్రా! వాడిప్పుడెక్కడున్నాడు? ఎందుకురా వాడు చెప్పాపెట్టకుండా అలా మాయమై పోయాడు?” అని.

ఆమె ముఖాన్నే తదేకంగా చూస్తూ తెలీనట్టుగా తల ఆడించాడు. ఇంకేదో అడగబోతున్న శాంతమ్మను వారించి, “అమ్మా! ఇప్పుడా విషయం ఎందుకు? వాడు ఎక్కడి కెళ్లాడో, ఏమయ్యాడో, ఈ విషయాలేవీ నాకు తెలియవు, నన్నేమీ అడగవద్దు,” అని పుల్ల విరచినట్టుగా మాట్లాడి అక్కణ్ణుంచి వెళ్లిపోయాడు.

***

పాత సంఘటనలే మరీ మరీ గుర్తుకొస్తున్నాయి శాంతమ్మకు. బెంగుళూరులో ఎప్పుడు వర్షం వస్తుందో ఎప్పుడు నిల్చిపోతుందో తెలియని విషయం. ఆ రోజు ఎడతెరపి లేకుండా కురుస్తోంది వర్షం.

గది లోంచి బయటి కొచ్చింది శాంతమ్మ. అక్కడ బాల్కనీలో కొడుకు విజయ్ కోడలు ఏదో విషయం గురించి గంభీరంగా మాట్లాడుకుంటున్నారు. ఇంత రాత్రివేళ ఏ విషయం గుఱించి మాట్లాడుకుంటూన్నారు, అని వారి వైపు అడుగులు వేస్తూ వుండగా శ్రీహరి పేరు తనకు వినిపించటంతో అక్కడే నిల్చుని వారి మాటల్ని ఆలకించసాగింది.

అదెందుకో విజయ్ భావోద్వేగంతో, వచ్చే కన్నీళ్లను ఆపుకుంటూ, “సుష్మా! మాతో పాటు మా ఇంట్లో శ్రీహరి అనేవాడు చదువుకుంటూ వుండేవాడని అపుడప్పుడు చెబుతూ వుండేవాడిని కదా. వాడు.. వాడు – ఇంత త్వరలో మాకు దూరమవుతాడని ఊహించలేదు సుష్మా.. ఆ రోజు తన నాన్నగారిని చూడటం కోసం వెళ్ళినవాడు, తిరిగి నాన్నగారితో వస్తూ.. హైవేలో.. – శ్రీహరి, తన నాన్నగారితో పాటు వస్తున్న కారు ఆక్సిడెంట్‌కి గురై ..శ్రీహరి దేహం ఛిద్రమై పోయిందట. శ్రీహరి నాన్నగారు కారు వెనక సీటూ కూర్చొని వుండటం వల్ల కొద్దిపాటి గాయాలతో బ్రతికి బయటపడ్డారట. కారు డ్రైవర్‍కు బలమైన దెబ్బలు తగిలాయట. అతను సృహ కోల్పోయాడట. అయితే కారు నుంచి విసిరి వేయబడ్డ శ్రీహరి దేహం మాత్రం ఛిద్రమై పోయింది. శ్రీహరి నాన్నగారికి తెలివి వచ్చిన తర్వాత, చుట్టూ చేరిన వారి సహాయంతో, శ్రీహరి శవాన్ని ఊరికి తీసుకెళ్ళారు. డ్రైవర్ మూడు నెలలపాటు కోమాలో వుండి అటు తర్వాత పోయాడట.”

“ఈ విషయం మీకెలా తెలిసిందండీ” అడిగింది భార్య.

“ఓ రోజు నేను రాఘవేంద్ర స్వామి మఠానికి వెళ్లినప్పుడు అక్కడ శ్రీహరి చావు విషయం నా చెవిన పడింది. అదే మఠంలో శ్రీహరి ఇంతకు మునుపు వుండేవాడని నాకు గుర్తుకొచ్చి, వాళ్లతో మాట్లాడి విషయం తెల్సుకున్నా. అది నిజమని తేల్చుకునేసరికి నేను షాక్‌కి గురి అయ్యాను. ఈ విషయం అమ్మకి తెలిస్తే ఆమె తట్టుకోలేక ఎక్కడ దిగాలు పడిపోతుందో ననే భయంతో ఈ విషయాన్ని దాచేశాము.”

ఇదంతా వింటున్న శాంతమ్మకు నెత్తిన పిడుగు పడ్డట్టయ్యింది. కొడుకు లాంటి శ్రీహరి.. వాడెక్కడున్నా సుఖంగా ఉండాలని ఆశించిన శాంతమ్మకు ఈ వార్త విద్యుద్ఘాతమయ్యింది. కొన్ని ఏళ్ల పర్యంతం, కొడుకులా ఇంట్లో తిరిగిన వాడు.. ఈనాడు – ఇలా.. కన్నీళ్ల పర్యంతం అయ్యింది శాంతమ్మ.

ఇంతకూ ఎవరో శ్రీహరి? వాడి గుఱించి తానెందుకిలా వేదన చెందటం? తాను కన్న కొడుకా, కాదు! లేదా బంధువా? ఏమీ కాని వాడిని గుఱించి తానెందుకిలా.. అని ఆలోచిస్తూ.. పిలువకనే వచ్చిన అతిథిని గుఱించి తలచుకొంటూ నిద్రలోకి జారింది శాంతమ్మ.

కన్నడ మూలం: ఇందిరా నాడిగ్

తెలుసు అనువాదం: కల్లూరు జానకిరామరావు

Exit mobile version