నేటికీ చదవదగ్గ నాటి కథలు – ‘అట్లూరి పిచ్చేశ్వరరావు కథలు’

0
2

[dropcap]శ్రీ [/dropcap]అట్లూరి పిచ్చేశ్వరరావు బహుముఖ ప్రజ్ఞాశాలి. పేరుపొందిన రచయిత, అనువాదకులు. హిందీ నుంచి, రష్యన్ నుంచి తెలుగులోకి పుస్తకాలను అనువదించారు. పత్రికలలో సహయ సంపాదకులుగా పని చేశారు. సినిమాలకు కథనం – సంభాషణలు అందించారు. పలు వెండితెర నవలలు రాశారు. 1945 నుండి 1953 దాకా భారత నౌకాదళంలో మెకానికల్ ఇంజనీరుగా పనిచేశారు. విభిన్నమైన అనుభవాలను ప్రోది చేసుకున్న ఆయన ఆనాటి సమాజాన్ని తన రచనలలో ప్రదర్శించారు. వారి కుమారుడు అనిల్ అట్లూరి ఆయన రచించిన, ప్రస్తుతం లభ్యమయిన కథలతో ‘అట్లూరి పిచ్చేశ్వరరావు కథలు’ అనే పుస్తకం వెలువరించారు.

కొన్ని కథలలోని సంఘటనలు, ప్రస్తావనల ప్రకారం వాటి కథాకాలం ప్రచురణ కాలం కన్నా ముందయి ఉంటుందని తోస్తుంది. ముద్రితమై దాదాపు 60-70 ఏళ్ళు గడిచినా చాలా కథలలోని అంశాలు నేటికీ వర్తిస్తాయి. ఆనాటి సమాజాన్ని కళ్ళకు కడుతున్న – నేడు కూడా మరో రూపంలో ఉన్న అలాంటి సమస్యలను, వ్యక్తులను స్ఫురింపజేస్తాయి. ప్రగతివాద దృక్పథంతో అల్లిన ఈ కథలు నేడూ చదవదగ్గవే.

కొన్ని కథలు సూటిగా ఉంటాయి, కొన్ని కథల్లో మార్మికత నిండి ఉంటుంది. కొన్ని ఉద్వేగాలను కలిగిస్తే, కొన్ని ఉత్తేజాన్నిస్తాయి. రచయితది చాలా నిరాడంబరమైన శైలి. పాఠకులను అక్షరాల వెంట పరుగిడేలా చేసే శైలి. వీరి విభిన్నమైన శైలిలో వాక్యం సరళంగా ఉంటూనే గంభీరమైన అర్థాలను స్ఫురింపజేస్తుంది. భారీ వర్ణనలు లేకుండానే, పదునైన సంభాషణల ద్వారా సన్నివేశాన్ని కళ్ళకు కట్టారు. క్లుప్తత పాటిస్తూనే విస్తృతమైన దృశ్యాన్ని ప్రదర్శించారు. ఈనాటి కథారచయితలు అలవర్చుకోవాల్సిన లక్షణమిది అని నేను భావిస్తాను. అనితర సాధ్యం ఈ శైలి అని తోస్తుంది.

ఇప్పటి తరానికి తెలియని పరిస్థితులు, సంఘటనలు, పుస్తకాలలో చదువుకున్న స్వాతంత్ర్య సమరయోధులను ప్రస్తావిస్తూ సాగుతాయి కొన్ని కథలు. స్వాతంత్రం రాక పూర్వం భారతీయుల కడగండ్లు, స్వాతంత్ర్యం వచ్చాకా ఆశలు వమ్మయి, పాలకులు మారారు తప్పితే, తమ జీవితాలు మారలేదని ప్రజలు గ్రహించడం మరికొన్ని కథలు చెబుతాయి. ఈ పుస్తకంలోని కథలను పరామర్శిద్దాం.

***

1954లో ప్రచురితమైన ‘నెత్తురు కథ’ ప్రతీకాత్మకమైన కథ. ఈ కథలోని నెత్తురు ఓ స్త్రీమూర్తికి ప్రతిరూపం. ఓ స్త్రీమూర్తి భార్యగా, తల్లిగా, అత్తగారిగా వివిధ దశలలో దేశంలో తాను చూసిన ఘటనలను ప్రస్తావిస్తూ సాగుతుంది. స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన భర్త, స్వాతంత్ర్యానంతరం దేశంలో మారిన పరిస్థితులు.. ఆకలి, పేదరికం, పోరాటాలు, ఉద్యమాలు.. పోలీసుల కాల్పులు.. రహదారిపై రక్తం.. ఆ రక్తం ఎవరిదైనా కావచ్చు.. కార్మికుడిది కావచ్చు, కర్షకుడిది కావచ్చు. ఆ రక్తంలో ప్రేమ ఉంది. దుఃఖం ఉంది. క్షోభ ఉంది. చిన్న కథే అయినా పాఠకులని ఆపి, ఆలోచింపజేసి, ముందుకు సాగేట్టు చేస్తుందీ కథ.

రచయిత నౌకాదళంలో పని చేసినప్పటి అనుభవాల్లోంచి పుట్టిన కథ ‘చిరంజీవి’. ‘చిరంజీవి సిక్‍బేలో మూలుగుతున్నాడు’ అనే వాక్యంతో ప్రారంభమైన కథ – చిరంజీవి అనే ఓ వ్యక్తి కథ. చిరంజీవి ఒక్కడే అయినా అతని పాత్ర చిత్రణ వెనుక అలాంటి భావాలు గల ఎందరో యువకులున్నట్లు పాఠకులకు అర్థం అవుతుంది. ఉన్నతాదర్శాల కోసం నౌకాదళంలో చేరిన చిరంజీవికి అడుగడుగునా అవమానాలు ఎదురవుతాయి. అధికారుల ఆధిపత్య భావనపై తిరుగుబాటు చేస్తాడు. జపాను వారిపై యుద్ధం చేయాలన్న తన ఆశయాన్ని వాళ్ళు త్రుణీకరించి, నౌకలో పాకీపని అప్పగిస్తే, అధికారులను వ్యతిరేకిస్తాడు. తన అప్లికేషన్‍ని ప్రాపర్ ఛానెల్ ద్వారా పంపాలన్న మిషతో మరికొన్నాళ్ళు వేధిస్తారు. ఓడలో పెట్టే అన్నంలో పురుగులు.. మెతుకులు ఏరుకుని తినాల్సి వస్తోందని ఫిర్యాదు చేస్తే మరో శిక్ష. వీటిని భరించలేని చిరంజీవి తోటివారికి ప్రేరణగా నిలుస్తాడు. ఉద్యమం లేవదీస్తాడు. కాల్పులలో చిరంజీవి తల వెనుక తూటా దిగుతుంది. చిరంజీవి భౌతికంగా మరణించినా – ఎందరినో జాగృతం చేసి ‘చిరంజీవి’ అవుతాడు. 1954లో ప్రచురితమైన ఈ కథ అధికారుల మదాన్ని ప్రదర్శిస్తుంది. వ్యక్తులు మారినా నేటికీ అలాంటి స్వభావం ఉన్న అధికారులు మనకీ కనబడుతూనే ఉంటారు.

స్వాతంత్ర్యం వచ్చిన 20 ఏళ్ళకి – 1967లో ప్రచురితమైన కథ ‘ఇదిప్పుడు మన దేశమే!’. ఒక కాలికి ఖరీదు కట్టలేమంటూ – వికలాంగుడికి జీవితాంతం పెన్షన్ ఇవ్వడం వల్ల దేశానికి ఎంత నష్టమో ఓ ఆఫీసర్ వాపోతాడీ కథలో. కాలు కోల్పోయిన అతన్ని – ఓ బీమా కంపెనీలో గేట్ కీపర్‍గా ఉద్యోగం చేసుకోమంటాడు. ప్రజా సంక్షేమం పట్ల అధికారులలో ఆలోచనలలోని మార్పును ఈ కథ విశదీకరిస్తుంది. నౌకలో పనిచేస్తూ ఓ పెద్ద ప్రమాదాన్ని నివారించి, ఎందరివో ప్రాణాలు కాపాడే ప్రయత్నంలో తన కాలును పోగొట్టుకుంటాడా వ్యక్తి. అతను చేసిన సేవలని గుర్తించలేని అధికారి గోడకానుకుని చేసే ఉద్యోగం ఇస్తామని అంటూ అందులోని వెసులుబాట్లు ప్రస్తావిస్తాడు. అయితే తాను ప్రాణాలు కాపాడిన అధికారులందరూ ఎంత కాలం బ్రతుకుతారో, వారికి జీతభత్యాల ఖర్చు ఎంతవుతుందో లెక్కించి, తాను వారందరినీ కాపాడడం వల్ల ప్రభుత్వానికి ఎంత ఖర్చో అని అంటాడతను. నీకు పిచ్చెక్కిందని అంటాడు అధికారి. అధికారి సూచించిన ఆ ఉద్యోగం చేయనని వెళ్ళిపోతాడతను. కాలు పోగొట్టుకున్నా ఆత్మాభిమానం కోల్పోని వ్యక్తిత్వం అతనిది.

1954లో ప్రచురితమైన ఇంకో కథ ‘విముక్తి’. రజాకార్ల నేపథ్యంలో అల్లిన కథ ఇది. సుబ్బమ్మ కథ ఇది. ఓ ఊరి కథ ఇది. ఊరి మీద పడి రజాకార్ల చేసిన దారుణాలు, భూస్వాముల ఆగడాలు ఈ కథలో దృశ్యమానమవుతాయి. అందరికీ సాయం చేసే తన స్వభావాన్ని మార్చుకుని, ఒంటరిగా ఉండడం అలవాటు చేసుకుంటుంది సుబ్బమ్మ. భర్త పోయిన దుఃఖంలో ఉన్న ఆమెను ఒకరోజు చెరువు దగ్గరకి రమ్మని కబురు వస్తుంది. ఊరికి ద్రోహం చేసిన వ్యక్తికి శిక్ష వేసేందుకు అక్కడందరూ గుమిగూడుతారు. అందరూ అతన్ని శిక్షించాలని కోరుకుంటే, సుబ్బమ్మ మాత్రం అతన్ని క్షమించి వదిలేయమంటుంది. దొరలు దోచుకున్న ఆస్తులన్నీ ఎవరికి వాళ్ళకి పంచేస్తుంది ప్రభుత్వం. సుబ్బమ్మ ఆవు, దూడలు మళ్ళీ ఆమె వద్దకు వచ్చేస్తాయి. అక్కడ చేరిన అందరూ సంఘానికి జై అంటారు. సుబ్బమ్మా గొంతు కలుపుతుంది.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఉత్సాహం కొన్నేళ్ళకే అలా ఆవిరయిపోయిందో 1954 నాటి ‘ఆగస్టు 15న’ కథ చెబుతుంది. అత్యంత మార్మికంగా సాగిన కథ. సందర్భోచితంగా నార్వే నాటకకర్త ఇబ్సన్, కవి రచయిత హోవార్డ్ ఫాస్ట్, అమెరికన్ రచయిత, ఉద్యమకారుడు పాల్ రాబ్సన్ ప్రస్తావనలుంటాయి ఈ కథలో. స్వాతంత్య్రం వచ్చాకా తాము ఆశించిన మార్పు సమాజంలో రానే రాలేదన్న ఉద్యమకారుల ఆవేదన నిగూఢంగా చిత్రించబడింది ఈ కథలో.

బ్రతకడం రాదని ముద్ర వేయించుకున్న పాపారావు కథ ‘బ్రతకడం తెలియని వాడు’. 1967లో ప్రచురితమైందీ కథ. తల్లిదండ్రులు, ఇంట్లో పెద్దలు ఆశించినట్టు బ్రతకడు పాపారావు. చదివిన చదువును, పొందిన అవగాహనని సమాజానికి ఉపయోగిస్తాడు. తన జీవితాన్ని తాడిత పీడిత జనుల ఉద్ధరణకి వినియోగిస్తాడు. ఇంట్లో వాళ్ళు బ్రతకడం రాని వాడని వదిలేస్తే, జనాల కోసం బ్రతికి, వారి కోసమే చచ్చి, ‘బ్రతికితే పాపారావులా బ్రతకాలి’ అనిపించుకున్న పాపారావుకి నిజంగా బ్రతకడం రాదా? అనిపిస్తుంది పాఠకులకు. తన బ్రతుకు తాను చూసుకోవడం రాదని అర్థమవుతుంది. సంఘం కోసం బ్రతికినవాడని గ్రహింపుకొస్తుంది.

మారుతున్న కాలం, రూపాంతరం చెందుతున్న సమాజం, ఆధునీకరణకి లోనవుతున్న జనాల జీవనశైలులను స్పష్టాస్పష్టంగా ప్రదర్శించిన కథ ‘గడవని నిన్న’. 1967లో ప్రచురితమైన ఈ కథ – అప్పట్లోనే అమెరికా గురించి ప్రస్తావిస్తూ ‘దూరపు కొండలు నునుపు’ సామెతని గుర్తు చేస్తూ డబ్బున్న వాడిదే రాజ్యం, లేనివాళ్లు ‘దౌర్భాగ్యులు’ అని చెప్తుంది. కఠినమైన వర్తమానం నుంచి అందమైన భవిష్యత్తు చూడాలనుకుంటుంది విన్నీ ఈ కథలో. “ఎంతమంది ఆకలి తీరుస్తావు విన్నీ?” అనే ప్రశ్నకి “నా ఆకలి చచ్చింది” అన్న ఆమె సమాధానం ఆమె నిర్లిప్తతని వెల్లడిస్తుంది. ప్రపంచానికి ‘రేపు’ వచ్చేస్తుంది. కానీ విన్నీ మాత్రం ‘నిన్న’లోనే ఉండిపోతుంది. గాఢమైన సంభాషణలు, లోతైన అర్థాలు ఉన్న ఈ కథని ఒకటికి రెండు సార్లు చదివితే పాత్రల మనస్తత్వాలు, ఉద్దేశాలు మనకు అవగతమవుతాయి.

“మీ దేశంలో రెక్కలాడితే డొక్కాడుతుందో లేదో నాకు తెలియదు. మా దేశంలో ఒక్కటాడినంత మాత్రాన్నే రెండోది కూడా ఆడదు. రెక్కల్తో పాటు మెదడమ్ముకోవాలి, నవ్వే కళ్ళమ్ముకోవాలి, గుండ్రంగా పెంచుకున్న అవయవాలమ్ముకోవాలి; ఆహ్వానించే నవ్వునమ్ముకోవలి, ప్రేమనమ్ముకోవాలి” అంటాడు డిక్ అనే అమెరికన్ సెయిలర్ ‘జీవచ్ఛవాలు’ కథలో. టోవెడో అనే అమెరికా నౌకలో నావికుడతను. భౌతిక సుఖాలు, డబ్బును కోరుకునే కొందరి అమెరికన్ల స్వభావాన్ని ఈ కథ ప్రస్తావిస్తుంది. న్యూయార్క్ లోని స్వేచ్ఛా ప్రతిమ ఇతర దేశీయులకి ఏ భావన కలిగిస్తుందో, అమెరికన్లకి ఏ భావన కలిగిస్తుందో డిక్ చెబుతాడు. అమెరికా గురించి ఉన్నతంగా ఊహించుకునేవారికి, ఆ గొప్పతనం వెనుక ఉన్న డొల్లతనం డిక్ మాటలతో అర్థమవుతుంది. ఇదీ 1967లో ప్రచురితమైనదే.

రైల్లో జనరల్ బోగీలో ప్రయాణిస్తున్న వ్యక్తికి ఎదురయిన సంఘటనలు, తారసిల్లిన వ్యక్తులు, వారి ప్రవర్తనా, సంభాషణలు – వీటితో అల్లిన కథ ‘ఒక అనుభవం’. దురుసుతనం, అన్నీ తమకే తెలుసనుకోవడం, ధనం చూసుకుని చేసే దాష్టీకం, ఇబ్బందులను మౌనంగా సహించడం, అనువుగాని చోట అధికుల మనరాదనే సూక్తిని పాటించడం అన్నీ – ఈ కథలోని వ్యక్తుల ప్రవర్తనలో కనబడతాయి. 1967లో ప్రచురితమైన ఈ కథలోని వ్యక్తుల ప్రవర్తన నేడు కూడా ప్రయాణాల్లో మనకి ఎదురవుతుంది.

వెర్రి కాదు వేదాంతం!!’ కథ ఎన్నో ప్రశ్నలను రేకెత్తిస్తుంది. 1954లో ప్రచురితమైన ఈ కథ జీవితం కొనసాగుతూనే ఉంటుందని చెబుతుంది. దేశభక్తి అంటే ఏమిటో చర్చించిన ఈ కథ – మనకి కావల్సింది మచ్చలున్న వెలుగు కాదు అంటుంది. మచ్చలు లేని వెలుగేమిటో తెలుసుకునేందుకు కథ చదవాలి.

ఆంధ్ర్ర రాష్ట్రం ఏర్పాటు నేపథ్యంలో అల్లిన రాజకీయ కథ ‘డొంకల వంకల మనసులు’. 1954లో ప్రచురితమైన ఈ కథ లోని రాజకీయ నాయకుల వంటి నేతలు నేడూ కనబడడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. శీతారామయ్య పాత్రని నడిపిన తీరులో కొద్దిగా వ్యంగ్యం గోచరిస్తుంది.

ఈ పుస్తకంలోని కథలకు కొద్దిగా భిన్నమైనది ‘వసుంధర’ కథ. 1957లో ప్రచురితమైన ఈ కథలో ఓ కొత్త టెక్నిక్‍ని (ఆ కాలానికి కొత్తదే అని నేను అనుకుంటున్నా) వాడారు రచయిత. మిగతా కథలకి భిన్నమైన శైలిలో నడిచిన కథ ఇది. కాలం, వ్యక్తులు, పరిస్థితులు – ఈ కథలో చెప్పే మాటలు నిత్యనూతనం.

“యీ చిక్కులో చిక్కుకున్న చిక్కును విడదీయవూ?” అని ఒకావిడ భగవంతుడిని వేడుకొంటుంది ‘కోరిన వరం’ కథలో. ఆ చిక్కేమిటో, ఆమె ఇదే నా చివరి ప్రార్థన అని ఎందుకందో 1954 నాటి ఈ కథ చదివి తెలుసుకోవాల్సిందే.

బొంబాయిలోని ఓ క్లబ్‍లో సభ్యత్వం పొందడానికి ఒకాయన ఏం చేశాడో, ఏం గొప్పలు చెప్పుకున్నాడో ‘సబద్ధం’ కథ చెబుతుంది. బొంబాయి గేట్ వే, బొంబాయి లోని హ్యాంగింగ్ గార్డెన్స్‌ని, అమెరికా అధ్యక్షుడు ట్రూమన్‌ని ప్రస్తావించిన ఈ కథ దిగువ మధ్యతరగతి వ్యక్తి ఎగువ స్థాయికి ఎగబాకడానికి చేసే ప్రయత్నాన్ని వెల్లడిస్తుంది. ఈ కథ 1954లో ప్రచురితమైంది.

జనరల్ బోగీలో ఓ రైలు ప్రయాణాన్ని వర్ణిస్తుంది ‘కథకుడు’ కథ. నారాయణమూర్తి ఉన్న బోగిలోకి ఓ తల్లీ, ఆమె పిల్లలు ఎక్కుతారు. మనం రద్దీగా ఉన్న ఈ బోగీలో ఎందుకు, ఖాళీగా ఉన్న పరుపుల బోగీ ఎక్కచ్చుగా అని ఓ కుర్రాడు ఆ తల్లిని అడుగుతాడు. ఆ తల్లి చెప్పిన జవాబు ఆమె నిస్సహాయతని వెల్లడించినా, ఆ సమాధానం వాడికి రుచించదు. ప్రశ్నల మీద ప్రశ్నలడిగి విసిగిస్తాడు. నారాయణరావు ఏవైనా జోక్యం చేసుకుని కుర్రాడి దృష్టి మళ్ళిస్తాడేమోనని ఆమె అనుకుంటుంది. కథ చెబుతానంటూ ఓ కథ చెబుతుంది. పిల్లలకి అది నచ్చదు. ఆ మాటే తల్లితో అంటాడు నారాయణరావు. “వాళ్ళకి మంచి కథలు నచ్చవు. ఈ వెధవ చచ్చు సినిమాలు చూచేవాళ్ళకి మంచి కథలెందుకు నచ్చుతయ్యీ” అంటుందావిడ. పిల్లలు నారాయణరావుని కథ చెప్పమంటారు. సంఘం కోసం పోరాడే బాలుడు, వాడి తండ్రి కథ చెబుతాడు నారాయణరావు. ఆ కథ పిల్లలకి తల్లికీ నచ్చిందో లేదో తెలియాలంటే 1954 నాటి ఈ కథ చదవాలి.

తన తల్లిదండ్రుల మధ్య గొడవల గురించి, వారి మధ్య ప్రేమ గురించి, వారింట లేమి గురించి, తండ్రి ముక్కోపం కాణంగా చెదిరిన కుటుంబం మళ్ళీ కలవడాన్ని ఓ కొడుకు చెప్పిన కథ ‘గడచిన దినాలు’. తండ్రి ముక్కోపం వెనుక ఉన్న నిస్సహాయతని ఆ కొడుకు సరిగ్గా గ్రహిస్తాడు. “మా నాన్న గూడా మనిషే, మా నాన్నకి ప్రేముంది; బిడ్డలంటే గారాబం ఉంది” అనుకుంటాడు. 1954లో ప్రచురితమైన ఈ కథ – ఆ కాలంలో భార్యల ఆధిపత్యం ప్రదర్శించేందుకు భర్తలు ఎలా ప్రవర్తించేవారో తెలుపుతుంది.

స్నేహితురాలితో కల్సి ఎడారికెళ్ళి అక్కడ సరదాగా గడపాలనుకుంటుంది ఓ మహిళ. “రాత్రిళ్ళు వెల్లకిలా పండుకొని చుక్కల్ని లెక్కించుకుంటాం” అంటుంది. “ఎవరి భర్తల గురించి వాళ్ళామాత్రమైనా పరిశీలన చెయ్యకపోతే ఎలా లెండి” అంటుంది. మగవారికి పొరుగింటి పుల్లకూర రుచి అని చెబుతుంది. 1967లో ప్రచురితమైన ‘పులి – మేక ఆట’ కథ ప్రతీకాత్మకమైనది.

పెళ్ళికి ముందు పేదవాడిలా ఉన్న రమణయ్య, పెళ్ళితో మధ్యతరగతి విభాగంలోకి మారతాడు. అలవాట్లు, అభిరుచులు మారతాయి. చాలా తెలివిగా ప్రవర్తించి భార్యకీ, తల్లికీ మధ్య గొడవలు రాకుండా చూస్తాడు. భార్య తనకి నచ్చేలా నడుచుకునేలా చేస్తాడు. భార్యకి స్వేచ్ఛ ఇస్తున్నట్టే కనబడుతూ, ఆమె తనకి లోబడి ఉండేలా చూసుకుంటాడు. 1967లో ప్రచురితమైన ‘పరిచయం’ కథ పాఠకులని ఆకట్టుకుంటుంది.

చావులో సుఖాన్ని కోరుకోవడం స్వార్థమని అంటుంది ‘తీరని కోరిక’ (1967). కథానాయిక తనకి తాను ఎన్నో ప్రశ్నలు వేసుకుంటుంది. తర్కించుకుని జవాబులు రాబట్టడానికి ప్రయత్నిస్తుంది. పెళ్ళయ్యాకా భర్తతోనూ తన సందేహాలను ప్రస్తావిస్తుంది. ఒక ప్రశ్నకి జవాబుగా ఆయన ‘చదువంటే గతం, బ్రతుకంటే ప్రస్తుతం’ అని అంటాడు. అర్థం చేసుకోవాలే గాని గొప్ప సత్యం ఇమిడి ఉంది ఈ వాక్యంలో.

ఇతర కవులకి భిన్నంగా, తాను కొత్తగా కవిత్వం రాయాలనుకుంటాడు శాస్త్రి. ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తాడు. తాను రాసింది ఓ మిత్రుడికి వినిపిస్తాడు. “ఎందుకురా ఇది” అంటాడా మిత్రుడు. చివరికి శాస్త్రి “నేను తప్పితే ఎవరూ అర్థం చేసుకోలేరు” అంటాడు. 1945లో ప్రచురితమైన ‘శాస్త్రి’ కథలో ఈ కవి తాను నేల విడిచి సాము చేయలేదని భావిస్తాడు. సిగరెట్ ఆరిపోవడంతో దాన్ని పడేస్తాడు. అయితే అతనిలో కవన కుతూహలం చల్లారిపోయిందని పాఠకులకి అర్థమవుతుంది.

‘వింత మరణం’ (1956) గొప్ప కథ. ఓ సినీ విమర్శకుడికీ, తానూ రచయితననీ, సినిమాలకు కథలందిస్తానని చెప్పిన విశ్వనాథానికి పరిచయం కలుగుతుంది. తనని తాను గొప్పగా పరిచయం చేసుకువాలనుకున్న ఆ సినీ విమర్శకుడిని తన బోళాతనంతో ఆటపట్టిస్తాడాయన. వారి మధ్య స్నేహం ఏర్పడుతుంది. వింతగా నవ్వుతూండే విశ్వనాథం హఠాత్తుగా మరణిస్తాడు. అంతకు ముందు రోజు సాయంత్రం “నేనూ గొప్పవాణ్ణే అన్న సంగతి మర్చిపోవద్దు రావు గారూ” అని ఆయన తనతో అన్నమాటలు ఈ విమర్శకుడికి గుర్తొస్తాయి. మరి విశ్వనాథం గొప్పవాడా కాదా అన్నది కథ చదివి పాఠకులు నిర్ణయించుకుంటారు. ‘ఈ రోజుల్లో చలనచిత్రాలు శతదినోత్సవం చేసుకోవడంలో గొప్పేఁ ఉంది; హాలు యజమాని హాలుకి డబ్బులిచ్చి ఉత్సవాలు జరుపుకుంటున్నవి గూడా కద్దే కదా’ అన్న వ్యాఖ్య ఉంది ఈ కథలో. శతదినోత్సవాలు తగ్గినాయోమో గాని, కలెక్షన్ల రికార్డుల విషయంలో ఈ వ్యాఖ్య నేటికీ వర్తిస్తుందనడంలో సందేహం లేదు.

ఓ రచయితా, ఓ విమర్శకుడి మధ్య జరిగిన సంభాషణకి కథా రూపం ‘గర్భస్రావం’ (1967). ఆ ఇద్దరూ మిత్రులే. రచయిత మీద విమర్శకుడు చివర్లో వేసిన చెణుకు నవ్వు తెప్పిస్తుంది. ‘మరపే మెరుగు’ (1957) చక్కని కథ. ఓ దివ్యాంగుడికి ఓ కాలు లేని మిడత తారసపడినప్పుడు అతనిలో చెలరేగిన భావ సంఘర్షణ – అతనిలో ఎన్నో ప్రశ్నలను రేకెత్తిస్తుంది. ఆత్మపరిశీలన చేసుకుంటున్నట్టు అనిపించినా, అది కాసేపే అవుతుంది.

పనిమనిషి కూడా మనిషేనని గుర్తించగలిగిన ఇల్లాలు విమలాదేవి. అలాంటావిడ తమ పనిమనిషిని హఠాత్తుగా ఎందుకు పని మానేసి వెళ్ళిపోమందో తెలుసుకోడానికి ‘పనిమనిషి’ (1957) కథ చదవాలి.

చిత్రాతి చిత్రమయిన ఒక గాథ’ అనే కథకి ఓ విశేషం ఉంది. రచయిత ఈ కథని ముందు హిందీలో రాసి ప్రచురించి, ఆ పై తానే స్వయంగా తెలుగులోకి అనువదించారు. 1947 ఆగస్టులో ఆనందవాణి పత్రికలో ప్రచురితమైన ఈ కథ అనువాదంలా అనిపించదు.

***

ఈ పుస్తకంలో పిచ్చేశ్వరరావు గారు రాసిన కథలే కాకుండా, ఆయన చేసిన పుస్తక సమీక్షలను పొందుపరిచారు. తన తండ్రి గారి గురించి అనిల్ అట్లూరి వ్రాసిన వ్యాసాలున్నాయి. పిచ్చేశ్వరరావు గారి కథలపై కొడవటిగంటి కుటుంబరావు గారు, ఆరుద్ర గారు రాసిన వ్యాఖ్యానాలు ఉన్నాయి. ఈ సంకలనానికి ఓల్గా గారు రాసిన ముందుమాట ఉంది.

దేశానికి స్వాతంత్ర్యం రాక మునుపు పరిస్థితులు, ఆయా వ్యక్తుల మానసిక స్థితిగతులు; స్వాతంత్ర్యం వచ్చాకా మారిన పరిస్థితులు, నెరవేరుతాయకున్న ఆశలు వమ్ము కావడం; పేద మధ్యతరగతి ప్రజల ఆలోచనా విధానాలు అన్నీ ఈ పుస్తకం ద్వారా తెలుసుకోవచ్చు. అందుకే ఈ పుస్తకం విలువైనది. నేటి కాలానికీ అవసరమైనదని నా అభిప్రాయం. ఈ కథలు విస్మృతికి లోను కాకూడదని పుస్తక రూపంలో అందుబాటులోకి తెచ్చిన అనిల్ అట్లూరి అభినందనీయులు.

~

అట్లూరి పిచ్చేశ్వరరావు కథలు (కథా సంపుటి)
సంపాదకులు: అనిల్ అట్లూరి
ప్రచురణ: సిఎస్‍ఎల్ పబ్లిషర్స్, హైదరాబాదు
పుటలు: 280
వెల: ₹ 250.00
ప్రతులకు: నవోదయా బుక్‍హౌస్ (హైదరాబాద్, 9000413413), పల్లవి పబ్లికేషన్స్ (విజయవాడ, 9866115655).
ఆన్‍లైన్‍లో:
https://www.amazon.in/dp/B09NXWHNMM

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here