[box type=’note’ fontsize=’16’] భారత ప్రభుత్వం ఆరంభించిన స్వచ్చభారత్ అభియాన్ వల్ల గ్రామాలన్నీ శౌచాలయాలను నిర్మిస్తూన్న సందర్భంలో ఒక మహిళ అంతరంగంలో పల్లవించిన ఆలోచనల రూపు పెరుగు సుజన కవిత “ఆత్మగౌరవం”.[/box]
ఎన్ని ఉదయాలు
ఎన్నెన్ని సాయంత్రాలు
నెత్తిన ముసుగుతో
చేతిలో చెంబుతో
చెట్టు పొదల్ని ఆసరా చేసుకుని
మమ్మల్ని మేం భయంకరంగా కోల్పోయాం ..
తరాలుగా చెప్పలేని ,
చెప్పుకోలేని అకృత్యాల పాలయ్యాం
డెబ్బయేళ్ళ స్వాతంత్య్రం సాక్షిగా
ఇప్పుడొక పిలుపు
మా ఉనికిని
మా ఉలికి పాటుని గుర్తించింది
మా ఆత్మ గౌరవాన్ని పలకరించింది
ఇప్పుడు
కురిసే చినుకుల అలజడి లో
మనసంతా ఆనందపు అల్లరి చేస్తుంది
ముసుగు తొలగించి
తలెత్తుకుని తడవగలుగుతున్నందుకు
మా మాన రక్షణ కోసం
ఒక అభయ హస్తం కాపుకాస్తున్నందుకు
స్వేచ్చా భారతంలో
మా కోసం ఒక స్వచ్ఛ ఆలోచన మొలకెత్తినందుకు
మాకోసం ప్రతి ఇంటా ఒక పడక గదే కాదు
మా పరువు నిలిపే ఒక మరుగు గది కూడా వెలుస్తున్నందుకు ..
తరం మారిందనే
ఒక నమ్మకాన్నిస్తూ …
ఇప్పటికైనా స్త్రీకి అసలు సిసలైన
ఆత్మ గౌరవం రక్షణ కవచం దొరికినందుకు ..
ఇప్పుడిక ఈ స్వేచ్చా భారతం లో
ఏ గ్రామం వెళ్లినా తలెత్తుకు తిరగనున్నందుకు .. !
పెరుగు సుజన