ఆత్మ తత్వ విచారణ – ఒక పరిశీలన

0
1

[శ్రీ సి.హెచ్. ప్రతాప్ గారి ‘ఆత్మ తత్వ విచారణ – ఒక పరిశీలన’ అనే రచనని అందిస్తున్నాము.]

[dropcap]భ[/dropcap]గవద్గీత 2వ అధ్యాయం, సాంఖ్య యోగం, 21 వ శ్లోకం ఈ విధంగా వుంది.

వేదవినాశినం నిత్యం య ఏనమజమవ్యయమ్।

కథం స పురుషః పార్థ కం ఘాతయతి హన్తి కమ్॥

ఓ అర్జునా, ఆత్మ నాశనం లేనిది, శాశ్వతమైనది, జన్మరహితమైనది మరియు మార్పులేనిది అని ఆత్మ తత్వాన్ని బహు చక్కగా అర్థం చేసుకున్న వ్యక్తి ఎవరినైనా ఎలా చంపగలడు లేదా ఎవరినైనా చంపగలడు? అని శ్రీకృష్ణుడు పై శ్లోకం ద్వారా ఆత్మ యొక్క తత్వాన్ని అర్జునుడిని నిమిత్తమాత్రంగా చేసుకొని మానవాళికి బోధించాడు.

ఓంకారమే పరమాత్మ. ఇది చలనరహితమైనది. అయినా మనస్సుకంటే మహా వేగము కలది. మనస్సు కంటే ముందు వెళ్ళుట వలన ఇంద్రియాలకు చిక్కదు. నిత్యమైనది, స్థిరమైనది అని కఠోపనిషత్తు ఆత్మ గురించి వర్ణించింది. అందుకే అతి దుర్లభమైన ఈ సంసార సాగరాన్ని అతి సులభంగా దాటేందుకు ఆత్మ  తత్వాన్ని అర్థం చేసుకొని  ఆచరణలో పెట్టడమే ఒక మంచి సాధనం అని తత్వ శాస్త్రం బోధిస్తోంది.

యోగ వాశిష్ఠం నిర్వాణ ప్రకరణంలో శ్రీ వశిష్ఠులవారు ఈ విధంగా తెలియజేసారు:

శ్లో:

“స్వయమేవ విచారేణ, విచార్యాత్మానమాత్మనా,

యావన్నాధిగతం జ్ఞేయం, నతావధి గమ్యతే”

ఎంత వరకు మనుజుడు విచారణ ద్వారా ఆత్మను తాను స్వయముగా విచారించి ఎరుగకుండునో, అంతవరకు దానిని నాతడు పొందజాలకయే యుండును అని పై శ్లోకం అర్థం.  దీనిని బట్టి మానవుడు తనంత తానే ప్రయత్న పూర్వకంగా విచారణ చేసి, తెలిసికొనదగిన వస్తువును తెలుసుకొనవలెను గాని, యితర మార్గములు లేవు యని రుజువు అవుతోంది.

తత్త్వ విచారమనేది ఆధ్యాత్మిక విద్యకు మూలస్తంభం అని ఆధ్యాత్మికవేత్తలు అంటారు.  ఇది పరమాత్మ అన్వేషణలో మనం సాగించే ప్రయాణంలో  అన్ని స్థాయిలలోను అవసరం పడుతుంది.

ఇట్టి ఆత్మ తత్వపు విచారణ యొక్క ప్రాశస్త్యాన్ని తెలిపెందుకే భగవాన్ రమణ మహర్షి నిన్ను నీవు తెలుసుకో అనే సాధనను ప్రవేశపెట్టారు. కోట్ల కోట్ల దీపాలతో దేవుణ్ణి ఆరాధించడం కాదు, నీలో ఒక్క ఆత్మజ్యోతి వెలిగించుకో, ఆ వెలుగులో నీకు పరమాత్మ, జీవిత పరమార్థం రెండూ తెలుస్తాయి. గుడులు గోపురాలు నదీనదాలు చెట్లు చేమలు రాళ్ళు రప్పల చుట్టూ తిరగడం కన్నా నీ చుట్టూ నీవు తిరిగితే, నీ గురించి నువ్వు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తే నిత్య సత్యాలు తెలుస్తాయి. నిన్ను నీవు తెలుసుకుంటే భగవంతుడిని  తెలుసుకున్నట్లే. నిజానికి దేవుడు మనం కల్పించుకొన్న ఒక నమ్మకం. ఆ నమ్మకాన్ని నిజం చేసుకోవాలంటే, నీ మనస్సులో జన్మజన్మలుగా పేరుకొని వున్న నేను అనే అహాన్ని తొలగించు, నేనెవరు నీవెవరు అని పరిశీలించు. అప్పుడే దేవుడే జీవుడు, జీవుడే దేవుడు అని తెలుసుకోగలవు అని భగవాన్ తన శిష్యులకు తరచుగా ప్రబోధించేవారు.

శరీరాన్ని రథంతోనూ, ఇంద్రియాలను గుర్రంతోనూ, మనస్సును పగ్గాలతోనూ, బుద్ధిని సారథితోనూ ఎలా పోల్చవచ్చో మనం చూశాం. అయితే వీరితో పాటు రథానికి అధిపతి, ఆత్మ శరీరంలో నివసిస్తుంది. అందువల్ల, శరీరం, ఇంద్రియాలు, మనస్సు మరియు బుద్ధి ఎలా పనిచేస్తాయో తెలుసుకోవడంతో పాటు, మీరు ఆత్మను అర్థం చేసుకోవడం ప్రధాన లక్ష్యంగా పరిగణించాలి. ఆత్మకు వ్యతిరేకంగా నిరంతరం జోక్యం చేసుకునేది మనస్సు. సూర్యుని ద్వారా ఏర్పడిన నీటి ఆవిరితో ఏర్పడిన మేఘం వలె, సూర్యుడిని దాచిపెట్టి, ఆత్మ నుండి ఉద్భవించిన మనస్సు, ఆత్మను కప్పివేస్తుంది. మనస్సు ఉన్నంత కాలం మనిషి ఆత్మ స్వభావాన్ని గ్రహించలేడు లేదా ఆత్మను గ్రహించలేడు. అన్ని విభిన్న చైతన్య స్థితులలో ఆత్మ గురించి తెలుసుకున్న వ్యక్తి మాత్రమే ఆత్మ ప్రత్యక్ష దృష్టిని కలిగి ఉంటాడని చెప్పవచ్చు అని సత్యసాయి ఆత్మ తత్వం గురించి అద్భుతంగా ప్రవచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here