[box type=’note’ fontsize=’16’] ఆర్. దమయంతి గారు సమాజంలోని నిపుణులతో, రచయితలతో ఆత్మహత్యలపై చర్చ జరిపి వారు అభిప్రాయలను వ్యాస రూపంలో అందిస్తున్నారు. “మన బాధ్యతగా బలహీన మనస్కులకు తగినంత ధైర్యాన్ని అందివ్వగలిగితే ఆత్మహత్యలను ఆపగలం” అని వీరంతా అభిప్రాయం వ్యక్తం చేశారు. [/box]
[dropcap]’జీ[/dropcap]వితం – వున్నది జీవించడానికే!
కథా, కథనాలు దైవ సంకల్పితాలు.
నీకు తెల్వని ముగింపుని
నీ చేతుల్లోకి తీసుకోకు.
బతుకు విషాదం కానీకు.
దేవుడిచ్చిన దీప్పాన్ని ఆర్పేయకు.
చీకటిగా మిగిలిపోకు. ‘
***
ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త ఎమీల్ డొర్ ఖైం ఆత్మహత్య అనే అంశం మీద గొప్ప పరిశోధనలు చేశారు. ఫ్రెంచ్‌లో ఆయన రాసిన ‘Le Suicide ‘ బహుళ ప్రచారం పొందింది. ఈ పుస్తకాన్ని 1897లో ప్రచురించారు. సామాజిక శాస్త్రంతో బాటు మనస్తత్వ శాస్త్రాన్ని చదివే విద్యార్ధులకు కూడా ఈ పుస్తకంలోని అంశాలే పాఠ్యాంశాలుగా చోటు చేసుకునున్నాయి. అంటే, ఎంత లోతైన అధ్యయనం జరిగిందో అవగతమౌతుంది. ఆత్మహత్య అనేది కేవలం వ్యక్తిగతమైన వ్యవహారం మాత్రమే కాదు, సమాజంలో అంటుకల్లా వేళ్ళూనుకుపోయిన మూల కారణాలు సాంఘికపరమైనవై వుంటాయి అని అంటారు డొర్ ఖైం. – ఇది అక్షర సత్యం.
ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మనమో, లేక మన ఆలోచనా విధానమో, ప్రవర్తనా లోపమో – ఆత్మహత్య లకు కారణాలు కావొచ్చు అని నేనూ అభిప్రాయపడుతుంటాను. ఎలా అంటే, మనం నడిచే దారే గొప్పదన్న అహం సమాజంలో చాలా మందికి అంటుకునున్న జబ్బు కావొచ్చు.
ఈ సందర్భంగా ఒక గొప్ప సోషల్ సైంటిస్ట్ మాటలు మనం గుర్తుచేసుకోవాలి. ‘ఈ సంఘంలో – ప్రవేశపెట్టబడిన ఒక జీవన విధానాన్ని కానీ, ఒక నూతన అంశాన్ని గానీ, వ్యతిరేకించే వారు అధిక శాతంలో వున్నంత మాత్రాన వారి అభిప్రాయమే సరైనదని నమ్మడం సబబు కాదు. కొన్ని సార్లు ఆ మెజారిటీని లెక్కలోకి పరిగణించడం వల్ల సమాజానికి అమితమైన అన్యాయం జరిగె అవకాశమూ లేకపోలేదు’ అని అంటాడు.
కొంతమంది సున్నిత మనస్కులు ప్రాణం తీసుకోవడం, ఆ తర్వాత బ్రతికున్న జనం అదే సరైన శిక్ష అనడం విన్నాక, నాకు ఈ సైంటిస్టు నా కళ్ళ ముందు మెరుపులా మెరిసారు – నవ్వుతూ!
సమాజానికి కూడా, మనిషికి మల్లేనే శరీరం వుంటుంది. అవయవాలూ వుంటాయి. బాడీ టెంపరేచర్ వుంటుంది. సమ ఉష్ణోగ్రతలో వుంటేనే ఆరోగ్యంగా వున్నట్టు. మించిన అధిక ఉష్ణోగ్రతలున్నప్పుడు దానికీ మనలానే జ్వరం వచ్చినట్టు. వెంటనే పట్టించుకోకపోతే, మూలపడుతుంది. మూల్గుతూ వుంటుంది. ఆ! ఏడ్వనీ అని వొదిలేస్తే చివరికి కోమాలో కెళ్తుంది. ఆ పైన ప్రాణాలే కోల్పోతుంది.
డొర్ ఖైం చెప్పిన ఈ సిధ్ధాంతం ప్రకారం – సమాజం అనారోగ్యం పాలైతే.. మనిషీ ఆరోగ్యం గా బ్రతకలేడు. అది చచ్చిపోయాక, మనిషి బ్రతికీ జీవచ్చవమే అవుతాడు. ఇది సత్యం.
అదీ – మనకీ, సమాజంలో జరిగే మంచి చెడుల సంఘటనలకీ మధ్య గల సంబంధం బాంధవ్యం. రేయీపగలులా, చెట్టూ విత్తనంలా, జననం మరణంలా – మనమూ, సమాజమూ! సమాజం బావుంటే మనమూ బావుంటాం.
అయితే, ఆత్మహత్యల మాటకొస్తే, అనాదిగా ఈ ఘోరాలు మనం వింటున్నవే. కాదనం. కానీ, అది భరించుకోగలిగినంత శాతంలోనే జరిగింది. కానీ ఈనాటి పరిస్థితి ఎలా మారిపోయిందంటే ఆత్మహత్య వార్త లేని రోజంటూ లేకుండా పోయింది.
ఇది సమాజం యొక్క తీవ్ర అనారోగ్య లక్షణాన్ని సూచిస్తోంది
అటు ప్రభుత్వం, ఇటు ప్రజలు, సాంఘిక సేవా తత్పరులు, సామాజిక సేవకులు, వైద్యులు, సోషల్ సైంటిస్ట్లులు, వీరందరికంటేనూ ముందుగా, ముఖ్యంగా – సాటి మనుషులు – అందరూ ఈ సమస్యని సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది..
ఆత్మహత్య అంటే ‘తనని తాను అంతమొందించుకోవడం..’ అనే ఈ ఘోరమైన ఆలోచన ఎలా వస్తుంది? ఎలాటి కారణాలు ఆత్మహత్యకి ఉసిగొల్పుతాయి?
- అధిక శాతం జీవితంలో ఎదురయ్యే ప్రతికూల సంఘటనలు, అనుభవాలు, వైఫల్యాలు ప్రధాన కారణాలు అని చెప్పాలి. దీని వల్ల కలిగే నిరాశ నిస్పృహల వల్ల – బ్రతకాలనిపించదు. శరీరం నించి ప్రాణం వెళ్ళిపోతేనే తప్ప ఆత్మకి శాంతి దొరకనంత అశాంతి వల్ల, ఆత్మహత్య చేసుకోడానికి సిద్ధపడతారు. ఎలాటి పరిస్థితుల్లోనైనా ఊపిరి ఆగిపోవాలి అనే బండ నిర్ణయం వల్ల ఈ కఠినమైన శిక్ష విధించుకుంటారు.
- ప్రాణంగా ప్రేమించిన వారు దూరమైనా, లేదా సంబంధాలు తెంచుకున్నా, తెగిపోయినా, శాశ్వతంగా విడిపోయినా, మరణించినా తట్టుకోలేని పరిస్థితులు ఆత్మహత్యకి పురిగొల్పుతాయి.
- విదేశాలలో అయితే, పిల్లల సంరక్షణ నించి దూరం చేసినా, లేదా పిల్లల బాధ్యతంతా తమ నెత్తి మీదే వుందన్నా, కలిగే ఉద్రిక్తతల వల్ల ఆత్మహత్య మరణాలు జరుగుతున్నాయని ఒక సర్వే వెల్లడించింది.
- చేస్తున్న ఉద్యోగం నించి హఠాత్తుగా తొలగింపబడటం ఒక కారణం. (నేనొక మాగజైన్లో పనిచేస్తున్నప్పుడు సంభవించిన అనుకోని పెను మార్పుల వల్ల ఇద్దరు ఆర్టిస్టులు ఆత్మహత్యలకు పాల్బడటం జరిగింది.)
- సామాజిక శాస్త్రవేత్తలు ఏం చెబుతారంటే, సాంకేతిక యంత్రాలు, నూతన టెక్నాలజీ అమాంతం జొరబడటం వల్ల – చాలామంది ఉద్యోగులు కొత్త సాంకేతిక పరిజ్ఞాన్ని అందిపుచ్చుకోలేని కారణంగా ఇలా ‘జాబ్ లాస్’ అవడం, పని లేకుండా మిగిలిపోవడం, తత్ఫలితంగా నిరాశ నిస్పృహలకు లోనుకావడం అవి ఆత్మహత్యలకు దారితీయడం జరుగుతుందని చెబుతారు. చేతి యంత్రాలు పోయి, కరెంట్ మిషన్లు వచ్చినప్పుడు, గుమాస్తాగిరీ పోయి, కంప్యూటర్లు ఆఫీసులో ప్రత్యక్షమైనప్పుడు… సగానికి సగం స్టాఫ్ ఖాళీ అవడం ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు
- పెళ్ళి కాకుండా మిగిలిపోవడం, ఒంటరితనం, పెళ్లైన వారికి సంతానం కలగకపోవడం. పోషించే భాగస్వామి మరణించడం, అంగవైకల్యం గల సంతానాన్ని కలిగి వుంటం, కుటుంబ తగాదాలు, కక్షలు, ప్రతీకారాలు, ఇవన్నీ వ్యక్తిగత కారణాలుగా నిలుస్తాయి.
- అనైతిక సంబంధాలు, శారీరక రుగ్మతలు, ఎలాటి వైద్యానికీ నయం కాని దీర్ఘ కాల జబ్బులు, భరించుకోలేని బాధలు, – గ్రహించలేని మానసిక వ్యాధులు, భయ భ్రాంతులు, అపోహలు, అనుమానాలు, మూఢ నమ్మకాలు, అజ్ఞానం ఇవన్నీ కూడా కారణం. ఇవి ఎక్కువ గా పల్లెల్లో నివసించే వారిని బాధిస్తున్న సమస్యలు. ఆరణాలు.
మరో రకం – పిల్లలు కిడ్నాప్ అయినప్పుడు, కళ్ళ ముందే తమ వారిపై దారుణాలు జరిగినప్పుడు, ఆక్సిడెంట్స్‌లో రక్త సంబంధీకులను పొగుట్టుకున్నప్పుడు, వృధ్ధాప్యంలో పిల్లలకి భారమయినప్పుడు, ఆర్థికంగా దిగబడిపోతున్నప్పుడు – ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతోంది.
ఆర్థిక పరమైన కారణాలు: అప్పులు చుట్టు ముట్టి, తీర్చలేక పోవడం, ఆస్తిని పోగొట్టుకున్నప్పుడు, కోర్ట్‌లో కేసు గెలవలేకపోయినందుకు, పెద్ద పెద్ద వ్యాపారాలలో భారీ నష్టం వచ్చినప్పుడు, కంపెనీ మూసేయాల్సి వచ్చినప్పుడు, ఇల్లు, ఆస్తి, మూలధనం, భూమి, కోల్పోయినప్పుడు తనువు చాలించడమొకటే మార్గంగా నిర్ణయానికొస్తున్నారు. ప్రకృతి బీభత్సాలు, వైపరీత్యాలు, యుద్ధ వాతావరణాలు కూడా పెద్ద కారణాలే.
యువతలో ఐతే, చదివే చదువు ఏ మాత్రం బుర్రలోకి వెళ్లక, సిలబస్ అర్థం గాక డిప్రెస్ అవుతున్నారు. ఇలా ఆత్మవిశ్వాసం లోపించినప్పుడు, లేదా టీజింగ్, రాగింగ్, ఇంకా – రాంక్ రానందుకు, ప్రేమ వైఫల్యమైనప్పుడు, లేదా పెళ్ళికి పెద్దలు అంగీకరించనప్పుడు, ఉద్యమాల ఉద్రేకంలోనూ – ఆత్మహత్యలు జరుగుతుంటాయి.
ఇటీవల కాలంలో చిన్న చిన్న కారణాలకు కూడా ప్రాణాలు తీసుకుంటున్న మొండి వైఖరిని చూస్తున్నాం. సినిమాకి తీసుకెళ్లలేదనీ, గేమ్స్ ఆడనీకుండా, తల్లి తండ్రులు సెల్ లాగేసుకున్నారనీ, పుట్టింటికి పంపలేదనీ.. ఇలాటి చిన్న చిన్న కారణాలుగా కూడా ఆత్మహత్యలకి పాలబడుతున్నారు.
రేప్ – అతి భయంకరమైన సామాజిక కారణంగా చెప్పుకోవాలి – ఆత్మహత్యల వెనక నిలుస్తున్న ఇదొక పెద్ద కారణం. చాలా నేరాలు కప్పేయబడుతున్నాయి. స్త్రీలపై జరుగుతున్న లైంగిక దాడులు హింసలు అనేకానేక రకాలు. వాట్ని భరించలేక స్త్రీలు ఆత్మహత్యకు తలపడుతుంటారు.
క్రియేటివిటీ రంగాలలో అణచివేతకి గురికావడం, ప్రలోభాలకి లొంగని కారణంగా కెరీర్ లేకుండా పోవడం, అలా బలి కావడం, తమకు రావాల్సిన అవకాశాలు దురుద్దేశంతోనే దూరం చేసారని తెలిసినప్పుడు.. కలిగే నిరాశ వల్ల కూడా ఎందరో నటీనటులు ఆత్మహత్యలు చేసుకోవడం మనకు తెలుసు. మోడలింగ్, సినీ రంగంలో – ఇలాటివి ఎక్కువగా వింటుంటాం.
డైవోర్స్ తీసుకుంటున్న తల్లి తండ్రుల వల్ల పిల్లలు ఆత్మహత్యకి ఒడిగడతారు.
పరువు ప్రతిష్ఠలు దెబ్బ తిన్నప్పుడు, నలుగురిలో తలెత్తుకోలేక కొందరు -ఉన్నత విద్యావంతులు, వైద్యులు సైతం ఆత్మహత్యలు చేసుకుంటారు. నమ్మిన వాని వలలో ట్రాప్ అవడం, ఆ పైని బ్లాక్ మెయిలింగ్, మెంటల్ టార్చర్, గృహ హింసలు తట్టుకోలేక గృహిణిలు సూసైడ్ చేసుకుంటున్నారు.
ఎంతో ఆశతో విదేశాలకెళ్ళినప్పుడు అక్కడ నీరు గార్చే హీన పరిస్థితుల్లో బ్రతుకీడ్చడం ఇష్టం లేక, ఆత్మహత్యలకు పాల్బడుతున్న వారెందరో.
తన తప్పిదం వల్ల ఒక మనిషి చనిపోయాడన్న పశ్చాత్తాపంతో, పాప భీతి వెంటాడటంతో ప్రాయచ్చిత్తంగా – ఇటీవలే ఒకతను ఆత్మహత్య చేసుకున్నాడు.
“మీడియాలో వచ్చిన వార్తా దుమారానికి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా” అని అంటారు చలపతిరావ్, సినీ నటులు.
ఫటా ఫట్ విజయలక్ష్మి, శోభ, సిల్క్ స్మిత, కల్పన, కామ సూత్ర టాప్ మోడల్, ఇలా ఎందరో – ఆత్మహత్య చేసుకుని తనువు చాలించారు.
ఇక దుర్వసనాల ఊబిలో చిక్కిన వారిలో – మద్యానికి, డ్రగ్స్‌కీ బానిసలైన వారు, పర స్త్రీ వ్యామోహం, విశృంఖలత్వం, నయము కాని అంటు వ్యాధులు ప్రబలి, చివరికి ఆత్మహత్యతో జీవితాన్ని అంతమొందించు కోవాలనుకుంటారు.
విజయానికి ఆఖరి మెట్టు ఎక్కి, అధః పాతాళానికి అణగదొక్కేయబడిన నిరాశతో చావలేక బ్రతికే బ్రతుకు ఆత్మహత్య లాటిదే అంటాడు ఒక రైటర్. తన కారణంగా ఒక మనిషి బలన్మరణం చెందాడంటే, పలుకుబడితో నేరాన్నించి తప్పించుకున్నా, వాని ముఖం మీద కాలిన మచ్చ వాడికే కనిపిస్తూ వుంటుంది.
ఆత్మ జ్యోతి వంటిదంటారు. అందుకే ఆత్మహత్య చేసుకున్నారు అని వినంగానే – చాలా నిజాయితీగా బాధపడుతుంటాం. ఆ మనిషి మనకు పరిచయం లేకపోయినా అప్రయత్నం గా అయ్యో అని నిట్టూర్చుతాం. కారణం మనలో వున్న ఆత్మ జ్యోతీ అదే కాబట్టి.
ఆత్మహత్యలు జరగకుండా ఏం చేయొచ్చు అని తలబద్దలు కొట్టుకోనవసరం లేదు. మన చుట్టూ వున్న వారి ని అనవసరమైన మాటలతో, చేతలతో, అవమానాలతో అపనిందలతో బాధపెట్టకుండా వుంటే చాలు. గాయపడిన వారికి వీలైతే కొన్ని ఓదార్పు మాటలతో మంచి వైద్యాన్ని అందిద్దాం. అయినా, బ్రతకలేకపోయినందుకు… ఆ జీవికై నివాళిగా ఒక చుక్క కన్నీరిడుదాం.
ఈ అంశం మీద చర్చిస్తూ, తమ తమ అభిప్రాయాలను తెలియచేస్తున్నారు ప్రముఖ విద్యావేత్తలు, ప్రొఫెషనల్స్, రైటర్స్, సామాజిక సేవకులు. వీరంతా ఏమంటున్నారో తెలుసుకుందామా?
***
ఆధ్యాత్మిక పరిజ్ఞానం నేటి సమాజానికి ఎంతయినా అవసరం:
నేడు ఉమ్మడి కుటుంబాల వ్యవస్థ అనేది పూర్తిగా హ్రస్వమై పోయింది. తాతయ్య, నానమ్మ, అమ్మమ్మ, పిన్ని, బాబాయిలు, మామయ్యలు అందరితో కళకళలాడే నాటి నిండు కుటుంబాలు సినిమాల్లో తప్ప నిజజీవితంలో మచ్చుకయినా కానరావడం లేదు.
నేటి ఒంటికాయ శొంఠి కొమ్ము బతుకులు మనుషుల జీవితాల్లో నిరాశా నిస్పృహలనే మిగులుస్తున్నాయి. చదువులు పెరిగాయి, జీతాలు పెరిగాయి, జీవితావసరాలు వున్నవాటికన్నా రెట్టింపు పెరిగాయి. సౌకర్యాలు పెరిగాయి, సౌలభ్యాలు పెరిగాయి. దానితో పాటు మనిషికి మనిషికీ మధ్య సంబంధ బాంధవ్యాల దూరాలు కూడా చాలా చాలా పెరిగాయి. దానివలన మనుషుల్లో అభద్రతా భావం అధికంగా పెరిగిపోయింది.
ప్రపంచాన్నంతా గుప్పెట్లో కుదించగల ఆధునిక విజ్ఞానం గుప్పెడంత మనిషి మనసుని కంట్రోల్ చెయ్యలేకపోతోంది. యూనివర్సిటీలో అపార జ్ఞాన పారావరాన్ని ఔపాసన పట్టి, చాంతాడంత పొడుగు డిగ్రీలు తమ పేరు వెనుక తగిలించుకున్న వారుకూడా లేశమాత్రం ఆత్మ జ్ఞానాన్ని, ప్రభోదాన్ని అందుకోలేకపోవడమే నేటి ఆత్మహత్యలకి కారణం అని ఘంటాపధంగా చెప్పవచ్చు.
సమాజంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు గల గొప్ప గొప్ప సంస్థలకి అధిపతులు, రాజకీయనాయకులు, సినీ కళాకారులు, రచయితలూ యీ కోవకి చెందిన వారే ఆత్మహత్యలకి అధికంగా పాల్పడుతుండడానికి కారణం ఒక్కటే… అదే ఒత్తిడి, భరించలేని మానసిక ఒత్తిడి.. ఉన్నదాన్ని నిలుపుకోలేక, లేనిదాన్ని అందుకోలేక నడుమ నలిగే మానసిక సంఘర్షణకి చరమ గీతం ఆత్మహత్య అన్న భావానికి లోనవుతున్నారు.
ఇటీవల మనస్తత్వశాస్త్ర విశ్లేషకుడు ఒకాయన నేటి ఆత్మహత్యల వెనుక నున్న కారణాలను విశ్లేషిస్తూ, ”మెదడులో కొన్ని రసాయనిక పదార్ధాలు లోపించడం వలన రక్త ప్రసరణ మెదడుకి అందక ఆ అస్తవ్యస్త పరిస్తితిలో ఆత్మహత్యకి పాల్పడతారు” అని చెప్పారు.. అంటే ఇంచుమించు బ్రెయిన్ డెడ్ లాటిదన్నమాట. బ్రెయిన్ డెడ్ అంటే మనిషి జీవచ్చవమే కదా! ఈ దయనీయ స్థితికి కారణం అధిక మానసిక ఒత్తిడి, భరించలేని, తట్టుకోలేని మానసిక ఒత్తిడి అంటాడాయన.. అటువంటి స్థితిలో ఎవరయినా దగ్గర వుంటే, వారి స్థితిని గ్రహించి, సాంత్వన పలుకుతూ, వెన్నుతట్టి, నీకు భయం లేదు, నేనున్నాను అని ప్రోత్సహిస్తే కొంత ఒత్తిడి తగ్గి మెదడులో చలనం కలగవచ్చు, లేదంటే తమకి అత్యంత ప్రియమైన వారి ఫోటోలను తదేకంగా చూస్తూ వారికోసం నేను బ్రతకాలి అనే భావంతో కొంత ఒత్తిడి తగ్గించుకోవచ్చట… అటువంటి సమయాల్లో ఒంటరితనం అభద్రతా భావాన్ని పెంచుతుంది.
ఏది ఏమయినా క్షణికొద్రేకానికి లోనయి తప్పుడు పనులు చెయ్యడం, క్షణిక మైన ఆవేశానికి లోనయి హత్యలు చెయ్యడం, క్షణికమైన ఒత్తిడికి లోనయి ఆత్మహత్యలు చేసుకోవడం వివేకవంతుల లక్షణం కాదు.. వారు సమాజంలో పేరు ప్రఖ్యాతులు ఉన్నవారే కావొచ్చుగాక.. ఒక్క క్షణాన్ని తమ చెప్పుచేతల్లోకి తీసుకోలేనివారు అంతకు ముందు సమాజానికి ఏమి చెప్పినా ఏమి చేసినా నిరర్ధకమే.
”మాటలు కాదు చేతలు, ఉదాహరణలు చెప్పకు నీవే ఒక ఉదాహరణగా మారు” అంటారు శ్రీమాత. లోకజ్ఞానం సముద్రమంత వున్నా బిందువంత ఆత్మ జ్ఞానం లోపిస్తే మనిషి జీవితానికి అర్ధం వుండదు.. అందుకే కేవలం మనో వికారాలకి లోనయ్యే ప్రపంచ జ్ఞానం కన్నా, మనలో ప్రకాశాన్ని వికాసాన్ని కలిగించే ఆధ్యాత్మిక పరిజ్ఞానం నేటి సమాజానికి ఎంతయినా అవసరం.. అందుకే సినారె గారు – ”నీలో దీపం వెలిగించు, నీవే వెలుగై వ్యాపించు” అన్నారు.
ఉమాదేవి అద్దేపల్లి
(ఫౌండర్ అండ్ అడ్వైజర్, ఎ యు ఎం స్పిరిట్యూల్ ఆర్గనైజేషన్, సాన్ జోస్, కాలిఫోర్నియ.)
Email: auropondy@yahoo.com
తమతో తమకు సామరస్యం లేకపోవడమే ముఖ్య కారణం:
– Amarendra Dasari.
(Writer)
ఏడు జన్మలు వెంటాడే పాపం – బలవన్మరణం!
ఏడు అనేది మనకు చాలా ముఖ్యమైన సంఖ్య ఏడుజన్మల బంధం అంటాం అలాగే ఒకసారి ప్రమాద వశాత్తు మరణించినా, ఆత్మహత్య చేసుకుని మరణించినా, ఆ మనిషి యొక్క మృత్యువు ఏడు జన్మల వరకు అలాగే వస్తుందని పెద్దలంటారు.. ఆత్మహత్య మహాపాపం. భగవంతుడు ఇచ్చిన జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించాలి.. ఇక ఈ విషయం పక్కన పెడితే…
మనిషి బలహీనుడవుతున్నాడు. మానసికంగా శారీరకంగా కూడా..
ఒకప్పుడు అతనికి ఏది కావాలన్నా కష్టంగా లభించేది. ఎంతో కష్టపడి సంపాదించుకునేవాడు. దాని విలువ తెలిసేది జాగ్రత్తగా కాపాడుకునేవాడు.
అప్పటి చదువు చెప్పే గురువులు విజ్ఞానాన్నే కాదు మానవ విలువలు కూడా నేర్పించే వారు..
ఒకప్పుడు మంచి కుటుంబం అంటే మంచి విలువలు, సత్ప్రవర్తన కలిగిన మనుషులున్న కుటుంబం అని అనుకునేవారు.. కుటుంబం అంతా కూచుని చర్చించుకునే వారు ఎవరైనా తప్పు చేసినా ప్రశ్నించే అధికారం ఉండేది. ఎందుకు ఏమిటి అనకుండా అందరూ జవాబు చెప్పేవారు.
కానీ ఇప్పుడు ఎవరినీ ప్రశ్నించకూడదు. ఇంట్లో తల్లిదండ్రులే పిల్లలకు అడగకుండానే అన్ని సౌకర్యాలు కల్పించి అడిగిన కోరికలన్నీ తీర్చి గారాబంగా చూడడం ఎందుకు, ఏమిటి అని అడగకుండా పెంచడంవల్ల వారు తమకు ఎదురయ్యే వ్యతిరేక పరిస్థితుల్ని భరించలేక పోతున్నారు.
మొదటిది గమనించినప్పుడు తల్లిదండ్రులు కూడా కొంత కారణం అనవచ్చు. పిల్లల ఇష్టా ఇష్టాలు గమనించకుండా తాము కోరుకున్న చదువులను వారిపై రుద్ది వారందుకు అర్హులా కారా వారికా శక్తి ఉందా లేదా గమనించక పోవడం వల్ల విద్యార్ధులు ఆత్మహత్యలకు పాల్బడుతున్నారు. విద్య వ్యాపార ధోరణితో ఉండడం, ఇక నాకిందులో సీటు రాకపోతే నేను బతకలేనేమో అనే ధోరణి నరనరాన జీర్ణమైపోవడం, వారి మనసులో మాటను సందేహాలను ఇతరులతో పంచుకోలేక పోవడం మరో కారణాలుగా చెప్పాలి.
ఇక రెండవది.. ప్రేమకు ఆకర్షణకు తేడా తెలియక పోవడం ముఖ్యమైనది.
చదివి జీవితంలో స్థిరపడిన తరువాత ఆలోచించ వలసిన వాటిని పిందె దశలోనే కోరుకోవడం వల్ల ఇలాతి దుర్ఘటనలు జరుగుతుననయి.
ఎనిమిదో తరగతి నుండే గాళ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్ సంస్కృతి అలవడుతోంది. కలిసి తిరగడాలు సినిమాలు షికార్లు ఇవి ఇంటర్ వరకూ కొనసాగి తెలిసీ తెలియని వయసులో తీసుకునే నిర్ణయాలు… ఇద్దరిలో ఎవరు కాదన్నా లేక తల్లిదండ్రులు కాదన్నా ఇక జీవితమే లేదని చావే శరణ్యం అనుకోవడం కారణం.
వీటిని కొంత నివారించాలనే చిత్తశుద్ధి ఏ మాత్రం ఉన్నా కో ఎడ్యుకేషన్ పధ్ధతి తీసివేయాలి ఎందుకంటే ఆ వయసులో వారి ఆలోచనలలో స్థిరత్వం తక్కువ ఆకర్షణ ఎక్కువ.. పరిణితి చెందని వయసులో ప్రమాదం జరిగే ఆస్కారం ఎక్కువ.. ఇక మూడవది… దీనికి ఆర్థిక పరిస్థితి ముఖ్యకారణం. ఒకప్పుడు రూపాయి మిగుల్చుకుని దాచి పెట్టి భూమి బంగారం కొని దాచుకునే వారు. డబ్బును అదే రూపంలో బాంకుల్లో దాచుకునేవారు..
ఎంత డబ్బు సంపాదించినా వారి జీవన విధానంలో మార్పు ఉండేది కాదు డబ్బు పొదుపు చేయడమే వారి ధ్యేయం…
కానీ ఇప్పుడు సంపాదన ఎంతో, అప్పులు కూడా అంతే నిష్పత్తిలో ఉంటున్నాయి. చేతిలో ఫోన్ తో సహా ఇల్లు కారు ఇంటిలో సామాను అన్ని లోన్ తో కొనుక్కున్నవే. జీతం రాగానే అన్నీ అప్పుల వారికి సరిపోతాయి… పని వత్తిడి, భద్రత లేని ఉద్యోగం, నిత్యం సంఘర్షణ లతో నిండిపోయే జీవన కాలం వీరిని నిర్వీర్యులను చేస్తున్నది.
అందుకే కొంతమంది వ్యాపారం వైపు మొగ్గు చూపుతున్నారు అంతకు ముందే వ్యాపారంలో స్థిరపడిన వారు కూడా తమ వ్యాపారాన్ని విస్తరించే ప్రయత్నంలో అప్పుల కోసం చేయి చాస్తూ బాంకుల వైపు అడుగులు వేస్తున్నారు..
అతిగా అంచనాలు వేసుకోవడం వాటిని చేరుకోలేక పోవడం ఇవన్నీ వారిని కుంగదీస్తాయి. అదే కొంత మందిని ఆత్మహత్య వైపు పురిగొల్పుతాయి.
ఇక నాలుగవది.. దీనికి సమాజం ఎక్కువ బాధ్యత వహించాలి.
పరువు హాత్యలలో పై మూడు కారణాలు కనబడతాయి..
తాను జీవితంలో ఏ రకంగా ఫెయిల్ అయినా ఫెయిల్ అయిన దానికన్నా నలుగురు ఏమనుకుంటారో అనే కారణమే ఎక్కువ..
సమాజంలో భగవంతుని కన్నా వ్యక్తిపూజ ఎక్కువయ్యింది.
డబ్బు, హోదా, పదవి, పరపతి ఉన్న వారే దేవుడితో సమానం వారికే సమాజంలో గుర్తింపు. వారి చుట్టూనే అందరూ పరిభ్రమణం చేస్తుంటారు. ఇందులో ఏది పోయినా వారిని అధఃపాతాళానికి తోసేస్తారు. మాటలతో చేతలతో గుచ్చి గుచ్చి చంపుతారు. అందుకని వారే జీవితాన్ని చాలించుకుంటారు.
మన మీద మనకంటే కూడా ఇతరులకు అంచానాలు ఎక్కువుంటాయి. కానీ, మన మనసు మీద మనకు నియంత్రణ ఉండాలి.
ఏదీ లేక పోయినా నేను నలుగురిలో నా వ్యక్తిత్వంతో నిలబడగలననే ఆత్మ విశ్వాసం ప్రతి మనిషికి కలగాలి కలిగించాలి. అప్పుడే ఆత్మహత్యలను కొంత వరకు నివారించ గలమేమో… !!
నళిని ఎర్ర
(రచయిత్రి, మేనేజర్ ఇన్ ప్రైవేట్ ఫాం. సెల్ : 87909 96840)
ఆత్మహత్యలు ఆపగలం:
నేటి ఆధునికతలో విభిన్నమైన ఆటలు, సాహసాలు చేయాలనే ఉబలాటాల నడుమ ముక్కుపచ్చలారని చిన్నారులు సైతం ఆత్మహత్యలనాశ్రయిస్తున్నారు. సమాజంలో ఊడలేస్తున్న అభద్రతను మనముందు నిలబెడుతున్న ఈ ధోరణి అత్యంత ప్రమాదకరం అని చెప్పక తప్పదు. ప్రేమ విఫలమైనా, అనుకున్న వారితో వివాహం జరుగకపోయినా వెంటనే వారికి దొరికే పరిష్కారం ఎవరికి కనబడకుండా మాయమయిపోవడమే అనుకునే వారి సంఖ్య పెరగడం సమాజానికి పెనుసవాలుగా పరిణమిస్తోంది.
కుటుంబంలో ఏదైనా సంఘటన ఆమోదయోగ్యం కానపుడు సమస్యను అందరు కూర్చుని సామరస్యంగా చర్చలద్వారా పరిష్కరించుకోవాలి కాని సమస్యను రణరంగం చేసి మాటల యుద్ధాలతో ఒకరి మనసును మరొకరు నొప్పించడం కుటుంబసభ్యుల విధానం కారాదు. గెలుపు బాటలో ఓటమి ఎదురైనా, లక్ష్యాన్ని చేరుకోలేకపోయినా, కోరినది జరుగకపోయినా ఆత్మహత్యే శరణ్యమనుకోవడం వారి మనసు సరైన మార్గంలో ఆలోచనలకు తావివ్వడంలేదనేది అవగతమవుతుంది.
మానసిక సమస్యగా గుర్తిస్తే మానసిక వైద్యుడిని సంప్రదించడానికి సందేహించగూడదు. మనస్తత్వ నిపుణుల సలహాలు కూడా తీసుకోవచ్చును. అంతేకాదు ‘నీకు మేమున్నాము’ అని వెన్నుదట్టి ప్రోత్సహించాలి. పరీక్షలో తప్పినా, ఆటలో ఓడినా ఓటమే గెలుపుకు చిరునామా అని ధైర్యాన్ని నింపాలి కాని విమర్శలు, ఎత్తిపొడుపుమాటలు అసలే గాయపడిన మనసును మరింత గాయపరుస్తాయి. గిన్నెలో సలసలా కాగుతున్న నీటిని బయటకు పంపాలని మూత ఎలా ప్రయత్నిస్తుందో అదే తీరున మనసును కుదిపే సమస్యలను బయటకు పంపగలగాలి. ఓటమికి నిర్వచనం ఓడిపోవడం కాదని గెలుపుకు ప్రథమసోపానమే ఓటమి అని వారిలో స్థైర్యం నింపాలి. అపజయాలు పొందినవారు విజయబాటలో పయనించినతీరు వారికి విశదపరచాలి. గురిచూసి కొట్టినపుడు లక్ష్యం సిద్ధిస్తుందని అంతేకాని ప్రాణమంటే అలక్ష్యం కూడదని మానసికంగా కృంగిపోయేవారిలో మనోధైర్యాన్ని నింపగలగాలి. ఆత్మీయస్పర్శ, మంచిమాట జీవితానికి చుక్కాని కావాలి. జీవితం మన చేతుల్లోనే ఉంటుంది. మనం జీవితాన్ని నడపగలగాలి కాని జీవితం మనల్ని నడపగూడదన్న సత్యాన్ని వారికి తెలియపరచాలి. మన బాధ్యతగా బలహీన మనస్కులకు తగినంత ధైర్యాన్ని అందివ్వగలిగితే ఆత్మహత్యలను ఆపగలం.
సి. ఉమాదేవి (సీనియర్ రచయిత్రి, రిటైర్డ్ ప్రిన్సిపాల్)
సెల్ : 9885809250
శిక్షలకు సిద్ధపడాలే గానీ ఆత్మహత్యలతో కాదు:
“రెక్కలు తెగిన పక్షి బలవన్మరణం పాలైనట్టు, ఆత్మీయతలు, అనుబంధాలు, స్నేహాలు, పలకరింపులు లేక ఒంటరయ్యానని కృంగిపోయే మనిషి అలాగే బలవన్మరణం కోరి తెచ్చుకుంటాడు. అయితే, కాఫీ డే యజమాని సిద్ధార్ధ అప్పుల్లో కూరుకుపోయి, తానిందునుంచి బయటపడలేననే నిరాశ నిస్పృహలతో తనువు చాలించుకున్నాడు.
కానీ, 29 మంది ఆర్థిక నేరస్ధులు విదేశాలకు పారిపోయారు. వీళ్ళంతా తప్పించుకోవడానికి, బతుకుమీద ఆశ ఉండి కుట్రపూరితమైన ఆలోచనలున్నందు వల్ల దేశం వదిలి పారిపోయారు. వీళ్ళు బ్యాంకుల్ని మోసం చెయ్యడంతో పోలీసులు తరుముతుంటే పారిపోయే దొంగల్లా పరారయ్యారు. సిద్ధార్ధ తన వ్యాపారం నష్టాల్లో పడటం, గట్టిక్కించే అవకాశాలు కనిపించకపోవడం, ఆర్థిక ఒత్తిళ్ళు తట్టుకోలేకపోయి ఏ దారులులేక బలవన్మరణాన్నే ఆశ్రయించాడు.
మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్ గారు గానీ, సిద్ధార్ధగానీ తమ విచారణ తామే చేసుకొని, ఓటమి తామే అంగీకరిస్తూ, అందుకు శిక్ష మరణమే అని తమ తీర్పు తామే రాసుకొని, తమ చావుని తామే కార్యాచరణలో పెట్టుకున్నారు. ఊపిరి పీల్చుకోవడంలో ఉన్న సుఖం కన్నా, వదులుకోవడంలోనే మొగ్గు వారికి కనిపించింది. (ఫర్నీచర్ దొంగ వార్త రాగానే నాకు అనిపించింది. డాక్టర్ కోడెల ఇటువంటి ఘాతుకానికి పాల్పడతారని.) ఇది సున్నితంగా పరిష్కరింపబడవలసిన విషయం తీవ్రరూపమై భూ ప్రకంపనలు పుట్టించింది. ఆయన్ని రెక్కలు తెగినట్టు చేసింది. ఇక విద్యార్ధుల మాటకొస్తే – పరీక్షల్లో ప్యాసైనా మార్కులు తక్కువ వచ్చాయని చిన్నపిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ లెవిన్ స్కీ సెక్స్ స్కాండల్ విషయంలో ప్రజల క్షమాపణలు కోరాడు. ఆ రకంగా డాక్టర్ కోడెల ప్రజల్ని క్షమాపణలు కోరి ఉండాల్సింది. మన సమాజం కూడా పరిపక్వత దశలో లేదు. సోషల్ మీడియా వచ్చాక, సంయమనం లేదు. ఎవరినైనా, ఎంతటి వారినైనా తూలనాడడం సాధారణమైపోయింది. మన భాషకూడా అటువంటి వారి చేతిలో బాగా దిగజారి ఉంది. మీడియా – గాలి రూపంలో ఉన్నాక సమాజంలో నిజాయితీ, విలువలు బాగా పెరగాల్సి ఉంది. పొరపాటున జరిగే తప్పులను ధైర్యంగా అంగీకరించి, శిక్షలకు సిద్ధపడాలే గానీ ఆత్మహత్యలతో కాదు.
– ఎస్. గణపతి రావ్, ప్రముఖ రచయిత
సెల్ : 9176282903
పోటీ యుగంలో పెరుగుతున్న ఓటమి ఫలితం:
మనం ఉన్నది కలి కాలం. అది కూడా విపరీతమైన స్వార్థం, దురాశ, దుర్నీతి నిండిన కాలంలో ఇక ఇలా కాక ఎలా ఉంటాయి – ఈ వికృతి చెట్టు ఇచ్చే ఫలాలు.
ఒకరిని చూసి ఒకరు పోటీగా ఆస్తులు పోగెయ్యటం జీవన ప్రధాన లక్షణమైపోయింది. ఉద్యోగం ఇచ్చే జీతం ఏ మూలకి అంటూ రెండు చేతులతో లంచాలు పుచ్చుకోవడం పరిపాటిగా మారింది. లోకం కూడా ఎలా సంపాదించారు అని కాకుండా, ఎంత సంపాదించారు అని లెక్కలు చూసి, వారినే అందలాలకి ఎక్కించి జే కొట్టడం, అవతలి వారిని నిచ్చెనగా ఉపయోగించి పై కెక్కి, ఆ పై కరివేపాకులా తీసి అవతల పడేయడం.. ఇవన్నీ ఈ కాలపు మనుషుల గుణ లక్షణాలేమో అనిపిస్తుంది.
పూర్వం ఓ ఉద్యోగం, ఓ సొంతిల్లు, ఓ స్కూటర్ ఉంటే జీవితంలో స్థిరపడినట్టే. ఇప్పుడు అలా ఉంటే వాళ్ళు ఉత్త చవటలు, అప్రయోజకులుగా ముద్ర వేస్తారు.
కనీసం నాలుగు ఫ్లాట్‌లు, లేదా మేడలు, రెండో మూడో కార్లు, ఒంటి నిండా నగలు ఇవి కాక లాకర్లలో కుక్కిన నగలు ఇన్ని ఉన్నా, ఇంకా ఏదో లేదనే అత్యాశతో వచ్చిన అసంతృప్తి, దిగులు, ఇవి తెచ్చే రోగాలు అన్నీ ఇన్నీ కావు.
పోటీ యుగంలో అంతస్తులు ఎక్కుతూ పునాది వేసుకోవడం మరిచిపోయారు. అందుకే కూలి పోతున్నాయి, మేడలు, కాపురాలు, జీవితాలు.
పరీక్ష పాస్ అవలేదని ఆత్మహత్యలు. రిజల్ట్స్ ఇంకా పూర్తిగా రానిదే మర్నాడే పాస్ అని వస్తుంది. ఈ లోపల తల్లిదండ్రుల ఆశలు నిలపలేదని దిగులుతో ఆత్మహత్య చేసేసుకుంటున్నారు పిల్లలు.
అంత ఆశ ఎందుకు అసలు, జీవితం అంటే చదువు ఒక్కటేనా.. అని పిల్లలకి చెప్పే రోల్ మోడల్స్ ఎక్కడా.
ఏ న్యూస్ పేపర్ చూసినా ఫస్ట్ ర్యాంకుల ప్రభంజనం అంటూ ఊదర కొట్టడమే. ఆ ర్యాంకుల మాయలో పడిపోతున్నారు, పిల్లల అర్హత మాట మరచి.
వ్యాపారాలు మొదలుపెట్టి, అప్పులు చేస్తూ, కిందకి దిగలేక, పరువు పోయిందని దిగులుతో ఆత్మ హత్యలు – ఈ మధ్య మనం ఎన్నో చూసాం.
కాఫీ డే ఓనర్ ఎంత స్థితిమంతుడు. అసలు అలాంటి వారు ఆత్మహత్య చేసుకోవడం అనేది సమాజానికి చాలా తప్పు సంకేతం ఇస్తుంది.
మొన్నటికి మొన్న రైస్ పుల్లింగ్ అనే భ్రమలో, మాయ మాటల్లో పడి, కోట్లు అప్పు చేసి ఇచ్చారుట ఓ డాక్టర్. తీర్చలేక కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకున్నారు. చదువుకుని కూడా ఏమిటో ఈ మూర్ఖత్వం, చదువు మానసిక వికాసం ఇవ్వడం మానేసిన రోజునే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అనేది సత్యం.
ఇంటిల్లిపాది ఆత్మహత్యలు చేసుకోవడం వెనక ఉండే విషాదాలు, వ్యథలు సమాజం ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి.
ఉన్మాదమో, ఓటమి ఇచ్చే దిగులో ఏమిటో కారణాలు ఇలా మూకుమ్ముడిగా జరుగుతున్నాయి ఈ మధ్య. ఏవో గాలి సోకిందని పూజలు, పరువు ప్రతిష్ఠ అంటూ హెచ్చులుకి పోవడం, మొత్తంగా ఈ సమాజానికే ఏదో రుగ్మత పుట్టింది.
చదువు అంటే మానసిక వికాసం అయి ఉండాలి. జీవితంలో సంతృప్తి ఉండాలి. ఆత్మీయ కుటుంబ సంబంధాలు కలిగి ఉండాలి. సమాజం నించి వ్యక్తిని విడదీసి, వారిని మాటలతో హింసించే ధోరణి పోవాలి. మొత్తంగా సమాజం శ్రేయస్సుకై నలుగురూ ఆలోచించాలి.
– లక్ష్మి వసంత, రచయిత్రి,
వైజాగ్.
కోరుకున్న మరణం:
మనిషి తన జీవితాన్ని అంతం చేసుకుంటే దానిని ఆత్మహత్య లేదా సూసైడ్‌అంటాము.
ఆత్మహత్య అనేకంటే ‘ఇచ్ఛా మృత్యు’.. ‘इच्छा मृत्यु’ లేదా ‘కోరుకున్న మరణం’ అని అనటమే సరైనది. ఎందుకంటే అది బలవన్మరణం కాదు. మనిషి తనంతట తానే మరణాన్ని కోరుకుంటాడు..
హిందూ ధర్మ శాస్త్రాలు ఆత్మ హత్యను మహాపాతకంగా వర్ణిస్తాయి.
ఐ.పి.సి.309 సెక్షన్ ప్రకారం ఆత్మహత్యా ప్రయత్నంచేసి బ్రతికినవారిపై కేసులు పెడతారు. కానీ, ఆత్మహత్యాయత్నం నేరం కాదు అని సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసింది. ‘తీవ్రమైన నిరాశ నిస్పృహలతోనే ఆత్మహత్య చేసుకోవాలని ఎవరైనా భావిస్తారు. వారికి కావలసింది సహాయం కానీ శిక్ష కాదు’ అని స్పష్టం చేసింది.
ఇప్పుడు ఆ సెక్షన్ రద్దుకోసం భారత లా కమిషన్ సిఫారసు చేసింది. ఆత్మహత్యకు ప్రయత్నించటాన్ని నేరంగా పరిగణిస్తున్న ఐపీసీ 309 సెక్షన్‌ను తొలగించాలని పార్లమెంటుకు సిఫార్సు చేసింది.
ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన ఎందుకు కలుగుతుంది ?
దానికోసం చేసే ప్రయత్నాలకి కారణాలు: మనిషి నిస్సహాయుడు కావడం, భవిష్యత్తుపై ఆశ సన్నగిల్లడం, మానసిక వత్తిడి, తనకు లభించే మార్గాలను సరిగ్గా ఎంచుకోలేకపోవడం మొదలైన కారణాలు మనిషిని ఆత్మహత్యకు పురికొల్పుతాయి. ఒక వ్యాధికి లేదా తీవ్ర మానసిక వత్తిడికి లోనయ్యేవారు ఆత్మహత్యా యత్నాలకు పాల్పడుతారు. సాంఘిక సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ పరమైన సమస్యలు, మానసిక వత్తిళ్లు, దీర్ఘకాలిక వ్యాధులు మనిషి ఆత్మహత్య చేసుకోవడానికి కారణమవుతాయి. సాంఘిక సమస్యలలో ప్రధానమైనవి జాతి వివక్ష, అణచివేతకు గురి కావడం ఆర్థిక కారణాల్లో ప్రధానమైనవి స్థాయికి మించిన అప్పులు చేయడం, కనీసావసరాలకు కూడా డబ్బు సరిపోకపోవడం.
మానసిక కారణాల్లో ప్రధానమైనవి పరీక్షలు, ఎన్నికలు మొదలైన వాటిలో ఓటమి చవిచూడటం, వ్యాపారంలో నష్టపోవడం, ఆత్మీయులు మృతి చెందటం, భరించ లేని స్థాయిలో అవమానాలకు గురికావడం. మానసిక వ్యాధులకు సంబంధించి డిప్రెషన్, స్కిజోఫ్రీనియా, వ్యక్తిత్వ లోపాలు, మద్యపానం మొదలైనవి ముఖ్య కారణాలు. డిప్రెషన్‌తో బాధపడుతున్న వారిలో 15 నుంచి 20 శాతం వరకూ ఆత్మహత్యలకు పాల్పడుతారు. స్కిజోఫ్రీనియా వ్యాధితో బాధపడే వారిలో 10 శాతం మంది ఆత్మహత్యలకు పాల్పడుతారు. డిప్రెషన్‌తో బాధపడుతున్నవారిలో ఆత్మహత్యా ప్రయత్నాలు చేస్తున్న సూచనలు ముందుగానే కనిపిస్తాయి. ఆత్మహత్యలు చేసుకోవాలని భావించే వారు ముందుగానే ఇతరులకు ఆ విషయం తెలియ జేయడం, లేదా ఉత్తరాలు రాసి ఉంచడం, దానికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవడం మొదలైన చర్యలకు పాల్పడుతారు.
స్కిజోఫ్రీనియా వ్యాధిగ్రస్తుల్లో ముందుగా ఎలాంటి సూచనలు కనిపించవు. ఒకేసారి ఆత్మహత్యకు పాల్పడుతారు. దీర్ఘకాలిక వ్యాధుల్లో కేన్సర్, ఎయిడ్స్ తదితర ప్రమాదకర వ్యాధులకు గురైనవారు మానసికంగా కృంగి పోయి ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. సాధారణంగా 40 -50 సంవత్సరాల మధ్య వయస్కుల్లో ఆత్మహత్యలు ఎక్కువగా కనిపిస్తాయి. ఆత్మహత్యాయత్నాలు స్త్రీలలో ఎక్కువగానూ, ఆత్మహత్యలు పురుషుల్లో ఎక్కువ గానూ ఉంటాయి. ఒక మనిషి ఆత్మహత్య గురించి ప్రస్తావించినప్పుడు కాని, ఉత్తరాల ద్వారా ఆ విషయాన్ని బహిర్గతం చేసినప్పుడు ఆ వ్యక్తి ప్రవర్తనను గమనిస్తూ ఉండాలి. ఆత్మహత్య గురించిన ఆలోచన వ్యక్తపరిచిన వ్యక్తిలో ఆ ఆలోచన ఎంత బలీయంగా ఉందో గమనించి దానినుంచి విరమించుకునేలా చేయాలి. దానికి అవసరమైన సహాయ సహకారాలు అందజేయాలి.
– ముసునూరి వెంకట రామ ఈశ్వర్.
SBI Asst General Manager (Rtd)
cell : 99767106177
అవకాశాలను అందిపుచ్చుకునేందుకు బ్రతకాలి కదా!:
ఇటీవల జరిగిన ప్రముఖుల ఆత్మహత్యలు మనసుని కుదిపేసాయి.
కోడెల ఒక మంత్రి. డాక్టర్. సిద్దార్ధ పెద్ద వ్యాపార సామ్రాజ్య నేత. రంగనాథ్ ఒక మంచి సినీ నటుడు. వాళ్ళను ఆత్మహత్యకు ప్రేరేపించిన అంశాలు ఏమిటి? అని ఆలోచించినప్పుడు మనసుకెంతో బాధ కలుగుతుంది.
జీవితంలో జీరో స్థాయి నించి అంచెలంచెలుగా ఎదిగి ఉన్నత శిఖరాలు అధిరోహించారు. దానితో పాటు ఆ శిఖరం మీదే కలకాలం అలా నిలిచిపోవాలి అనుకొన్నారు. జీవితం రంగులరాట్నం. ‘కలిమి మిగలదు. లేమి నిలవదు అన్నట్టు, కలకాలం ఒక రీతి గడవదు’ అని కవి అన్నట్టు, ఒక వేళ అధోగతికి వెళ్ళిపోయినా వారి అనుభవంతో తిరిగి జీవితాన్ని కొనసాగించగలరు కదా! ఆ సానుకూల దృక్ఫథం ఎందుకు కొరవడుతోంది. ఎంతో అనుభవజ్ఞులైన వీరే జీవితంలో వచ్చే ఒడిదుడుకులకు భయపడి ఆత్మహత్యలకు పూనుకుంటే చిగురుటాకుల్లాంటి చిన్న పిల్లలకు మానసిక స్థైర్యం కొరవడదా?
జీవితంలో ఒక దారి మూసుకుంటే మరోదారి తెరుచుకుంటుంది. కాలు కోల్పోయినా నర్తకి నటిగా నిలిచిన సుధాచంద్రన్, కాన్సర్‌తో పోరాడి నిలిచిన యువరాజ్ సింగ్, సోనాలి బింద్రే, గౌతమి లాటి సినిమా యాక్టర్స్ ఇలా ఎంతోమంది ఎన్నో సమస్యలను అధిగమించి జీవితాన్ని ఆనందమయం చేసుకుంటున్నారు. ప్రతి సమస్యకూ పరిష్కారం ఉంటుంది. జీవితం తప్పకుండా అవకాశాలను ఇస్తూనే ఉంటుంది. అందమైన ఆ అవకాశాలు అందిపుచ్చు కోవాలంటే మరి మనిషి ఊపిరితో బ్రతికి ఉండాలి కదా!
సమాజానికి చేయాల్సిన సేవ ఎంతో ఉంది. బ్రతకడం అంటే సుఖంగా బ్రతకడం ఒక్కటేకాదు. పోరాడి గెలవటం.
– నాగేశ్వరి.
(గాయని, రిటైర్డ్ బాంక్ ఆఫీసర్)
సహించలేని బాధ్యతా రాహిత్యం:
బుద్ధిజీవి దీన్ని వదిలేసి బలవన్మరణం పొందాలనుకోవడం తనలో వున్న సాధించే గుణం, తన మాటే నెగ్గాలనే తత్త్వం, మొండితనాలే మూలకారణాలని చెప్పక తప్పదు.
దీనికి మీడియాలో ప్రచారం కూడా ప్రధానమైనది. అసలు బలవన్మరణాలు పొందినవారి గురించి సానుభూతి చూపించడం అధమాతి అధమం. అట్లాంటిది చిలవలు పలవలుగ కథనాలు ప్రచారం చేసే బదులు వచ్చిన కష్టాల నుండి ఎట్ల బైట పడాలో చూపెట్టడం, ధైర్య స్థైర్యాలను పెంపందించుకోవడం చేయాలి.
ఆత్మహత్యలంటే సహించలేని బాధ్యతా రాహిత్యం.
ప్రేమ ప్రసాద్,
నల్గొండ.
(జర్నలిస్ట్, రిటైర్డ్ టీచర్)
బతుకు పట్ల ఆశ కలిగించాలి:
నిజానికి ఆత్మహత్య అనేది వ్యక్తిపరమైన చర్య. కానీ దానికి పురి కొల్పటంలో వ్యక్తి చుట్టు వుండే వ్యక్తులు, పరిస్థితులు, సంఘ పరంగా వ్యక్తి మీద ఉండే వత్తిడులు తమవైన విధంలో వ్యక్తి మీద కలిగించే ప్రభావాలు సంఘటితంగా వ్యక్తిని ఈ చర్యకు పాల్పడేట్లు చేస్తాయి అనేది లోక విదితం. ఇవి ఎలా ఉసురు తీసేందుకు దారి తీస్తున్నాయో అలాగే ప్రయత్నిస్తే ఇవే అంశాలు వ్యక్తిలో జీవితం పట్ల సానుకూల దృక్పథం ఏర్పర్చటానికి తోడ్పడేట్టు మనం మలచగలిగితే ఆత్మ హత్యలు నివరించవచ్చును.
దానికి ముందు క్రుంగుబాటుకు గురి అయిన వ్యక్తి కుటుంబ సభ్యులు, సన్నిహితుల పాత్ర చాలా ముఖ్యమైనది. వ్యక్తిలో ఆత్మహత్యా ధోరణులు గుర్తించి అతని పట్ల సానుభూతితో అతని భయాలు అర్థరహిత మైనవి అయినా సహనంతో వినాలి. విని అవసరమైతే తగిన వైద్య సహాయంతో బాధితుని వెంట ఉండి అతనిలో ఆత్మ విశ్వాసం నింపాలి. బతుకు పట్ల ఆశ కలిగించాలి. ఇది చాలా ఓర్పుతో, నేర్పుతో చేయవలసిన కార్యం. ఈ రోజుల్లో నేర్పు మాట ఎలా వున్నా ఓర్పు అనేది వ్యక్తులలో కొరవడి ఇంటా, బయటా ఒకరు చెప్పేది రెండో వారు శ్రద్ధగా వినటం అనేది జరగటమే లేదు. ఇక నిలబడి సమస్య స్వరూప స్వభావాలు అర్ధం చేసుకోవడం ఎక్కడ.
ఎవరూ వినేవారు, తమ భయాలు అర్ధం చేసుకునే వారు లేరని క్రుంగుబాటుకు లోనయి జీవితాలు చాలించుకుంటున్నారు అన్ని వయసుల వాళ్ళు, అన్ని వృత్తులలో వాళ్ళు పట్టణాలు పల్లెలు అనే తేడా లేకుండా. ఇక ఈ ధోరణి ప్రముఖులలో మరీ ఎక్కువగా కనబడుతోంది. ఒక శిఖరాన్ని చేరిన తరువాత అక్కడ శాశ్వతంగా ఉండిపోము. కొత్త నీరు వస్తుంది, పాత నీరు కొట్టుకు పోతుంది. ప్రతి వ్యక్తి జీవితంలో వెలుగు నీడలు ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉంటాయి అనే అవగాహనా రాహిత్యం; ఈ విచ్చిన్నమవుతున్న కుటుంబ వ్యవస్థ వలన, పెడధోరణి పడుతున్న సాంఘిక పరిస్థితుల వలన, బెడ్ రూములోకి, బాత్ రూముల లోకి చొచ్చుకు పోతూ మనుషుల వ్యక్తిగతాలని వ్యవస్థాపరం చేసేస్తున్న అంతర్జాలం, పరిణితి లేని వార్తా ప్రసార మాధ్యమాల వలన వ్యక్తుల ఆలోచన విధానాలు, ప్రవర్తించే తీరు తెన్నులు చాలా ఆందోళన కలిగించే రీతిలో రూపుదిద్దుకుంటున్నాయి నానాటికి. జనం మరీ విమర్శనాత్మకంగా, పూర్వపరాలు తెలియకుండా తీర్పునిచ్చేవారుగా తయారవుతున్నారు. ఈ తీర్పులు సున్నిత మనస్కులని బాధించి ప్రాణాలు తీసుకోడానికి ప్రేరేపిస్తున్నాయి.
వీటి నివారణకు ముందు ఆత్మహత్యలు, వాటికి దారి తీస్తున్న పరిస్థితులు పట్ల వ్యక్తులలో అవగాహన పెంచాలి. క్రుంగుబాటును గుర్తించి అదేదో పెద్ద తప్పు అన్నట్లు దాచి పెట్టకుండా తగిన వైద్య సహాయం తీసుకునే ప్రయత్నం తప్పని చేయాలి.
దీనికి తల్లి తండ్రులు, స్కూల్స్‌లో, కాలేజీలలో టీచర్స్, మేధావులు సంబంధాలు ఏర్పరచుకొని కలిసి కట్టుగా స్కూల్స్, కాలేజీలలో అవగాహనా శిబిరాలు నిర్వహిస్తూ ఉంటే కొంత పరిస్థితి చక్కబడుతుంది. ఇల్లు, స్కూల్ లో ఆ చిన్న వయసులో ఏర్పడే సరి అయిన భావ జాలం, దృక్పథంతో ఎదిగే వ్యక్తులు జీవితం పట్ల సరియైన అవగాహనతో ఎదిగి ఇలాటి విపరీత చర్యలకు అంత త్వరగా పాల్పడరు.
కారణాలు స్థూలంగా తెలిసిన నేపథ్యంలో నివరణా మార్గాల పట్ల దృష్టి నిలిపి ఆ దిశగా భవిష్యత్తులో అడుగులు వేయాలి వ్యక్తులు, వ్యవస్థలు ఇకపై.
– సావిత్రి రమణ రావ్, రచయిత్రి, (హైదరాబాద్)
(ఎక్స్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్, ఎలెక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్స్, ఎ.వి.ఎన్. కాలేజ్ విశాఖపట్నం.)
సెల్ : 09908256959
హత్య కిందే వస్తుంది నా దృష్టిలో:
ఆత్మహత్య!!
చిన్నప్పటినుంచి మాట అర్ధం తెలీక తికమక పాడేదాన్ని. వేదాంతంతపు మాటలు వినపడుతుండేవి ఇంటిలో పెద్దల చర్చలు.
ఈ శరీరము – జీవి – ఆత్మ అంటూ వినపడుతుండేవి.
ఆత్మహత్య !! ఆత్మా మరో శరీరంలో స్థానం ఏర్పర్చుకుంటుంది అన్నప్పుడు ఆత్మహత్య అవదు కదా?
ఆత్మ మరో చోటు వెతుక్కుంది. హత్య కిందే వస్తుంది నా దృష్టిలో.
ఒక ఆకృతిని తల్లి ఇచ్చినప్పుడు బలవంతంగా బూడిద పాలు చేస్తున్నప్పుడు ఆ ఆత్మ ఎగిరిపోయింది ముందే. కాబట్టే యిక ఆత్మహత్య నాలుగు హత్యలతో సమానము.
ఒకటి ఆ శరీరము. రెండు ఆత్మకును చోటు లేకుండా వెతుకున్నే ఖర్మ కలిగించినందుకు, మిగిలిన వారు ముందు వెనుక తరాలను క్షోభపెట్టినందుకు – భయంకరమైన పాతకాని చుట్టుకున్నందుకు. ఇది మనము నమ్మే ధర్మము.
ఇక వాస్తవం : అవసరమా !!! ఆత్మహత్య అంత అవసరమా?
నీవు అహంతో చేసిన తప్పులకు/ఆశకు/నీవనుకున్న ప్రేమకు ఆటంకమొస్తే చావే శరణ్యమా !!
అహంభావం. పొగరు. సద్దుకోవాలా!! అన్న భావమే ఆత్మహత్యకు దారి తీస్తుంది.
నేను ఒక వ్యక్తిననో, నా భావాలు గొప్పవానో అనుకుంటూ బతికేవారు, చిన్న తేడా వస్తే చచ్చపోవటమే శరణ్యమని ఆత్మహత్య చేసుకోవటం అసహ్యకరమైన చర్య. సంఘంలో అత్యున్నత పదవుల్లో, విద్య, వ్యాపార, రాజకీయ, సాహిత్య రంగాలలో ఉన్నవారి ఆత్మహత్యలను ఈ మధ్యకాలంలో చూస్తే, నోటమాట రాని వారమౌతున్నాం. రాజకీయ నాయకుడు!! వీరా నాయకులూ !!! బతుకుతో “రాజీ” పడలేనివారా!! వీళ్ళా మనకు నాయకులు !!! సిగ్గు సిగ్గు.
ఆదర్శము అంటూ సహజీవనపు అడుగులు వేసి, వద్దని, అవమానము అనుకుంటూ, వుండలేనిక అంటూ బలవన్మరణం పొందిన వారు మనకు సాహిత్యమూ ద్వారా ఏదో ఏదేదో బోధించే వారా? నిలకడ లేని మనుషులు – ఆత్మహత్యకు పాల్పాడే మానసిక రోగులు.
‘మీరూ – నా ఆత్మహత్య – దారి పట్టండి’ అని అన్యోపదేశం గా భోధించినట్లు లేదా? సంఘంలో ఒకస్థాయికి వచ్చిన వారు చేసే చిల్లర గాళ్ళ ‘చవట యవ్వారమే’ ఆత్మహత్య.
చరిత్రలో వారు నల్లమచ్చ.
(ఇది నా ఆవేదన.)
జై హింద్ !
సంధ్య గోళ్లమూడి, హైదరాబాద్.
(మేనేజింగ్ డైరెక్టర్, ప్యూర్)
మనం ఎంత వరకు కారణమన్నది ఆలోచించాలి:
– మంజు యనమదల (కవయిత్రి)
విజయవాడ. సెల్ : 9490769585
వారిని గౌరవించడం మాత్రం సమాజం బాధ్యత:
మరణం అనేది వినగానే ఆ ఫలానావారు ఎవరైనా తెలియని వారైనా ఈ మనముంటున్న ప్రపంచం విడిచి వెళ్ళిపోయారన్న విషయం తెలిసాక మొదట కలిగేది బాధ. దురదృష్టవశాత్తూ అది ఆత్మహత్య అయితే.. తర్వాత కలిగేది బాధతో కూడిన అసహనం. ఎందుకంటే ఎవరకీ మరణం శిక్ష కాకూడదు. అది సహజ పరిణామం అసహజంగా జరగడం, అది అంగీకరించలేకపోవడం వల్ల వచ్చిన అసహనం.
అనుభవం లేని వయసులో చిన్నవారైన విద్యార్ధులు, జీవితంలో ఆటుపోట్లు ఎదుర్కోలేకవిసిగినవారు, విచిత్రమైన పరిష్కారం లేని సమస్యలు ఎదుర్కుంటున్నవారు, వారికి ఆత్మహత్య పరిష్కారం తమ సమస్యలకు అనుకోవడం సాధారణంగా జరుగుతోంది, వారి కొరకు మన మనసులో సానుభూతి జాలి, వారికి కొంత అవగాహన కల్పించి లేదా దొరికి ఉంటే ఆ నిముషము గట్టెక్కి, వారు జీవితం చాలించే ఆలోచన ఆపుకునేవారు కదా అని అనిపిస్తుంది.
కాని వయసులోనూ అనుభవంలోనూ చదువులోనూ ఆలోచనలోనూ అవగాహనలోనూ జ్ఞానంలోనూ అధికులూ, ఇతరులకి మంచి చెప్పగల విద్వత్తు గలవారు, ఆత్మహత్యలకు పాల్పడటం ఆశ్చర్యము అనడం కంటే విపరీతమైన వ్యధకు గురి చేస్తుంది.
ఒకరకంగా ఎక్కువ విషయపరిజ్ఞానం, అవగాహన చెప్పాలంటే విలక్షణమైనారు ఆత్మహత్యలను ఎంచుకోవడం.. ఏ విధంగాను సమర్థనీయమైన విషయం కాకపోయినా, వారి దృష్టిలో ఇలా అయుంటుంది అనుకుంటే, వారి మీద గౌరవం మనకు చల్లారదు, కొద్దో గొప్పో సానుభూతి మిగులు.
కాని, విమర్శను వదిలివేయలేము కదా, ఏ విధంగా ఈ చర్య ద్వారా ప్రముఖులు సమాజానికి సందేశం అందించారు, వారి బాధ్యత అదేనా, జీవితంలో నిలచి పోరాడకుండా, అనుకూల విషయాలకు ఆనందించి, అననుకూల విషయాలు ఏర్పడినప్పుడు తప్పుకుని పారిపోయే పిరికితనాన్ని ప్రోత్సహించి చూపుతున్నారా, ఇదేనా ఏ సమస్య కైనా పరిష్కారం? అని. వారి వారి వ్యక్తిగత విషయం అని వదిలివేయడం ఈ సమాజం రీతి కాదు, మాటాడుకోవడం చర్చ తీర్పు లివ్వడం సంప్రాప్తించిన హక్కు అనుకుంటారు చాలామంది. అందునా గుర్తింపబడిన గొప్పవారి విషయంలో ఇంకా ఎక్కువ.
కాని ఆత్మహత్య చిన్న విషయం కాదు, ఆ పనికి పాల్పడిన వారి మనోభావాలు, మానసిక సంఘర్షణ, శారీరకశ్రమ, కుంగుబాటు, నాకెవరూ లేరు, సమర్ధించేవారు, సాయం చేసేవారు అన్న ఒంటరితనము, సంచలనము, చంచలత్వము, పిరికితనము, తెంపరితనము, అంతపెద్ద నిర్ణయము తీసుకోవడానికి దారితీసిన పరిస్ధితులను చక్కదిద్దుకోలేని వారి నిస్సహాయత, పొందిన అవమానాలు, అవి గుర్తుచేసుకుంటూ భరించలేని మనోవ్యధ, ఈ లోకంలో అనుభవించవలసిన భోగాలను వదిలివేయాలన్న వారి విరక్తి, అన్నిటికినీ మించి వదిలివెడిపోతున్న ఆత్మీయుల మీద ప్రేమ, తనవారి బాగోగుల గురించి చింత, ఇన్ని భావ సంచలనాలను గుర్తించాలి.
ఆత్మహత్యలు జరగడంలో జరగకుండా ఆపడంలో సమాజ బాధ్యత ఎంత వరకో తెలియదు కాని, వారి ఆత్మహత్య సమాజంలో ఎటువంటి ముద్ర వేస్తోందో చెప్పలేము గాని, వీపరీతమైన విమర్శలు చేయకుండా, వారి మరణాన్ని, మరణానంతరం వారిని గౌరవించడం మాత్రం సమాజం బాధ్యత అనుకుంటాను
–జానకి చామర్తి.
అవగాహనా కార్యక్రమాలు ముమ్మరం చేయాలి:
విద్యార్థులు, రైతులు, ప్రేమికులు, అత్తింటి వేధింపులకు బ్రతకలేని అపుడపుడు కొంతమంది గొప్పవారు ఒంటరివారు ఆత్మహత్యలు చేసుకునే వారిలో అధికం. అందరి చావుల్లో రేపు ఎలా అనే భయమే వారిని ఆ దారికి తీసింది అని నిర్ధారణౌతున్న నిజం.
అలాగే వారి చుట్టూ పక్కలవారు, లేక పెరిగిన వాతావరణం, లేక లేనిపోని భయాలు వారి అమాయకత్వం, నిస్పృహ దేని గురించి కానీ, సరైన అవగాహన లేకపోవడం, విపరీతమైన ఒంటరితనం 70% కారణాలు అని ఈజీగా చెప్పవచ్చు.
మన జీవితాల్లో ఫాల్స్ ప్రెస్టేజ్, కొన్నింటికి డబ్బు లేమి, కొన్నింటికి కొన్నింటికి విపరీతమైన జల్సా లేక దురాశ ఈమధ్య కాలంలో ప్రాణాలు తీసుకోవటానికి కారణంయ్యింది. దీన్ని అరికట్టటం అంత సులువు కాదు ఎందుకంటే శారీరక జబ్బులకు వెంటనే మందులున్నాయి గాని ఇలాంటి బాధలు కాని బాధలు – పైకి కనిపించనివి, కనుక్కోలేనివి ఎవరు చెప్పి చావటం లేదు.
కొంతమంది పోయే ముందు ఓ ముక్క రాస్తే ఓ పనయి పోతుంది అనే టైపులో రాసి చనిపోయే వారే తప్పితే చాలా మంది ఆవేశములోను, తంకెలాటి సహాయమూ, ఎట్టి పరి స్థితిలోను అందదు అని తెలియటం వలన ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
మరి వీటిని ఎలా ఆపాలి? ప్రజల్లో ఒక అవగాహన కల్పించాలి. ఇలాంటి వారికోసం కొన్ని ఉచిత సర్వీస్ సెంటర్స్, ఆశ్రమాలు వంటివి నెలకొల్పాలి. అందుకు ప్రభుత్వం ముందుకు రావాలి. ‘అంతకంటే ముందుగా ఆత్మహత్య నేరం’ అనే చట్టానికి సవరణగా ఆత్మహత్య అనేది మీ మైండ్ లోకి రాగానే ఈ ఫలానా ఆసుపత్రి ని సంప్రదించండి, లేదా జాయిన్ అవండి అని ప్రకటనలు గుమ్మరించాలి. అప్పుడు ఆటోమేటిక్‌గా ఆ కుటుంబీకులకు, లేదా చుట్టూ పక్కల వారికి అవగాహన కల్గుతుంది. తెలిసి జాగర్తలు తీసుకుంటారు. బీదలకు ప్రభుత్వమే ఒక దారి చూపాలి తప్పనిసరిగా.
అలాగే పెద్ద పెద్ద కంపెనీలు, స్వచ్ఛంద సంస్థలు ఏ కష్టానికి ఎలాంటి సొల్యూషన్స్ ఉన్నాయో బోధిస్తూ, అవగాహన కల్గించే సంస్థలకు తగినంత ఆర్థిక సహాయం చెయ్యాలి. అలా కొంతవరకు ఆత్మహత్యలను అరికట్టవచ్చు.
– మీనాక్షి వేదుల.
సెల్ : 9849959549
ముందు తరాలవారికి సరి అయిన మార్గనిర్దేశకులు కాలేరు:
చిన్న వయసులో అంటే 16, 25 సంవత్సరముల వయసులో పరీక్షలో తప్పడం వలన, ప్రేమలో పరాజితులు అవడం వలన ఆత్మహత్యలు సంభవిస్తాయి. వారికి జీవితం పట్ల ఏవిధమైన అవగాహన లేక క్షణికావేశంలో ఆత్మహత్యకు పాల్పడతారు. కానీ కుటుంబీకులు కొంచెం ముందుగా గమనించి పరిస్థితి పట్ల సానుభూతి చూపించి, జీవితం పట్ల అభిరుచిని కలిగించి సరి అయిన టైంలో ధైర్యం చెప్పగలిగితే ఆతరువాత జీవితంలో ఆ ఆలోచనే రాదు సరికదా అత్యంత నాణ్యమయిన దారిలో తమ జీవితాన్ని నడిపిస్తారు.
సమాజంలో ఉన్నతి స్థితిలో వుంటూ జీవిత పరిమితులు పరిధులు తెలిసి ఉన్నవారు బలహీనతకు లోనై తమ బాధ్యతను విస్మరించి పర్యవసానాలు ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకొని సాగినంత కాలం ఎవరిని లెక్కచేయకుండా ఏదైనా అవరోధం ఏర్పడినప్పుడు మానసిక సంఘర్షణ తట్టుకోలేక, ఒంటరితనం భరించలేక ఆత్మహత్యకు పాల్పడతారు. సమాజాన్ని ఒక మెరుగైన రీతిలో నడిపే బాధ్యత విస్మరించడమేకాక ముందు తరాలవారికి సరిఅయిన మార్గనిర్దేశకులు కాలేరు
జీవితంలో తన మాటకు ఎదురు లేకుండా ఎప్పుడూ విజయాలు, పొగడ్తలు, సన్మానాలు పొందుతూ ఒకవిధమైన మనోగర్వంతో ముందుకు దూసుకు వెళుతూ హఠాత్తుగా ఏదైనా అనుకోని సంఘటన జరిగి తన గౌరవ భంగం కలిగేలా పరిస్థితి ఏర్పడితే ఆ అవమానం భరించలేక స్వంత నిర్ణయం తీసుకొని ఆత్మహత్యకు పాల్పడతారు. కొందరు పథకం వేసుకొని కూడా ప్రాణాలు తీసుకుంటారు.
ఏది ఏమైనా పరిస్థితులను ఎదుర్కోలేక ధైర్యం కోల్పోయి అకాల మరణం చేజేతులా కొని తెచ్చుకుంటారు. పిల్లలకు చిన్నతనం నుండే మానసిక స్టైర్యం, జీవిత విలువలు సామాజిక బాధ్యత, నైతిక విలువలు పట్ల అవగాహన కలిగించినట్లైతే ఈ సమస్యను అధిగమించవచ్చు.
– జానకీ గంటి
(రచయిత్రి, మాథ్స్ అసిస్టెంట్. విశాఖా వాలీ స్కూల్, విశాఖపట్టణం.)
సెల్ : 9290102422