అత్త కుట్టిచ్చిన కొత్త చొక్కా

7
4

[dropcap]మా [/dropcap]ఇంట్లో ఈ మధ్య ఓ పెళ్ళి నిశ్చయమైంది. పెళ్ళికి ముందు ఇంటికి రంగులు వేయించాలని మా అక్క ఇల్లంతా సర్ది, అటకల మీద సామాన్లు దింపించి వాటిని ఓ గదిలోకి చేర్చింది. సరే, రంగుల పని పూర్తయి, పెళ్ళి హడావిడి మొదలైంది. మళ్ళీ చాలా వస్తువులు వాటి వాటి స్థానాల్లోకి వెళ్ళిపోయాయి, ఒక పాత సూట్‌కేస్ తప్ప. పెళ్ళి దగ్గర పడుతుండడంతో కజిన్స్ అందరూ వచ్చేశారు. ఆ రోజు పొద్దున్నే కజిన్స్ అందరం ఒక చోట చేరి కాఫీలు తాగుతూ కబుర్లు చెప్పుకుంటున్నాం. మాటల సందర్భంలో మా మేనకోడలు ఆ పాత సూట్‌కేస్ ప్రస్తావన తెచ్చింది.

“అమ్మా, ఆ సూట్‌కేస్ కూడా తీసేయ్యచ్చుగా, చాలా పాతబడిపోయింది. నా చిన్నప్పటి నుండి చూస్తున్నాను దాన్ని” అంది.

“నీకిప్పుడు 19 ఏళ్ళు, కాని ఆ సూట్‌కేస్ ఏజ్ నీ ఏజ్ కన్నా ఎక్కువ. బహుశా పాతికేళ్ళ క్రితంది అనుకుంటా” అన్నాడు మా తమ్ముడు.

“పాతబడిపోయిన వస్తువులన్నీ ఎందుకు పోగు చేసి ఉంచడం? ఇల్లు సర్దుతున్న ప్రతీసారి చెబుతుంటాను, ఆ పెట్టెలో అక్కర్లేనివి పారేసి, ఏవైనా దాచుకోవాల్సినవి ఉంటే వేరే పెట్టెలో పెట్టుకోమని… కాని అమ్మ వినదు…” అంది.

“అది జ్ఞాపకాల పెట్టె… అందులో పడేసేవి ఏవీ ఉండవు… అన్నీ దాచుకోవలసినవే” అన్నాను నేను.

“याद न जाए, बीते दिनों की जाके न आये जो दिन, दिल क्यूँ बुलाए, उन्हें दिल क्यों बुलाए याद न जाये…” అంటూ ‘దిల్ ఏక్ మందిర్’ సినిమాలో మహమ్మద్ రఫీ ఆలపించిన పాట పాడింది మా మేనకోడలు.

“మామా, ఇలాంటి పెట్టె చినమామ ఇంట్లోనూ ఉంది, మరి మీ ఇంట్లో లేదేం?” అడిగాడు నా మేనల్లుడు.

“అలా అడుగు….” అంది మా ఆవిడ.

ప్రశ్న అడగడమయితే మేనల్లుడు అడిగాడు కానీ, ఆ సందేహం మా కజిన్స్ అందరిలోనూ ఉంది. నేనేం చెప్తానా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

కారణం నాకు తెలుసు. కాని ఎలా చెప్పడమా అని ఆలోచిస్తున్నాను.

“आया है मुझे फिर याद वो जालिम गुज़रा ज़माना बचपन का हाए रे अकेले छोड़ के जाना” ‘దేవర్’ సినిమాలో ముకేష్ పాడిన పాట గుర్తు చేసుకున్నాను.

“లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అనా?” అన్నాడో కజిన్.

“కొంతవరకు అదీ ఒక కారణం. అక్క వాళ్ళది స్వంత ఇల్లు కాబట్టి, అటకలున్నాయి కాబట్టి ఎంత సామాను ఉన్నా, ప్రస్తుతానికి అవసరం లేదు అనుకుంటే అటకెక్కిస్తున్నాం. మేము అద్దెక్కున్న చాలా ఇళ్ళు చిన్నవి, అటకలు లేనివి. దాంతో తప్పనిసరిగా సామాన్లు పరిమితం చేసుకోవాల్సి వచ్చింది. జ్ఞాపకాల కోసం ఫిజికల్‌గా పెట్టె లేదు కాని మనసులో పెద్ద భోషాణమే ఉంది” అన్నాను.

“కొయ్… కొయ్…” అన్నాడో కజిన్ సరదాగా.

“సరే, ఇంకొక కారణమూ ఉంది, చెప్తాను” అన్నాను.

“చెప్పు మామా” అన్నారు మేనల్లుడు, మేనకోడలు.

“नगमे हैं, शिकवे हैं  किस्से हैं, बाते हैं  नगमे हैं, शिकवे हैं  किस्से हैं, बाते हैं  बातें भूल जाती हैं  यादें याद आती हैं  बातें भूल जाती हैं यादें याद आती हैं” అంటూ ‘యాదేఁ’ సినిమాలో హరిహరన్, సునిధి చౌహాన్ పాడిన పాట పాడి చెప్పాను.

“చిన్నప్పటి నుండి అక్కా నేను ఒకచోట ఉండడం, వాసు ఇంకో చోట ఉండడం వల్ల – అక్కవీ నావీ చాలా వరకు ఉమ్మడి జ్ఞాపకాలు. అందుకని ఆ పెట్టెలో ఉన్నవి నావి కూడా… వాసు మాకు దూరంగా పెరిగాడు కాబట్టి వాడికి విడిగా ఓ పెట్టె” అన్నాను.

“అవును” అన్నాను మా తమ్ముడు.

“చిన్నతనంలో మా ఆటలు, అల్లరి మా జ్ఞాపకాలు కావు. అవి మా పెద్దల జ్ఞాపకాలు. మాకు ఊహ వచ్చి, వస్తువులను జాగ్రత్త చేసుకోవడం తెలిసిన తర్వాత గుర్తులుగా మిగిలినవి ఈ పెట్టెలో ఉన్నాయి” అంది అక్క.

“సరే, మేం కాస్త పెద్దయ్యి, అక్కకి పెళ్ళయి, పిల్లలు పుట్టేసరికి మా జ్ఞాపకాలు డిజిటల్ బాట పట్టాయి. మా కొలీగ్ దగ్గర డిజిటల్ కెమెరా తెచ్చి, నీ ఫోటోలు తీసేవాడిని” చెప్పాను మా మేనకోడలితో.

“పాత ఫోటోలను కూడా స్కాన్ చేసి డిజిటల్ ఫార్మాట్‍లో సేవ్ చేసుకుంటున్నాం…” అన్నాడు మా తమ్ముడు.

“ఇప్పుడన్నీ మెమొరీస్ ఏ గూగుల్ డ్రైవ్ లోనో, 1TB, 2TB ఎక్స్‌టర్నల్ హార్డ్ డిస్కులలోనో భద్రంగా ఉంటున్నాయి” చెప్పాడింకో కజిన్.

“నిజమే” అన్నాను. అంగీకరిస్తున్నట్టు అందరూ తలాడించారు.

కాసేపు నిశ్శబ్దం.

ఉన్నట్టుండి ‘ఏదో ఒక రాగం పిలిచిందీ వేళ’ పాట నుంచి “జ్ఞాపకాలే మైమరపు జ్ఞాపకాలే మేల్కొలుపు జ్ఞాపకాలే నిట్టూర్పు జ్ఞాపకాలే ఓదార్పు” అంటూ ఓ కజిన్ పాడింది.

“दिल की बात कहीं लब पे ना आ जाए हँसते हँसते आँख कहीं ना भर आये याद रहें, याद रहें, क्या…. चेहरे पे चेहरा लगा…” ‘తేరీ కసమ్’ సినిమాలో అమిత్ కుమార్ పాడిన పాటని ఇంకో కజిన్ పాడాడు.

“గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి

ఎదలోతులో ఏ మూలనో

నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి

గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి” ‘నా ఆటోగ్రాఫ్’ సినిమాలో పాట పాడింది ఓ కజిన్.

“ఎగరేసిన గాలిపటాలు దొంగాట దాగుడుమూతలూ గట్టుమీద పిచ్చుక గూళ్ళు కాలువలో కాగితం పడవలూ గోళీలు గోటీబిళ్ళ ఓడిపోతే పెట్టిన డిల్ల చిన్ననాటి ఆనవాళ్ళు స్నేహంలో మైలురాళ్ళు” అంటూ ‘స్నేహం’ సినిమాలోని పాటని పాడిందో కజిన్.

“మరపురాక వున్నది నేటి వరకు పాత జ్ఞాపకం

నిన్న నుండి రేపు చేరమంది కొత్త ఆశయం” పాడాడింకో కజిన్

“ఏ సినిమాలోది? ఎప్పుడూ వినలేదే?” అంది ఇంకో కజిన్.

“సినిమా పేరు ‘అల’. 2018లోది. శివకృష్ణ రాసిన గీతాన్ని హరిహరన్ పాడారు. రాణీ శ్రీనివాస శర్మ సంగీతం” వివరించాడు.

“అందరూ भूले बिसरे गीत పాడేస్తున్నారుగా, సరే, అన్నా, మీ మనసులో పెద్ద జ్ఞాపకాల భోషాణమే ఉందన్నారుగా, ఏదైనా ఓ మంచి జ్ఞాపకాన్ని మాతో షేర్ చేసుకోండి” అంది ఓ కజిన్.

“చాలా ఉన్నాయి. ఏది చెప్పను?” అన్నాను.

“यादों की बारात निकली है आज दिल के द्वारे ” అంటూ మా మేనకోడలు హమ్మింగ్ చేసింది.

ఇంతలో మా మేనల్లుడు చెప్పాడు – “మామా నీ కొత్త డ్రెస్ టైలర్ దగ్గర నుంచి తెచ్చి, బీరువాలో పెట్టాను…”.

కొత్త డ్రెస్ అంటే నాకో సంగతి జ్ఞాపకం వచ్చింది.

“సరే చెప్తాను వినండి.” అన్నాను. మా ఆవిడ వచ్చి అందరికీ మరో రౌండ్ కాఫీలు అందించి, తను కూడా ఓ కప్పు తెచ్చుకుని కూర్చుంది.

***

మా నాన్నగారు వాళ్ళది పెద్ద కుటుంబం. నాకు ఐదుగురు బాబాయిలు, ఇద్దరు మేనత్తలు. నా చిన్నప్పుడు అందరూ బేగంపేటలో ఒకే వీధిలో ఉండేవాళ్ళం. వీధి మొదట్లో మా ఇల్లు, వీధి చివరి మరో ఇంట్లో తాతగారు, నానమ్మ, బాబాయిలు అత్తలు ఉండేవారు. ఇంకో బాబాయి చిక్కడపల్లిలో ఉండేవాడు. మేం మా ఇంట్లో కన్నా నానమ్మ దగ్గరే ఎక్కువ కాలం గడిపేవాళ్ళం. నాన్నగారు ఆఫీసుకెళ్లాక, అమ్మ కూడ పనులు ముగించుకుని నానమ్మ దగ్గరికి వచ్చేది. మళ్ళీ సాయంత్రం నాన్నగారొచ్చే టైమ్‌కి మా ఇంటికి వచ్చేసేవాళ్ళం. బాబాయిలకిష్టమని అమ్మ కొన్ని కూరలు చేసేది, మాకిష్టమని నానమ్మ పులుసు చేసేది… ఐటమ్స్ పంచుకుంటూ భోంచేసేవాళ్ళం. ఆదాయం తక్కువ, కుటుంబంలో మనుషులెక్కువగా ఉండే రోజులవి. ఎవరికి వారు చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ చేదోడువాదోడుగా ఉండేవారు.

మా పెద్దత్త అప్పుడే డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగాలకి ప్రయత్నిస్తోంది.

ఆఫీసులో ఏదో గొడవై మా నాన్నగారు ఉద్యోగం మానేసారు. ఇది కాకపోతే, ఇంకోటి దొరుకుతుందనే ధీమా ఆయనది! కాని అలా జరగలేదు. చాలా రోజుల పాటు ఆయనకి మరో జాబ్ దొరకలేదు. అప్పుడు నాకు పదేళ్ళనుకుంటా… అయిదో క్లాసు చదువుతున్నాను. మామూలుగానే పొదుపుగా ఉండేవాళ్ళం. డబ్బుకి కటకట అయ్యేసరికి అమ్మ ఇంకా పొదుపు చేసేది. ఆర్నెల్ల పాటు నాన్నగారికి ఉద్యోగం లేదు. ఆయన బాగా క్రుంగిపోయారు. మా మీద విసుక్కునేవారు, కొట్టేవారు. అమ్మ మీద అరిచేవారు.

అసలేమీ పట్టించుకునే వయసు కాదది… డబ్బులు లేవన్న విషయం తెలిసింది ఎప్పుడంటే స్కూలు ఫీజులు కట్టలేక – క్లాసు బయట నిలుచున్నప్పుడు, అమ్మ వచ్చి హెడ్‌మాస్టర్ గారిని బ్రతిమాలుకున్నప్పుడు! రెండు మూడు నెలలయ్యాకా, మమ్మల్ని స్కూలికి రావద్దనేశారు. ఓ వారం గడిచాకా, బాబాయిలు కొంత, మావయ్యలు కొంత సర్దుబాటు చెయ్యడంతో బాకీ ఫీజులు కట్టి స్కూల్‌కి మళ్ళీ వెళ్ళసాగాం.

మామూలుగా ప్రతీ సంవత్సరం రెండు జతలు కుట్టించేది అమ్మ. ఆ ఏడాది అసలు కొత్త బట్టలు కుట్టించలేదు. స్కూలు యూనిఫారం ఎప్పుడూ ఒక జతే ఉండేది. రోజూ స్కూలు నుంచి రాగానే వెంటనే ఉతికి ఆరేసేది, మర్నాటి కోసం.

లేమి పట్టని బాల్యపు అమాయకత్వం మాది. ఆటల్లో అన్నీ మరిచిపోయేవాళ్ళం.

నా చొక్కా చేతుల దగ్గర చిరిగింది. అమ్మ కుట్టిస్తానంది. సరే అని, చొక్కా విప్పేసి, లాగు మీదే ఆడుకోడానికి వెళ్ళిపోయాను.

చొక్కా లేకుండా రోడ్డు మీద ఆడుతుంటే మా పెద్దత్త చూసింది, “వెళ్ళి చొక్కా వేసుకో!” అంది. మాకు మా పెద్దత్తంటే భయం! ఎప్పుడూ మమ్మల్ని క్రమశిక్షణతో ఉంచాలని చూసేది.

అత్త మమ్మల్ని దాటి వెళ్ళేవరకు దాక్కుని, మళ్ళీ వచ్చి ఆడుకోసాగాను.

మర్నాడు కూడా ఇదే తంతు. అత్త చూడ్డం, చొక్కా వేసుకోమని చెప్పడం, నేను సరేననడం… ఆమె వెళ్ళేదాకా ఆగడం, మళ్ళీ ఆటల్లో పడడం!

మూడో రోజు కూడా ఇలాగే అయ్యింది. చొక్కా లేకుండా ఆడుతున్న నా వీపు మీద గట్టిగా ఒక్కటేసింది. “చొక్కా వేసుకోమంటుంటే నీకర్థం కాదా?” అంది కోపంగా.

“నాకు చొక్కా లేదు, ఇంట్లో వేసుకునే చొక్కా చిరిగిపోయింది. స్కూలు యూనిఫాంతో ఆడితే అమ్మ తిడుతుంది. చొక్కా లేకుండా ఆడుకుంటే నువ్వు తిడతావు… నువ్వో కొత్త చొక్కా కుట్టించి ఇవ్వు. అప్పుడేసుకుంటాను” అన్నాను ఉక్రోషంగా.

అత్త మొహం వెలవెలపోయింది. ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయింది.

తర్వాత ఓ పదిరోజులకి అత్తకి మా ఇంటి దగ్గరే ఓ స్కూల్‌లో ప్రైమరీ టీచర్‌గా ఉద్యోగం వచ్చింది. మొదటి జీతం అందుకున్నాక, ఇంట్లో వాళ్ళందరికీ స్వీట్లు తెచ్చింది. నన్ను టైలర్ దగ్గరకి తీసుకెళ్ళి నా కొలతలు తీసుకోమంది. మూడు రోజుల తర్వాత మెరూన్ కలర్ మీద తెల్లటి పువ్వులున్న గుడ్డతో చొక్కా, దానికి సరిపోయే లాగు కుట్టించింది. నన్ను దగ్గరకి తీసుకుని, ప్యాకెట్ నా చేతిలో పెట్టింది.

“ఇదిగోరా, నువ్వు అడిగినట్లు చొక్కానే కాదు, లాగు కూడా కుట్టించాను” అంది.

థ్యాంక్స్ చెప్పాలని కూడా గుర్తురానంత ఆనందం! వెంటనే వేసుకోడానికి సిద్ధమయ్యాను.

“కొద్ది రోజుల్లో పండగ వస్తోందిగా, అప్పుడేసుకుందువులే” అంది అమ్మ.

“అప్పుడు ఇంకోటి తీసుకోవచ్చు వదినా, వేసుకోనివ్వండి” అంది అత్త.

కొంచెం వదులుగా, పొడవుగా కుట్టించడంతో ఆ చొక్కాని నేను దాదాపు రెండేళ్ళ పాటు వేసుకున్నాను.  ఏ ఫంక్షనైనా ‘అత్త కుట్టిచ్చిన కొత్త చొక్కా’ వేసుకోవాల్సిందే. అది పాతదయిపోయినా సరే దాన్ని ‘అత్త కుట్టిచ్చిన కొత్త చొక్కా’  అనే పిలిచేవాడిని.

మేం పెద్దయ్యాం. ఆ చొక్కా చిరిగిపోయింది. అయినా దానిలో ఒక ముక్కని చాలా కాలం రుమాలుగా వాడాను. కొంతకాలానికి అదీ కూడా చిరిగిపోయింది.

ఇప్పుడు అత్త లేదు, ఆ చొక్కా కూడా లేదు. అన్నీ జ్ఞాపకాలే… మనుషులు చాలా తొందరగా జ్ఞాపకాలైపోతారెందుకో…” అన్నాను.

ఈ మాటలు చెబుతున్నప్పుడు నా కళ్ళు చెమ్మగిల్లాయి.

***

भूली हुई यादों, मुझे इतना ना सताओ अब चैन से रहने दो, मेरे पास न आओ भूली हुई यादों – ‘సంజోగ్’ సినిమాలో ముఖేష్ పాడిన పాట నా మనసులో మెదిలింది.

అందరూ మౌనంగా వుండిపోయారు. వాతావరణం గంభీరంగా మారిపోయింది.

మా మాటలు వింటూ మా సందడంతా గమనిస్తున్న మా అమ్మ – “చాల్చాలు.. ఇక లేవండి. మీ ముచ్చట్లు ఆపి… ఈ పెళ్ళి ఓ మధుర జ్ఞాపకంగా మిగిలేలా చెయ్యండి. లేవండి. వెళ్ళి పనులు చూడండి” అంది.

కబుర్లూ, పాటలూ కట్టి పెట్టి పెళ్ళి పనులకి లేచామందరం.

ఇప్పుడు మేం ఆర్థికంగా బావుండి ఉండవచ్చు, మాకు అన్ని సౌకర్యాలు, వసతులు ఉండి ఉండవచ్చు. కాని చిన్నప్పటి ఆ అమాయకత్వం, చొక్కాల్లేకుండా ఆడుకున్న రోజులు, పెద్దల ఆప్యాయతలు మరపురానివి.

अलबेले दिन प्यारे मेरे बिछड़े साथ सहारे हाय कहा गए हाय कहा गए आँखों के उजियारे मेरी सूनी रात के तारे हाय कहा गए

कोई लौटा दे मेरे बीते हुए दिन कोई लौटा दे मेरे बीते हुए दिन बीते हुए दिन वो मेरे प्यारे पलछिन कोई लौटा दे అంటూ दूर गगन की छॉंव में సినిమాలో కిషోర్‌కుమార్ పాడిన పాటని నాలో నేనే పాడుకున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here