అట్ట వేరు, పుస్తకం వేరు

0
2

[dropcap]నె[/dropcap]మ్మదిగా నడుచుకుంటూ వచ్చి, గేటు తీసి “లాయర్ శేఖరం ఉన్నాడా” అడిగాడు అప్పుడే పై అంతస్తు నుండి మెట్లు దిగి కిందకు వస్తున్న ఒకామెని.

“ఉన్నారండీ. కాకపోతే కొంచెం బిజీగా ఉన్నారు” చెప్పిందామె .

“సరే, థాంక్ యు” అనేసి మెట్లెక్కి తలుపు తీశాడు. చూస్తూనే కళ్ళు పెద్దవి చేసి, సున్నం పిడతలా మొహం పెట్టి మరీ ఆశ్చర్య పోతూ ‘ఇదేవిటిది, ఇంత మంది ఉన్నారు. అవున్లే ఈ రోజు ఆదివారం కదా, ఆ మాత్రం క్లయింట్లు ఉంటారు. అయినా వాడి క్లోసెస్ట్ అండ్ బెస్ట్ ఫ్రెండ్‌ని, నన్ను ఆపేదెవరూ, హాయిగా నేను ఎప్పుడూ వెళ్ళినట్టే నేరుగా లోనికి వెళ్లిపోతాను’ అనుకుంటూ లోనికి వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. అంత మంది జనం ఉన్నా, ఆ హాలంతా నిశ్శబ్దంగా ఉంది. అప్పటికే శేఖరం ఎవరో క్లయింటుతో మాట్లాడుతున్నాడు. సుబ్బారావ్ వచ్చి పది నిమిషాలు అయిపోవడంతో కాస్త చిరాగ్గా వాచీ చూసుకున్నాడు. తర్వాత కొద్ది సేపటికి ఆ క్లయింటు బయటకు వచ్చాడు.

“నెక్స్ట్” అంది అసిస్టెంట్.

ఆమె అలా అనగానే, టక్కున లేచి, “ఆ… నేను, నేను వెళతాను” అంటూ లాయర్ శేఖరం రూంలోకి వెళ్లబోయాడు.

ఆమె సుబ్బారావ్ వంక అయోమయంగా చూస్తూ, “సార్ ఆగండి, అపాయింట్మెంట్ లేకుండా లోనికి వెళ్లకూడదు.” చెప్పింది అతని అసిస్టెంట్.

ఆమెని ఓ సారి కింద నుండి పైకి చూసి, “ఇందాకట్నుండీ నేను నిన్ను సరిగా గమనించలేదు. నువ్ కొత్తగా జాయిన్ అయ్యావా” అడిగాడు ఆవదం తాగినట్టు మొహం పెట్టి

“అవును సార్. నేను జాయిన్ అయ్యి ఓ పది రోజులౌతోంది. ఎందుకు అడిగారు సార్” అడిగిందామె నీళ్ళు నములుతూ.

“అదే మరి, నువ్ కొత్తగా జాయిన్ అయ్యావ్ కాబట్టి నీకు నేనెవరో తెలీదు. నేను వాడి స్నేహితుడ్ని. నేను ఇలా అప్పుడప్పుడూ వచ్చి పలకరించి వెళ్తుంటాను. ఎంత మంది ఉన్నా, నేను నేరుగా వాడి చాంబర్లోకి వెళ్లిపోతుంటానులే” అని ఓ నవ్వు నవ్వి మళ్ళీ లోనికి వెళ్లబోయాడు.

“ప్లీజ్ సార్” అని చేయి అడ్డం పెట్టి, “మీ మొహం చూస్తే మీరు చెప్పేది నమ్మబుద్ధి కావడం లేదు సార్” చెప్పిందామె బుర్ర గోక్కుంటూ.

“నా మోహవే అంత, ఉండు” అని వెనక్కి తిరిగి జేబులో ఉన్న ఫేస్ పౌడర్ చల్లిన కర్చీఫ్ తీసి మొహానికి రాసుకుని, తరవాత వెనుక జేబులో ఉన్న చిన్న దువ్వెన తీసుకుని తల దువ్వుకుని ఇటు తిరిగి, “ఇప్పుడు చూడు ఓకేనా” అడిగాడు చిన్న నవ్వుతో.

“ఇప్పుడు అందంగా ఉన్నారు సార్.” చెప్పిందామె సిగ్గు పడిపోతూ.

“సిగ్గు తర్వాత, నువ్ ఇప్పుడు కూడా నన్ను పంపించకపోతే, నీ ఉద్యోగం ఊడిపోయినా ఊడిపోతుంది” చెప్పడంతో ఆమె తత్తరబిత్తరయిపోయి, “సారీ సార్, మీరు విస విసా విసుక్కునే లోపే, నేను పుసుక్కున లోనికివెళ్ళి కసుక్కున కనుక్కుని వస్తాను” అంటూ లోనికి వెళ్ళింది. తర్వాత కాసేపటికి ఆమె, “వ్వా” అంటూ రెండు చేతులతో కళ్ళు తుడుచుకుంటూ ఏడుస్తూ బయటికి వచ్చింది.

ఆమెని అలా చూసిన సుబ్బారావు, “అచ్చికిచ్చయిందా! అప్పటికీ నేను చెబుతూనే ఉన్నాను. నన్ను ఆపద్దూ అని, విన్నావా! ఇప్పుడు చూడు ఏం జరిగిందో! నన్ను ఇలా బయట ఆపినందుకు గాను, లోన వాడు నీ చెంప పగలగొట్టాడా.” అడిగాడు ఆసక్తిగా.

ఆ మాటలు వింటూనే ఆ పి.ఏ. “నన్ను కొట్టింది అందుకు కాదు, ఆ దరిద్రుడు వచ్చినప్పుడు, సెక్యూరిటీతో అట్నుండి అటే గెంటించేయక, మళ్ళీ నన్ను అడుగుతున్నావా అంటూ చెవి మెలేసి, ముక్కు మీద గుద్దారు.”

“అలాగా” అంటూ తలువు తోసుకుని లోనికి వెళ్ళిపోయాడు. శేఖరం ఎదురుగా కూర్చుంటూ “ఏవిట్రా నువ్వు చేసిన పని. ఆమెతో నిజంగా అలా అన్నావా! నేను విన్నది నిజమేనా, నా చెవుల్ని నేనే నమ్మలేకపోయాను తెలుసా” అడిగాడు సుబ్బారావు.

“ఏం చేయమంటావు చెప్పు. నువ్ ఎప్పుడు వచ్చినా నేను పరమ బిజీగా ఉన్నప్పుడే వస్తావ్. పైగా నువ్ వచ్చిన ప్రతిసారీ, ఎంతో కొంత డబ్బు అడిగి పట్టుకెళ్ళి పోతున్నావ్. ఏదో నానా తంటాలు పడి అలా, ఇలా సంపాదిస్తున్నాను. కొందరైతే ఆ ఫీజు ఇవ్వడానికి కూడా ఏడుస్తారు. మళ్ళీ ఇందులో నువ్వొచ్చి ఓ కథ చెప్పి, ఇస్తావా, చస్తావా అని నా పీకల మీద కూర్చుని ఒక పట్టాన కదలవ్. నువ్ కదలనంత వరకూ, నా కోసం వచ్చిన వాళ్ళని నేను కలవలేను. అందుకే, నేను ఇవాళ నిన్ను కలవకూడదనీ, డబ్బు ఇవ్వకూడదనీ నిర్ణయించుకున్నాను. అందుకే, మా అసిస్టెంట్‌తో అలా చెప్పించాను. కనుక నీకు నామీద కోపం రావడం సహజం. నీకు ఇక్కడ ఇంత అవమానం జరిగాక మళ్ళీ నా దగ్గరకి రావని నాకు తెలుసు.” అన్నాడు శేఖరం.

“భలే వాడివేరా శేకు, నువ్ బిజీగా ఉండి అలా మాట్లాడావని ఆ మాత్రం నేను అర్థం చేసుకోలేనా. నువు పైకి అలా పిచ్చి పట్టి తగ్గినట్టు మాట్లాడతావ్ కానీ, నీ మనసు బట్టర్ అని నాకు తెలీదా చెప్పు” అని చిన్న నవ్వుతో పైకి అనేసి, మనసులో ‘అమ్మదొంగా, నన్ను వదిలించుకోవాలని ఇలా ప్లాన్ వేశావా! నీ ప్లాన్లు నా దగ్గర పారవు. అయినా పాత రోజులు నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోను. నువ్వూ, నేనూ లాయర్లుగా ప్రాక్టీస్ మొదలు పెట్టిన కొత్తలో, నువ్వు కేసులు లేక ఈగలు తోలుకునేవాడివి. అప్పుడు నీకు ఎన్ని మార్లు సాయం చేశానని. నాకొచ్చిన కొన్ని కేసులు కూడా నీకే అప్పజేప్పేవాడ్ని. ఏదో హఠాత్తుగా నీ అదృష్టం కలిసి వచ్చి ఇలా పెద్ద లాయర్ అయిపోయావ్. అయితే అయ్యావ్, కానీ స్నేహితుడిని మర్చిపోతావా మిత్ర ద్రోహి. ఏదో నా టైమ్ బాలేక, మా ఆవిడకి ఒంట్లో బాలేక నీ దగ్గర రెండు మూడు సార్లు రెండు మూడు వేలు తీసుకున్నందుకే పెద్ద లక్షల్లో సాయం చేసినట్టు ఫీల్ అయిపోతున్నావ్’ అనుకున్నాడు.

శేఖరం కాస్త డీలా పడిపోతూ, “సరేలే వచ్చిన విషయం చెప్పు” అన్నాడు కాస్త నీరసంగా .

“ఏవీ లేదురా”, అని తన కుర్చీ కాస్త ముందుకు జరుపుకుని, కాస్త చిన్న స్వరంతో, “అదేరా ఆ రౌడీ రంగారావ్ గాడికి నువ్వే వేరే లాయర్‌తో చెప్పి బెయిల్ ఇప్పించావట. దాని కోసం, కేసు పెట్టిన వారి కాళ్ళూ, గడ్డాలూ పట్టుకున్నావట. నిజవేనా.” అడిగాడు సుబ్బారావు.

సుబ్బారావ్, ఆ విషయం చెప్పీ చెప్పగానే శేఖరం అదిరిపడుతూ “అదీ, మరీ, అదీ, ఈ విషయం నీకెలా తెల్సింది.” అడిగాడు అయోమయంగా చూసి నీళ్ళు చప్పరిస్తూ.

“తెల్సిందిరా తెల్సింది. నేను కూడా పక్క ఊళ్ళో చేస్తోంది లాయర్ ప్రాక్టీసే.”

ఆ మాట వింటూనే, “ఒరేయ్ నాయనా, ఈ విషయం ఎవరికీ” అని శేఖరం ఏదో చెప్పబోయేంతలో…

“వద్దు, ఇంకేం చెప్పొద్దు. వాడో కరుడు గట్టిన రౌడీ. మానవత్వం లేని మనిషి. అంతెందుకు, ఓ సారి నిన్నే కడుపులో గుద్దడం నాకు తెలుసు. అయినా సరే, నువ్వు ఇంత గొప్ప మానవత్వం ప్రదర్శించి, ఆ దరిద్రపెదవని బెయిల్ మీద జైల్ నుండి బయటికి తీసుకొచ్చావ్. నువ్వు గ్రేట్ రా గ్రేట్” అంటూ కళ్ళు తుడుచుకున్నాడు.

అది విన్న శేఖరం, కొంచెం నిదానించి ‘అట్టను చూసి పుస్తకం అంచనా వేసే మొహం వీడూనూ. ఇంకా నయం, ఆ రౌడీ రంగారావ్ నా మనిషని వీడికి తెలియలేదు. దొంగ సాక్ష్యాల కోసం మనుషుల్ని అప్పజెప్పడం, నా ఫీజు ఎగ్గొట్టే వారిని బెదిరించడం, రాజకీయ నాయకుల కొడుకులు అమ్మాయిల్ని ఏడిపించడవో, హిట్ అండ్ రన్ లాంటివి చేస్తే, వాడో, వాడి మనుషులో ఆ కేసులని మీదేసుకునేవారు. అలాంటి వాడు లోపల ఉంటే నాకు చేయి విరిగినట్టు అయిపోదూ. అందుకే విడిపించాను రా తింగర సన్నాసి’ అని మనసులో అనుకుని, పైకి “నీలా ఇలా అర్థం చేసుకునే వారు ఉండబట్టేరా, మా లాంటి వాళ్ళం ఇలాంటివి చేయగలుగుతున్నాం.” చెప్పాడు శేఖరం, అమాయకంగా మొహం పెట్టి.

అంతకు ముందే లోనికి రాబోతూ ఆగి, వాళ్ళ మాటలు విన్న శేఖరం పర్సనల్ అసిస్టెంటు కళ్ళు నులుముకుని మళ్ళీ చూసింది. అయినా, శేఖరం తోడేలు లాగా, సుబ్బారావు గొర్రెపోతులాగ కనిపించారు.

ఆమె కొద్ది సేపు తర్వాత వద్దాంలే అని వెళ్ళి ఆమె కుర్చీలో కూర్చుంది. కొంచెం సేపు తర్వాత బయటికి వచ్చిన సుబ్బారావుతో “ఏవిటి సార్ మీరు మరీ అక్కుపక్షిలా ఉన్నారే. మా సార్ చెప్పింది మీకు అలా అర్థం అయిందా” అడిగింది ఆశ్చర్యంగా.

“ఆబ్బే, ఆ దరిద్రుడి గురించి నాకు పూర్తిగా తెలుసు. కాకపోతే, నేను అలా అర్థం అయినట్టు నటించి, వాడ్ని ఆ నాలుగు ముక్కలూ పొగిడి కళ్ళు తుడుచుకోబట్టే, ఓ పది వేలు తీసి ఇచ్చాడు మరి. అట్టను చూసి పుస్తకాన్ని అంచనా వేయకు” చెప్పి అక్కడినుండి వెళ్లిపోయాడు సుబ్బారావు.

ఊహించని ఆ సమాధానంతో తెల్ల మొహం వేసింది పి.ఏ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here