మా మంచి అత్తగారు!

0
2

[శ్రీమతి కలవల గిరిజారాణి రచించిన ‘అత్తగారు – అమెరికా యాత్ర’ అనే పుస్తకానికి కొల్లూరి సోమ శంకర్ రాసిన ముందుమాటని అందిస్తున్నాము.]

[dropcap]‘అ[/dropcap]త్తగారు’ అన్న పదం చాలామందిలో ఒక రకమైన భయాన్ని కల్పిస్తుంది. కొన్ని దశాబ్దాల క్రితం వరకూ ఈ పదం అధికారానికి, ఆధిపత్యానికి చిహ్నంగా నిలిచింది. కట్నం కోసమో, ఇతర కారణాల వల్లో కోడళ్ళపై దాష్టికం చేసి వాళ్ళ జీవితాలని నరకం చేసిన అత్తగార్ల గురించి విన్నాం, వార్తల్లో చదివాం. సినిమాల్లో చూశాం, కథలు నవలలలో చదివాం. అలాగే అత్తగారిని ఇబ్బంది పెట్టిన కోడళ్ళూ ఉన్నారు.

సమాజంలో ఉమ్మడి కుటుంబాలు తగ్గాకా, అత్తగారి సాధింపులు, వేధింపులు కొంతమేర తగ్గాయి. కాలక్రమంలో అత్తగార్ల ధోరణిలోను, కోడళ్ళ ఆలోచనా విధానంలోనూ వచ్చిన మార్పుల వల్ల వారి మధ్య వైషమ్యాలు తగ్గాయి. అవసరార్థం సర్దుకుపోవడం అలవాటు చేసుకున్న అత్తాకోడళ్ళు – కొంతకాలానికి ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఒకరికొకరు ఆసరా అవుతూ కుటుంబాన్ని నిలబెట్టారు, నిలబెడుతున్నారు.

అయితే కోడళ్ళని రాచిరంపాన పెట్టిన అత్తగార్ల గాథలు జనాలకి తెలిసినంతగా, కోడళ్ళని కూతుళ్ళగా చూసుకుని ప్రేమని పంచిన అత్తగార్ల గురించి తెలియదు.

సమాజంలో మంచీచెడూ ఉన్నట్టే, వ్యక్తులలోనూ మంచి చెడూ ఉంటాయి. కొందరిలోని చెడును పట్టుకుని అందరినీ జనరలైజ్ చేయలేము. అత్తగార్ల దౌర్జన్యాలను చిత్రించిన సినిమాలు, రచనలు ఉన్నట్టే, అత్తగారి వ్యక్తిత్వాన్ని, వాత్సల్యాన్ని ప్రేక్షకులు/పాఠకుల ముందుంచిన సినిమాలు, రచనలు ఉన్నాయి. అత్తగారు ప్రధాన పాత్రగా ‘అత్తగారు-కొత్తకోడలు’, ‘అత్తగారూ జిందాబాద్’, ‘అత్తగారి పెత్తనం’ ‘అత్తా ఒకింటి కోడలే’, ‘అత్తగారూ స్వాగతం’ వంటి సినిమాలు రాగా, భానుమతి రామకృష్ణ గారు రాసిన ‘అత్తగారి కథలు’ పుస్తకం తెలుగు సాహిత్యంలో సుస్థిర స్థానం పొందింది.

తెలుగు సాహిత్యంలో అత్తగారిపై వస్తున్న మరో పుస్తకం ‘అత్తగారు.. అమెరికా యాత్ర’. ప్రముఖ హాస్య రచయిత్రి శ్రీమతి కలవల గిరిజారాణి సృజించిన ఈ రచనలో – ఒక తెలుగింటి అత్తగారు కొడుకు వద్దకు అమెరికా వెళ్ళి అక్కడ దాదాపు ఆరు నెలలు ఉండి – అక్కడి తెలుగువాళ్ళని కూడా ప్రభావితం చేసి, ఇండియాకి తిరిగివస్తారు. ఆ అత్తగారి ప్రేమాభిమానాలని, వ్యకిత్వాన్ని చిన్న చిన్న కథనాలుగా అల్లి కోడలు సుమిత్ర చెప్తున్నట్టుగా పాఠకులకు అందిస్తున్నారు గిరిజారాణి. ‘అత్తగారు.. అమెరికా యాత్ర’ పుస్తక రూపంలోకి రాక ముందు ‘సంచిక’ వెబ్ పత్రికలో 20 వారాల పాటు ప్రచురితం అయి పాఠకుల ఆదరణ పొందింది.

తెలుగువాళ్ళల్లో దాదాపు ఇంటికొకరుగా అమెరికాలో ఉంటున్న ఈ రోజుల్లో కొడుకు తల్లిదండ్రులో/కూతురి అమ్మానాన్నలో అమెరికా వెళ్ళక తప్పడం లేదు. చాలామందికి ఎంతోకొంత విదేశీయానం అనుభవం ఉంటోంది. ఒకప్పటిలా ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి అనే విషయాల్లో అస్సలు అవగాహన లేని కాలం కాదు. దేశాల మధ్య ప్రయాణాలు ఎక్కువైన ఈ రోజుల్లో ఎయిర్‍పోర్టులలో, విమానాల్లో ఎలా నడుచుకోవాలో చాలామందికి తెలిసే ఉంటుంది. అయినా.. కొంత కంగారు, బెరుకు ఉండడం సహజం.

సాధారణంగా – అమెరికా ప్రయాణం అంటే – ఇక్కడినుంచి మనవాళ్ళకి తీసుకెళ్ళాల్సిన వస్తువులు అమర్చుకోడంతోనూ, అక్కడ నుంచి ఇక్కడివాళ్ళకి తేవాల్సిన వస్తువుల జాబితా రూపొందించడంతోనూ మొదలవుతుంది. ఈ అత్తగారి కథ కూడా అంతే! అమెరికా చేరాక, తనకి విమానంలో ఎదురైన అనుభవాలను కొడుకూ కోడళ్ళతో పంచుకుని – కొద్ది రోజుల విశ్రాంతి తీసుకుంటారావిడ. జెట్‍లాగ్ ఇబ్బందిపెడుతుందావిడని.

కోడలు ఆవిడకి డిష్‌వాషర్, రూంబా ఎలా పనిచేస్తాయో చూపిస్తుంది. పెరట్లోని మొక్కల్ని, ఆకుకూరల్ని చూసి మెచ్చుకుంటారత్తగారు. సాయంత్రం బయటకి వెళ్ళినప్పుడు అత్తగారి పరిశీలనా శక్తిని గ్రహించి, మెచ్చుకుంటుంది కోడలు. ఓ రోజు వడియాలు వేయిద్దామని అత్తగారు చేసిన ప్రయత్నం వికటించి ఫైర్ అలారం మోగితే విస్తుపోయినా, ఆ దేశంలోని జాగ్రత్తలని అభినందిస్తారావిడ. కోడలితోనో, కొడుకుతోనో బయటికి వెళ్ళినప్పుడు ఆవిడ ఎన్నో విషయాలు పరిశీలిస్తారు, వాటి లోని మంచి చెడులను విశ్లేషిస్తారు. ఇక గుమ్మడి వడియాలు, కుమ్మొంకాయ పచ్చడి తయారు చేసుకోవడం నవ్విస్తుంది. అక్కడ ప్రతీదాని ధరని డాల్లర్లని రూపాయలతో పోల్చుకుని అమ్మో అనుకోవడం సాధారణంగా జరిగేదే. అయితే కరివేపాకు ఖరీదుకి హడలెత్తిపోయిన ఈ అత్తగారు మాత్రం సరదాగా ఓ పేరడీ పాట పాడుకుంటారు.

ఆవిడని ఆకర్షించిన మరో ముఖ్యమైన సాధనం అలెక్సా! అలెక్సా గురించి ఏకధాటిగా ఆవిడ చెప్పినవన్నీ వింటే మనమూ నోరెళ్ళబెట్టి ఉండిపోతాం. తెలిసిన కుటుంబాలని భోజనాలకి పిలిస్తే సుమారు 30మంది అవుతారు. అత్తగారే వండుతారు. తిన్నాకా, మిగిలిన పదార్థాలను పారేయకుండా, పాక్ చేసుకుని ఇళ్ళకు తీసుకువెళ్ళడం; ప్రతి ఒక్కరూ కూడా ఇది మా ఇల్లు కాదు, మేమెందుకు చేయాలీ, అనుకోకుండా.. ఎంచక్కా సర్ది పెట్టడం చూసి మెచ్చుకుంటారావిడ. అమెరికాలో పరిచయమైన ఓ తెలుగావిడ పిల్లలు తన చేత చాకిరీ చేయించడానికి పిలిపించారు అని వ్యాఖ్యానించినప్పుడు అత్తగారు అన్న మాటలు అక్షరసత్యాలు. అలాగే ఇండియా వెళ్తున్న రమ్య తన తల్లిదండ్రులకి కానుకలు కొని, అత్తగారికి మావగారికి ఏమీ కొనకపోవడాన్ని తప్పుబట్టి హెచ్చరించడంతో, రమ్య చిన్నబుచ్చుకుని వెళ్ళిపోతుంది. అమెరికాలోని రిచ్ పనివాళ్ళని చూసి ఆశ్చర్యడతారావిడ. హాలోవీన్‌కీ, దసరాకి ముడిపెట్టి తన చిన్నప్పటి విషయాలను గుర్తు చేసుకుంటారు. అమెరికాలో పిల్లలు కూడా చిన్నప్పటి నుండే నేర్చుకుని చేసే మంచి అలవాట్లు చాలా మెచ్చుకుంటారావిడ.

ఆరు నెలలు ఇట్టే గడిచిపోతాయి. ఇండియాకి తిరిగివచ్చేసే సమయం వస్తుంది. వెళ్ళేముందు అమెరికా క్రమశిక్షణ, జీవన విధానాన్ని మెచ్చుకున్నా, లోటుపాట్లు కూడా ఉన్నాయంటారు. అమెరికాలో ఉంటున్న పిల్లలు కనీసం ఏడాదికో, రెండేళ్ళకో ఇండియా వచ్చి తమ వారందరితోనూ చక్కగా గడిపి వెళ్ళాలని సూచిస్తారు.

ఇండియాకి వచ్చేముందు ఎయిర్‍పోర్టులో తనకి వీల్ చైర్ అవసరం లేదని, తను అన్నీ చూసుకోగలని చెప్పేసి విమానం ఎక్కేస్తారు. తాను ఇండియా వెళ్ళి ఉండలేను కాబట్టి, అత్తగారు అమెరికాలో అడ్జస్ట్ అయి, ఉంటానని ఒప్పుకుంటే తన దగ్గరే ఉంచేసుకోవాలనుకుంటుంది సుమిత్ర.

***

అభిమానం, వాత్సల్యం, ప్రేమ, పరిశీలనా శక్తి, విశ్లేషణా నైపుణ్యం, హాస్య చతురత, నేర్చుకునే స్వభావం, నేర్పించే గుణం – మెండుగా ఉన్న ఈ అత్తగారు పాఠకులకీ నచ్చేస్తారు. ‘మా మంచి అత్తగారు’ అనిపించుకుంటారు.

సరదాగా సాగుతూ, హాస్యపు జల్లులు కురిపిస్తూ సాగిన ఈ ‘అత్తగారి అమెరికా యాత్ర’ అందరినీ ఆకట్టుకుంటుందనడంలో సందేహం లేదు. కలవల గిరిజారాణి గారికి అభినందనలు.

***

అత్తగారు – అమెరికా యాత్ర
రచన: కలవల గిరిజారాణి
ప్రచురణ: అచ్చంగా తెలుగు ప్రచురణలు
పేజీలు: 96
వెల: ₹ 150/-
ప్రతులకు:
అచ్చంగా తెలుగు ప్రచురణలు
ఫోన్: 8558899478 (వాట్సప్ మాత్రమే)
ఆన్‍లైన్‍లో ఆర్డర్ చేయడానికి:
https://books.acchamgatelugu.com/product/attagaru-america-yatra/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here