Site icon Sanchika

అత్తగారు.. అమెరికా యాత్ర 11

బేక్‌యార్డులో బూడిద గుమ్మడి వడియాలు..

[dropcap]ఆ[/dropcap] రోజు ఇంట్లోకి కూరలు కూడా తీసుకోవాలి కదా అని ఇండియన్ సూపర్ మార్కెట్‌కి వెళ్ళాము. అక్కడ నవనవలాడుతూ కనపడిన కూరలన్నీ చూసి అచ్చెరువొందారు.

“అబ్బో.. ఇక్కడ బూడిద గుమ్మడి కాయ కూడా ఉందే! బుజ్జి శివలింగంలా వుంది. వడియాలు పెడతాను తీసుకో. అచ్చిగాడికి పచ్చొడియాలు చాలా ఇష్టం. వీటితోనే మొత్తం అన్నం లాగించేస్తాడు” అనేసరికి, ‘కుంభాసురుల వారి సంగతి నాకు తెలీదా, ఏంటి’.. అనుకున్నాను.

ఆరోజు ఆదివారం. ఈయన గారి సెలవు రోజు. ముందురోజు సాయంత్రం, మార్కెట్ నుంచి తెచ్చిన బూడిద గుమ్మడికాయని ముక్కలు తరిగి మూట కట్టి వుంచారు కదా? తల్లీ కొడుకులు ఇద్దరూ కలిసి, వాటిని నేను మెత్తగా రుబ్బి ఇచ్చిన మినప్పిండిలో కలిపి.. మా బేక్‌యార్డులో ఒక బల్ల వేసి, దాని ప్లాస్టిక్ కవర్ పరిచి.. వాళ్ళ ఊళ్ళో కబుర్లు చెప్పుకుంటూ వడియాలు పెట్టడం మొదలెట్టారు.

ఆ సీన్ మొత్తం ఫోటోలు, వీడియో తీస్తూ, “మొన్న మీరు తెచ్చిన వడియాలు వున్నాయి కదా అత్తయ్యా! మళ్లీ ఇప్పుడు మీకు ఈ శ్రమ ఎందుకూ?” అన్నాను.

లోపల లోపల మాత్రం.. ‘మా పెరట్లో అత్తగారు పెట్టే వడియాలు’, అంటూ ఈ వీడియోలు, ఫేస్బుక్ లోనూ, ఇన్‌స్టాలో ఎలా అప్‌లోడ్ చెయ్యాలా అనే ఆలోచనే.

“ఇందులో శ్రమ ఏముందీ? మీకు అమెరికాలో ఈ మాత్రం ఎండ రావడమే ఒక అపురూపం. అలాంటిది వచ్చిన ఎండను ఊరికే పోనిస్తే ఎలా? ఏదో ఇలా వడియాలు పెట్టి, ఇచ్చానంటే నాకూ తృప్తిగా వుంటుంది.” అన్నారు ఆవిడ.

“అమ్మా! మాటల్లో పడి పిండి మొత్తం వడియాలు పెట్టేయకు. కొంచెం పచ్చిగానే వేయించుకుందాం” అన్నాడు మా అచ్చిబాబు.

“అయ్యో! నీ సంగతి నాకు తెలీదట్రా! కొంచెం పచ్చిపిండిని ముందే లోపల ఉంచాను నీకోసం. ఇవి బాగా ఎండాక తర్వాత సగ్గుబియ్యం, పిండి వడియాలు, మినప వడియాలు, పొట్టు వడియాలు.. పెడతాను.” అంటూ చెయ్యి కడుక్కుందికి లేచారు.

అయితే రేపటి నుంచి ఇలా ఆ వడియాలు.. ఈ వడియాలు.. అంటూ,ఇక్కడ మా అత్తగారు.. అప్పడాలు, వడియాల కుటీర పరిశ్రమ నెలకొల్పుతారు కాబోలు అనుకున్నాను.

మరో రోజు బార్బెక్యూ ప్రహసనం..

“ఇదిగో! ఈ పెద్దొంకాయలు చూడు ఎంత బావున్నాయో! నవనవలాడిపోతున్నాయి. ఓ నాలుగు తీసుకో! కుంపట్లో కాల్చి కుమ్మొంకాయ పచ్చడి చేసుకుందాం. ఔనూ! మీకు కుంపటి లేదేమో కదూ! ఫర్వాలేదు మీ పెరట్లో.. అదేదో ఆ పన్నీరు ముక్కలు, రంగురంగుల బుంగ మిరపకాయల ముక్కలు కాల్చుకునే స్టాండ్ పొయ్యి వుందిగా! ఆ చట్రం మీద కాల్చి చేస్తాను” అన్నారు.

“అది స్టాండ్ పొయ్యి కాదు. దాన్ని బార్బెక్యూ అంటారు బామ్మా!” అన్నాడు మా వాడు.

“బార్బెక్యూనో, బస్సు టికెట్ల క్యూనో.. ఏదో ఒకటి. నిన్న మీరు పొడుగు పొడుగు స్టీలు ఊచలకి పన్నీరు ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, బుంగ మిరపకాయల ముక్కలు గుచ్చి కాల్చారు కదా! అమెరికా వాళ్ళు అవేవో ముక్కలు కాల్చుకుంటే, మీరు ఈ ముక్కలు కాలుస్తున్నారు. అంతే తేడా.. ఏ ఇంట్లో చూసినా ఇవే పొయ్యిలు. ఇదివరలో మా ఇంట్లో ఇలాగే గాడిపొయ్యిలు పర్మనెంటుగా తవ్వించుకుని వుండేవాళ్ళం. పెళ్ళిళ్ళ సమయంలో వంటలకు అవే వాడుకునే వాళ్ళం. ఇప్పుడు ఇక్కడ వీటిని చూస్తోంటే అవే గుర్తుకు వస్తున్నాయి.

అయినా ఆ బార్బెక్యూలో కాల్చిన పన్నీరు ముక్కలు రుచిగానే అనిపించాయి.. ముందు ఎలా వుంటాయో అని తినడానికి సంకోచించాను కానీ.. ‘పాలు విరుగుడుతో చేసినవే, బావుంటాయి, తినమని’ మీ నాన్న ఒకటే గొడవ. ఫర్వాలేదు బానే వున్నాయి. సెలవు రోజుల్లో మీ స్నేహితులు కుటుంబాలు అందరూ కలుసుకుంటే ఇలా బార్బెక్యూ పండగ చేసుకుంటూంటారట కదా?” అన్నారు.

‘హమ్మయ్య, నచ్చాయని ఓటు వేసారు’ మనసులో అనుకుని, “ఔను, అత్తయ్యా! అప్పుడప్పుడు అందరం కలుసుకున్నప్పుడు సరదాగా ఇలా బార్బెక్యూ సందడి చేసుకుంటాము.” అన్నాను.

“అమ్మా! నేను అప్పుడే చెప్పానా? బామ్మ.. బార్బెక్యూలకీ, బర్గర్లకీ అలవాటు అయిపోతుందని. ఇప్పుడు చూడు.. ఇక రోజూ చేయమంటుంది” మా వాడు అనేసరికి,

“ఏదీ? నోరంతా మొత్తం తెరిచి తింటారు అదేనా ఆ బర్గరు? ఇంకా నయం.. అలాంటివి నాకు పెట్టారంటే రేపే విమానం ఎక్కేస్తాను” ఎక్కడ పెడతామో అని కంగారు పడుతూ అన్నారు.

మా వాడు, ఈయనా ఒకటే నవ్వులు.

మొత్తానికి ఆ మర్నాడు, వంకాయలకి పైన దూదూమెరుగ్గా నూనె రాసి బార్బెక్యూ పొయ్యి మీద కాల్చారు. అవి కాలినంతసేపూ, వాటికి ముచ్చికలు లేకుండా బోడి గుండులా వున్నాయని, ఒకటే సణుగుడు. దానికి నేనేం చేసేది? ఇక్కడ ఈ మాత్రం అయినా దొరికాయి. ఇక ఇక్కడ దొరికే పిలక లేని కొబ్బరికాయను చూసి ఇంకేం అంటారో అనుకున్నాను.

“బామ్మా! ఈ కార్న్ కూడా బార్బెక్యూ లో కాల్చుకోవచ్చు” అంటూ మా వాడు తీసుకువచ్చాడు.

“ఎంచక్కా మొక్కజొన్న పొత్తులు అనకుండా, ఇంగ్లీష్ పేర్లు ఎందుకురా? ఇక్కడ నేను వున్నన్నాళ్ళూ నీకు తెలుగు నేర్పిస్తాను. తెలుగులోనే మాట్లాడాలి. సరేనా?” అంటూ మా వాడి చేత సరే అని అనిపించుకున్నారు.

గ్యాస్‌తో పనిచేసే బార్బెక్యూలు కాకుండా, పిడకలు, బొగ్గులతో నిప్పు రాజేసి చేసుకునేవి కూడా వుంటాయని ఈయన చెప్పగానే.. వాటి గురించి ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. పేడతో చేసిన పిడకలలాంటివి చూపిస్తే, “ఇవేం పిడకలు? మైసూర్ పాక్ ముక్కల్లా వున్నాయని” ఒకటే నవ్వడం మొదలెట్టారు. వీటిని చక్కగా పేకింగ్ చేసి, షాపుల్లోనూ, ఆన్‌లైన్ లోనూ అమ్ముతారు అని, విని ఒకటే ఆశ్చర్యపడడం.

ఈసారి భోగి పండుగనాడు ఇది అంటించి, భోగి పిడకలు, పనికిరాని చెక్కసామాను దీంట్లో వేసి చేసికుందామనీ, చలికాలంలో చలిమంట వేసుకుందామనీ సలహా ఇచ్చారు కూడా.

దోసకాయలు కూడా కుంపట్లో కాల్చి పచ్చడి చేసుకుంటే చాలా బావుంటుందని, మా కబుర్ల మధ్య టాపిక్ రావడం తడవు వెంటనే ఈయన ఆశతో దోసకాయలు కొనుక్కొచ్చి వాళ్ళమ్మ ముందు గుమ్మరించారు. పట్టలేని ఆవేశంతో ఆవిడ వాటిని బార్బెక్యూ పొయ్యి మీద కాల్చడం మొదలెట్టారు. అంతే ఇక.. అవి ఒక్కొక్కటీ కడప బాంబులు లాగా పేలి అంతెత్తున లేవడం మొదలెట్టాయి. బెదిరిపోయిన అత్తయ్య గారు, “అయ్యో! వీటికి ముందు చిన్న చిన్న గాట్లు పెట్టాలిరా, అప్పుడు ఇలా ఎగరవు. మర్చిపోయాను.” అన్నారు నెమ్మదిగా.

గాల్లోకి ఎగిరిన దోసకాయలు చూసి మా వాడు,

“బామ్మా! ఈ బాల్ గేమ్ బావుంది” అంటూ వాటిని కేచ్ పట్టుకోవడం మొదలెట్టాడు.

ఈ దెబ్బతో అత్తయ్య గారు మళ్లీ బార్బెక్యూ జోలికి రాలేదు.

వచ్చే వారం ఇంకేం హడావిడి చేస్తారో చూడాలి మరి..

Exit mobile version