Site icon Sanchika

అత్తగారు.. అమెరికా యాత్ర 19

[dropcap]మా[/dropcap] ఇంటికి ముందు వేపూ, వెనక వేపూ బోలెడంత ఖాళీ స్థలం వుంది. బాక్ యార్డుకైతే చుట్టూ చెక్కలతోనే ప్రహారీలా చేయించాం కానీ ముందు వేపు ఓపెన్ గానే వదిలేసాము. అక్కడ లాన్ పెంచినప్పటికీ మధ్య మధ్యలో పూల మొక్కలు కూడా వేసాము. ఇప్పుడు సీజన్ అయేసరికి రెండుమూడు రంగుల చామంతులు గుత్తులు గుత్తులుగా విరబూసాయి. గులాబీ పూవులైతే ఒకొక్కటీ అరచేయంత పూవు, కొమ్మలు ఆకులు కనపడనంతగా పూసాయి.

ఇలా ఓపెన్‌గా కనీసం ప్రహారీ గోడ కూడా లేకుండా వుండి, రోడ్డు మీదకు కనపడేలా వున్న ఈ పూలమొక్కలు చూసి అత్తయ్య గారు అననే అన్నారు.

“ఇదేంటే.. రోడ్డు మీద వెళ్ళేవారికి కనపడేలా పూవులు వుంటే జనం బతకనిస్తారా? చెట్టు దులిపేయరూ?” అన్నారు.

“లేదత్తయ్యా! ఇక్కడ ఎవరూ అలా పూవులు తెంపరు. చెట్టుకే వాడి రాలిపోతాయి తప్పించి ఎవరూ కొయ్యరు. నేనైనా బేక్ యార్డులో వున్న మొక్కలవి ఓ నాలుగు పువ్వులు కోసి దేముడికి పెడతానంతే.” అన్నాను.

“ఇక్కడ ఇళ్ళల్లోనే కాకుండా రోడ్ల మీద కూడా రకరకాల పువ్వుల మొక్కలని ఎంతందంగా పెంచుతున్నారో. మన రోడ్లు మీద అక్కడక్కడా గన్నేరు పూవుల మొక్కలాంటివి మనవాళ్ళు వేసినా అవి మట్టి కొట్టుకుని కనపడతాయి. అసలు మనూళ్ళో ఇలా తాజా పూవులు కనక ఎదురుగా కనపడితే చాలు.. పొద్దున్నే వాకింగ్‌కి వెళ్ళే అమ్మలక్కలు, అయ్యలన్నలు కూడా పట్టికొచ్చే ప్లాస్టిక్ కవర్లలోనో, చీర కొంగుల్లోనో గబగబా తెంపుకుని పోతారు. తెల్లారి లేచి చూస్తే ఒక్క పువ్వు కూడా వుండదు. మనవాకిట్లో వేసిన పారిజాతం పూవులు సూర్యోదయానికి అవే రాలతాయి కదా! అంతసేపు ఆగలేక చెట్టుని కొమ్మలు పట్టుకుని ఊపేసి బలవంతంగా పూవులు రాల్చేసి మరీ ఏరుకుపోతారు. పది రూపాయలు పెట్టి పూలు కొనుక్కోవడానికి చేతులు రావు మనవాళ్ళకి. వాళ్ళందరినీ తెచ్చి ఇక్కడ పడేయాలి.” గుక్క తిప్పుకోకుండా అన్నారు అత్తయ్య గారు.

“అసలు చెట్టు మీద నుంచి పువ్వులు దేవుని కోసమైనా.. మొత్తం కొయ్యకూడదట. కొన్ని పూవులు తుమ్మెదల కోసం, తేనెటీగల కోసం వదలాలిట. మనవాళ్ళు రేపటికి విచ్చుకోవాల్సిన మొగ్గలతో సహా ఊడ్చిపారేస్తారు. కొంచెం కూడా ఇంగిత జ్ఞానమే వుండదు. ఇక్కడ చూస్తే విచ్చుకున్న పువ్వుల బరువుతో కొమ్మలు భారంగా వంగిపోతున్నాయి. అందంగా కనపడే ఆ గులాబీలని, చేమంతులని చూసుకుంటూ వెడతారే కానీ మొక్క మీద చెయ్యి కూడా వెయ్యడం లేదు. మంచి సంస్కారం” అంటూ తెగ మెచ్చుకున్నారు.

ఒకసారి రోడ్డు మీద మేమందరం సరదాగా కబుర్లు చెప్పుకుంటూ వెడుతూంటే ఒకళ్ళ ఇంటి ముందు పెద్ద ఏపిల్ చెట్టు అత్తయ్య గారిని ఆకర్షించింది. చెట్టు నిండా ఎర్రటి పళ్ళు విరగకాసి వున్నాయి. చెయ్యి చాపితే చాలు పటుక్కున కోసేలా వుంది. రోడ్డున వెడుతున్న ఎవరూ కూడా అటువేపు కూడా చూడడం లేదు. ఆ చెట్టుని చూసి అత్తయ్య గారు చటుక్కున ఆగిపోయారు.

“ఎన్ని ఏపిల్ పళ్ళో? ఆ ఇంటిగల వాళ్ళు కోసుకోరు కాబోలు. ప్రహారీ గోడ కూడా లేదు. రోడ్డున పోతూ గబుక్కున కోసుకోవచ్చు. నాకే చేతులు ఎంత దురద పెడుతున్నాయో కోసేయాలని. ఇదే చెట్టు మన ఇంటి ముందుంటేనా? మనవాళ్ళు గోడెక్కి మరీ దులిపేసే వాళ్ళే. నేను ఎంతో ఇష్టంగా వేసుకున్న జామ, మామిడి, సీతాఫలం, దానిమ్మ, సపోటా కాపుకి వచ్చాయి. కానీ నేను ఒక్క పండు కూడా నోట పెట్టలేదంటే నమ్ము. అందకపోతే రాళ్ళతో కొట్టి దులిపేస్తారు రోడ్డు మీద ఆడుకునే పిల్లలు. ఎన్నిసార్లు అదిలించినా లాభం లేదు. అదరరు బెదరరు. ఇక్కడ అలా ఎవరూ కొయ్యరు. కోసినా ఇంటిగలవాళ్ళు ఏ పోలీసు రిపోర్టు ఇస్తారో అని కూడా భయం. ఇలా ఇక్కడ మెచ్చుకోవలసిన విషయాలు చాలానే వున్నాయి” అన్నారు.

ఇక్కడ పిల్లలకి కూడా చిన్నప్పటి నుండే నేర్చుకుని చేసే మంచి అలవాట్లు చాలా మెచ్చుకునేవారు అత్తయ్య గారు. ఎక్కడా కొంచెం కూడా చెత్త వేయకుండా డస్ట్ బిన్‌లో వేస్తారు. ఆడుకున్నాక బొమ్మలు వాటి ప్లేసులో సర్దేయడం వంటివి చూసి మెచ్చుకునేవారు. స్కూల్ లోనూ, ఇంట్లోనూ కూడా నేర్చుకున్న మంచి అలవాట్లు, పద్ధతులు పాటించేవారు. అటు అమెరికన్ లైఫ్‌తో అలవాటు పడిపోతూనే.. మన తెలుగువాళ్ళు తమ పిల్లలకు తమ మూలాలు మర్చిపోకుండా చక్కని స్పష్టతతో కూడిన తెలుగు భాష నేర్పించడంతో పాటు పద్యాలు, శ్లోకాలు, భగవద్గీత, విష్ణు సహస్రనామాలు వంటివి నేర్పిస్తున్నారు. అంతేకాకుండా సంగీతం, నాట్యం వంటి కళల్లో నిష్ణాతులని చేస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే మన దేశంలో వున్నట్లు అనిపిస్తోందని అత్తయ్య గారు అనేవారు.

మన పండగలు, సంస్కృతి సాంప్రదాయాలు ఇక్కడ వెల్లివిరియడం చూసి మెచ్చుకున్నారు. ఏ పండగైనా కూడా వదిలిపెట్టకుండా, చక్కగా చేసుకోవడం చూస్తే ముచ్చటగా వుందని మురిసిపోయారు. ఇక్కడ కూడా ఏ ఊరికి ఆ ఊళ్ళో మన దేవాలయాలలాగానే ఇక్కడ కూడా ఆలయ నిర్మాణం జరిగి, నిత్య పూజలు, అభిషేకాల వంటి వాటితోపాటుగా బ్రహ్మోత్సవాలు వంటివి జరపడం చూసి దేశం కాని దేశంలో కూడా మన దేవుడికి ఎంత భక్తిశ్రద్ధలతో చేస్తున్నారో కదా అని అన్నారు అత్తయ్య గారు.

Exit mobile version