[dropcap]ర[/dropcap]కరకాల అనుభవాలతోనూ, పరాయి దేశపు అలవాట్లు ఆకళింపు చేసుకుంటూ, అర్థం చేసుకుంటూ, వుండగానే ఆరునెలలు ఇట్టే గడిచిపోయాయి. అత్తయ్య గారు మొన్న మొన్ననే వచ్చినట్టుంది, అప్పుడే ఆరునెలలు గడిచిపోయాయా? అనిపించింది నాకు.
ఇప్పుడిప్పుడే ఇక్కడ వాతావరణానికి, అలవాటు పడుతున్నారో లేదో అప్పుడే తిరుగు ప్రయాణం తారీకు పది రోజుల్లోకి వచ్చేసింది.
“ఈ దేశంలో కొడుకు దగ్గర కరువుతీరా వుండడానికి కూడా లేదే? ఏంటో ఆరునెలలు కాగానే ఇలా తరిమేస్తారా?” నవ్వుతూ అన్నారు అత్తయ్య గారు.
“లేదమ్మా! ఇంకా వుండవచ్చు. నీ వీసా కాలం పొడిగిస్తాను” అమ్మ వెళ్ళిపోతుందనే బెంగ మొహంతో అన్నారు ఈయన .
“అబ్బే! ఊరికే అన్నాను లేరా! ఆరునెలలుగా ఇక్కడే వున్నాను. అక్కడ ఇల్లు వాకిలి చూసుకోవద్దూ! చెయ్యడానికి ఎంత మనుషుల్ని పెట్టినా మనం వున్న తీరు వేరు. అక్కడ మన మొక్కలు ఎలా వున్నాయో ఏంటో? మామిడి చెట్టు పూత, పిందె వచ్చుంటాయేమో? చింత చెట్టు ఎంత కాపు వచ్చిందో, వెళ్ళగానే చూసుకోవాలి కదా! అమెరికా రావడానికి ముందు ఏమో అనుకున్నాను కానీ, ఇప్పుడు ఫర్వాలేదు.. మళ్లీ మరోసారి ఎప్పుడైనా వస్తానులేరా!” అన్నారు అత్తయ్య గారు.
“వచ్చే సంవత్సరం తప్పకుండా రండి అత్తయ్య గారూ! ఈసారి మిమ్మల్ని నయాగరా వాటర్ ఫాల్స్ తీసుకువెడతాము. ఈ ట్రిప్‌లో మీ అబ్బాయికి కుదరలేదు కానీ, లేపోతే వెళ్ళే వాళ్ళమే.” అన్నాను.
“అలాగే తప్పకుండా వస్తాను. అక్కడ విమానం ఎక్కితే ఇక్కడ దిగడమేగా! ఇదేమంత పెద్ద కష్టమేమీ కాదులే” అన్నారు.
మరునాడు షాపింగ్‌కి వెళ్ళాము. ఆవిడ ఇండియాలో వాళ్ళ చుట్టాలకీ, స్నేహితులకీ, ఇరుగు పొరుగు వాళ్ళకీ బహుమతులు ఇవ్వడానికి, ఆవిడ ఏదడిగితే అవి కొందామని తీసుకువెళ్ళాను. ఆ ఖరీదులూ అవీ చూసి ఆవిడ, “ఇంతింత రేట్లు పెట్టి కొనక్కర్లేదే. వాళ్ళకి ఏం తెలుసు? మాట్లాడితే మీకేం మీ అబ్బాయి అమెరికాలో వున్నాడు. బోలెడు సంపాదన అంటూంటారు కానీ.. ఎంత చెట్టుకు అంత గాలి. ఇదివరలో నేనూ అలాగే అనుకునేదాన్ని. ఇప్పుడు ప్రత్యక్షంగా చూసాక తెలిసింది. ఇక్కడ ఈ ఖరీదులతో, ఖర్చులతో మీరెలా వుంటున్నారో కనపడుతూనే వుంది. ఇంతింత పెట్టి తీసుకెళ్ళినా వాళ్ళ కళ్ళకి ఆనవు. ఇంతేనా తెచ్చింది అంటారు. అందరికీ ఏదో ఒకటి కొనాలని వచ్చే ముందు అనుకున్నా కానీ.. ఇప్పుడు వద్దులే.” అన్నారు.
“ఫర్వాలేదు అత్తయ్యా! మీరు మొదటిసారి అమెరికా వచ్చారు. తీసుకెళ్ళకపోతే బావుండదు.” అంటూ నేను హేండ్ బేగులు, బట్టలు, మెత్తటి రగ్గులు ఇలా అందరికీ అన్నీ కొని ఇంటికి తీసుకువచ్చాను.
మంచిరోజు చూసి ఆవిడ పెట్టె సర్దడం మొదలెట్టాను.
పక్కన కుర్చీ వేసుకువి కూర్చున్నారు ఆవిడ.
“సుమిత్రా! అమెరికా బావుంది. ఇక్కడ క్రమశిక్షణ, జీవన విధానం నచ్చింది నాకు. అలా అని ఇక్కడ లోటుపాట్లు లేకపోలేవు. చాలా సమస్యలని అధిగమించి ఇక్కడ వుండగలగాలి. ఎప్పుడో వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయినవారి సంగతేమో కానీ, కొత్తగా వచ్చిన వారికి ఇక్కడ ఎప్పటికప్పుడు కొంత కష్టమే సుమీ! కానీ ఇక్కడకి సంపాదనల కోసమో, జీవితంలో ఎదుగుదల కోసమో, ఇక్కడ లైఫ్ కోసమో అందరూ వేలం వెర్రిగా వస్తునారు. కానీ మన దేశంలో మాత్రం తక్కువ ఏముంది? మంచి ఉద్యోగాలు, మంచి జీతాలూ అక్కడా వున్నాయి. ముఖ్యంగా అయిన వారందరూ దగ్గర్లో వుంటారు. కష్టమైనా, సుఖమైనా పంచుకుంచుదుకు తల్లితండ్రులు, తోబుట్టువులు వుంటారు. అమెరికాలో వుంటే, ఎప్పుడు ఏ అత్యవసర పరిస్థితి వస్తుందో తెలీదు. గబుక్కున రావాలంటే సామాన్యం కాదు. ఆ విషయం ఆలోచించాలే మీరు. పోనీ ఏడాదికో, రెండేళ్ళకో ఇండియా వచ్చి తమ వారందరితోనూ చక్కగా గడిపి వెళ్ళాలి. కనీసం అలా అయినా బావుంటుంది.” అన్నారు.
మళ్లీ తనే, “ఎంత ఎత్తుకు ఎదిగినా, ఏ దేశంలో వున్నా మన భారతదేశపు మూలాలు మర్చిపోకూడదు. ‘జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసి’ అంటారు. అది గుర్తుంచుకోవాలి” అన్నారు.
తర్వాత ఆఖరు వారం రోజుల పాటు, అత్తయ్య గారు వెళ్ళిపోతున్నారని, ఇక్కడ అత్తయ్య గారికి పరిచయమైన వారూ, మా స్నేహితులూ అందరూ పూటకొకరు వాళ్ళ ఇంటికి భోజనానికి పిలిచి, చీరలు, బహుమతులు ఇచ్చారు. అందరికీ తలలో నాలుకలా అయిపోయారు. వాళ్ళ ఇంట్లో వ్యక్తి వెడుతున్నట్లే బాధ పడ్డారు. మళ్లీ తొందరగా వచ్చేయండి ఆంటీ! మిమ్మల్ని మిస్ అవుతాము.. అని చెప్పారు.
వాళ్ళందరికీ కూడా అత్తయ్య గారు, నాకు చెప్పినదే తిరిగి చెప్పారు. ఏడాదికో, రెండేళ్ళకో మీ ఊరు వెళ్ళండి, మీ అమ్మానాన్నల దగ్గర కొంత కాలం గడపండి, లేదా వాళ్ళు ఇక్కడ అడ్జస్ట్ అవగలిగితే మీ దగ్గరకి తెచ్చేసుకోండి అని చెప్పేసరికి వాళ్ళందరూ తప్పకుండా అని మాటిచ్చారు.
అత్తయ్య గారి ప్రయాణం ఆరోజే. దారిలో తినడానికి టిఫిన్లు చేసి పెట్టాను. మా వాడు సరదాగా ఆవిడని ఆట పట్టిస్తూ, “బామ్మా! ఈసారి పులిహోర విమానంలో పైలట్లకి కూడా రుచి చూపించు.” అన్నాడు.
“భడవకానా! నేనంటే నీకు ఆటయిపోయిందిరా!” అంటూ వాడిని దగ్గరకు తీసుకుని ముద్దాడారు.
“ఈసారి నేను వచ్చేసరికల్లా భగవద్గీత శ్లోకాలు అన్నీ నేర్చుకుని వుండాలి” అన్నారు.
“ఓ.. అలాగే తప్పకుండా” అన్నాడు.
ఇక్కడ వున్నవాళ్ళు అత్తయ్య గారు చుట్టు పక్కల వువ్న పిల్లలందరినీ కూర్చోపెట్టి శతక పద్యాలు, శ్లోకాలు, భాగవత, రామాయణ కథలూ చెప్పేవారు. దాంతో మా వాడికి అవన్నీ బాగా వంట పట్టాయి.
ఎయిర్‌పోర్ట్‌లో ఈసారి వీల్ ఛైర్ వద్దని చెప్పి, ఆవిడే వెళ్ళగలనన్నారు. మేము వద్దని చెప్పినా వినలేదు.
“ఏదైనా అనుమానం వుంటే మీకు ఫోను చెయ్యడమో, ఎవరినైనా అడగడమో చేస్తాను. అంతేకానీ నాకు మాత్రం చక్రాల కుర్చీ వద్దు. ప్రస్తుతం కాళ్ళు చేతులు పని చేస్తున్నాయి.” అంటూ తనే స్వయంగా వెడతానన్నారు.
అత్తయ్య గారు వెడుతోంటే చాలా బాధనిపించింది నాకు. ఆవిడ దగ్గర ఎంతో నేర్చుకున్నాను. పెళ్ళి అయాక ఇండియాలో ఆవిడతో కలిసి వున్నదే లేదు. ఇప్పుడే ఎక్కువరోజులు గడిపాను. అత్తగారితో కలిసి వుండడమంటే, అమ్మో అనే మా స్నేహితురాళ్ళ మాటలు అన్నీ.. నాకు మాత్రం అబద్ధమనిపించింది. ఈవిడ నాకు అత్తగారులా కాకుండా అమ్మలాగా, అంతకుమించి స్నేహితురాలిగా మసిలారు. దాంతో ఆవిడని వదిలి వుండాలంటే మనసంతా భారంగా అయిపోయింది.
ఆవిడ చెప్పనట్లు.. నేను ప్రతి సంవత్సరం ఆవిడ దగ్గరకి వెళ్లి నెలరోజులైనా వుండి రావాలని నిశ్చయం చేసుకున్నాను.
ఇక్కడ ఎయిర్‌పోర్ట్‌లో మనలా కాకుండా, మేము కూడా లోపలిదాకా వెళ్ళే అవకాశం వుండటంతో మేమే సూట్కేస్‌లు చెకిన్ చేయించి, సెక్యూరిటీ చెకింగ్ దాటి లోపల గేటు దాకా వెళ్లి, విమానం కదలేదాకా వుండి, భారమైన మనసుతో తిరిగి వచ్చాము.
ఇంటికి వచ్చాక ఆవిడ లేకపోయేసరికి ఎంతో బోసిగా అనిపించింది. ఆరునెలలుగా ఆవిడ ఇక్కడ అడుగుపెట్టిన మొదలు.. తన అనుభవాలను వివరిస్తూ చెప్పినవన్నీ గుర్తు వచ్చాయి. అవన్నీ రాస్తే ఓ పెద్ద పుస్తకం అవుతుంది అనిపించింది. ఆవిడ గుర్తులతో,ఆ జ్ఞాపకాలతో మరో రోజుని ప్రారంభించాను.
(సమాప్తం)
గత ఇరవై వారాలుగా, నేను వ్రాసిన ‘అత్తగారు.. అమెరికా యాత్ర’ చదివి, అమూల్యమైన స్పందనలు అందించిన వారందరికీ ధన్యవాదాలు. ప్రచురించిన సంచిక సంపాదకులకి ప్రత్యేక కృతజ్ఞతలు.🙏
కలవల గిరిజా రాణి.