Site icon Sanchika

అత్తగారు.. అమెరికా యాత్ర – 3

ప్రయాణం సర్దుడు

[dropcap]అ[/dropcap]త్తగారి ప్రయాణం రెండు వారాల్లోకి వచ్చింది. మళ్లీ ఆరునెలలు కనపడరు కదా అని ఆవిడ తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, ఇంకా బంధు బలగం అందరూ పలకరించి వెడదామని వచ్చారు. రెండు మూడు రోజులు వాళ్ళకి వండి పెట్టడం సరిపోయిందని రాత్రి ఫోన్ చేసి చెప్పారు. వాళ్ళందరూ ఏవేవో పెద్ద లిస్టే ఇచ్చారు. ఎవరేం అడిగారో తర్వాత మర్చిపోతానేమో, పైగా ఏవో కంపెనీ పేర్లు, బ్రాండ్ పేర్లు చెప్పారు.. అవన్నీ నాకు గుర్తుండి చావవు అని మొత్తం అన్నీ పుస్తకంలోకి ఎక్కించానని, ఇక్కడికి వచ్చాక ఆ లిస్ట్ ప్రకారం అందరికీ కొనాలనీ ఆర్డర్లు రాకముందే ఇచ్చేసారు.

ఆవిడ ఇద్దరు చెల్లెళ్ళు, ఇద్దరు మరదళ్ళకీ కోచ్ హేండ్ బేగ్‌లు కొనాలట. ఇంకో నాలుగు కొని పడేస్తే ఎవరైనా చెప్పడం మర్చిపోతే ఉంటాయని అన్నారు. మగపిల్లలు వయసులవారీగా ఓ పదిహేను మంది తేలారు. అందరి సైజులూ నోట్ చేసుకున్నాను.. వాళ్ళందరికీ గేప్ టీ షర్టులు కచ్చితంగా తీసుకోవాలన్నారు. ఒకళ్ళకి తీసుకుని మరొకరికి తీసుకోకపోతే ఫీలవుతారట. ఇంకా తమ్ముళ్ళు ఇద్దరు, మరుదులిద్దరూ మొత్తం నాలుగు జతల నైక్ షూస్.. ఇవి కూడా సైజులతో సహా రాసుకున్నారట. నలుగురివీ పాదాలు కాయితం మీద అవుట్ లైన్ గీసి వాటిలో వాళ్ళ పేర్లు రాసారట. రాత్రి వీడియో కాల్ ఫోన్ చేసి ఇవన్నీ చూపించడమే సరిపోయింది ఆవిడకి. ఇక ఆడపిల్లలకి గోళ్ళ రంగులూ, పెదాలు రంగులూ కొనమన్నారు సుమిత్రా! అవైతే నీకు బాగా తెలుస్తాయికదా అని నీకు చెప్పుతున్నాను.. మొదటిసారి అమెరికా వస్తున్నాను. అక్కడ నుంచి వచ్చేటప్పుడు అందరికీ బహుమతులు తేకపోతే ఊరుకోరు. అక్కడ మీ అబ్బాయి పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు.. చూడ్డానికి వెళ్లి ఖాళీ చేతులూపుకుంటూ వస్తే బావుండదు అంటూ పెద్దక్క చెప్పింది. అందుకే అందరికీ తలాఓటి తీసుకోవాలి. నా అకౌంట్‌లో డబ్బు ఉంది. అది ఖర్చు పెడదాంలే.. అడిగినవన్నీ మాత్రం గుర్తుంచుకో.. అంటూ నాకు ఆర్డరు వేసారు.

వీడియో కాల్ కదా.. నా ముఖ భంగిమలు సక్రమంగా పెట్టి, “అలాగే అత్తయ్యా! మీరు వచ్చాక అన్నీ కొందాము. అన్నీ మీ అబ్బాయి కొంటారు.. మన రూపాయలు మీరు తెచ్చినా ఇక్కడే అవి పనికిరావు.” అంటూ వినమ్రంగా సమాధానం ఇచ్చాను. ఆవిడ తిరుగు ప్రయాణంలో ఈ షాపింగ్లు చేసి ఆవిడ అడిగినవన్నీ కొనాలని ఎలాగూ అనుకున్నాను. రాక రాక ఆవిడ ఇక్కడికి వస్తున్నారు.. అదే పదివేలు అనుకున్నాను.

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version