అత్తగారు.. అమెరికా యాత్ర 4

0
2

బరువులు.. తూకాలు

[dropcap]మా[/dropcap] అత్తగారి ప్రయాణం ఇక దగ్గరకి వచ్చేసిందని, అనుకున్నప్పటినుండే ఈయన చెపుతూ వచ్చారు.

“అమ్మా! రెండు పెద్ద సూట్‌కేస్‌లు పెట్టుకో. కొత్తవి తీసుకో. ఇంట్లో పాతవి వున్నాయి కదా అని వాటిలో సర్దుకోకు. అవి ఎప్పటివో బిసీ కాలం నాటివి. వాటి జిప్పులు అవీ ఎలా ఉన్నాయో ఏంటో?”

“ఇప్పుడు మళ్లీ ఆ ఖర్చు కూడా ఎందుకురా? పాత పెట్టెలు రిపేర్ చేయిస్తాలే” అనేసరికి, ఈయన గారు ఎగిరి పడ్డారు.

“అవి వద్దు. కొత్తవి తీసుకోమని రాజుకి చెప్పాను. వాడు తెస్తాడులే. వాటిలో నీ బట్టలూ, ఇక్కడకి తేవలిసినవీ అన్నీ కలిపి.. ఒకొక్కటీ 21 కేజీలకంటే ఎక్కువ ఉండకుండా చూడాలి. నువ్వు అన్నీ సర్దుకున్నాక, రాజుగాడిని పిలు.. వాటి బరువు చూస్తాడు. చిన్న సూట్‌కేస్‌ 7 కేజీలు ఉండాలి అనవసరంగా ఎక్కువ ఎక్కువ అవీ ఇవీ కొని పెట్టకు.. బరువు పెంచకు.. అన్నీ ఇక్కడ దొరుకుతూనే ఉన్నాయి” అని, చిలకకి చెప్పినట్లు చెప్పారు.

అబ్బే.. వింటే కదూ! రెండు పెట్టెలకీ పెట్టాల్సినవి పెట్టగా మరో పెట్టెడు సామాను మిగిలాయట.

అసలు ఏవేం సర్దారు? అని అడిగితే…

ఆవిడ కుంకుడుకాయలతో తప్ప తలంటుకోరు కదా అవో మూడు కేజీలు తెప్పించి, పొడి కొట్టించారట. అదో పెద్ద పేకెట్ అయిందన్నారు.

అసలు మామూలుగానే… మా అత్తయ్య గారికి పూజలూ పునస్కారాలూ ఎక్కువ. ఇక కార్తీకమాసం అంటే చెప్పనవసరం లేదు. కార్తీకమాసంలో ప్రతిరోజూ ఆవిడ రెండు పూటలా దేవుని మందిరంలోనూ, తులసమ్మ దగ్గరా, వీధి గడిప దగ్గరా తప్పనిసరిగా దీపాలు వెలిగిస్తారు. అందుకోసమని ఆవిడ తన ఊరినించి తెప్పించిన ఆవునెయ్యి ఐదుకేజీలట.

ఐదు కేజీలంటే మాటలా? బోలెడంత బరువు. ఇంతింత బరువులు తెస్తోంటో వెయిట్ ఎందుకు పెరగదూ?

అప్పటికీ ఈయనతో చెప్పాను… మన ఊళ్ళలో లాగా వీధి గుమ్మంలో దీపాలు పెడితే ఇబ్బంది అవుతుందని. అప్పటి సంగతి అప్పుడు చూద్దామని కొట్టి పారేసారు. కార్తీకమాసంలో ఈవిడ తెల్లవారుజామున చేసే చన్నీటి స్నానాలు ఇక్కడ ఎలా కుదురుతాయో? ఆవిడకి ఎలా నచ్చచెప్పాలో తలుచుకుంటేనే కంగారొస్తోంది.

చాలా నీటి స్నానాలు అని గనుక ఆవిడ మంకుపట్టు పడితే ఇక కొయ్యబారిపోవడమే. అసలే చలి దేశం. చలికాలం. ఎలాగైనా వద్దని నచ్చచెప్పినా అనుకున్నాను.

ఇక ఈయనగారి కోరికలు మేర తీసుకుని వచ్చే చింతకాయ పచ్చడి మూడు కేజీలు మిగితా పచ్చళ్ళు తలా ఓ కేజి.. ఇంకా జంతికలు, చేగోడీలు, చెక్కలు, మిక్సరు, కజ్జికాయలు, బందరు లడ్డు.. ఇలా చెప్పుతూ వెడితే పుల్లారెడ్డి స్వీటు షాపు మొత్తం అయేలా ఉంది.. వీటన్నిటితోనూ ఓ సూట్‌కేస్‌ నిండిపోయిందట. మరో సూట్‌కేస్‌కి ఇక్కడ వాళ్ళ వాళ్ళకి అందివ్వమని చెప్పి ఆ బజారులో ఉండే వాళ్లు నలుగురైదుగురు ఇచ్చిన పేకెట్లు ఓ పదికేజీలపైనే తేలాయట. శ్రావణమాసంలో వరలక్ష్మి వ్రతం అని నా కోసం ఓ రెండు బరువైన కంచిపట్టు చీరలు కూడా కొన్నారట. ఇలా ఇవన్నీ పెట్టేసరికి పాపం ఆవిడ చీరలు ఓ పది కన్నా ఎక్కువ పట్టలేదట. ఆ విషయం ఫోన్‌లో… చెపుతూ…

“సుమిత్రా! ఏం చేయమంటావే? వెంకటగిరి, మంగళగిరి, ఉప్పాడ అన్నీ కలిపి పాతిక దాకా సిద్ధం చేసుకున్నాను. అక్కడ ఆరునెలలు ఉండాలని అన్నారుకదా! నాకేమో రోజుకి రెండు చీరలు కట్టుకోవడం అలవాటు.. ఇప్పుడేమో అవన్నీ పట్టడం లేదు.

వారం రోజుల నుంచి.. చీరలు.. పెట్టెలో.. పెట్టనూ.. తియ్యనూ.. పెట్టనూ.. తియ్యనూ.. ఇదే పని.. ఒకొక్క పెట్టే.. ఇరవైమూడు కేజీల కంటే.. గురివింద గింజంత బరువు కూడా వుండకూడదట కదా!

ఏడాది నుంచి కూడపెట్టిన చీరలు.. అన్నీ ఇస్త్రీ దొంతరలు.. పెట్టెలో పేర్చి.. తూకం చూసేసరికి.. అమ్మో.. ఆరు కేజీలు ఎక్కువయ్యాయి.

గద్వాల చీర.. ప్లీజ్.. నన్ను తీసేయకు.. నాకు నీతో రావాలని వుంది అనగానే జాలి పొంగివచ్చి.. సరే సరే అని.. పక్కన వున్న కంచి పట్టు చీర కేసి చూసాను. ఎంచి.. ఎంచి నన్ను కొన్నావు.. ఇంచి కూడా జాలి లేదా.. నా మీద అంది.. ఏం చేస్తా! తప్పదు.. బరువులో అన్ని చీరలకన్నా మించి వున్నావు.. తిరిగి రాగానే.. దీపావళికి నిన్నే కట్టుకుంటా.. అందాక జాగ్రత్తగా బీరువాలో వుండు… అని దాన్ని ఊరడించాను. ఆ తర్వాత మనసు దిటవు పరుచుకుని.. ఓ రెండు వెంకటగిరిలు.. మరో రెండు మంగళగిరిలు.. వీటికీ మంగళం పాడేసా.. ఇప్పుడు సరిపోవచ్చేమో..

ఇంతలో అచ్చిగాడి అభ్యర్ధన గుర్తొచ్చింది. వీడు అమ్మనీ మర్చిపోడు. ఆవకాయనీ మర్చిపోడు.. అమ్మ కూచి.. వాడు అడిగిన ఆవకాయ కోసం.. ఆరణి చీరలు రెండు కాన్సిల్..

రోజూ వారీ డ్రస్సులూ.. ఫంక్షన్ లకి మరో రెండు డ్రస్సులు తీసుకురమ్మన్నావు కదా! ముద్దుల కోడలి ముచ్చట ముఖ్యం… వెరసి మరో నాలుగైదు.. మడతలిప్పని నా చీరలు.. పెట్లోంచి బీరువాలోకి వెళ్లి పోయాయి..

బామ్మా.. ఐ వాంట్.. బొమ్మలూ.. డ్రస్సులూ.. స్వీట్లూ.. అవీ.. ఇవీ.. అబ్బో… ఈ లిస్ట్ మా బుల్లి ఆంజనేయుడి తోకే… ఎక్కడా.. ఏదీ కత్తిరించకూడదుగా.. వాడి ముద్దు మాటలకి నేను ఫిదా కదా…. వాడు చెప్పడం. వెంటనే కుప్పడం చీరలు రెండు కట్..

కోరి అడిగినవి కొన్నీ.. కోరకుండానే నేను కొన్నవి కొన్నీ.. పచ్చళ్ళు.. పొడులూ.. స్వీట్లు, హాట్లు.. ఇలా.. ఇలా.. అలా పెంచుకుంటూ పోగా..

మిగిలినవి లెక్కేస్తే… పది చీరలు… తప్పదు మరి..

కట్టిన చీర తిరిగి కట్టకుండా ఏడాదికి పైగా నడిపించే నేను.. నా బరువుకే.. వెరవని నేను.. .. ఇప్పుడు.. అలాంటిది.. ఈ సూట్‌కేస్‌ల ఇరవైమూడు కేజీల బరువుకి.. పెరిగిందని బావురుమనాల్సివస్తోంది. మీరేమో ఇక్కడ గంజిలు, ఇస్త్రీలు కుదరవని ముందే నొక్కి వక్కాణించేసారు.. ఆ వాషింగ్ మిషన్లలో.. జరీచీరలూ.. భారీ చీరలూ.. కుదరవాయె.. అందుకే.. ఇట్టే ఆరిపోతాయనీ.. బరువుకి వెరవక్కర్లేదనీ.. జర్రున జారే.. జార్జెట్లో.. నైలక్సులో.. తెచ్చుకోమన్నావు.. అవి నా వల్ల చచ్చినా కుదరదు. సరే… ఉన్నవాటితోనే సరి పెట్టుకుంటాలే… తప్పదుగా! అయినా మన వూళ్లో.. అందరూ మనకి తెలిసినవాళ్ళేకదా.. ఏ చీర కట్టుకున్నా.. ఏమనుకోరు.. ఫర్వాలేదు.. అలాగే కొత్త వూళ్లో.. మనకెవరూ తెలీదు కదా.. ఏ చీర కట్టుకున్నా పట్టించుకోరు… మరేం ఫర్వాలేదులే.” ఏకధాటిగా చెప్పిన ఆవిడ చీరలు సర్దుళ్శ గురించి విని నోరు తెరిచాను.

మళ్లీ ఆవిడే.. “ఎంత ఉతికి కట్టినా మరీ పది చీరలతో ఎలా ఉండాలే?” దీనంగా అడిగేసరికి పాపం జాలేసింది. వెంటనే నా కొడుకు “ఫర్వాలేదు బామ్మ! ఇక్కడకి వచ్చాక ఫేంట్లు, షర్టులు కొనుక్కుందువుగాని” అన్నాడు. నవ్వు రాబోయి ఆగింది నాకు. “ఛీ.ఛీ.. ఆ పంట్లాములు, చొక్కాలు నేను వేసుకోవడం ఏంట్రా! రావడమయినా మానేస్తాకానీ! ఆ బట్టలు మాత్రం చచ్చినా వేసుకోను” అన్నారావిడ.

“మరెందుకు బామ్మా! వాళ్ళెవరో, వాళ్ల వాళ్లకి ఇక్కడ ఇమ్మన్నవన్నీ పుచ్చుకున్నావు? అయినా ఇక్కడ లోకల్‌గా ఉండే వాళ్ళు కాదు.. డైరక్ట్‌గా చేతికి ఇవ్వలేము.. మళ్లీ ఇక్కడ నుంచి పార్శిల్ వేయాలి. అవి కనక నువ్వు తీసుకెడతానని ఒప్పుకోకుండా ఉంటే నీ చీరలు అన్నీ పట్టేసేవే” అన్నాడు.

“అదేంట్రా! అలా తీసుకెళ్ళను అని ముఖం మీదే ఎలా చెప్పమంటావు? పాపం వాళ్లు అడిగేసరికి కాదనలేక తీసుకున్నాను. వాళ్ళందరూ ఇక్కడ నాకెంతో సాయంగా ఉంటారు. అయినా ఈ విమానం వాళ్ళకి మరీ ఇంత పట్టింపులేంటీ? మన పెట్టెలు, మన వస్తువులు మనిష్టం వచ్చినట్టు కుక్కనీకుండా.. ఇంతే తేవాలీ అనడం ఏంటీ? అదే ఇక్కడ మా బస్సుల్లోనూ, రైళ్లలోనూ ఎవ్వడూ అడగడు” నిష్ఠురంగా అన్నారు అత్తయ్య గారు.

“ఫర్వాలేదు అత్తయ్య గారూ! మరో పెట్టెలో మీ చీరలు సర్దుకోండి.. ఎక్కువ బరువుకి మీ అబ్బాయి ఏదో ఏర్పాటు చేస్తారులెండి”అంటూ ఊరడించాను.

దాంతో మూడు సూట్‌కేసులూ, మరో కేబిన్ పెట్టె తోనూ రెడీ అయ్యారు. ఎయిర్ పోర్ట్‌లో వీల్ ఛైర్ ఏర్పాటు చేశానని చెప్పడంతో, దానికోసం గోల పెట్టేసారీవిడ. “అదేంట్రా! నేనేమైనా జబ్బు దాన్నా? ఆ చక్రాల కుర్చీలో కూర్చుంటే హాస్పిటల్‌లో వెళ్ళినట్లుంటుంది. నాకు వద్దు. శుభ్రంగా ఎంత దూరమైనా నడుస్తాను” అందావిడ.

“అది కాదమ్మా! నువ్వు నడవలేవని కాదు. కానీ ఆ ఎయిర్‌పోర్ట్‌లలో ఎటువేపు వెళ్ళాలి అవీ నువ్వు కనుక్కోవడం కష్టం. భాష కూడా తెలీదు నీకు. వీల్ ఛైర్ అయితే అన్నీ వాళ్ళే చూసుకుంటారు. ఇక్కడకి వచ్చే పేరెంట్స్ కోసం పిల్లలు ఇలాగే ఏర్పాటు చేస్తారు.” అనేసరికి ఆవిడకి సరే అనక తప్పలేదు. ఆవిడ ఫోన్‌కి ఇంటర్నేషనల్ రోమింగ్ ఏర్పాటు చేసారీయన. ఇక రేపు ఎయిర్‌పోర్ట్ నుంచి వచ్చే ఫోను కోసం ఎదురు చూడాలి అనుకున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here