ఇంటికి వచ్చాక..
[dropcap]ఇం[/dropcap]టికి రాగానే, అత్తయ్య గారి పెట్టెలు ముందు హాల్లో ఓ పక్కగా పెట్టాము. తరువాత నెమ్మదిగా పైన రూమ్ లోకి చేర్చారు ఈయన.
“అమ్మకి ముందు వేడిగా కాఫీ ఇయ్యి” ఈయన మాట ఇంకా నోట్లో ఉండగానే పొగలు కక్కే ఫిల్టర్ కాఫీ తెచ్చిచ్చాను ఆవిడకి. కాఫీ గ్లాస్ చూడగానే అత్తయ్యగారి ముఖం చాటంత అయింది.
“ఆ విమానంలో కాఫీ తుర్రునీళ్ళే… అస్సలు తాగబుద్ధి కాలేదనుకో! ఎప్పుడు ఇంటికి చేరతానా? ఎప్పుడు ఫిల్టర్ కాఫీ తాగుతానా? అనుకుంటూ కూర్చున్నా!” అంటూ చటుక్కున గ్లాసందుకున్నారు. ఆవిడ అసలే కాఫీగతప్రాణి. ఎన్ని సార్లు ఇచ్చినా వద్దనరు. మా మామగారు ఉన్న రోజుల్లో రావణాసురుడి కాష్టంలాగా కాఫీ పొయ్యి వెలుగుతూనే ఉండేదని ఎప్పుడూ అంటూ ఉంటారావిడ. ఆ తర్వాత ఆ పిచ్చి కొంత తగ్గినా, రోజుకి నాలుగుసార్లైనా ఆవిడకి కాఫీ తప్పకుండా పడాలి.
ఖాళీ గ్లాసు అందుకని, “ముందు స్నానానికి పదండి అత్తయ్యా!” అంటూ బాత్ రూమ్‌లో కుళాయి ఎటు తిప్పితే వేణ్ణీళ్లు వచ్చేదీ చూపించాను.
“ఇదేంటే బాబూ! ఈ తొట్టె స్నానం నేనెక్కడ చేసేదీ? నా వల్ల కాదు” అక్కడ ఆ బాత్ టబ్ చూడగానే కంగారుగా అన్నారు.
“తొట్టె స్నానం కాదు లెండి అత్తయ్యా! ఇదిగో టబ్ లోనే మీకు స్టూల్ పెడుతున్నాను. నీళ్లు మాత్రం బయటకి చిందకుండా ఈ ప్లాస్టిక్ కర్టెన్ వేసేయండి.” అంటూ చెప్పాను.
“ఏంటో, అన్నీ విడ్డూరాలే! అమెరికా వింతలు. స్నానాలు గదిలో నీళ్ళు కింద పడకుండా ఎలానో.. ఏంటో..” గొణుక్కున్నారు.
“మీ చీరలు నేను వాషింగ్ మెషీన్‌లో వేస్తాను అత్తయ్యా! మీరు జాడించుకోకండి. ఆరేసుకుందికి ఇక్కడ అనువుగా ఉండదు. డ్రైయ్యర్‌లో ఆరిపోతాయి.” అన్నాను. స్నానం అవగానే చీర జాడించుకోవడం అలవాటు ఆవిడకి.
“ఈ తొట్టెలోకి ఎలా దిగాలే? ఇంతెత్తున ఉంది” అంటూనే… నెమ్మదిగా నా చేయందుకుని, బాత్ టబ్ అంచున కూర్చొని అటువైపుకు దిగారు.
“బామ్మా! ఇదే మొదటిరోజు కదా! నెమ్మదిగా అలవాటయిపోతుందిలే!” అంటూ మనవడు అనేసరికి ,
“ఏం అలవాటో, ఏంటో… అంతెత్తున వున్న ఈ తొట్టెలోనుండి బయటకి దిగేలోగా బొక్కబోర్లా పడతానేమో అని భయంగా వుంది. అయినా కింద నీళ్ల చుక్క పడితే చాలు… కార్పెట్టూ కింద చెక్క నేలా పాడయిపోతాయట. ఈ ఇళ్ళేంట్రా బాబూ! మరీ చెక్కతో కట్టారు. మా ఊళ్లో మన ఇళ్లు పటిష్టమైన నాగార్జున సిమెంటుతో కట్టాము. మేకు కొట్టాలంటే సుత్తి విరిగిపోవడమే తప్ప మేకు మాత్రం దిగదు. ఇక్కడ గుండుసూది కూడా ఇట్టే దిగిపోతుంది” ఇలా ఈ మాటలు ఇంకా ఎక్కడ దాకా సాగేవో కానీ, “స్నానం కానిచ్చుకొని రా అమ్మా! ఆకలి దంచేస్తోంది” అంటూ ఈయన అన్నారు.
అత్తయ్య గారు వచ్చేసరికి, భోజనం వడ్డించి రెడీగా ఉంచాను. అన్నీ ఎంతో ఇష్టంగా తిన్నారు. “మన దేశం కాకపోయినా.. మన కూరలూ అవీ బానే దొరికేస్తున్నాయి మీకు” అన్నారు.
భోజనం తర్వాత సూట్కేస్‌లు అన్నీ తెరిచారు. చింతకాయ పచ్చడి సీసా చూడగానే మావారి ముఖం వెయ్యి వాల్టుల బల్బులాగా వెలిగిపోయింది.
“అయ్యో! ఇందాకే పెట్టె తెరవాల్సింది, పాపం, అచ్చిగాడు భోజనలో తినేవాడే… గుర్తేరాలేదు నాకు” అంటూ తెగ బాధ పడిపోయారు అత్తయ్య గారు.
“ఫర్వాలేదు అత్తయ్యా! రాత్రికి ఈయన దీంతోనే వాయిస్తారులెండి.” అన్నాను కచ్చగా.
మాకోసం తీసుకువచ్చిన మిగిలిన పచ్చళ్ళు, బట్టలు, చీరలు మొత్తం బయటకి తీసారు.
అలాగే అక్కడ ఇరుగు పొరుగు… ఇక్కడ వాళ్ళ వాళ్ళ చుట్టాలకి, పిల్లలకి ఇవ్వాల్సిన సామాను తీసి,ఏ పేకెట్ ఎవరికి పంపాలో చెప్పారు.
కాస్త దగ్గరగా వుండే వారికి, ఈయన ఫోన్ చేసి, “అమ్మ ఈరోజే వచ్చింది.. మీ వీలైనప్పుడు వచ్చి, మీకోసం వచ్చిన పేకేజి తీసుకువెళ్ళండి.” అని చెప్పారు.
వచ్చే శని, ఆదివారాల్లో వచ్చి, తీసుకుంటామని చెప్పారు అందరూ.
మిగతా దూరం వారి అడ్రసులు తీసుకున్నారు ఈయన. రేపు వీలు చూసుకుని అవన్నీ పార్శిల్ పంపుతానని చెప్పారు.
“అలా పార్శిల్ పంపితే బావుండదేమో? మనమే తీసుకుని వెళ్లి ఇద్దాము” అన్నారు అత్తయ్య.
“అమ్మా! మనం వెళ్ళడానికి వీళ్ళేం పక్కనే లేరు. ఒకే దేశం అన్నమాటే కానీ… వేరే చాలా దూరంగా వుంటారు. విమానంలోనే వెళ్ళాలి.” అన్నారు ఈయన.
“ఔనా! వాళ్ళూ అమెరికాలోనే వుంటారంటే ఒక్కచోటే అనుకున్నాను. ఇక్కడే ఇంత దూరమా? ఔనులే… మన దేశంలో అయినా, పేరుకి ఇండియాలో అంటారు కానీ, సుందరి మనవడు ఢిల్లీలోనూ, మనవరాలు బెంగళూరు లోనూ వుంటున్నారు. ఇలాగే విమానం లోనే వెడుతూంటారు. ఇక్కడా అలాగే కామోసు. సరే పార్శిల్ పంపేయి.” అన్నారు.
ఇంకా ఏవో కబుర్లు చెపుతూనే వున్నారు.
మధ్య మధ్యలో ఆవలిస్తూ…
“అమ్మా! కాసేపు నిద్ర ఆపుకో. ఇప్పుడు పడుతున్నావంటే మళ్ళీ మధ్య రాత్రిలో మెలుకువ వచ్చేస్తుంది?” ఈయన అంటూనే వున్నారు.
అలాగలాగే… అంటూనే అత్తయ్య గారు నెమ్మదిగా సోఫాలోకి జారిపోయారు. చిన్నపాటి గురక కూడాను. పాపం, ఇరవైనాలుగు గంటల పాటు ఆ విమానంలో, నిద్ర లేకుండా, నీలుక్కుపోయి కూర్చుని కూర్చుని నిద్ర సరిగ్గా పట్టుండదు. ఈ జెట్‌లాగ్ ఓ వారం రోజులపాటు తప్పదు… అనుకుంటూ, “లోపల బెడ్ రూమ్‌లో పడుకోండత్తయ్యా!” నెమ్మదిగా తట్టి లేపాను కానీ, లేవడం లేదు.
ఆ పడుకోవడం పడుకోవడం… లేచేసరికి రాత్రి ఎనిమిది అయిపోయింది. కాసేపు ఆవిడకి అది ఉదయమో, సాయంత్రమో, రాత్రో… అర్ధం కాని స్ధితిలో ఉండిపోయారు.
ఆ తర్వాత నెమ్మదిగా పూర్తి మెలకువ తెచ్చుకుని, కొడుకుతోనూ, మనవలతో నూ కబుర్లు చెప్పుకుంటూ భోజనం కానిచ్చారు. మేమందరం ఆవలిస్తూ ఉండేసరికి… “ఇక్కడ ఇప్పుడు రాత్రయింది పడుకోవాలి కదూ!” అంటూ మాతో పాటు మంచమెక్కారు కానీ, నిద్ర పోతే ఒట్టు. ఆవిడ పగలంతా కునుకు తీసేసరికి… ఇప్పుడు నిద్ర పట్టడం లేదు. ఈ సమస్య ఇండియా నుంచి అమెరికా రాగానే ఇంచుమించు అందరికీ ఉండేదే! అర్ధరాత్రి ఆకలేస్తుంది. తినడానికి ఏముందా అని చూసుకుంటారు. ఆ విషయం నాకు తెలుసు కాబట్టి, డైనింగ్ టేబుల్ మీద, పళ్లు, బ్రెడ్ బటర్ జామ్, ఇంకా కొన్ని తినుబండారాలు పెట్టి, ఆకలేస్తే తినమని చెప్పాను. అవీ సరిపోకపోతే నన్ను లేపమని చెప్పాను. ఇడ్లీ పిండి, దోశ పిండి ఉంది టిఫిన్ చేసిస్తానని చెపితే, అర్ధరాత్రి అంకమ్మ శివాలు లాగా అప్పుడు దోశలేంటీ? అన్నారు కానీ, పాపం ఆకలికి ఆగలేక మధ్య రాత్రి నన్ను లేపారు. వేడిగా నాలుగు దోశలు వేసిచ్చాను.
“ఇలా కాదత్తయ్యా! రేపు మధ్యాహ్నం నిద్ర ఆపుకోండి. ఆ టైమ్‌లో బయటకి తీసుకెడతాను. అప్పుడు రాత్రి మంచి నిద్ర పడుతుంది” అన్నాను.
“ఇదేం జెట్‌లాగే తల్లీ!” అంటూ, మళ్ళీ ఆవలించారు.*