Site icon Sanchika

అత్తగారు అమెరికా యాత్ర.. 9

వంటింట్లో వడియాలు.. ఫైర్ అలారం కూతలు

[dropcap]త[/dropcap]ర్వాత రోజు పెందరాళే మెలకువ వచ్చేసిందట్టుంది. ఆవిడ నిద్ర లేచి.. నన్ను లేపకుండానే తనే కాఫీ పెట్టుకుందామని ప్రయత్నం చేసారట. చేతకాలేన్నట్టుంది. చివరికి,

“ఈ స్టౌ ఎలా వెలిగించాలి?” అంటూ నన్ను పిలిచారు.

నేను లేచి వచ్చి, ఫ్రిజ్‌లోనుంచి పాలు, కప్పులో పోసి ఓవెన్‌లో పెట్టిన వేడి చేసి దాంట్లో, డికాషన్, పంచదార కలిపి ఇచ్చాను.

“వేడి సరిపోకపోతే చెప్పండి అత్తయ్యా! మళ్లీ ఓవెన్‌లో పెడతాను” అన్నాను.

“ఇదేంటీ స్టౌ మీద కాచుకోరా పాలు? అయినా ఈ పొయ్యి ఎలా వెలిగించాలో చూపించు. నువ్వు నిన్న చేస్తోంటే చూసాను. అసలు మంటే కనపడలేదు. వింతగా వుంది. అగ్గిపెట్టె లేకుండానే అంటిస్తారా?” కాఫీ తాగుతూ అడిగారు.

“ఇది కరెంటుతో పని చేస్తుంది అత్తయ్యా! ఇదిగో ఈ నాలుగు పొయ్యిలకీ ఈ నాలుగు స్విచ్లు వుంటాయి. ఏది నొక్కితే దాని తాలూకు పొయ్యి ఆన్ అవుతుంది. మంట కనపడదు కానీ.. గిన్నె వేడెక్కుతుంది. ఇక కాఫీ సంగతికి వేస్తే, ఒక కప్పు కాఫీ కోసం మళ్లీ గిన్నె దాన్ని పొయ్యి మీద పెట్టడం, తర్వాత కప్పులో పోయడం ఇంత తతంగం ఎందుకని తిప్పినా డైరక్ట్‌గా ఓవెన్‌లో పెట్టేస్తూంటాను అత్తయ్యా!” అని వివరించాను.

“ఓహో! మీవన్నీ సులభ మార్గాలన్నమాట” అంటూ.. ఏదో అర్థం అయినట్లే బుర్ర మాత్రం ఊపారు.

పక్కన నా సహాయంతో ఆవిడే చేసారు వంట.

ఏ పొయ్యి ఏదో, ఒకటే కన్‌ఫ్యూజ్ అయిపోయారు. ముందుది ఆన్ చేసి.. వెనక పొయ్యి మీద పులుసు గిన్నె పెట్టి, “ఎంతసేపయినా ఉడుకు పట్టదేం?” అన్నారు.

నేను చూసి “అయ్యో! అత్తయ్యా! ఉడకడానికి మీరసలు పొయ్యి అంటిస్తేగా” అంటూ పులుసు గిన్నె పెట్టిన పొయ్యి అంటించాను.

ఆ తర్వాత మొక్కలకి నీళ్ళు పోదామని బేక్ యార్డులో కి వెళ్ళగానే లేదో.. ఇంతలో ఫైర్ అలారం బయ్ బయ్ మంటూ మోగడం మొదలెట్టింది. గాభరాగా ఇంట్లోకి పరుగు తీసాను.

అత్తయ్య గారు.. ఆ సౌండ్ ఏదీ పట్టించుకోకుండా, పొయ్యి మీద బూర్ల మూకుడులో సలసల కాగుతున్న నూనెలో.. తను తీసుకువచ్చిన, వడియాలు, ఊరు మిరపకాయలు వేయించడంలో నిమగ్నమయి వున్నారు. హాల్లో నుంచి ఈయన గారు కూడా పరుగు పరుగున ఫైర్ అలారం దగ్గర పెద్ద టవల్ పుచ్చుకుని వేగంగా ఊపడం మొదలెట్టారు. ఇంతలో మా అబ్బాయి గబగబా కిటికీ తలుపులు, బాల్కనీ తలుపులు తెరిచాడు.

ఊరు మిరపకాయలు డబ్బాలో పెట్టి మూత పెడుతూ.. “ఏంట్రా అచ్చిబాబూ? ఏదో కొంపలు అంటుకున్నట్లు అలా హడావుడి పడిపోతున్నారు అందరూ!” అంటున్న ఆవిడతో, “ఔను అత్తయ్యా! ఇలా చేసి ఆ అలారం నోరు నొక్కకపోతే నిజంగానే కొంపలు అంటుకున్నాయేమో అని ఫైరింజను వచ్చేస్తుంది” అంటూ ఆ నూనె బాణలి పొయ్యి మీద నుండి గబగబా దించేసాను.

“ఇలా పొగలు వస్తే, ఈ అలారం ద్వారా ఫైర్ స్టేషన్‌కి మనింట్లో ఏదో అగ్నిప్రమాదం జరిగిందని వార్త వెళ్లిపోతుందమ్మా! వాళ్ళు వెంటనే వచ్చేస్తారు. అదో పెద్ద తతంగం అవుతుంది. అందుకే ఇలా టవల్‌తో అలారం దగ్గర గట్టిగా వూపుతూ వుంటే పొగ ఉధృతి తగ్గి అలారం ఆగుతుంది” అన్నారు ఈయన.

“అమ్మయ్యో.. ఇదెక్కడి గోలరా? గట్టిగా వడియాలు కూడా వేయించుకోలేమా?” ముక్కున వేలేసుకున్నారు అత్తయ్య గారు.

“ఫర్వాలేదు అమ్మా! వేయించుకోవచ్చు.. మరీ సెగలు పొగలు రాకుండా ఎగ్జాస్టర్ ఫోను వేసుకోవాలి.” అన్నారు ఈయన.

ఆరోజు సాయంత్రం, అత్తయ్య వచ్చారని పలకరించడానికి వచ్చిన నా స్నేహితురాలు సుధతో, అత్తయ్య గారు చెప్పింది చెప్పకుండా వర్ణించి మరీ చెప్పారు. సుధతో పాటు వచ్చిన తన అత్తగారికి కూడా ఇలాంటి అనుభవం కలిగిందట. ఆవిడ మాకు చెపుతోంటే మా అత్తయ్య గారు ఒకటే ఆశ్చర్యపడడం.. ఆ తర్వాత నవ్వడం.

“మీ వంటింటి వడియాలకి అలారం మోగడం సరే.. ఒకసారి మా ఇంట్లో ఏమయిందంటే.. అప్పుడు మా అమ్మాయి ఫేమిలీ కూడా ఇక్కడే వుంది లెండి.. అందరం కలిసి మధ్యాహం కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేస్తున్నాము.. ఇంతలో.. కయ్.. కయ్.. కయ్.. అంటూ ఏదో అలారం శబ్దం ఆగకుండా మోగుతూనే వుంది. వెంటనే మా కోడలు.. అందరం బయటకి వెళ్లి పోవాలి.. రండి.. రండి అని తొందర పెట్టేసింది.. ఉండమ్మా.. ఇంకా పెరుగు వేసుకోనేలేదు అంటున్న నాతో.. అయ్యో.. అత్తయ్యా.. అది ఫైర్‌కి సంబంధించిన అలారం.. వెంటనే అందరం ఇంట్లోంచి బయటకి వెళ్ళాలి.. అనేసరికి.. ఆశ్చర్యంతో కూడిన భయమైన ఆసక్తి కలిగింది. ఇక్కడ అమెరికాలో వాళ్ళకి ఇలా మామూలేమో కానీ కొత్తగా వచ్చిన నాలాంటి వాళ్ళకి మాత్రం ఇది వింతగా అనిపించింది.

..అల వైకుంఠపురం నుండి విష్ణు మూర్తిగారు.. సిరికిం చెప్పడు.. అంటూ.. గజేంద్రుడు గారిని రక్షించడానికి వెళ్లినట్లే.. ముందు మా అబ్బాయి, అల్లుడు.. ఆ వెనకాల నా మనవల సైన్యం.. ఆ తర్వాత కూతురు, కోడలు.. తింటున్నది వదిలేసి.. గబగబా చేతులు కడిగేసుకుని.. రోడ్డు మీదకి పరుగో పరుగు.. ఏం జరుగుతోందో.. ఏం జరగబోతుందో.. తెలీని అయోమయంతో.. తెల్లమొహం వేసుకుని.. వెనకాలే నేనూ గబగబా బయటకి వచ్చేసాను.. అప్పటికే ఇరుగుపొరుగు అమెరికా తెల్లమొహాలు అన్నీ కూడా బయటకి వచ్చేసాయి.

“ఇంతకీ ఎందుకు మోగిందంటావు ఆ అలారం? ఇందాక కాకరకాయ ముక్కలు నూనెలో డీప్ ఫ్రై చేసి వెల్లుల్లి కారం పెట్టాను.. కొంపతీసి ఆ నూనె వాసన పొగలకి  ఆ అలారం మోగిందంటావా?” అంటూ ఓ సందేహం ఒదిలాను.

“ఏమో.. అమ్మా.. కాసేపట్లో కొంపలార్పేవాళ్ళు వస్తారు.. వాళ్ళు చెపుతారు.. నీ కొంపతీసే సందేహాలకి సమాధానాలు” అన్నాడు మా అబ్బాయి.

ఏంటో.. కట్టుబట్టలతో బయటకి వచ్చేసాము.. ఇప్పుడు ఏమవుతుందో.. ఏంటో… పాస్‍పోర్ట్‌లు లోపలే వుండిపోయాయి.. ఆ పడమటి సంధ్యారాగం సినిమాలో అగరొత్తులు వెలిగిస్తేనే అలారం మోగిపోయింది.. ఏంటో.. ఈ అమెరికా.. వడియాలు వేయించడానికి కూడా అగ్గగ్గలాడుతూ వేయించాలి.. ఏ కూతలు కూస్తాయో అని.. అయ్యో.. వడియాలు అంటే గుర్తు వచ్చింది.. బయటకి  వస్తూ వస్తూ.. నాలుగు వడియాలు కూడా తెచ్చుకోవలసింది.. కాలక్షేపానికి కాస్త పరపరలాడించేవాళ్ళం కదా అనిపించింది.

ఐదే ఐదు నిముషాల్లో.. బయ్.. బయ్.. బయ్.. అంటూ ఫైరింజన్ ప్రత్యక్షమయింది మా ఇంటి ముందు.

అందులోంచి గబగబా ముగ్గురు.. బందోబస్తుగా.. రకరకాల పరికరాలు  మంటలు ఆర్పేవి.. ఇంకా ఆక్సిజన్ మాస్కులు చొక్కాల నిండా ఏవేవో నింపుకుని.. దిగి… ఇంటి దగ్గర ఏవేవో పరీక్షలు చేసి.. అప్పటిదాకా మోగుతూనే వున్న అలారం శబ్దాన్ని ఆపేరు. శబ్దం విని వెంటనే బయటకి వచ్చేసినందుకు మాకు ధాంక్స్ చెప్పారు. “అయ్యో.. ఫోటోలు తీసుకుందామంటే.. ఫోన్ లోపలే వుండిపోయిందే” అని మా అమ్మాయి ఆవేదన..

అప్పుడు గుర్తు వచ్చింది… ఏదో సామెత.. ‘కొంప తగలడుతోంది అంటే.. ఎవడో చుట్ట కాల్చుకుందికి నిప్పు అడిగాడట’ అని.

ఇంతకీ కంగారు పడాల్సిందేమీ జరగలేదని తెలిసి.. హమ్మయ్య.. ఊపిరి పీల్చుకున్నాము.. కిందన ఇంట్లో ఏదో కార్పెంటరీ పని జరుగుతోందట.. అక్కడ వాళ్ళు చేసిన ఏదో పొరపాటుకి ఆ అలారం మోగేసింది.. ఇక్కడ అలారం మోతకి ఎక్కడో ఫైరింజన్ ఆఫీసులో తెలిసిపోయి.. వెంటనే ఫైరింజన్ వచ్చేసింది.

అదే మన ఊళ్ళో అంతా బూడిద అయ్యాక వస్తుందేమో..  ఫైరింజన్.” అంటూ జరిగినదంతా చెప్పి ఊపిరి పీల్చుకుంది ఆవిడ.

“ఇటువంటి వ్యవస్థ ఇంత పకడ్బందీగా వుండడం, ఎటువంటి ఆపదలు జరిగినా వెంటనే పోలీస్ వాహనం, అంబులెన్స్, ఫైరింజన్.. గబగబా చర్యలు చేపట్టడం.. చక్కగా వుంది. ఇలాంటివి ఇంకా మరెన్నో చాలా పద్దతిగా, క్రమశిక్షణగా.. జరగడం చూస్తోంటే అమెరికాని మెచ్చుకోక తప్పదు.” అన్నారు అత్తయ్య గారు.

“ఔను ఆంటీ! చెక్కతో కట్టిన ఇళ్లు అయ్యేసరికి.. ఇంతగా జాగ్రత్త తప్పనిసరిగా తీసుకోవాలి.. ఇళ్ళ మెయింటెన్స్ వారు కూడా ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూనే వుంటారు. ఇంట్లో.. కాస్త నూనె పెట్టి ఏ జంతికలో చేసుకున్నా.. గట్టిగా పోపులు పెట్టినా.. బాల్కనీ తలుపులు.. కిటికీ తలుపులు తీసేసి.. ఎగ్జాస్టర్ ఫేన్‌లు వేసేసి చేసుకుంటూ వుంటాము.. చలికాలం అయితే తలుపులు తీస్తే గజగజలే” అంది సుధ.

వచ్చే వారం మళ్లీ ఇంకొన్ని కబుర్లు..

Exit mobile version