Site icon Sanchika

అటు.. ఇటు

[షేక్ కాశింబి గారు రచించిన ‘అటు.. ఇటు’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]

[dropcap]యు[/dropcap]ద్ధ భూమిలో..

ఒకడొక వైపు
ఇంకోడింకో వైపు

అటు సొమ్మసిల్లిన వాడు
ఇటు కాళ్ళు విరిగిన వాడు

అటు చేతులు తెగిన వాడు
ఇటు కళ్ళు పోయిన వాడు

అటు రోదిస్తున్న వాడు
ఇటు నొప్పుల్ని భరిస్తున్న వాడు

అటు ఆఖరి శ్వాస పీలుస్తున్న వాడు
ఇటు అనాథగా మిగిలిన వాడు

అటు అహంకారంతో హుంకరిస్తున్న వాడు
ఇటు అన్యాయాన్ని ఆర్తితో ప్రశ్నిస్తున్న వాడు

అటు రక్తం కారుస్తున్న వాడు
ఇటు రక్త దానం చేస్తున్న వాడు

అటు చికిత్స చేస్తున్న వాడు
ఇటు సేవ లందిస్తున్న వాడు

అటు యుద్ధ కాంక్షతో రగుల్తున్న వాడు
ఇటు యుద్ధమంటే విసిగి పోయిన వాడు

అటు శిధిలాల క్రింద నలుగుతున్న వాడు
ఇటు శరీర భాగాలు ఛిద్రమైన వాడు

చెరో పక్షానికి ప్రతినిధులుగా
చెరో పక్కన పోరాడుతున్నారు

ఒకరి పై ఒకరు రాగద్వేషాల్లేని వారు
ఒకరినొకరు ఎన్నడూ చూడని వారు

యుద్ధ కారణాల లోతులు తెలియని వారు
యుద్ధ పరిణామాల నూహించ లేని వారు

వాడిదైనా.. వీడిదైనా..
ప్రాణమున్న.. దేహమే!

వాడికైనా.. వీడికైనా..
బ్రతుకంటే… తగని మోహమే!

వాడినీ. వీడినీ.. ఉసిగొలుపుతుంది
ఎవరో ఒకరి.. రక్తదాహమే!

Exit mobile version