[box type=’note’ fontsize=’16’] వైష్ణవి శ్రీ గారి కవితా సంపుటి ‘అటుగా వంగిన ఆకాశం’ను సంచిక పాఠకులకు పరిచయం చేస్తున్నారు శ్రీ చలపాక ప్రకాష్. [/box]
[dropcap]వై[/dropcap]ష్ణవి శ్రీ గతంలో 2 కవితా సంపుటాలు వెలువరిచిన అనుభవంతో తాజాగా వెలువరిచిన కవితా సంపుటి ‘అటుగా వంగిన ఆకాశం’.
‘ఛిద్రమౌతున్న సున్నిత ప్రాణులకై ఉద్యమించు’ అనే తత్త్వాన్ని భోదించే స్ఫూర్తిని రగిలించే విధంగా ఉన్న ముఖచిత్రం, అందమైన ముద్రణ ఈ సంపుటికి మరింత ఆకర్షణీయతను కలిగించింది. 50 శీర్షికల కవితలందించిన ఈ సంపుటిలో ప్రధానంగా సున్నితమైన స్త్రీజాతిపై మోపబడుతున్న ఉక్కుపాదాల్ని ఎండగట్టడం, స్త్రీలపై జరుగుతున్న వివక్షతలను ప్రశ్నించి, కవితాత్మకంగా దృశ్యమానం చేసిన కవితా సంపుటిది.
ఈ సంపుటికి ముందుమాట రాసిన కవి యాకూబ్ పేర్కొన్నట్టు – ”తెలుగు సాహిత్యంలో స్త్రీవాద కవిత్వం సృష్టించిన ఒక వాతావరణానికి కొనసాగింపును ఈ కవితా సంపుటి” అన్నట్లు… కవిత్వం కూడా అదే కోణంలో సాగుతుంది. కాని కొందరు స్త్రీవాద కవయిత్రుల్లా పురుష ప్రపంచాన్ని ‘పచ్చి’గా విమర్శించే భావజాలానికి భిన్నంగా స్త్రీల యొక్క అనేక బాధల కోణాల్ని ఆవిష్కరించి ఆలోచింపచేయడం వైష్ణవి శ్రీలో ప్రత్యేకతగా చెప్పవచ్చు.
యుక్తవయస్సు వచ్చిన యువతి పడే ‘మూడు రోజుల’ శారీరక, మానసిక వేదననను ‘దుఃఖ భారం’లో చెప్పిన తీరుకు ఎటువంటివాడైనా దుఃఖసాగరంలో మునగక తప్పదు- ”ఏ రోజు కారోజు ఆంక్షల స్నానాలతో/ పునీతమయ్యే జీవితకాలం/ ఇరవై ఎనిమిది రోజులకోసారి/ సూర్యుడి కంట పడకుండా/ చీకటి నిందల పాలవ్వకుండా/ రుతుస్రావ స్నానమూ చేస్తుంది”- ”అమ్మతనంపై ఎవరెవరో/ తెలివిడితనంతో పెట్టిన కొడవలి గాట్లు/ మీరు గుర్తుంచుకోని పట్టించుకోని/ ఆ మూడు రోజులు/ తెరవని డైరీలో ఓ మూలగా/ వొదిగొదిగి కూర్చుంటాయి/ నెత్తురు కక్కుకుంటూనే…”
స్త్రీవాదుల్లో సామాన్యంగా పితృస్వామ్యంపై తిరుగుబాటు కనిపిస్తుంది. కాని వైష్ణవి శ్రీ ”పుట్టడానికే కాదు/ గౌరవంగా బతకడానికీ నాన్న కావాలి” అంటూ ‘నాన్న లేని దేశంలో’ కవితలో ఆవిష్కరించడం గమనార్హం.
25 ఏళ్ళుగా గుర్తించని మహిళా రిజర్వేషన్ బిల్లుకి నిరసనగా ‘ఐదూళ్ళిచ్చిన చాలదు’ కవితలో ”మాకు ఐదు వూళ్ళు చాలవు/ యావద్దేశంలో సగం అడుగులు మావే కావాలి” అని స్త్రీ సమానహక్కులపై ఎలుగెత్తి చాటారు. యావద్దేశంలోనే కాదు – ప్రపంచంలో సగభాగం కావాలన్నా తప్పు అనడం సత్యదూరం కాదు. ఈ కవితలో వచనా ప్రవాహం పెద్ద వాఖ్యాలుగా సాగాయి. కవిత చివర రెండో పేజీలో కవిత్వం రూపంలో ఎక్కడ విడగొట్టాలో అక్కడ విడగొట్టక, పెద్ద వ్యాసం పరంపరలా సాగడాన్ని కవయిత్రి గుర్తించి ఇకముందు జాగ్రత్త పడాలి.
‘ఆకుపచ్చని గాయం’, ‘చెదిరిన ముగ్గు’ వంటి కవితలకు పెట్టిన ఎన్నో శీర్షికలో ఆ కవితలో ఉన్న సారాంశాన్ని తేటతెల్లంగా తెలియచేస్తున్నాయి. చివరి కవిత ‘మెయిడ్ మదర్’ ఒక్క కవితలోనే కుటుంబానికి స్త్రీ అనే ఆవిడ లేకపోతే ఎలా ఉంటుందో చూపించేసారు కవయిత్రి. ”ఒక్కరోజు సూర్యుడు ఉదయించక పోయినా/ తెల్లవారుతుంది/ ఒక్కరోజు ఆమె రాకపోతే/ ఆ ఇంట్లో ఉదయానికి ఉషోదయముండదు/ గిన్నెలన్నీ సింక్‌లో మూతి ముడుచుకు కూర్చుంటాయి/ మాసిన బట్టలన్నీ గుండెలను బండకేసి బాదుకుంటాయి” అంటూ ఆమెలేకపోతే పరిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉంటుందో చూపించి, చిట్టచివరికి ”చంటిబిడ్డకు గుక్కెడు పాలివ్వలేని/ నిర్జీవ దేహమిప్పుడు ఈ దేశం” అంటూ దేశం చేతకాని తనాన్ని ఇన్‌డైరెక్ట్‌గా ఎండకడతారు వైష్ణవిశ్రీ. కవిత్వమంతా స్త్రీచైతన్య ఉద్యమస్వరూపంగా చూపించే ప్రయత్నంలో ఈ కవితాసంపుటి ‘అటుగా వంగిన ఆకాశాన్ని’ చూడవచ్చు.
***
అటుగా వంగిన ఆకాశం (కవిత్వం)
పేజీలు 120
ధర 120
ప్రతులకు..
వైష్ణవి శ్రీ
8074210263