అతులితమాధురీమహిమ

1
3

జానపదుల జీవితం:

ధూర్జటికవి కవిత్వాన్ని ఒక వ్యాసంలో ఒడిసిపట్టటం నిజానికి చేతకాని పని. పలుకు పలుకునా ఓ మోస్తరుగానైనా పద్యాలను ప్రస్తావిస్తూ పోవాలి. జానపదులపదసంపదనే కాక, ఈ కవి జానపదుల జీవన విధానాన్ని ఆశ్చర్యకరంగా చూపినాడు. ఆయనకాలంలో తెలుగునాట ఉన్న ఆటలను – తిన్నడు(కన్నప్ప) కథలో చెబుతాడు కవి.

సీ.

చిట్లబొట్లాకాయసిరిసింగణావత్తి

          గుడుగుడుగుంచాలుకుందెనగుడి

డాఁగిలి మ్రుచ్చులాటలుగ్రచ్చకాయలు

          వెన్నెలకుప్పలుతన్నుబిల్ల

తూరనతుంకాలుగీరనగింజలు

          పిల్లదీపాలంకిబిల్లగోడు

చిడుగుడువ్వలపోటిచెండుకట్టినబోది

          యల్లియుప్పనఁబట్టెలప్పళాలు

గీ.

చిక్కనాబిల్లలోటిల్లుచిందఱాది

యైన శైశవక్రీడావిహారసరణిఁ

జెంచుకొమరులతోడ నుద్దించుకాడుఁ

దిన్నుఁ డభినవబాల్యసంపన్నుఁ డగుచు. (3.33)

ఇవన్నీ దాదాపుగా నేడు నశించినట్లే. 80 వ దశకంలో టీవీలు అడుగుపెట్టని ఇళ్ళు ఉన్న కాలాన, బాల్యాన్ని గడిపి, ఇప్పుడు మధ్యవయసు నిండిన వారికి ఆ క్రీడలలో కొన్ని తెలిసి ఉండవచ్చు. బిల్లగోడు (దీనినే కర్రాబిళ్ళ/చిల్లాకట్టె అంటారు), డాగిలి మ్రుచ్చులాట (దాచిపెట్టుకునే ఆట), గుడుగుడుగుంచెం, గ్రచ్చకాయలు వగైరా. ఈ ఆటలలో గ్రచ్చకాయలు, సిరిసింగనవత్తి ఇత్యాది ఆటలను పదకవితాపితామహుడు అన్నమయ్య కూడా ఓ కీర్తనలో ప్రస్తావించియున్నాడు.

మన కవి సీసం – అవడానికి ఓ చిట్టాపద్యమే. అయితే ఈ జాబితాపద్యంలోనూ అక్కడక్కడా అనుప్రాసలని పోషించడం చమత్కారం. ఎత్తుగీతి చివరన కవి అంటున్నాడు, ఆ క్రీడలన్నిటిని బాల్యాన చూసిన తిన్నడు – అభినవబాల్యసంపన్నుడు అయ్యాడట! ఎంత పచ్చి నిజం! ఆ అభినవబాల్యసంపదను తరతరానికి మధ్య ఎంతగా కోల్పోతున్నాం?

తిన్నడు కారడివిలో ఉన్న లింగాన్ని తన పల్లెకు రమ్మని పిలుస్తూ, ఉడుమూరిలో దొరికే ఫలాలను గురించి చెబుతాడు.

సీ.

నేరేడు పండులునెలయుట్టి పండులుఁ

          గొండ మామిడి పండ్లుదొండపండ్లుఁ

బాల పండులునెమ్మి పండులుబరివంక

          పండులుఁ జిటిముటి పండ్లుఁ గలివి

పండులుఁ దొడివెంద పండ్లుఁ దుమ్మికి పండ్లు

          జానపండులుగంగ రేఁగుఁబండ్లు,

వెలగ పండులుపుల్ల వెలగ పండులుమోవి

          పండ్లునంకెన పండ్లుబలుసు పండ్లు

గీ.

బీరపండ్లునుబిచ్చుక బీర పండ్లుఁ

గొమ్మిపండ్లీతపండ్లునుగొంజి పండ్లు,

మేడి పండ్లునుమోదలుగాఁ గుడిమాడి

చెంచెతలు దెత్తురిత్తు విచ్చేయుమయ్య (3-69)

మొత్తం 24 జాతుల ఫలాలు. వీటిలో కొన్ని పొత్తపినాటి ఫలాలు. ఉదాహరణకు కలివి పండ్లు. వీటిని కలేపండ్లు అంటారు. వర్షాభావం ఉన్న ప్రాంతాల్లో కొండల్లొ పండే ముదురు నీలి/నలుపు రంగు పళ్ళివి. ఇవి చాలా మధురమైనవి. అలాగే బరివంక పండ్లు కూడాను. నిన్నటి తరం వరకూ కనిపించేవి. ఇప్పుడు మృగ్యమైనాయి. పై లిస్టులో ఇప్పటికి కొన్నే  మిగిలి ఉన్నాయని మనకు తెలుసు.

చదువరులారా! ఫలాలే కాదండోయ్! ధాన్యం సంగతీ ఉంది. ఈ రోజుల్లో వరియన్నం మానేసి కొర్రలు, సామలు వంటి వనధాన్యాలను తినమని కొందరు ఆరోగ్యవేత్తలు చెప్పడం, ప్రజలు పోలోమని ఆ వేలం వెర్రిలో పడడం మనకు తెలుసు. ధూర్జటి కావ్యంలో ఎఱుకల వాళ్ళకు ఆ ఆరోగ్యరహస్యం తెలుసు. వారు –  రాజాన్నభోజనప్రాభవశ్రీ గల్గియును వన్యధాన్యంబు నొల్ల మనరు (3. 6); అంటే, రాజనాల వరి తినగలిగే సంపద ఉన్నా, వన్యధాన్యాలను తోసి పుచ్చరు.

శాఖాచంక్రమణం చేసినట్టున్నాం. తిరిగి – అతులిత మాధురీ మహిమకు.

తిన్నడు పుట్టాడు. విలువిద్య నేర్చాడు. సహచరులతో కలిసి వేటకెళ్ళాడు. ఆ వేట వైభవంగా సాగింది. ఆపై వేటాడిన అడవిపందిని కాలుస్తున్నారు అందరున్నూ. అక్కడ ఉత్పలమాల!

.

క్రొవ్విన యేకలంబులను గొన్నిటిఁ గూల్చి కమర్చి పెంచులం

జివ్వుచు నెఱ్ఱమన్నలఁది చివ్వున నీరివురంగ నేర్చి నో

ళ్ళువ్విళులూరఁ బ్రేల్చి చమురుట్టిపడం గఱుకుట్లు గాల్చి క

ల్జువ్వులనీడ నొక్క పరిశుద్ధ శిలాతల భూమినందఱున్.  (3. 50)

ఏకలము = అడవిపంది;

కమర్చు = (వెండ్రుకలు తగులబడేలా) కాల్చు;

పెంచులు = మట్టిపెంకులు (మాండలికం)

కఱుకుట్లు = కర్రల చివర్న గుచ్చి వ్రేల్చిన మాంసపు ముక్కలు; (Barbeque)

 తా: క్రొవ్వు పట్టిన అడవిపందులను కొన్నిటిని కొట్టారు; వాటిని బాగా కాల్చారు. మాంసపుముక్కలను పెంకులలో చిమ్మారు. వాటిపై ఎర్రమన్ను అలది, మాంసంలో నీరు ఇగిరి పోయేలా చేశారు. నోళ్ళు ఊరుతుండగా లొట్టలు వేస్తూ ప్రేల్చి, చమురు బయటకు వచ్చేట్టు కరుకుట్లు (కర్రల చివర్న గుచ్చిన మాంసపు ముక్కలు; Barbeque) కాల్చి, జువ్వి చెట్ల నీడన ఓ శుభ్రమైన చోట అందరూ కూడారు.

వస్తువు రమ్యమైనదైనా, రమ్యం కానిదయినా కవి మానసంలో చిక్కితే అది మధురమైన పదార్థంగా పరిణమిస్తుందట. ఈ కవిత్వ వస్తువును, ఆ వస్తువు – కవితలో పొందిన పరిణామాన్ని రసజ్ఞులు తెలుసుకోగలరు.  పద్యం అంతటా స్వభావోక్తి అలంకారం; రీతి. యథార్థక్రమనిర్వాహే రీతిరిత్యభిదీయతే ’; అంటే – పద్యము, భావము చెట్టపట్టాలు వేసుకుని నడవడం. అచ్చతెనుఁగు మామూలే.

ఈ విధమైన వేట వృత్తాంతాన్ని అల్లసాని పెద్దన మనుచరిత్ర చతుర్థాశ్వాసంలో సుదీర్ఘంగా వర్ణించాడు. శబరులు స్వరోచి అన్న రాజుతో కలసి, వేటకుక్కలను తోడిడుకొని వేటకు వెళ్ళే ప్రక్రియ అది. అల్లసాని వారి వేట వృత్తాంతంలో సుదీర్ఘమైన వివరణలు, ఉత్ప్రేక్ష, అతిశయోక్త్యాది అలంకారాలు చోటుచేసుకుంటే, ధూర్జటి కవనంలో వేట పెద్దనార్యుని కవనంకన్నా సహజంగా, క్లుప్తంగా, స్వభావోక్తులతో ఉంటుంది. అల్లసాని వారు వేట సాగిన విధాన్ని వర్ణిస్తే, ధూర్జటి – శబరుల జీవన విధానంలో భాగంగా ఉన్న వేటను వర్ణించడం ప్రధానంగా కనిపిస్తుంది.

ప్రౌఢిమ:

పైన ప్రస్తావించిన పద్యాలలో అంతానూ తెనుగు పాలే యెక్కువ. ధూర్జటికవి అవసరానికి తగినట్టు ప్రౌఢగంభీరంగా సంస్కృతసమాసభూయిష్ఠంగానూ పద్యాలను నిర్మింపగలడు. అటువంటివి కొన్ని చూద్దాం.

మృగయావినోదంతో మిత్రులతో కలిసి ఆనందిస్తున్న తిన్నడికి ఓ రోజు కలలో పరమేశ్వరుడు కనిపించాడు. అడవిలో ఓ చోట లింగమై ఉన్నానని, తనను వెతికి కనుగొని అర్చించమని ఆదేశించాడు. ఆ లింగాన్ని తిన్నడు వెతికి వెతికి కనుగొన్నాడు.

శా.

సంతోషంబునఁ గాంచెఁ దిన్నఁడు సమస్తవ్యాపకాంత వే

దాంతస్థాపిత చిన్మయాంగము నవిద్యా ధ్వాంత సంతాన సం

క్రాంత స్వాంత నిశాంత జంతు సుఖమార్గ ప్రాపకాభంగ రు

క్కాంతాపాంగము దివ్యలింగము వివిక్తధ్యేయ నిర్లింగమున్. (3.63)

సమస్తవ్యాపక అంత వేదాంత స్థాపిత చిన్మయాంగమున్;

సమస్తవ్యాపక అంత = అన్నిదశలలో చివరవరకు వ్యాపించినయట్టి ; వేదాంతస్థాపక = వేదాంతవిద్య యొక్క అంతిమభావమై; చిన్మయాంగమున్ = ఆనందమయ స్వరూపమును;

అవిద్యాధ్వాంత సంతాన సంక్రాంత స్వాంత నిశాంత జంతు సుఖమార్గ ప్రాపకా భంగరుక్ కాంత అపాంగము;

అవిద్యాధ్వాంత  = అజ్ఞానాంధకారము (అనెడు);  సంతాన = సమూహము(వలన);  సంక్రాంత = లభించిన;  స్వాంత = మనస్సు (అనెడు); నిశాంత = ఇంట;  జంతు = జంతుప్రాయపు; సుఖమార్గప్రాపక = సుఖమైన దారిని అంటిపెట్టుకున్న (వారి యెడ); అభంగరుక్కాంత అపాంగము = అంతమెఱుంగని కాంతిగల సూర్యుని యొక్క చూపునూ;  వివిక్తధ్యేయ నిర్లింగమున్ = ఏకాంతమున ధ్యానము చేయుటకు తగినదైన; దివ్యలింగము = తేజోమయమైన లింగమును;

తిన్నడు సంతోషంబున కాంచెను.

తా: సర్వదిశలకూ తన ఆత్మతేజాన్ని ప్రసరింపజేయునది, వేదాంతవిద్య యొక్క నికషోపలము, అజ్ఞానతిమిరంలో మ్రగ్గి, జంతుప్రాయులై, సుఖలాలసలో మునిగిన భక్తులపాలిటి కాంతిపుంజమైన, ధ్యానమునకు అర్హమైన, తేజోమయమైన లింగాన్ని తిన్నడు చూచాడు.

ఇది కవికన్నులతో చూచిన తిన్నడి సంతోషము. ఇది గంభీరమైన సంస్కృతగంగాప్రవాహము. కవి యొక్క శార్దూల విక్రీడితము.

పైని పద్యం లింగాకారుడైన శంకరుణ్ణి వర్ణిస్తోంది. వస్తువు భగవంతుడు అవడంతో పద్యంలో శబ్దప్రౌఢిమ యెక్కువగా కనిపిస్తోంది. శబ్దమే కాక, భావం కూడా వినూత్నంగా, భావగంభీరంగా ఉన్న పద్యం ఒకటి.  మద్యపానమత్తులైన భిల్లదంపతుల వర్ణన ఇది! ఈ పద్యం సంస్కృతసమాసభూయిష్ఠమైనా, ప్రాసాదగుణభరితంగా ఉండటం గమనార్హం.

.

మంకెనపువ్వులో విడిసి మత్తిలియుండెడు తేఁటిరీతి మీ

నాంక సరోజరాగ కలితాభరణాంతర నీలలీల హా

లాంకురితారుణచ్ఛవి సమంచిత లోచన తారకద్యుతుల్

బింకముఁ జూపఁ బానముల పెక్కువఁ జొక్కిరి భిల్లదంపతుల్(3.45)

మంకెనపువ్వులో; విడిసి = విడిది చేసి; మత్తిలియుండెడు; తేఁటి రీతి = తుమ్మెద వలే;

మీనాంక సరోజరాగ కలిత + ఆభరణ + అంతర నీల లీల;

మీనాంక = మన్మథుని; సరోజరాగ = తామరపువ్వు యొక్క ఎఱుపును; కలిత = సంతరించుకున్న; ఆభరణ = నగయొక్క; అంతర = మధ్య పొదిగిన; నీల = ఇంద్రనీలమణియొక్క నీలిరంగు; లీల = విలాసము గల;

హాల + అంకురిత + అరుణ చ్ఛవి సమంచిత లోచన తారక ద్యుతుల్;

హాల = ఇప్పపువ్వు సారాయి (త్రావుట) వలన; అంకురిత = పుట్టిన; అరుణచ్ఛవి = ఎఱుపు రంగు కాంతులను; సమంచిత = కూడిన; లోచన = కన్నులనెడు; తారక ద్యుతుల్ = కనుపాప కాంతులు;

బింకమున్ చూపన్ = అతిశయింపగా; పానముల = మద్యపాన గోష్టిలో; పెక్కువన్ = ఎక్కువగా; భిల్లదంపతులు; చొక్కిరి = పరవశించిరి;

తా: భిల్లదంపతులు ఇప్పపూల తో చేసిన సారాయిని త్రాగుతూ పరవశిస్తూన్నారు. మద్యపానంతో వారి తెల్లని కనులు ఎఱ్ఱబారినాయి. నల్లని కనుపాప తో కూడిన ఆ ఎఱ్ఱని కనులు – మంకెనపువ్వు మధ్యభాగంలో ఉన్న తుమ్మెద ను పోలి ఉన్నవి. ఇంకా – మన్మథుని యొక్క ఎఱుపు రంగు ఆభరణము మధ్య పొదిగిన ఇంద్రనీలమణి వలె ఉన్నవి

’మద్యపానం వలన దంపతుల కనులు ఎఱ్ఱబారినాయి’ – ఇంత చిన్ని భావాన్ని కవి సానబట్టాడు. కార్యకారణాలను చెబుతున్నాడు కనుక కావ్యలింగాలంకారం. మత్తెక్కిన కనులను మంకెనపువ్వు తో, కనుపాపను తుమ్మెదతో ఉపమిస్తున్నాడు. హాలాంకురిత….ద్యుతుల్ రూపకము. ఈ అలంకారాలు ఒకదానితో ఒకటి పాలు నీళ్ళలా కలిసి పద్యాన్ని శోభింపజేస్తున్నాయి కనుక సంసృష్టి అలంకారం. (’క్షీరనీరవత్ సంసృష్టిః, తిలాతండులవత్ సంకరః’). అవడానికి విషయం మద్యపానమైనా, ఒకింత శృంగారస్పర్శ కూడా కలిగిన పద్యం యిది.

ఇదివరకే చెప్పినట్టు కవిత్వప్రౌఢిమకు స్నిగ్ధమైన భావాన్ని కూడా జోడించిన పద్యం యిది. వస్తువుకు తగినయట్టు కవిత్వగుణాలను కూర్చటం ఈ కవికి కరతలమాలకం. ఈ కూర్పు అత్యంత సహజంగా కవి హృదయంలోనుండి వెలువడినట్లు ఉండటం ఈయన కవితలో లక్షణం.  ఇంకా ధూర్జటి కవి రచించిన ప్రౌఢసంస్కృతసమాసభూయిష్ఠమైన పద్యాలు కృత్యాదిలోనూ, ఆశ్వాసాంతాలలోనూ కనిపిస్తాయి.  కాశీ విశ్వనాథుడు, గంగాదేవి, కాళహస్తీశ్వరుని ఇల్లాలైన జ్ఞానప్రసూనాంబ ఇత్యాది మూర్తి వర్ణనలు కూడా ప్రౌఢమైనవి, మహాద్భుతమైనవి, రోమాంచితమైనవిన్నీ. వ్యాసం విస్తృతి భీతి కారణాన వాటిని ప్రస్తావించటం లేదు. వీటన్నిటినీ ఆ కావ్యంలో చదువుకోవలసిందే.

కవిత్వం పై కవి:

ఈ వ్యాసం ఆరంభంలో కవిత్వం గురించి చెప్పుకున్నాం. చాలామంది కవులు, తమ కవనంలో ఏదో ఒక భాగంలో తమకు కవిత్వంపై గల అభిప్రాయాన్ని, ప్రత్యక్షంగానో,పరోక్షంగానో చెప్పడం కద్దు. సంస్కృతంలో దండి, రాజశేఖరుడు, జగన్నాథుడు, క్షేమేంద్రుడు, ఆనందవర్ధనుడు వంటి కవులు కవులే కాక లాక్షణికులు కూడానూ. వారు కవిత్వమే కాక లాక్షణిక గ్రంథాలూ వ్రాశారు. మరికొంత మంది కవులు తమ కావ్యాల్లోనే కవిత్వం గురించి ప్రస్తావించారు.మాఘుని శిశుపాలవధమ్ ద్వితీయాశ్వాసంలో, శ్రీకృష్ణ, ఉద్ధవుల సంభాషణలో భాగంగా కవిత్వం గురించి ఉద్ధవుని నోట కొన్ని శ్లోకాలను చెప్పిస్తాడు. వాటిని కవి అభిప్రాయాలుగా తెలియవచ్చు.

ధూర్జటి కవి కూడా నత్కీరుడి కథలో కవిత్వాన్ని గురించి చెబుతాడు. నిజానికి రాయలవారు చెప్పిన చాటువు ( స్తుతమతియైన యాంధ్రకవి ధూర్జటి పల్కులకేల గల్గెనో యతులిత ’మాధురీ’ మహిమ?) లోని మాధురీమహిమ కూడా నత్కీరుని పద్యాలను గురించేనేమో అన్న అనుమానం వస్తుంది.

నత్కీరుని కథ క్లుప్తంగా: పాండ్యదేశంలోని మధుర నగరంలో ఓ మారు గొప్ప కరువు వచ్చింది. ఆ కరువుబారిన పడిన ఓ దరిద్రబ్రాహ్మణుడు, మారుగతి కానక పరమేశ్వరుని శరణు వేడినాడు. పరమేశ్వరుడా బ్రాహ్మణుడికి ఓ కవితను లిఖించి యిచ్చి, మహారాజు వద్దకు వెళ్ళి వినిపించమంటాడు. బ్రాహ్మణుడు- రాజు కొలువులో కవితను వినిపించినాడు. ఆ కవిత వస్తువు ఇదీ. ’స్త్రీల శిరోజాలకు గల సౌరభం స్వతః సిద్ధంగా ఏర్పడినదే కానీ తైల, లేపనాదుల వలన కృత్రిమంగా వచ్చినది కాదు’.  కొలువులో గల నత్కీరుడన్న కవి, ఆ కవితలో గల ఔచిత్యాన్ని ప్రశ్నించి, అది ఉత్తమకవిత కాదని ఆక్షేపిస్తాడు. జరిగిందంతా బ్రాహ్మడు పరమేశ్వరుడికి విడమర్చి చెప్పి, బాధపడ్డాడు. అప్పుడు పరమశివుడే మారురూపాన రాజు కొలువుకు వెళ్ళి కవితను చెప్పి, దాని భావాన్ని వివరించడమే కాక, ’ఉమాదేవి శిరోజాలకు గల సువాసన స్వతఃసిద్ధంగా ఏర్పడిందేనని’ నత్కీరునికి సమాధానం చెప్పినాడు. అయితే నత్కీరుడు తన పట్టు వదలక, శంకరుని సూచి ’అగజకు నైనం దగున్ ఇల మగువలకు తగదు’ అని ఆ కవిత్వంపై ఆక్షేపణను కొనసాగించినాడు. ఇక నిటలాక్షుడు ఉగ్రుడై నత్కీరునికి మాత్రం కనబడేట్టు తన మూడవకన్ను తెరిచి హెచ్చరించినాడు. నత్కీరుడు కూడా శివభక్తుడే. అయినప్పటికీ, పద్యంలో దోషం దోషమేనని పట్టుబట్టాడు. చివరకు పరమశివుడాతనికి కుష్ఠురోగివి కమ్మని ఘోరశాపం విధించినాడు. నత్కీరుడు గొప్ప యాత్ర చేసి, చివరన కాళహస్తీశ్వరుని సేవించి తన రోగం బాపుకోవడం కథలో ముగింపు.

కథలో భాగంగా బ్రాహ్మణుడు – తనకు రాజసభలో జరిగిన అవమానాన్ని ప్రస్తావిస్తూ పరమేశ్వరుని తగ్గర ఇలా వాపోయాడు.

కం.

తా నెఱిఁగిన విద్య నృపా

స్థానములో నెరపఁ గీర్తి సమకూరుం గా

కే నరునకుఁ బరవిద్యా

ధీనత భూపాలసభమఁ దేజము గలదే? (3. 162)

తా: రాజాస్థానాలలో తనకు తెలిసిన విద్యను ప్రదర్శిస్తే కీర్తి ఒనగూడుతుంది కానీ, ఇతరులకు చెందిన విద్యను తమ విద్యగా ప్రదర్శించడంలో గొప్ప ఏమున్నది?

ఇది అచ్చంగా ధూర్జటి కవిత లక్షణమే. ఆయన కవితలో అరువు తెచ్చుకున్న భావాలు కానీ, పాత కవిత్వ సరంజామా  కానీ  కనిపింపవు. ఒకవేళ అటువంటివి ఉన్నా, అది కూడా నవనవోన్మేషతను సంతరించుకుని,నిత్యనూతనంగా భాసిస్తాయి.

పరమేశ్వరుడు మారురూపాన రాజసభకు వెళ్ళి నత్కీరుని ఇలా ప్రశ్నించాడు.

శా.

ఈ రాజన్యుని మీఁద నేఁ గవిత సాహిత్యస్ఫురన్మాధురీ

చారుప్రౌఢిమఁ జెప్పి పంప విని మాత్సర్యంబు వాటించి న

త్కీరుం డూరకె తప్పుపట్టెనఁట యేదీ లక్షణంబో యలం

కారంబో పదబద్ధమో రసమొ చక్కంజెప్పుఁడా తప్పనన్(3. 167)

తా: ఈ మహారాజు వద్దకు నేను సాహిత్యం చక్కగా స్ఫురించే విధాన మాధుర్యముతో కూడిన, అందమైన శైలిలో చెప్పి పంపిన కవితను, ఈర్ష్యతో నత్కీరుడు ఊరకే తప్పుపట్టినాడు. ఇందులోని దోషం ఏది? రసదోషమా? అలంకారముల లోపమా? లక్షణములు సరిగా లేవా? పదబంధాల్లో తప్పున్నదా? వివరించి చెప్పండి?

బహుశా ధూర్జటి కవి కూడా ఈ పద్యం ద్వారా తన కవితను గురించి ఏ విమర్శకుడినో ప్రశ్నిస్తున్నట్టుగానే ఉంది. సాహిత్య స్ఫురన్ మాధురీ చారు ప్రౌఢిమ’ అన్న శబ్దం గమనార్హం. అంటే –

‘సాహిత్యముచేత ప్రకాశిస్తూ, భావస్ఫోరకమై

మాధుర్యం అనే గుణాన్ని సంతరించుకున్నదై,

సుందరమైన నేర్పు (ద్రాక్షాపాకం వంటి రీతిని) కలిగిన సుకవిత’

అని ఆ సమాసానికి వివరణ చెప్పుకోవచ్చు.

భావస్ఫోరకత – అంటే అనాయాసంగా భావం వెలువడటం. దీనిని అర్థవ్యక్తి అని అన్నారు లాక్షణికులు. సుందరమైన నేర్పు – పాకమును లక్ష్యంగా చెప్పియుండవచ్చు. ద్రాక్ష, కదళీ, నారికేళ పాకములు అన్నవి శైలికి చెందిన విషయాలు. ద్రాక్షాపాకం అంటే నోట పెట్టుకోగలిగినంతనే ఇట్టే కరగిపోయే లక్షణం కలిగిన రీతి.

ఇక మాధుర్యం గురించి కొంత చెప్పుకోవాలి.

మాధుర్యం అన్నది శబ్ద గుణం, మరియు అర్థగుణం కూడా. గుణములు చిత్తము యొక్క ’ద్రుతి దీప్తి వికాస’ కారకాలని జగన్నాథపండితుడు. అంటే చిత్తద్రుతి, చిత్తదీప్తి, చిత్తవికాసములకు గుణములు కారకాలు. మాధుర్యం అన్న గుణం చిత్తద్రుతి కారకము. కరుణే విప్రలంభే చ తచ్ఛాంతే చాతిశయాన్వితమ్’– అంటే చిత్తద్రుతి కరుణలోనూ, విప్రలంభంలోనూ, ఆపై శాంతరసంలో క్రమేణా అతిశయిస్తుంది. కాళహస్తి మహాత్మ్యము శాంతరసప్రతిపాదక కావ్యం కావడం గమనార్హం.

రసగంగాధరమ్ లో మాధుర్యం అన్న గుణం యొక్క లక్షణాలను జగన్నాథపండితరాయలు ఇలా వింగడించినాడు.

సంయోగపర హ్రస్వాతిరిక్త వర్ణఘటితత్వే సతి పృథక్పదత్వం మాధుర్యమ్’ – ఇది శబ్దగుణం.

ఏకస్యా ఏవోక్తేః భంగ్యంతరేణ పునః కథనాత్మక ముక్తి వైచిత్ర్యం మాధుర్యమ్’ – ఇది అర్థగుణం.

మాధుర్యము అంటే అలతి అలతి పదాలతో కావ్యాన్ని కూర్చడం, అలాగే మాధుర్యం అంటే – తెలిసిన విషయాన్ని భంగ్యంతరంగా, మరల మరల నవనవోన్మేషంగా చెప్పడం. ఇవి ధూర్జటి కాలానికి తర్వాతి వాడైన జగన్నాథుని కాలానికి చెందిన ప్రతిపాదనలు అయినా, పారంపరికంగా వస్తున్న భావాలే. పరమప్రాచీనమైన నాట్యశాస్త్రంలో కూడా మాధుర్యమ్ అంటే ఇటువంటి నిర్వచనమే ఉంది. బహుశః యచ్ఛ్రుతం వాక్యముక్తం వాపి పునః పునఃనోద్వేజయతి యస్మాద్ధి తన్మాధుర్య మితి స్మృతమ్’ అంటే విన్న విషయం పలుమార్లు విన్నా, విముఖత్వం కలుగకుండా ఊరించే గుణమే మాధుర్యం.

పైన మనం ప్రస్తావించుకున్న ధూర్జటి కవితల్లో ’భావస్ఫోరకత, మాధుర్యము, ద్రాక్షాపాకం’ – ఇవన్నీ ధూర్జటి కవితలో అలవోకగా ఇమిడిపోయి కనిపిస్తాయి. అంతే కాదు, ధూర్జటి కవిత గొప్ప రసప్రపూర్ణమైనది కూడానూ. ఈ రసప్రతీతి – పనికట్టుకుని కల్పించిన నగిషీపని కాదు. అలా అలవోకగా, స్వభావసిద్ధంగా కవితలో ఇమిడిపోయిన లక్షణం యిది. దరిమిలా నత్కీరుడి ద్వారా కవి చెప్పించినది కూడా తన కవిత్వలక్షణాలనే అని అనిపిస్తుంది. రాయల వారు ప్రస్తావించిన ’అతులిత మాధురీ మహిమ’ లోని మాధురి కూడా ధూర్జటి కవి ఈశ్వరుని నోట పలికించిన ’సాహిత్యస్ఫురన్ మాధురీ చారు ప్రౌఢిమ’ ను గురించే అయి ఉండవచ్చునేమో ననిపిస్తుంది. అయితే కాళహస్తి మహాత్మ్యము కావ్యాన్ని మొత్తం మథించి, అత్యుత్తమమైన ఘట్టాన్ని ఏరికొమ్మంటే మాత్రం – తిన్నడు లింగానికి సేవ చేసే ఘట్టం (3.65 – 3. 71) అని ఒప్పుకోక తప్పదు.

కవిత్వాన్నే కాక, కవిత్వవిమర్శ తీవ్రతనూ కవి కథలో భాగంగా చిన్నగానే అయినా ప్రస్తావించాడు. సభలో – నిటలాక్షుడు నత్కీరునిపై ఆగ్రహం చెంది తన ఫాలనేత్రాన్ని నత్కీరునికి దర్శింపజేస్తాడు. నత్కీరుడు తొణకక యిలా అంటాడు.

కం.

తలచుట్టు వాఱఁ గన్నులు

గలిగినఁ బద్యంబు దప్పు గాదన వశమే?

వలదిచ్చట నీ మాయా

విలసనములు పనికిరావువిడువు మన్నటన్(3.171)

తా: ఓ పరమేశ్వరా! నీ ఫాలంలో నేత్రం ఉన్నంతమాత్రాన – పద్యంలో తప్పు తప్పు కాకపోదు. నీ మాయా విలాసాలు ఇక్కడ పండితపరిషత్తులో కాదు, వీటిని ఇక్కడ ప్రదర్శింపకుము, విడువుము.

అప్రస్తుతప్రశంస: సాక్షాత్తూ పరమేశ్వరుని కవిత్వంలోనూ దోషం ఎన్నిన నాటి విమర్శ యెక్కడ? అణువణువునా ’భజన’ పరత్వమే ధ్యేయంగా మారిన నేటి విమర్శ యెక్కడ? లేదా మన కవులు పరమేశ్వరుని ’స్థాయి’ ని మించిపోయారని మనం గర్వపడాలి కాబోలు!

ముగింపు:

ప్రబంధము – అంటే అవిచ్ఛిన్నంగా సాగే కవితప్రవాహమును వహించిన గ్రంథము అని ఒక నిర్వచనం. అవిచ్ఛిన్నత – అంటే వస్త్వైక్యాన్ని ఉద్దేశించినది. కాళహస్తి మహత్మ్యములో వస్తువు శివభక్తిపారమ్యత. అంగి రసము శాంతము. అంగములు – శృంగారము, అద్భుతము ఇత్యాది. ఒక్కొక్కచోట కావ్యాంగ రసమైన శృంగారం అంగిని దాటిపోయిన సందర్భాలు ఉన్నవి.

తిన్నడు – కాఱడవిలో దిక్కూమొక్కూ లేక పడి ఉన్న లింగాన్ని, తమ పల్లె ఉడుమూరికి రమ్మని పిలుస్తున్నాడు. తమ ఊరికి వస్తే, రకరకాల తేనెలు ఇస్తాడు, రకరకాల పాలు, వాటితో చేసిన పాయసాన్నాలు సమర్పిస్తాడు, రకరకాల అడవిపళ్ళు సమకూరుస్తాడు, ఇంకా;

తే.గీ.

చుఱుకుఁ జూపునఁ గాలిన కొఱఁత నుఱుకు

నుఱుకుఁజూపులఁ బుట్టించు నెఱుకవారి

యిఱుకు వలిగుబ్బపాలిండ్ల యిగురుబోండ్ల

సేవకిచ్చెద నీకు విచ్చేయవయ్య(3.71)

చిఱుకున్ చూపునన్ = చురుకుగా చూసిన చూపుతో; కాలిన = వేడెక్కి; కొఱఁత నుఱుకున్ = అకార్యము చేయు (ఆంధ్రభారతి నిఘంటువు); యిగురుబోండ్లు = చివురులాంటి యువతులు;

 ఈ పద్యం యొక్క అర్థం కొంచెం ఇబ్బంది పెడుతుంది. భిల్లుల యింటి ఆచారాలు అలాంటివని అనుకోవాలి. అలా ఉంచితే, బాలుడైన తిన్నడి ద్వారా కవి ఈ పద్యం చెప్పించటం అనౌచిత్యమని కొందరు విమర్శకుల భావన. అయితే 2.36 వచనంలో తిన్నడు నవయౌవనుడని స్పష్టంగా ఉంది. ’ఆ సమయంబున నవయౌవనం బాసన్నం బగుటయుఁ దిన్ననికి..’ .  ఆ చర్చలు గట్రా పక్కన పెట్టి పద్యాన్ని చదువుకుంటే – ఈ పద్యంలోని పదగుంఫనపు సోయగమే సోయగం!

ఈ కావ్యం గురించి యెడతెరిపి లేక మాట్లాడుకొనవచ్చు కానీ, ఓ వర్ణనతో ప్రస్తుతానికి ముగింపక తప్పదు.

చీకటి పడుతోంది. వెన్నెలలు ముసురుకొంటున్నవి.

.

వెన్నెలగుజ్జు నంజుకొని వెన్నెలప్రోవు భుజించినాలికన్

వెన్నెల గ్రొజ్జుఁ జాలఁగొని వెన్నెల తేటలఁ ద్రావి వేడుకన్

వెన్నెల కాను జుఱ్ఱుకొని వీథులయందుఁ జకోరదంపతుల్

మిన్నులు ముట్టి వెన్నెలలు మేపుచుఁ బిల్లలుఁ దాము నాడఁగన్. (4.93)

చకోరదంపతులు = వెన్నెల పులుగులు (ఈ పురుగులు/పక్షులు వెన్నెల కోసం తపిస్తూ ఉంటాయి. వెన్నెలను త్రాగుతాయి. ఈ పక్షుల ప్రస్తావనలు భారతదేశ సాహిత్యపు కవితాసమయాలలో వేలాది ఏళ్ళుగా ఉన్నాయి.)

కాను = నీరు కలపని చిక్కని మజ్జిగ;

పద్య తాత్పర్యం:  చకోరపక్షుల జంట వెన్నెల గుజ్జు (లేహ్యము) నంజుకొని, అప్పుడప్పుడూ వెన్నెల పచ్చడిని (చోష్యము) నాలుకకు రాసుకుంటూ వెన్నెలకుప్పతో భోజనం (భోజ్యము) చేసింది, ఆపై వెన్నెల మీగడలను (భక్ష్యము) గ్రోలింది, నీరు కలపని మజ్జిగ వంటి వెన్నెలను (పానీయం) జుఱ్ఱుకొని, వీథుల్లో చేరి, ఆకాశాన యెగురుతూ, వెన్నెలను ఎక్కువ చేస్తూ, పిల్లలతో కలసి తామూ ఆడుతున్నవి.

ప్రస్తావించిన పంచభక్ష్యాలు – భక్ష్య భోజ్య చోష్య లేహ్య పానీయాలు అన్నీ వెన్నెలవే. వెన్నెల పులుగులు వెన్నెల గ్రోలడం సాధారణమైన కవిసమయం. ఈ కవిసమయాన్ని భంగ్యంతరంగా ఇంత అందంగా చెప్పడమే మాధుర్యం.

చకోరకాల జంటే కాదు, పాఠకులూ ధూర్జటి కవి కవితల వెన్నెలలో అలా ఆడవలసిందే. అంత కమనీయమైన కవిత – కవి గారిది. ఒక్క పిసరు కూడా ఇందులో అతిశయోక్తి లేదు.

*****

(Note:  కాళహస్తీశ్వర మహాత్మ్యము – ఈ కావ్యం టీకాసహితంగా జాలంలో దొరుకుట లేదు. అందువలన వ్యాసంలో ఉటంకించిన పద్యాలకు సాధ్యమైనంత మేరకు స్వశక్తితో, నిఘంటువుల సాయంతోనూ, ప్రతిపదార్థాలు కూర్చడమైనది. ఆ ప్రయత్నంలో జరిగిన పొఱబాట్లు క్షంతవ్యాలు. పండితులు, విజ్ఞులు సవరణలు సూచిస్తే ఆనందమే.)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here