అతుల్యవిక్రమం

0
3

[dropcap]‘శూ[/dropcap]న్యం మీదుగా విషాదం కమ్ముకుంటుంటే, అశ్రువులను చినుకులుగా మార్చి బీడు మనసును మొలకెత్తించేవరకు ఆశల విత్తులను వెదజల్లుతూనే ఉంటాను’.. “వావ్ అమ్మా! చాలా బాగుంది కొత్త కథన్నమాట!” డైరీలో అమ్మ పలుకులను చదివి అభినందించకుండా ఉండలేకపోయాను. ఆత్మన్యూనతను దరిదాపుల్లోకి కూడా రానియ్యని ధీర వనిత తను.

“మొదలు పెట్టాను, చూడాలి., అన్నట్టు అతుల్యా! బిందుగారు ఎలా వున్నారు?”.

“ఏమీ బాగోలేదు అమ్మ. ఇవాళ మళ్ళీ హై డోస్ ట్రాన్క్విలైజర్ ఇవ్వాల్సి వచ్చింది” ఓ విషాద నిట్టూర్పు నాలో.

“త్యాగం కూడా ఒక మత్తులాంటిదే అంటారు., ఆ మత్తులో ఉన్నంత సేపు గొప్ప సౌఖ్యము. ఒక్కసారి ఆ మత్తు నుండి బయటపడితే, చుట్టూ అంతా శూన్యమే. తనదయిన జీవితాన్ని జీవించాలంటే పెద్ద యుద్ధమే చెయ్యాలి. లేకపోతే బిందు గారిలా విషాద నీలిమలో కలిసిపోయే జీవితాలుగా మిగిలిపోతాయి!” అంది అమ్మ తన అనుభవం నుంచి ఉబికిన ఆవేదనతో.

“అవునమ్మా! జీవితమంతా తనవారికోసం ధారబోసి తనకంటూ ఏమీ లేకపోవడతో ఆ శూన్యాన్ని పూడ్చుకోలేక రోజురోజుకు ఇలా!..” గొంతు జీరబోయింది నాకు.

“అతుల్యా! మనసుకు తీసుకోకు. మనసుతో వారికి ఉపశమనం కలిగించు అంతే!. ఇంతకు ఎందుకు చాలా నెర్వెస్‌గా ఉన్నావు?” అనునయంగా అడిగింది అమ్మ.

“నిన్న చెప్పాను కదా అమ్మా! రామ్ బీదర్లో ఒక పెద్ద ‘హ్యూమన్ ట్రాఫికింగ్’ ను ఛేదించేందుకు వెళ్లాడని. అప్పటికే ఎవరో వారికి ఉప్పందించారు. అనుకున్నంత సక్సెస్ కాలేదు, ఒకరిద్దరిని మాత్రమే రక్షించగలిగినట్టు సమాచారం. ఇంకా పూర్తి వివరాలు రావలసివుంది” నిరుత్సాహంగా చెప్పాను.

“నీరుగారిపోకు అతుల్యా! నీ వయసు యువతీయువకులు పబ్బులు, మాల్స్ అంటూ తిరుగుతుంటే డాక్టర్‌వి, అనాయాసంగా పెద్ద కార్పొరేట్ హాస్పటల్లో కోరినంత జీతం దొరికే అవకాశం ఉన్నా, ఎర్రగడ్డ మెంటల్ హాస్పటల్లో మానసిక రోగుల బాగోగులు చూస్తూ, సన్నిహితులతో కలసి ‘జాగృతి’ ఎన్జీఓను సమర్థవంతంగా నిర్వహించడం ఆషామాషీ కాదు. అందుకే నువ్వంటే నాకు గర్వం. ఎలా కలిశారో వివిధ శాఖల్లో వున్న మీరంతా!!? మీ జాగృతి విజయాలు చూస్తుంటే ఎప్పుడూ అబ్బురమే నాకు. ఎన్నో అవార్డులు, రివార్డులు అంతకు మించి ఎనలేని తృప్తీ మీ సొంతం. ఫలితాల్లో హెచ్చుతగ్గులు మాములే కదా!” అన్న అమ్మ ఊరడింపు మిహి సాంత్వన నాకు. నిట్టూర్చి చంటిపిల్లనై అమ్మ ఒడిని చేరాను.

***

నిన్నటి ట్రీట్మెంట్ తర్వాత బిందుగారిని చూడాలనిపించి, రోజుకన్నా ముందే వచ్చాను.

“ఎలా వున్నారు?” ఇంతకన్నా చచ్చు ప్రశ్న ఇంకోటి లేదని తెలుసు. అయినా.,

“ఎప్పటిలానే!!…” గుండెచెమ్మతో దాహం తీర్చుకున్నంత దీనంగా వుంది తన గొంతు.

“మీకు విశ్రాంతి అవసరం…” ఏమి మాట్లాడాలో తెలియక వచ్చిన మాట. అర్థం చేసుకుంది కాబోలు ఓ నిర్వికారమైన నవ్వు. ఒంటరి దారుల్లో చిక్కుబడిపోయిన జీవితాలకు స్పందించే వారెందుకుండరు?!. ఈ ఆసుపత్రిలో ప్రతి పేషెంట్‌ను చూసినప్పుడల్లా ఇదే భావన నాది.

నా ఆలోచనల్లో ఉంటూండగా, సుష్మా నుంచి మెసేజ్.., ‘జాగృతికి వెంటనే రమ్మంటూ..’ నాకు జాగృతిలో పెద్ద అత్యవసర కేసులేమీ ఉండవు. ఎర్రగడ్డలో డ్యూటీ ముగించుకొని అక్కడికెళ్ళటం నా దినచర్య. జాగృతి ఒక ‘సెక్స్ ట్రాఫికింగ్ అండ్ హ్యూమన్ ట్రాఫికింగ్ రీహాబిలిటేషన్ సెంటర్’. సుష్మ మా జాగృతి మేనేజర్. మొత్తంగా తనే చూసుకుంటుంది. మా సంస్థకు వెన్నముక, సుష్మ ఫియాన్సీ అయిన సి‌ఐ‌డి ఆఫీసర్ రామ్. విషయం ఏమైయుంటుందా! అనుకుంటూ జాగృతి కి చేరుకున్నాను.

“అతుల్యా! నీకోసం ఓ వినూత్నమైన కేస్ వచ్చింది..” అంటూ సుష్మ నవ్వుతూ ఎదురొచ్చింది.

“నిన్న ట్రాఫికింగ్ నుంచి రక్షించబడిన వాళ్ళా!”.

“అందరూ కాదు,, అందులో ఒకరు, పద!! నీకోసమే వెయిటింగ్…” అంది. ఎందుకో అర్థంకాక తనను అనుసరించాను. స్పెషల్ వార్డ్ తలుపువేసుంది. బైట నాకోసమోనేమో రామ్ వేచి యున్నాడు.

“హలో రామ్!!”.

“హాయ్ అతుల్యా!! ఈసారి కొద్దిగా ఇంట్రెస్టింగ్ కేస్ చూద్దువు గాని రా!” అంటూ మూసి ఉన్న గది తలుపుని మెల్లిగా తెరిచి లోనికి వెళ్తున్న రామ్‌ను మేము అనుసరించాము. అక్కడ,, ఏ చిలిపికళ్ల కలల రాకుమారుడో!, మంచమ్మీద హాయిగా పడుకొని ఉన్నాడు, చూపు తిప్పుకోనివ్వని అరవింద నేత్రుడు. కాసేపు స్థాణువైన నేను, రామ్ చిలిపి నవ్వుతో సర్దుకొని, రాకుమారుడికి నిద్రాభంగం అవుతుందేమో అని బయటకు వచ్చేశాను. నన్ననుసరిస్తూ వాళ్ళు.

“నివ్వెరపోయావా? లేక…” ఆటపట్టిస్తూ రామ్. తన పరిహాసానికి దరహాసాన్ని బదులిచ్చి, ఆశ్చర్యం నుండి తేరుకొని, “సెక్స్ ట్రాఫికింగ్ అంటే అమ్మాయేమో అనుకున్నా!!” అన్నాను.

“అందుకేగా ఇంట్రెస్టింగ్ అన్నది” భృకుటి ముడివేస్తూ పలికాడు రామ్.

“స్ప్రైట్ తాగుతావా!” అన్న నా మాటలకు విరగబడి నవ్వి, “సూటిగా విషయం ఏమిటంటే, ఎంత పక్కా ప్రణాళికతో దాడి చేసినా,, ఎలా తెలిసిందో అందరూ తప్పించుకోగా, ఇద్దరమ్మాయిలతో పాటు, ఈ అబ్బాయి అపస్మారకస్థితిలో పట్టుబడ్డాడు. ఆ అమ్మాయిల ద్వారా ఇతను ఫినాయిల్ తాగినట్టు తెలిస్తే ఆలస్యం చేయకుండా దగ్గర్లోని హాస్పిటల్లో ప్రథమ చికిత్స చేయించి ప్రాణాపాయం తప్పిందని చెబితే ఇక్కడకు తీసుకొచ్చేసా…” వివరించాడు రామ్.

“ఇంతకు ఈ అబ్బాయి నిర్వాహకుడా?!”

“కాదని ఆ అమ్మాయిలు చెప్పారు. వాళ్ళు తెలిపిన వివరాల ప్రకారం ఇతనో మేల్ ప్రాస్టిట్యూట్..” రామ్ అన్నమాట వినగానే విభ్రమమో! విస్మయమో! ఇంకా ఏవేవో భావనలు ఒకేసారి కలిగాయి నాలో. చేష్టలుడిగి చూస్తుంటే రామ్ నిట్టూర్చి, “ఈ మధ్య మాకు కొన్ని విషయాలు తెలిసాయి, డబ్బు, మాదక ద్రవ్యాలను ఎరగా వేసి అబ్బాయిలను కూడా ఇందులోకి దింపుతున్నారని ముఖ్యంగా అశ్లీల వీడియోల కోసం.., దీనికి చాలా పెద్ద మార్కెట్ ఉంది. మనకు మేల్ ప్రాస్టిట్యూట్ దొరకడం ఇదే మొదటిసారి. వద్దనుకున్నప్పుడు కొద్దోగొప్పో వెళ్లిపోయే అవకాశం ఉన్నందున అబ్బాయిలు త్వరగా దొరకరు. మరి ఈ అబ్బాయి ఆత్మహత్యా ప్రయత్నం ఎందుకు చేశాడు? కాలు ఎలా ఫ్రాక్చర్ అయ్యింది? ఇతని కోణం ఏమిటో చూడాలి. చేతికున్న సూది గుర్తులు చూస్తుంటే బాగా డ్రగ్ అడిక్ట్ అని తెలుస్తోంది. పూర్తి వివరాలు రాబట్టే పని నీదే. దాంతో మనం ఇంకా ఇటువంటివారిని రక్షించే అవకాశం ఉంటుంది. పోలీసులకు ఓర్పు తక్కువ. ఈజిట్ క్లియర్!??” నాకో బృహత్కార్యం అప్పగించినట్టు చెప్పాడు.

“అన్నట్టు ఈ అమ్మాయిలను ఏం చేద్దాం?!” సుష్మ నవ్వుతూ రామ్‌ను అడిగింది.

“మామూలే!! ప్రభుత్వ రూల్స్ ప్రకారం కౌన్సెలింగ్ పేరుతో నెలరోజులు మేపడం, తర్వాత వదిలి పెట్టడం. ఆ తర్వాత మళ్ళీ ఇంకో రైడ్లో పట్టుకోవడం. ఇప్పుడు దొరికిన వీరు, ఇది మూడోసారిట. మనమేమో ట్రాఫికింగ్ అని పరుగులు, వీళ్ళకేమో పుట్టింటికి పండగకు వచ్చినట్టు!” అని రామ్ ఇంకా ఏదో చెబుతుండగా ఫోన్ రావటంతో బయటకెళ్లి మాట్లాడి వచ్చి,

“ఈ అబ్బాయి గురించి కొన్ని వివరాలు తెలిసాయి. అతని జేబులో దొరికిన ఆధార్ కార్డుతో మాకు లభించిన వివరాలు,, పేరు విక్రమ్, తల్లి విదేశీయురాలు, తండ్రి విశాఖ ట్రైబల్. విశాఖలోని ట్రైబ్స్‌కు అతను దేవుడు. తల్లి బతికే ఉంది. తండ్రి ఈమధ్యే చనిపోయాడు. ఆధార్ లింక్డ్ బ్యాంక్ అకౌంట్స్ చూస్తే డబ్బు బాగా ఉంది. తల్లి బాంబే లోనే ఉంటోంది. కానీ బ్యాంక్‌లో ఇచ్చిన అడ్రస్‌లో ఇప్పుడు ఉండట్లేదు. విశాఖలో వీరి గురించిన సరైన సమాచారం ఏది దొరకలేదు. ఇప్పటికి లభించిన వివరాలు ఇవి. వీడు చిన్నప్పటినుంచి బాలల లైంగిక హింసకు గురయ్యాడు అని నా అనుమానం. ముంబైలో కదా ఉండేది. పైగా ఆంగ్లో ఇండియన్, అందంగా వుండటంతో డిమాండ్ ఎక్కువే ఉంటుంది” అని చెప్పటం ముగించాడు రామ్.

“అన్నీ తెలిసాయి కదా రామ్!! ఇక మేము కనుక్కోవాల్సింది ఏముంది?” అడిగింది సుష్మ.

“అవును నిజమే!” నేను వత్తాసు పలికాను.

అందుకు రామ్, “వ్యక్తిగత వివరాలు, ఎలా వచ్చాడు ఇందులోకి, అన్నవి నాలుగు తగిలిస్తే చెప్తాడు. ఆత్మహత్యా ప్రయత్నానికి గల నిజమైన కారణం కావాలి. సెన్సిటివ్ అనుకుంటా,. పోలీసులు అడిగితే వివరాలు చెబుతాడు కానీ, ” అని తను మాట పూర్తి చేసేలోపే నేనందుకుంటూ,

“ఎస్!! అతన్ని చూస్తే ఇట్టే చెప్పొచ్చు చాలా డిప్రెషన్‌లో ఉన్నాడని,, మీ పోలీసుల చేతికి చిక్కితే వివరాలు తెలుస్తాయి కానీ, మనిషి మిగలడు. మన ‘మోటో’ మనసుని బతికించటం. హుందాగా జీవించేలా మలచడం!”, మోటో అన్న పదాన్ని వత్తి పలుకుతూ అన్నాను.

“Exactly!!” అని నన్ను సమర్థిస్తూ.,

“మనం చెయ్యాల్సిన పని తన అంతరంగం ఏమిటో తెలుసుకోవడం. చిన్నప్పటినుంచి గాయపడ్డ మనస్సు, శరీరం అంత త్వరగా ఎవ్వరినీ నమ్మకపోవచ్చు. బయటకు వెళ్తే ప్రమాదం అని ఖచ్చితంగా చెప్పగలను. అందుకే, నేను ఎఫ్‌ఐ‌ఆర్ కూడా రాయలేదు. ఎఫ్‌ఐ‌ఆర్ రాస్తే కోర్టులో సరెండర్ చెయ్యాలి. అప్పుడు అవతల వాళ్ళు సునాయాసంగా పట్టుకుంటారు. ఇతను ఏదో పెద్ద ప్రాస్టిట్యూట్ హౌస్లో డిమాండ్ ఉన్న కాండిడేట్ అని నా అనుమానం. ఇలాంటి ఒక్కరిని కాపాడగలిగితే మనం పెద్ద విజయం సాధించినట్టు” అని వివరాలు అందించి వెళ్ళిపోయాడు రామ్.

“అతుల్యా!! ఆ అబ్బాయిని చూస్తుంటే చాలా జాలిగా ఉంది. మనకు ఇదే తొలి కేస్. మన మామూలు కౌన్సిలర్స్ పనికిరారు అనిపించి రామ్ నిన్ను ఎన్నుకున్నాడు..” అని చెప్పి సుష్మ కూడా వెళ్లిపోయింది.

ఏదో తెలియని ఉత్సుకత, అంతకంతకూ పెరుగుతున్న ఆసక్తి మళ్ళీ తన గదికి నన్ను పిల్చుకెళ్లింది. పడుకున్నాడేమో అని మెల్లిగా తలుపు తీశాను. గంధర్వుడు శాపవశాన భూమ్మీదికి వచ్చాడేమో అన్నంత అందంగా వున్నాడు. పల్స్ చూడటం కోసం అతని చేతిని పట్టుకుంటే, ఆడవారికన్నా సౌకుమార్యంగా ఉంది చెయ్యి. చేతిపై కమిలిన గాయాలు, సూది గుర్తులు. చెయ్యి తాకగానే తనలో ఓ జలదరింపు,. సుదీర్ఘ స్వప్నం తర్వాత ఇప్పుడే నిద్దుర లేచిన్నట్టు మెల్లిగా కళ్ళు తెరిచాడు. కొంపదీసి సినిమాల్లో మల్లే తన గతం అంతా మర్చిపోయి, ‘నేనెక్కడ వున్నాను!? అని అడుగుతాడా!..’ నా అపరిపక్వ ఆలోచనలకు భంగం కలిగిస్తూ, చుట్టూ పరికించి ఆఖరుకు నామీద చూపు నిలిపి, “నేను బతికే వున్నానా!?” భయానక సుడిగుండంలో చిక్కుకున్న ఆవేదన ఆ గొంతులో ఒలికింది. శోకాన్ని పరామర్శించటమే నేను నేర్చిన విద్య కదా!! నాలోని వైద్యురాలు ఏ తడబాటు లేకుండా, “మీకేమి అవ్వలేదు, ఓ నాలుగు రోజుల్లో డిశ్చార్జ్” అన్నాను.

“మీరు డాక్టరా??”

“అవును. మీ తాలూకు చెబితే, వారికి ఇన్ఫార్మ్ చేస్తాము” అన్నాను. ప్రశ్న అడిగాక బదులివ్వాలిగా., ఏంటో మౌనం… వెళ్దాం అనుకుంటూ దగ్గరకెళ్లి మళ్ళీ నాడీ చూసి సవ్యంగా వుందన్న తెరిపితో, ‘అడగొద్దు’ అని బుర్ర చెబుతున్నా, మనన్సు అడగమని మారాము చేస్తుంటే, “మీకు తెలుగు వస్తుందా!?” అని అడిగా సెలైన్ వైపు చూస్తూ,. నా ప్రశ్న నన్ను సూటిగా చూడనివ్వలేదు. అలవాటు లేని నటన మరి.

“నా తెలుగు బాలేదా?” ఇబ్బందిగా బదులిచ్చాడు. ఇతనికి బదులివ్వడం అంటే ప్రశ్నించటమే కాబోలు. నేను వివరాలు కనుక్కోవాలంటే జవాబులు అడగాలేమో అని నవ్వుకొని,

“బాగుంది. మిమ్మల్ని చూస్తే తెలుగువారిలా అనిపించలేదు అందుకు అడిగా”.

“నేను తెలుగే” అని బదులిచ్చి ప్రశ్నా కార్యక్రమాన్ని ఏకపక్షంగా ముగించి కట్టుకట్టిన కాలు సలిపిందేమో చిన్నగా మూలిగి కళ్లుమూసుకున్నాడు. ‘పేరు అడగాల్సింది పోయి.,’ నా ధోరణికి నవ్వొచ్చి ఇవాల్టికి విశ్రాంతి అవసరం అని నేను వచ్చేశాను. మళ్ళీ ఆత్మహత్య వంటి పనులు చేయకుండా తనతోనే సాయానికి, కాపలాకు అన్నట్టు ఒక మనిషిని పెట్టాడు రామ్.

***

తెలియని ఆసక్తేదో ఉదయమే జాగృతికి వచ్చేట్టు చేసింది. మెల్లిగా విక్రం గది తలుపు తీశాను. నేను వచ్చిన అలికిడైనా,, ప్రపంచంతో సంబంధాలు తెంచుకున్నట్టు కిటికీలోంచి కనిపిస్తున్న శూన్యాకాశం వైపు నిర్జీవపు చూపులు రెప్పవాల్చకుండా చూస్తున్నాడు. చెంగు చెంగున ఎగరాల్సిన నవ యువకుడు ఇంత పరాధీనంగా!, గుండె మెలిపెట్టినట్టైంది.

“మీ పేరేంటి?” మాట్లాడేందుకు మౌనం తప్ప ఇంకేమీ లేనట్టు కనీసం చలనం లేదు నా ప్రశ్నకు. రెప్పవేయటం కూడా మరిచాడేమో ఒకింత భయంతో పల్స్ చూశాను, నార్మల్ గానే ఉంది. మళ్ళీ అడగడంతో, “విక్రమ్” అని ముక్తసరిగా బదులిచ్చాడు.

“విక్రమ్!! హౌ అర్ యు ఫీలింగ్ నౌ!?” అనడిగితే జవాబుగా తలూపాడు ‘బాగున్నాను అన్నట్టు’.

“మీ వివరాలు కావాలి” అనడిగితే ‘ఇవ్వనుపో!’ అంటున్నట్టు మళ్ళీ నిద్ర నటన. ఎలా ఇతనితో మాటలు కలపాలో అర్థం కావట్లేదు. మొదటిసారి ఇటువంటి కేస్ చూడటం. సహజంగా ఆడవారే భాధితులు. మగవారు కూడానా? ఏంటో యోచించేందుకు ఏమీలేని సందిగ్ధం. విక్రముడి కథా కమామీషు తెలుసుకొనేవరకు నిద్రపట్టేట్టు లేదు. కొత్తగా వచ్చిన వారికి కౌన్సిలింగ్ సెషన్ పూర్తి చేసి, మళ్ళీ ప్రశ్నలు అడిగే బేతాళుడిలా విక్రమ్ గదివైపు వెళ్తుంటే, ‘విక్రమ్! విక్రమ్! విక్రమ్!!’ అంటూ కావాలనే కూనిరాగాలు తీస్తోంది సుష్మ.,

చిరు కోపంతో దాని పొట్టలో చిన్నగా తన్ని, “విక్రముడు బేతాళ ప్రశ్నై మదినీ, మస్తిష్కాన్ని తొలుస్తున్నాడు” అంటే, తను హాయిగా నవ్వేసి వెళ్ళిపోయింది. నేను తనతో నవ్వేసి, ‘ఈ వేళలో ఏంచేస్తూ వుంటాడో!’ అనుకుంటూ తన గది తలుపు సందుల్లోంచి తొంగి చూసా. కళ్ళు తెరుచుకొని, తపస్సు చేస్తున్న ఋషిలా ఉన్నాడు. అతని తపస్సు భగ్నమవుతుందేమోనని వెనుతిరిగి పోదాం అనుకుంటూ,, లోపలికే అడుగేసాను. ఫేస్ రీడింగ్ చేద్దాం అంటే భావాలన్నీ ఇంకిపోయినట్టు అభావంగా ఉంది ముఖం.

“ఎలా వున్నారు?” రౌండ్స్ కొచ్చిన డాక్టర్లా అడిగా, జవాబుగా నావైపు చూడకుండానే, బాగున్నట్టు తలుపాడు. సంభాషణ ఎలా కొనసాగించాలో అర్థం కాలేదు. ఆరోజు కూడా సంభాషణ ముందుకు సాగలేదు.

***

“ఏంటి అతుల్యా, కొన్నిరోజులుగా చూస్తున్నా, ఏదో హడావుడిగా వెళ్తున్నావు?” అన్న అమ్మ కంగారుకి జరిగిన సంఘటనలు వివరించాను.

“అవునా!! ఉంటారని పేపర్లో చదివా. పట్టుపడటం ఇదే వినటం” అమ్మక్కూడా ఆశ్చర్యం.

“అమ్మా! ఏమాటకామాట చెప్పాలి మన హీరోలు ఏ మాత్రం పనికిరారు. అంతందంగా వున్నాడు..” నా ఆపేక్షను ఆపుకోలేకపోయాను. అమ్మ నవ్వి,

“అందుకే,, అతనికి డిమాండ్ ఎక్కువ ఉండొచ్చు వదులుకోలేక హింసిస్తున్నారు కాబోలు. పాపం!” అన్న అమ్మ మాటల్లో కరుణ ధ్వనించింది.

“మగవారు బయటపడలేరా?!, ఇది నా ప్రశ్న. ఎందుకంటే ఆడవారికి ఉన్నన్ని ఆంక్షలు వీరికి వుండవు కదా అమ్మా!” నా మెంటార్ అమ్మను అడిగా.

“ఆలోచిస్తే నాకు ఆశ్చర్యంగా అనిపిస్తోంది. మన ఊహకు అందనిది ఏదైనా వుందేమో అతుల్యా!!”.

“అది రాబట్టడానికే విశ్వప్రయత్నం చేస్తున్నాను. అందుకే తనతో ఎక్కువ సమయం గడపటం కోసం ముందే వెళ్తున్నా. ట్రీట్మెంట్కు బాగానే రెస్పాండ్ అవుతున్నాడు. సంతోషం ఏంటంటే ఇప్పుడు మౌనం కొద్దిగా మాటలు నేర్చింది” అన్నాను గాఢంగా నిశ్వసిస్తూ.

“నా ఉద్దేశం,, చిన్నప్పుడు తెలిసీ తెలీనితనంలో ఆకర్షించబడి, పరిణితి వచ్చాక ఏహ్యత కలిగి దూరంగా వెళ్లే ప్రయత్నంలో ఎక్కడో ఓడిపోతున్నాడు. అడుగంటుతున్న ఆత్మవిశ్వాసాన్ని దీప్తివంతం చేస్తే చాలు అతుల్యా!” అని చెప్పి ఏదో స్ఫురించినట్టు “బిందుగారిని ఇతన్ని కలిపితే ఎలావుంటుంది? ఇద్దరికీ ఓ తోడు ఉంటుంది కదా, ఇద్దరిలోను మార్పు త్వరగా రావచ్చేమో!” అంది అమ్మ. పరిణితి చెందిన తన ఆలోచన నాకు ఉత్తమంగా తోచి, కార్యరూపంలో పెట్టడానికి ఆ దిశగా అడుగులు వేసాను.

***

రోజులు గడుస్తున్నాయి. ఇదివరకు జాగృతికి రోజుకు ఒకసారే ఓ గంట., పనుంటే ఇంకాసేపు. ఇప్పుడు… రోజుకు రెండుసార్లు, సమయమేమో తెలీదు. నాకు అలవాటు పడ్డాడో లేక నన్ను నమ్మాడో ఇదివరకటి శూన్యపు చూపులస్థానే చిరునవ్వుల పలకరింపు. ఒకటి అరా మాటలు కూడా కలుపుతున్నాడు. అవకాశం ఉన్న ప్రతిచోటా తన గురించి అడుగుతూనే ఉన్నా. తన గతం ప్రస్తావనకు రాగానే కుంచించుకుపోతున్నాడు. అడపా దడపా పంచుకున్న విషయాలను బట్టి తనకు బాల్య జ్ఞాపకాలు ముద్దు అని, తన తండ్రి గొప్ప సంఘసేవకుడు అని, మాకు తెలుసున్న విషయాలే రూఢి పరిచాడు. కొత్త విషయాలు పెద్దగా లేవు. ఒక రోజు,

“ఈ పుస్తకం చదువు చాలా బాగుంటుంది” అని జిడ్డు కృష్ణమూర్తి తత్వాలు పుస్తకాన్ని ఇచ్చాను. విలువైన కానుక అందుకున్నట్టు, వచ్చిన తర్వాత మొదటిసారి కళ్ళలో మెరుపులు. ఆ కాంతి సూటిగా నా గుండెను తాకింది. రాత్రంతా ఆ చూపుల సవ్వడే.

కొత్త అలవాటు ప్రకారం మరురోజు ఉదయమే వచ్చేసా విక్రమ్ గదికి. నేనొస్తానని తెలిసి నాకోసమే వేచియున్నట్టు., రాగానే ఆ పుస్తకం గురించి చర్చ. నాకు ఇష్టమైన పుస్తకం తనకు నచ్చడం, అదీ చర్చించేంతగా!. ఇది ఓ పెద్ద ఊరట నాకు. గంట పైనే గడిచి ఉంటుంది. సుష్మ వచ్చి పలకరించే వరకు ఆగలేదు చర్చ. బాగా లోతుగా ఉన్నాయి తన భావాలు. Gk గారి తత్వాలు బోధపడడం కొద్దిగా కష్టం. ఎవరైనా అబ్బురపడేట్టు చర్చించాడు. తన అభిరుచి అర్థమయ్యాక నా పని చాలా సులువయ్యింది. రోజుకో పుస్తకం, మరురోజు చర్చ., ఇలా సాగుతోంది విక్రంతో నా దినచర్య. పేరుకు పుస్తకం గురించి చర్చే కానీ, అందులో తనలో నమ్మకం, ఆత్మస్థైర్యం పెంపొందించే వ్యక్తిత్వ వికాసం గురించిన విషయాలు జొప్పించేదాన్ని. జీవితాన్ని పునర్నిర్మించుకోవడం ఎలానో సోదాహరణంగా చర్చించే పుస్తకాలనే ఇచ్చేదాన్ని. విక్రమ్ కూడా శ్రద్ధగా చదువుతూ, అనుమానాల్ని నివృత్తి చేసుకుంటూ తన్ను తాను ఎడ్యుకేట్ చేసుకోవడం నాకు ఎంతో నచ్చింది. తనలో కరుగుతున్న నైరాశ్యం, మా మధ్య పెరుగుతున్న సాన్నిహిత్యం. రామ్ అప్పగించిన పనిలా లేదు నా ధోరణి, రోజురోజుకు అదేదో more than ఫ్రెండ్ కోసం వస్తున్నట్టుంది. ఒకటి రెండుసార్లు వివరాలు అంటూ అడిగినా, తర్వాత సుష్మ, రామ్‌లు కూడా ఆ ఊసెత్తలేదు. రోజురోజుకు అతని వైపు లాగబడుతున్నా అని మాత్రం తెలుస్తోంది. బిందు గారితో కూడా మాట్లాడాను. విక్రమ్ కాలు బాగైతే ఆవిడను ఇక్కడకు పిల్చుకొనివద్దామని అంతా సిద్ధం చేసి ఉంచాను. వికలమైన మనసులకు చేతనైన సాంత్వన కలిగించటం నేనెన్నుకున్న బాట!, కానీ ఇవాళనిపిస్తోంది మనసు ఇంత బలహీనమా అని!. గాఢమైన నా నిశ్శబ్దపు క్షణాల్లో మౌనంగా నవ్వే తన తలపు ఇప్పుడు నాకో తియ్యని వ్యాపకం అయ్యింది.

***

ఒకరోజు, “నచ్చాడా!?” భుజం తడుతూ అమ్మ కళ్ళలోకి సూటిగా చూస్తూ అడిగింది. ఉలిక్కిపడి చూసా!, భోజనం కంచం ముందున్నా!, ఎక్కడో ఉన్న నన్ను గమనిస్తూ అడిగింది అమ్మ.

“అదీ అమ్మా!” తలొంచా అపరాధిలా. అమ్మ నవ్వుతూ ఉంటే దాచడం అనవసరం అనిపించి,

“అమ్మా!! ఎందుకు నచ్చాడో తెలీదు. ఇన్నాళ్ళు బలమైన వ్యక్తిత్వానికి మాత్రమే దాసోహం అనుకున్నా!” అని ఇంకేం చెప్పాలో తెలీక ఆగిపోయా.

“అందరూ అనుకుంటారు ప్రేమించడానికి బలమైన కారణం ఉండాలి అని. నేను నమ్మను. కొందరు ఎందుకు నచ్చుతారో, కొందరు ఎందుకు నచ్చరో ఇదమిత్థంగా చెప్పటం కష్టం. అన్నీ చూసి మనకు సరిపోతే ప్రేమించడం ప్రేమ కాదు. అందుకే అందరూ ప్రేమలో పడలేరు. ప్రేమకు గుండె అలికిడయ్యే భావాలు అవసరం. కొందరికి మది మొదటిసారే స్పందిస్తే కొందరికి నిదానంగా” అంది అమ్మ సౌమ్యంగా. తన విశ్లేషణ అబ్బురపరిచింది. తన కూతురు ఒక ప్రాస్టిట్యూట్‌ను ఇష్టపడుతోందని తెలిసినా, ‘ఎలా…?’ అదే అడిగాను.

“ఒక క్షణం విభ్రాంతి., కాదనను.. నీ సంస్థ లక్ష్యమే మోడువారిన జీవితాలను చిగురింపచేయడం. చేతల్లో కూడా ఉండటం ప్రతుష్టి. ఇంతవరకు సాగిన నీ జీవన గమనం ఇచ్చిన భరోసా!” అని వెన్ను తట్టి వెళ్ళిపోయింది. నోట మాటరాక సంభ్రమంగా అమ్మను చూస్తూ ఉండిపోయా. అమ్మ సమ్మతి ఆకాశమే అందుకున్న అందమైన అనుభూతి. నిజం! అందరికీ ఉండదు ఇలాంటి అమ్మ. స్థితప్రజ్ఞతకు నమూనా తను. మరోసారి ప్రాజ్ఞి అని నిరూపితమైంది.

అమ్మకు విషయం తెలిసాక తనతో గడిపే సమయం పెరిగింది. దూరం దగ్గరైన ఆనందం. ఇవాళే తన కాలు కట్టువిప్పుతారు. మా దగ్గరనుంచి వేరే ఆసుపత్రికి వెళ్ళాలి. నాకు ఎర్రగడ్డ లో మినిష్టర్ ప్రోగ్రాం ఉండటంతో నేను వెళ్లలేకపోయాను. మినిష్టర్ వెళ్ళాక ఫోన్ చేద్దాం అని చూస్తే సుష్మ నుంచి చాలా మిస్డ్ కాల్స్,. త్వరగా రమ్మంటూ మెసేజ్,, ఏ వార్త వినాల్సొస్తుందోనన్న ఆదుర్దా!. ముసురుకుంటున్న ఏవేవో విపరీత ఆలోచనల మధ్య కారును పరుగుపెట్టించి క్షణాల్లో జాగృతి చేరాను.

నాకోసమే ఎదురుచూస్తున్నట్టు రామ్, సుష్మ. రామ్ జాలి చూపులను తప్పించుకొని విక్రమ్ గది తలుపు తీసాను. విక్రమ్ స్థానే ఏదో కాగితం ఎగురుతోంది. రామ్ వైపు చూసా.

“అతుల్యా! విక్రమ్ ఆ లెటర్ ఇచ్చి వెళ్ళిపోయాడు” అన్నాడు రామ్.

“అలా ఎలా వెళ్ళనిచ్చావు??!!” నిస్సత్తువ నాలో.

“లెటర్ చదువు” అని ఇంకేమి మాట్లాడకుండా వెళ్ళిపోయాడు, భుజం తట్టి సుష్మ కూడా వెళ్ళిపోయింది.

ఎవరో నా శక్తినంతా లాగేసినట్టు,. ఒక్కదాన్నే!, భారంగా నిశ్వసించి వణుకుతున్న చేతులతో ఉత్తరం తీసాను., కళ్ళల్లో ఎప్పుడూ లేనిది నీటి చెలమలు, అలాగే అక్షరాల వెంట పరుగెత్తించాను.,

అతుల్య గారూ,

చితికిన చీకటికి వెలుతురును కానుకిస్తూ మది తలుపు తెరిచిన తూరుపు మీరు. తెగులు పట్టిన నా నిన్నని నేడు అందంగా మలిచేందుకు మీరు చేసిన ప్రయత్నం నాకు ఆలంబన. మీరు నాలో నమ్మకాన్ని ప్రతిష్ఠించేందుకు సలిపిన కృషి అతుల్యం. నావంటి వారినిచూస్తే కలిగే ఏహ్యత, జాలి, దయ ఎన్నడూ మీలో చూడలేదు., అచ్చంగా మా నాన్నలానే.. అమ్మ రుమేనియా దేశస్థురాలు, చీకటికి రాణి అవ్వాలనుకొని ఇండియాకు వచ్చింది. నాన్న ప్రేమతో చీకటిని వదిలి వెలుగుకు పయనం అయితే చేసింది కానీ., నాన్న ఆర్తుల కోసం ఆరాట నైరూప్యంలో ఆమె మళ్ళీ చీకటిని వరించింది. ఈసారి పదేహేనేండ్ల నాకు కూడా చీకటిలోనే అందం ఆనందం అని నేర్పింది. నాన్నది అరణ్యరోదనే. ముంబయి మహానగరం, అదో రంగురంగుల ప్రపంచం, అయిష్టమైన చదువుతో పని లేదు. విచ్చుకుంటున్న యవ్వనానికి కావాల్సినదంతా దొరికింది. అమ్మ కలగన్నట్టు తను రాణి, నేను యువరాజు అయ్యాము. డబ్బు, హంగు, ఆర్భాటం వయసుతో పాటు పెరుగుతూ వచ్చాయి. ఫేజ్ 3 సెలబ్రిటీల్లో చాలామంది నా క్లైంట్స్. అలా సాగుతున్న నా జీవితంలో ఒకనాడు ఒక అమ్మాయి నేనెవరో తెలిసి ఈసడించుకోవడంతో అప్పటికే మోనోటనీ మొదలైన నాలో అంతర్మథనం మొదలైంది. అప్పుడే అనుకోకుండా నాన్న చనిపోయినట్టు వార్తల్లో చూసా. నాన్న గొప్పదనం చెబుతూ తన తీరని కల గురించి చెబుతుంటే నాలో ఓ వెలుగురేఖ. దాని వెంట పరుగులో తెలిసింది నేనున్నది ఊబిలో అని. వారి కబంధ హస్తాలనుంచి తప్పించుకోవడం దుస్సాధ్యం అని అర్థమయ్యింది. అయినా పారిపోవాలని శతధా ప్రయత్నంలో విఫలమే పలకరించింది. కాలువిరిగిన నిస్సహాయతలో చచ్చిపోదాం అనుకుంటే భగవంతుని కృపేమో అమూల్యమైన మీ చేతుల్లోకి చేరుకున్నాను. ఈ కొద్దిరోజుల్లోనే మీ స్నేహంలో మీరంటే అనురక్తి స్థాయికి చేరుకున్నాను. మీలో కూడా నాపై విరిసే ప్రేమ నాకు గొప్పగా అనిపించేది. మీతోనే మమేకం అవ్వాలన్నంత ఆర్తి. నాన్న కలను నెరవేర్చడం నా ఆశయం. దానికి మీ పరిపూర్ణ మద్దతు ఉంటుందని తెలుసు., కానీ, నేను నా తల్లిలా మళ్ళీ చీకటిని ప్రేమిస్తే!. ఈ ఊహే నన్ను మీనుంచి దూరం వెళ్లేట్టు చేసింది. మీకు ఎంతో మంచి భవిష్యత్తు ఉంది. గొప్ప వ్యక్తి మీ జీవన సహచరుడిగా రావాలని మనస్పూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.

పారిపోతే మీ నమ్మకాన్ని వమ్ము చేసినవాడినవుతా!! అందుకే రామ్ గారిని బతిమాలి ఒప్పించి నాకు తెలిసిన వివరాలు వారికి అందించి, అతుల్యవిక్రమమై వెళ్తున్నాను., అశువులు బాసిన ఆత్మవిశ్వాసపు భావుటాని మొలకెత్తిన ఆశ సాక్షిగా హృది పుడమిపై హుందాగా పునఃప్రతిష్ఠిస్తాను. ఈ చిన్ని స్నేహాన్ని మరువరని ఆశతో…

విక్రమ్.

మాటలు వలసపోయాయో లేక వీడిపోయాయో అన్న నిశ్శబ్దంలో, హృదయాన్ని తడిపేంత అవ్యక్తపు అచేతనసంద్రం అశ్రువైంది. కన్నీరు గుండె బరువుదించాక, మరోసారి ఉత్తరం చదివాను. రామ్ కనుసన్నల్లోనే., అంటే క్షేమం అన్న నిశ్చింత. అక్షరాల్లో ఒలికిన మమత ఎడబాటు తాత్కాలికమే అన్న తృప్తితో లేఖను గుండెకు హత్తుకున్నా ఇప్పటి వెలితి నింపేందుకు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here