[ఇటీవల జరిపిన ఔలి, బద్రీనాథ్ పర్యటన వివరాలను అందిస్తున్నారు డా. నర్మద రెడ్డి]
ఔలి, బద్రీనాథ్ వెళ్ళాలన్న మావారి కోరిక ప్రకారం పిల్లలు, మనమళ్ళు మనమరాలు 30 మార్చి 2024 నుండి ప్లానింగ్ మొదలుపెట్టారు. అందరు పిల్లల ఎగ్జామ్స్ అన్ని డేట్స్ కుదిరి మే 13న బయల్దేరడానికి ఫిక్స్ చేశాము. మే 13 నుండి 23 వరకు!
14న మేము ఢిల్లీ నుండి బయలుదేరి ఉత్తరాఖండ్ లోని కొడియాల అనే ప్లేస్‌కి చేరాము. ఇక్కడికి మేము వెళ్లేసరికి రాత్రి ఒంటిగంట అయ్యింది. పదిమందిమి ఉన్న మా బృందం 12 సీట్ల బస్సు మాట్లాడుకుని వెళ్లాము. కొడియాల ఉత్తరకాండలో చాలా అద్భుతమైన ప్లేస్. మేము 24 రూములు ఉన్న రిసార్టులో దిగాము. పిల్లలు కాసేపు ఫుట్ బాల్ ఆడారు అందరం అన్నాలు తిని పడుకున్నాము. పొద్దున్నే పిల్లలందరూ బ్రిడ్జి పైకి వెళ్ళారు. ఇక్కడ 7 km మార్నింగ్ వాక్ చేసి మావారూ, నేను మా మనుమాళ్ళు మనుమరాలితో బ్యాట్మెంటన్ ఆడాము. తర్వాత టిఫిన్ చేసి ఔలి బయలుదేరాము. 6 గంటల ప్రయాణం ఎంత ఎండగా ఉందో. ఔలి వెళ్ళే సరికి 12° పిచ్చి చలి. అందరు వణుకుతూ రాత్రి భోజనం చేసి పడుకున్నాము.
ఔలి:
ఇక్కడ రెండు కొండలు ఎక్కి పైవరకు బస్‌లో వెళ్లి అక్కడ ట్రెకింగ్ చేసాము. ట్రెకింగ్ చేసిన తర్వాత మాకు ఎలాట్ చేసిన కేబుల్ కార్‌లో – నేను హర్బిత, సమిత, ఇంద్రారెడ్డి నలుగురం ఎక్కాం. ఆ కేబుల్ కార్ ఎక్కేటప్పుడు కొద్దిగా జంప్ చేసి ఎక్కలసి వచ్చింది. అది ఓపెన్ కేబుల్ కాదన్నమాట. అయితే మొత్తం చక్కటి కొండలు, మంచు కొండలు – ఆ వ్యూ చూడడానికి ఆ కేబుల్ కార్ నిజంగా బావుంటుంది. ఆ మంచు కొండల మధ్యలో మేత వెతుక్కుంటున్న గొర్రెలు తెల్లటి చుక్కలుగా కనిపిస్తున్నాయి. ఎంతో అందంగా ఉంది. ఆ ప్లేస్ చూస్తూ ఆ కొండలు చూస్తూ, చెట్లు చూసుకుంటూ మేము హాయిగా పాటలు పాడుకుంటూ ఆ కేబుల్ కార్ ఎక్కి దిగేసాం. దిగిన తర్వాత అక్కడ రెండు గుడులు ఉన్నాయి. వాటిని దర్శించుకున్నాం.
హెలికాప్టర్ వస్తే దిగడానికి అక్కడ ఒక హెలీపాడ్ లాగా పెట్టారు కాని దానిని ఇప్పుడు వాడడం లేదట. ప్రస్తుతం దాన్ని ఒక చెరువు లాగా చేశారు. మాన్ మేడ్ లేక్ అన్నమాట! ఆ లేక్ చాలా పెద్దగా బాగుంది. అక్కడ నుంచి కొండలు గుట్టలు చూస్తూ – ఎక్కుతూ దిగుతూ ముందుకు సాగాము. మేము క్రిందకి దిగడానికి కూడా చాలా రాళ్ళు లాగా ఉన్నాయి. ఆ ప్రదేశం అందానికి ప్రకృతి నిర్వచనంలా ఉంది. ఎంతో హాయిగా అక్కడ 3 గంటలు గడిపి ఒక జిప్సీ కార్ ఎక్కాము. అది ఎక్కి దాంట్లో రావడం కన్నా నడవడం మేలననిపించిది. నాకు చాలా కష్టం అనిపించింది.
క్రింద రెస్టారెంట్లో భోజనం చేసి రూమ్‌కి వచ్చేసాము. సాయంత్రం టిబెట్ గ్రామం, అంటే ఔలి చివర్లో ఉన్న డిబెట్ శరణార్థుల గ్రామానికి వెళ్ళాం. ఆ గ్రామం ఇండియా బార్డర్‍కి అనుకుని ఉంది. ఇక్కడ ఒక గుడికి వెళ్లి దర్శనం చేసుకుని వచ్చాము. ఇక్కడ ఒక అమ్మాయి కలిసి టీ ఇచ్చి తమ కుటుంబం గురించి చెప్పింది.
ఇద్దరు పిల్లలు రోజు 14 కిలోమీటర్లు నడిచి స్కూల్‌కి వెళ్లి వస్తారట. ఇక్కడ వారికి పొలం ఉంది. 1 నాలా, 2 నాలాలు.. ఇలా భూమిని కొలుస్తారట. భర్త కేదార్‌నాథ్‌లో ఉంటాడట. అక్కడ భూములు ఉన్నాయట. చాలా ఆప్యాయంగా మాట్లాడింది. ఆమెతో ఒక ఫోటో దిగి అక్కడి నుండి వెళ్ళాము.
భవిష్య బద్రీనాథ్:
మూడవ రోజు భవిష్య బద్రీనాథ్ వెళ్ళాము. ఔలి నుండి 13 కిలోమీటర్లు పోవడం రావడం జరిగింది. అతి ఎత్తైన కొండలు. అద్భుతమైన దృశ్యమాలిక. కానీ మా డ్రైవర్ కొండ చివరకు వెళ్లినా బస్సు ఇక పోదు అన్నాడు. నాకు పిచ్చి భయమేసింది. ఆ బస్సు అలా వెనక్కి దొర్లుకుంటూ వెళ్తుందేమోనని అందరం దిగేసాము.
మాకు ఎదురుగా ఒక మిలిటరీ జీప్ వచ్చింది. అతనిని అడిగాము వెళ్లగలమా లేదా అని. అతను పెద్ద పెద్ద లారీలు రోజూ తిరుగుతాయి, వెళ్ళొచ్చు అని చెప్పారు. కొండ చివరి భాగంలో అతి ఎత్తైన కొండ మీదకి ఒక 50 కొండల వరుస లెక్కవేస్తే దగ్గర దగ్గర ఒక 50 కొండలు మేము దాటము. బస్ లోనే ఐతే కొండ చివరి భాగం వెళ్లినప్పుడు చివరి భాగం వరకు ఆ పైకి వెళ్లడానికి చాలా ఐ పోసిషన్ ఉండి అది ఎక్కలేక ఆ దారి కూడా చాలా సన్నగా ఉంది. చాలా చాకచక్యంగా మా డ్రైవర్ మా బస్‌ని భవిష్య కేదార్‌నాథ్, భవిష్య బద్రీనాథ్ గుళ్ళకి క్షేమంగా తీసుకువెళ్లాడు.
కాశ్మీర్ లాగా ఉంది. పైన్ చెట్లతో అతి చల్లగా ఎంతో సుందరంగా మారు ములలో జెండాలతో గంటలు సన్నగా మ్రోగుతూ మధురమైన సవ్వడి గాలులలో ఆ గుడి అద్భుతంగా ఉంది. అక్కడ ఒక పండితుడు మా అందరిని కూర్చోబెట్టి గోత్రనామాలతో అర్ధగంటకు పైగా గంభీరమైన గొంతుతో పూజా కార్యక్రమాలు చేయించాడు.
తరువాత అందరం 1/2 కిలోమీటర్ ట్రెక్ చేసి క్రిందకు వచ్చాము. అక్కడ మ్యాగీ మాత్రమే దొరుకుతుంది. అందరం 9 ప్లేట్స్ మ్యాగీ తిని క్రిందికి దిగి వచ్చేసరికి రెండున్నర అయ్యింది. రాబోయే కాలంలో బద్రీనాథ్ ఆలయం పూర్తిగా మూసుకొనిపోయి భక్తులు వెళ్ళలేని పరిస్థితులు ఏర్పడి – భక్తులు ఈ భవిష్య బద్రినాథ్ ఆలయానికి వస్తారట! నిజంగా అద్భుతంగా ఉంది.
బద్రీనాథ్:
నాల్గవ రోజు ఉదయం 5 1/2 గంటలకి నిద్ర లేచి ఒక సుమో మాట్లాడుకుని పిల్లలు లేకుండా పెద్దలు మాత్రమే గుడికి వెళ్ళాము. ఔలిలో 6 గంటలకి బయల్దేరితే 71/2 గంటలకి బద్రీనాథ్‌లో ఉన్నాము. ఆ రోజు శనివారం కావడంతో ఒక లక్ష మంది వరకూ భక్తులు దాదాపు 5 కిలీమీటర్ల మేర క్యూ లో నిలబడి ఉన్నారు. మా డ్రైవర్ లోకల్‌గా ఛానల్ తీసి ఉండడంతో మాకు ఒక గంటలో దర్శనం చేయించాడు.
అక్కడి నుండీ ‘మన’ గ్రామము వెళ్ళాము. ‘ఇది భారతదేశంలో మొదటి గ్రామము’ అని వ్రాసి ఉంది. ఇక్కడ వ్యాసుడు మహాభారతం చెబుతూ ఉంటే వినాయకుడ రాశాడట.
అప్పుడు సరస్వతీ నదీ జలాల హోరుకి మాటలు వినిపించకపోతే సరస్వతి నదిని తన హోరుని తగ్గించమని చెప్పారట. అలాగే పాండవులు వనవాసము చేస్తూండగా, ద్రౌపది ఇక్కడ ఒక వాగుని దాటలేకపోతే భీముడు ఒక బండరాయిని వేశాడట. ఇవన్నీ చూసి మధ్యాహ్నం 2 ½ గంటలకి ఔలి చేరుకున్నాం.
***
ఔలి పైన కొండపై జీప్ లైన్‍లో పిల్లలు ఊగారు. మధ్యలో మా మనుమడు 20 కిలోలు ఉంటాడు. జిప్ లైన్ మధ్యలో ఆగిపోయాడు బరువు తక్కువ కావడంతో. మధ్యలో కేకలు కేరింతలు. మెల్లగా 5 నిమిషాల తర్వాత లాండ్ అయ్యింది.
హోటల్ కి వచ్చి క్రింద చెట్ల మధ్యలో నాలుగు గంటల నుండి పిల్లలు ఆడుకుంటున్నారు. అకస్మాత్తుగా ఒక పాము కనిపించింది, మూడు అడుగుల పాము! పిల్లలు భయంతో వణికిపోయారు. అది ఎవరిని ఏమి చేయకుండా పారిపోయింది. అప్పటినుండి పిల్లలు క్రిందకి దిగలేదు. మేము అందరం కలిసి 5 రోజులు అక్కడే గడిపాము.
ఒక రోజు నేను సాయంత్రం పూట అలా తిరుగుతూ ఉంటే ఒక అమ్మాయి కట్టెల మోపు తోటి వచ్చింది. ఆమె సన్నగా చిన్నగా ఉంది, ఆ కట్టెల మోపేమో ఆమెకు 5 రెట్లు బరువు! అంత బరువుని మోస్తూ ఆ కొండలు ఎక్కుతూ కనిపించింది.
ఆ అమ్మాయి వచ్చేవరకు ఆగి దగ్గరికి వచ్చిన తర్వాత అడిగాను – “అమ్మా, నువ్వు కట్టెలు కొట్టుకొని జీవనం గడుపుతారా? రోజు ఇలా కూలీ పని చేస్తారా?” అని అడిగాను. “లేదు, లేదు నాకు చాలా పొలం ఉంది. ఆ పొలం దగ్గర నుంచి వంట కోసం ఈ కట్టెలు తెచ్చుకొని ఎండబెట్టుకుంటాను. రోజు కొన్ని కొన్ని తెచ్చుకుంటే సంవత్సరమంతా అలా నడుస్తూ ఉంటుంది” అని చెప్పింది. “అవునా, చాలా బరువు మోస్తున్నావమ్మా” అని అన్నాను. “మా ఇల్లు ఇక్కడేనమ్మా. అదిగో కనిపించేదే” అంది. తను పదే పదే ‘రండి రండి మా ఇంటికి’ అని అడిగింది. అంతకుముందు ఆ రోడ్‍లో నడుస్తున్నప్పుడూ ఆ ఇంట్లో చాలా రోసెస్ ఉన్నాయి. ఆ రోసెస్ చూడాలని 3, 4 రోజుల నుండి అటు ఇటు తిరుగుతూన్నప్పుడల్లా అనుకున్నాను. ఈ అమ్మాయి పిలవగానే వెంటనే “సరే సరే మీ వెంబడే నేను వస్తాను” అని చెప్పి వాళ్ళ ఇంటికి నేను మా పిల్లలు ఇద్దరం వెళ్ళాము. ఇంటిని ఎంత చక్కగా అమర్చుందామె. తోటలో ఒక వెయ్యి పూల వరకు ఉన్నాయి. అన్నదమ్ములిద్దరు కలిసి కట్టుకున్నారా ఇల్లు. కొండ పై నుంచి కింద వరకు వాళ్ళదే ఇల్లు. దాంట్లోనే ఎద్దులని కూడా పెట్టుకున్నారు. బర్రెలు ఎద్దులు అన్ని ఉన్నాయి. నాకు ఆమెలో ఒక విషయం బాగా నచ్చింది. అదేంటంటే – “ఇంత ఆస్తులు ఉండి కూడా మీరు ఎందుకు ఇంత పని చేస్తున్నారు” అని అడిగితే, “ఏమీ పొద్దుపోదమ్మా. ఒక పాప. తనకి పెళ్ళయి అత్తగారింటికి వెళ్ళిపోయింది. ఒక కొడుకు. వాడికి పెళ్ళి కాలేదు. మా అబ్బాయేమో పొద్దున్నే వెళ్ళి రాత్రికి ఎప్పుడో వస్తాడు. మా అబ్బాయికి ట్రావెల్ ఏజన్సీ ఉంది. అందుకని నేను నా కోసమే – నన్ను నేను బిజీగా ఉంచుకోవటానికి ఈ పనులు అన్నీ చేస్తున్నాను” అని చెప్పింది. నాకు చాలా సంతోషం వేసింది ఆమె ఇంట్రెస్ట్ చూసి. ఎందుకంటే నిజంగానే ప్రతీ మనిషి ధనం ఉన్నా కూడా వ్యాపకం అనేది ఏర్పరుచుకోవాలి.
ఇలా నేను ఆ అమ్మాయి తోటి మాట్లాడుతుంటే టీ తాగమని చాలా బలవంతం చేసి టీ తెచ్చేసి ఇచ్చేసింది. తరువాత ఒకటే ఏడుపు! “ఎందుకమ్మా అలా ఏడుస్తున్నావు?” అని అడిగితే “నేను ఒంటరిదాన్నైపోయాను మొన్నటి వరకు నా హస్బెండ్ ఉండేవారు. ఇప్పుడు ఆయన లేరు. ఒక టీ తాగాలన్న, పలకరించాలన్నా, ఒక మనిషి లేడు” అని ఆమె తన ఘోష అంతా చెప్పుకుంటుపోతుంటే నాకైతే ఎంతో బాధ అనిపించింది. తనకి బాగా కౌన్సిలింగ్ చేశాను. “మీరు అస్సలు బాధ పడవద్దు. ఆ బాధలోంచి బైటికి వచ్చేసేయాలి. మీకు మరీ కష్టంగా అనిపిస్తే, ఒక్కసారి కూతురి దగ్గరకి వెళ్ళి పది రోజులు ఉండి రండి. తర్వాత కొడుకును కూడా త్వరగా రమ్మని చెప్పాలి. ఇంకో విషయం ఏంటంటే ఇరుగుపొరుగు వారితో స్నేహం చేసుకుని వాళ్ళ ఇండ్లకి వెళ్ళి అలా మాట్లాడుతూ మీ బాధని తగ్గించుకోవాలమ్మా” అని తనని ఓదార్చాను. ఇంక ఆ అమ్మాయి అయితే నన్ను వదలట్లేదు. “ఇంక కాసేపు కూర్చోండి, కాసేపు కూర్చోండి” అంటూనే ఉంది. ఆల్మోస్ట్ ఒక గంటన్నర తనతోటే గడిపి వచ్చేసాము.
అక్కడికి మా రూమ్‌కి రాగానే మా పిల్లలు – “రేపు ఫారెస్ట్‌లో క్లీనింగ్ ప్రాసెస్ చేస్తున్నాము, హిమాలయ కొండలలో” అని చెప్పారు. “అయితే నేను కూడా వస్తాను” అని చెప్పాను.
మర్నాడు వాళ్ళతో పాటు ఉదయాన్నే తయారై కూర్చున్నాను. ఈలోపల వాళ్లు వచ్చి “వెహికల్స్ తక్కువైన్నట్టు ఉన్నాయి, అందుకని వెయిట్ చేస్తున్నాము” అన్నారు. చాలా సేపు వెయిట్ చేస్తు నిలబడ్డారు. “ఎందుకు వెయిట్ చేస్తున్నారు, మన బస్ ఉంది కదా, నేను పిలుస్తాను” అని చెప్పి, మా బస్ డ్రైవర్‌ని పిలిచి అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఎక్కించాను. 15 మంది దాకా అయ్యారు. అందరం ఫారెస్ట్‌కి వెళ్ళాము ఫారెస్ట్‌కి వెళ్ళి దగ్గర దగ్గర రెండు గంటల పాటు శుభ్రపరిచాం.
క్లినింగ్ ప్రాసెస్ మొదలుపెట్టాక ఒకటిన్నర కిలోమీటర్ రేంజ్ ఎన్నో ప్లాస్టిక్ బాటిల్స్, లిక్కర్ బాటిల్స్, తర్వాత చెత్త, పగిలిపోయిన బాటిల్స్ లాంటి చాలా చెత్తని శుభ్రం చేశాం. అదంతా చూసి అందరం డిస్బర్స్ అయ్యాము. కొందరు అక్కడ వీడియోస్ తీసుకున్నారు. ఒక ప్రాజెక్టు క్రింద వచ్చిన వాళ్ళు ఏదో క్లీనింగ్ ప్రాసెస్ చేశారు. నేను కూడా వాళ్ళతో పాటే చేరి చెత్తని ఏరాను. అక్కడ శుభ్రం చేసి మళ్ళీ బస్ ఎక్కాము. అప్పుడు మా వాళ్ళందరినీ పాటలు పాడండి అని అడిగాను. చక్కగా గంట పాటు బస్సులో పాటుకుంటూ వెళ్ళాము.
హిమాలయాలకి వెళ్లినప్పుడు పైన చెట్లు, మంచుకొండలు ఎంత అందంగా కనిపిస్తాయో! కానీ అంత అందమైన ప్రకృతిని అంతలా పాడు చేస్తున్నారే అని బాధనిపించింది. అందుకే క్లీనింగ్ చేసేవాళ్ళని చాలా ఎంకరేజ్ చేశాను, వాళ్ళకి చిన్న గిప్ట్స్ లాంటివి కూడా ఇచ్చాను.
మేము ఇంకో రెండు రోజుల గడిపి ప్రతీ రోజూ ట్రెకింగ్ చేసి హిమాలయాల అందాలన్నీ చూసి తిరుగుముఖం పట్టాం.