ఆటోగ్రాఫ్

4
2

[dropcap]అ[/dropcap]లలు అలలుగా వినిపిస్తోంది నవ్వు. మధ్యలో పాట.. వీణలో ‘మరుగేలరా! ఓ రాఘవా!’ త్యాగరాజకృతి శ్రావ్యంగా వినిపిస్తోంది. పరిచయమున్న గొంతే, కానీ మనిషి మాత్రం కనిపించడం లేదు. పాట ఉన్నట్టుండి ఆగిపోయింది. కలలోనే కళ్ళు తెరుచుకుంది మెళకువ. లేచి కూర్చుని అయోమయంగా చుట్టూ చూశాను. ఎవరూ కనిపించలేదు. ఆ భమ్ర తాలూకు భ్రాంతి మాత్రం మెదడంతా ఆక్రమించుకుంది. సమయం అర్ధరాత్రి రెండయింది. ఆరు పదులు పూర్తిచేసుకున్న ఒంటరితనం విదేశాల్లో ఉన్న కొడుకు దగ్గర ఇమడలేనంటోంది.

నిద్ర నుండి మేల్కొల్పిన ఆ నవ్వు మరోసారి వినాలన్పించింది. లోపలికెళ్లి చిన్న టేప్ రికార్డర్ని బయటకు తీసాను. దానితో పాటే దాచుకున్న క్యాసెట్ తీసుకొని, పడక్కుర్చీలో పడుకొని, టేప్ రికార్డర్ ఆన్ చేశాను. వీణలో వినిపిస్తున్న కీర్తనలు, ఆమె నవ్వు, పాట మనసు పొరలను ఛేదించుకుని, చెవులను మంద్రంగా తాకుతుంటే, జ్ఞాపకాల నిద్రలో జోలపాట మొదలైంది.

***

నలభైఏళ్ళ క్రితం సంగతి. నేను బెజవాడలో డిగ్రీ చదువుతున్న రోజులు. కృష్ణలంకలో తెలిసినవాళ్ల ఇంట్లో అద్దెగదిలో ఉండేవాడిని. ఇంటి ఓనర్ భాస్కర రావు, ఆయన భార్య సరస్వతి.

ఆరోజు కాలేజీకి సెలవు కావడంతో ఆలస్యంగా నిద్ర లేచాను. ఇంటివాళ్ళ గది నుంచి కొత్త గొంతు వినిపిస్తోంది. మధ్య మధ్యలో అమ్మాయి నవ్వు వినిపిస్తుంటే, దంతధావనం ఆపి మరీ వినసాగాను.

“రమ్యా! పాట పాడవే! నీ పాట విని చాలా రోజులైంది” అంది సరస్వతి.

వెంటనే పాట వినిపించ సాగింది. స్వరంలో శ్రావ్యత, ఉచ్చారణలో స్పష్టత కలగలిసి రాగ, భావయుక్తంగా చెవులను తాకుతుంటే, మైమరచి వింటున్నంతలోనే పాట పూర్తయింది. కాసేపటికి తలుపు చప్పుడైంది. తెరిచి చూశాను. సరస్వతి గారు.

“ప్రసాదూ! ఈ అమ్మాయి మా అన్నయ్య కూతురు రమ్య. నాగాయిలంక నుంచి వచ్చింది. మా చలపతి మామయ్య వాళ్ళిల్లు నీకు తెలుసుగా! వాళ్ళ ఇంటికివెళ్తుందట. కాస్త ఇల్లు చూపిస్తావా?” అంది.

“అలాగేనండి” అని అంటుంటే

“బందరులో బి.ఎ. మొదటిసంవత్సరం చదువుతోంది.” అని,

“చినుకులు పడుతున్నాయి. గొడుగు తీసుకెళ్ళు రమ్యా!” అని లోపలికెళ్ళింది. ఆమె లోపలికెళ్ళి గొడుగు తెచ్చేసరికి, నేను బయటకు వచ్చి, “రండెళ్దాం” అన్నాను. ఇద్దరం బయల్దేరాం. చలపతి గారిల్లు రెండు వీధుల అవతల ఉంది. మౌనంగా నడుస్తున్నాం. వీధి చివరికి వచ్చేసరికి చినుకులు పెద్దవయ్యాయి. ఆమె గొడుగు తెరిచింది. నేను కర్చీఫ్ తీసి తలకి కట్టుకున్నాను. వర్షంలో తడుస్తూ అందమైన అమ్మాయి పక్కన నడవడం నా వయసుకి కొత్త అనుభూతే. ఆమె మాట వరసకైనా గొడుగులోకి రమ్మనలేదు. అమ్మాయి పక్కన వానలో తడవడం హాయిగా అన్పించిందప్పుడు. మధ్యలో నా వైపు చూసింది కానీ గొడుగులోకి రమ్మనే ధైర్యం చేయలేకపోయింది.

చలపతి గారిల్లు చేరేసరికి నేను పూర్తిగా తడిసి పోయాను. ఆమె ఇంట్లోకి వెళ్తూ,

“అయ్యో! మీరు పూర్తిగా తడిసి పోయారండీ” అంది ఆశ్చర్యంగా. గొడుగులో చోటివ్వకపోయినా ఏమన్పించలేదు కానీ, ఇప్పుడు అమాయకంగా అన్న మాటకి ఆశ్చర్యం వేసింది. ఆమెకు ఏం చెప్పాలో తెలియక వెనుదిరిగాను

నన్ను చూసి “ఏంటి ప్రసాదూ! తడిసి పొయ్యావు.. గొడుగు పెద్దదేగా..” అంది సరస్వతి గారు.

నవ్వి “పర్లేదండి” అని గదిలోకి వెళ్ళాను.

***

మర్నాడు సాయంత్రం.. కాలేజీ నుంచి ఇంటికొచ్చేసరికి, రమ్య వాకిట్లో బాదం చెట్టు కింద కూర్చుంది. నన్ను చూసింది. కానీ నేను ఆమెను చూడనట్టు గదిలోకి వెళ్లాను. కిటికీ తలుపులు తీసి చూశాను. తెల్లని మేని ఛాయ, కోల మొహం, ఆమె అందాన్ని చూసి దృష్టి మరల్చుకోలేక పోయాను.

అంతలో సరస్వతి గారు వచ్చి రమ్యకి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది.

“రమ్యా! వీణ క్లాస్ కి వెళుతున్నావుట కదా! ఎంత వరకు వచ్చింది?”

“కీర్తనల వరకూ వచ్చింది.”

“మా ఇంట్లో వీణ అలంకార పరికరంలా మూలన నిలబడి ఉంది. తీసుకురానా!”అంది .

“వద్దులే.. అత్తయ్యా! లోపలికి వెళ్ళాక… వాయిస్తాను”

“మరైతే పాట పాడు” అంది సరస్వతి.

రమ్య పాట మొదలు పెట్టింది. అంతే! మరుక్షణంలో భాస్కర్ రావు గారు అక్కడికి వచ్చారు. నాకూ వెళ్లాలన్నంత ఉత్సుకత కలిగింది. కానీ.. తీరా వెళ్ళాక ఆమె కన్నెత్తయినా చూడకపోతే.. ?!, వెళ్లాలన్న ఆలోచన మానుకుని ఆగిపోయాను.

వెంటనే మెరుపులా ఆలోచన వచ్చింది. నా దగ్గరున్న చిన్న టేప్ రికార్డర్ తెచ్చి రికార్డు చేశాను. పాట క్లారిటీగా రికార్డ్ అవ్వకపోయినా నాకు అర్థం అవుతోంది.

రెండు రోజుల తర్వాత రమ్య హాల్లో కూర్చుని వీణ వాయిస్తోంటే.. నా గదిలో కూర్చుని రికార్డ్ చేశాను.

నేను ఇంట్లో ఉన్న సమయంలో ఒకట్రెండు సార్లు ఆమె ఎదురు పడ్డా, మౌనంగా పక్కకి తప్పుకుని వెళ్ళేది. మళ్లీ ఆదివారం వచ్చేసింది

బయటికి బయలుదేరబోతున్న నాతో “ప్రసాదూ! రమ్య… ఈరోజు బందరు వెళ్తోంది. ఈయన ఇంట్లో లేరు. కాస్త బస్టాండ్ వరకు తోడెళ్ళి, బస్సు ఎక్కించి వస్తావా?” అంది సరస్వతి గారు.

“అలాగేనండి” అని, రోడ్డు మీదకు వచ్చి, రిక్షా పిలిచాను. ముందువైపు కూర్చుంది రమ్య. ఇద్దరి మధ్య బ్యాగ్ పెట్టింది. బస్టాండ్ చేరేవరకు ఇద్దరి మధ్య మౌనం. పది నిమిషాల తర్వాత బస్టాండ్ వచ్చింది. ఆమె ఎక్కాల్సిన నాన్ స్టాప్ బస్సు సిద్ధంగా ఉంది. మౌనంగా టికెట్ డబ్బు నా చేతికిచ్చింది. టికెట్ తెచ్చాను. డ్రైవర్ ఇంకా రాలేదు. ఆమె బస్సెక్కి, విండో పక్కన సీట్లో కూర్చున్నాక,

“వెళ్తానండీ” అని బస్సు దిగి వెళుతుంటే…

“ప్రసాద్ గారూ!” అనిపిలిచిందామె. వెనక్కి తిరిగి చూసి, బస్సు దగ్గరికి వెళ్లాను.

“ఆటోగ్రాఫ్ ఇవ్వండి” అని చిన్న ఆటోగ్రాఫ్ పుస్తకం ఇచ్చింది. అందులో మరెవరో రాసినవీ ఉన్నాయి.

“నా ఆటోగ్రాఫ్ ఎందుకండీ”

“ఉత్తినే” అంది.. కళ్ళు పెద్దవి చేసి.

ఏం మాట్లాడాలో తెలియలేదు. ఏం రాయాలో అంతకంటే తెలియలేదు. డ్రైవర్ బస్సెక్కాడు.

“మౌనం ఒక ప్రశ్న, ఒక జవాబు” అని రాసి సంతకం చేసి ఇచ్చాను. బస్సు కదిలింది. బస్సు నుండి ‘బై’ చెబుతున్నట్టు చేయ్యూపింది. నా ప్రమేయం లేకుండానే నా చెయ్యి బదులిచ్చింది. బస్సు బస్టాండ్ వదిలెళ్ళే వరకూ చూసి, ఇంటికి బయల్దేరాను. అసలా కొటేషన్ ఎందుకు రాశానో నాకు అర్థం కాలేదు. ఎక్కడో చదివింది గుర్తొచ్చి రాశానంతే..

ఆమె ఆలోచనలతో.. ఇంటికి రాగానే “బస్సు ఎక్కిందా? ప్రసాదూ! దానికి బిడియం ఎక్కువ. బయట మనుషుల్తో కలవలేక పోతోంది. ఎలాగో? ఏంటో?” అంది సరస్వతి గారు.

“నా మనసులో కలిసిందిగా!” అని మనసులోనే అనుకొని లోపలికెళ్ళాను.

ఆ తర్వాత రమ్యను ఎప్పుడూ కలవలేదు.

***

డిగ్రీ పూర్తయ్యాక బి.ఈడి చేశాను. సైన్స్ అసిస్టెంట్‌గా మా ఊరి దగ్గర హైస్కూల్ లోనే నాకు ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత రెండేళ్లకు పెళ్లి, ఇద్దరు పిల్లలు కూడా.

రెండేళ్ల తర్వాత భాస్కర రావు గారి షష్టిపూర్తికి కుటుంబంతో బెజవాడ వెళ్ళాను. రమ్య తప్పకుండా వస్తుందనుకున్నాను. ఎక్కడా కనిపించలేదు. మాటల మధ్య సరస్వతమ్మ గారే చెప్పింది. రమ్యకి పెళ్లయి, ఒక పాపనీ.. వాళ్లు బందర్లోనే ఉంటారని చెప్పింది. ఒకట్రెండు సార్లు నన్ను గురించి ఆమె అడిగిందని, బందర్ ఎప్పుడైనా వెళ్తే, వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చని అడ్రస్ కూడా ఇచ్చింది.

***

మరి కొన్ని సంవత్సరాలు ముందుకు కదిలాయి. జిల్లా పరిషత్ ఆఫీస్ పని మీద బందర్ వెళ్ళినప్పుడల్లా రమ్య వాళ్ళ ఇంటికి వెళ్లాలన్పించేది. కానీ ఒక్కసారి పరిచయానికే వెతుక్కుంటూ వెళ్తే.. తీరా ఆమె ఎవరో తెలియదంటే,!?!

ఆ ప్రయత్నాన్ని బలవంతంగా విరమించుకునే వాడిని. ఆమెను చూసి ఎంతకాలమైనా, ఇప్పటికీ ఆమె మౌనం నా హృదయంలో శేష ప్రశ్నగానే మిగిలింది.

***

వేకువ జాము జ్ఞాపకాల గతం నుండి బయట పడేసరికి తెల్లారింది.

రిటైర్మెంట్ గ్రాట్యుటీ డబ్బు కోసం బందరు జిల్లాపరిషత్ ఆఫీస్‌కి, ఆ రోజు వెళ్దామనుకున్నాను. ఈసారి ఖచ్చితంగా రమ్య వాళ్ళ ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్నాను. లాక్‌డౌన్ ఎత్తేయడంతో, గబగబా తయారై, మాస్కు పెట్టుకొని, శానిటైజర్ తీసుకొని.. బస్టాండ్ చేరుకున్నాను.

***

జిల్లా పరిషత్ ఆఫీస్‌లో పని ముగించుకొని అడ్రస్ ప్రకారం, ఈడేపల్లిలో ఉన్న రమ్య వాళ్ళింటికి వెళ్ళాను.

కాలింగ్ బెల్ శబ్దానికి తలుపు తెరిచిందో పెద్దావిడ. నెరిసిన జుట్టు, మొహంలో ముడతలు, కళ్ళు జోడు.. ఆశ్చర్యంగా ఆమెనే చూస్తూ “రమ్య గారున్నారా?” అన్నాను.

ఆమె నన్ను ఆశ్చర్యంగా చూస్తూ… “నేనే రమ్యని.. మీరూ!?!?!..” అంది ప్రశ్నార్థకంగా. నా బట్ట తల చూసి నన్ను ఆమె గుర్తు పట్టనట్టుంది.

“రమ్య గారి ఆటోగ్రాఫ్ కోసం వచ్చాను” అన్నాను.

అంతే! గుర్తుపట్టి.. “ప్రసాద్ గారూ!” అంది ఆశ్చర్యంతో కూడిన ఉద్వేగంతో.

“అవును” అన్నాను నవ్వుతూ.

“రండి.. రండి ఎన్నేళ్ళకెన్నాళ్ళకు.. కనిపించారు” అంది.

“ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఏ ఊళ్ళో ఉన్నారు?” వంటి ప్రశ్నల వర్షం కురిపించిందామె.

ఆమె ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెప్పాక.. “ఉండండి… కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం” అని లోపలికి వెళ్ళింది.

ఇల్లంతా చూశాను. ఓ మూల వీణ స్టాండ్ మీదుంది. గోడమీద ఫోటోల మధ్య ఓ పెద్ద ఫోటోకి దండేసి ఉంది.

ఐదు నిమిషాల్లో కాఫీ కలిపి తెచ్చింది. తర్వాత తన కూతురు సంగతులు, భర్త మరణం సంగతి చెప్పి, దండేసున్న ఫోటో చూపించింది. నేనూ నా కుటుంబం, పిల్లల గురించి చెప్పాను.

ఇన్నేళ్లుగా మనసులో దాచుకున్న మౌనానికి మొదటిసారి మాటలు వచ్చినట్టు… రెండు గంటలు నిరవధికంగా.. కాలం కదిలిందే తెలియలేదు.

వాచ్ వైపు చూసుకొని “వెళ్ళొస్తానండీ” అని లేచాను.

“భోజనం టైం అయిందిగా! కాసేపు కూర్చోండి.. వంట చేస్తాను” అంది.

“నాతో పాటు నా స్నేహితుడు కూడా వచ్చాడు. నాకోసం వెయిట్ చేస్తుంటాడు. ఏమీ అనుకోకండి” అని బయలుదేరబోతుంటే,.

“ప్రసాద్ గారూ!” అంది. కొన్నేళ్ళ క్రితం ఆమె బస్సులో కూర్చుని పిలిచినట్టు అనిపించి, వెనక్కి తిరిగాను.

“ఒకసారి లోపలికి రండి”అంది.

వెనక్కి వెళ్లి కూర్చున్నాను. ఆమె లోపలికి వెళ్ళి ఓ చిన్న పుస్తకం తెచ్చింది. దాని వైపు ఆశ్చర్యంగా చూస్తూంటే..

“అవును ఇది ఆరోజు బస్టాండ్లో మీరు నాకు ఆటోగ్రాఫ్ ఇచ్చిన పుస్తకమే” అంది. ఆశ్చర్యంగా చూశాను.

దానిని తెరిచి ఆ రోజున నేను రాసిన వాక్యం చదివి,

“నాకు అర్థం కాని విషయం ఒకటుంది. అడగనా?” అంది.

“అడగండి” అన్నాను నవ్వుతూ.

“నేను మా అత్తయ్య వాళ్ళింటికి వచ్చినప్పుడు, మీకు ఎప్పుడూ నా పాట వినాలన్పించలేదా?” అంది.

“విన్నాను. మళ్లీ, మళ్లీ వినాలనిపించేది. మిమ్మల్ని అభినందించాలన్పించేది. కానీ… వర్షంలో తడుస్తూ మీ పక్కన నడుస్తుంటే, కనీసం గొడులోకి రమ్మనలేదు మీరు. పరిచయమయ్యాక ఎదురుపడ్డా తప్పుకుపోయారు తప్ప, చిన్న పలకరింపు కూడా లేదు. అయినా నేను అప్పటి మీ పాట ఇప్పటికీ వింటూనే ఉన్నాను” అన్నాను.

ఈసారి ఆమె కళ్ళద్దాల మాటున అప్పట్లానే కళ్ళు పెద్దవి చేసి, “ఎలా.. ?!” అంది ఆశ్చర్యపోతూ.

నాతో తీసుకొచ్చిన టేప్ రికార్డర్ తీసి ఆన్ చేశాను.

అంతే! అప్పటివరకు నిండుకుండలా ఉన్న రమ్య కళ్ళలో తడి.

“మరి ఎందుకని?!”అంది జీరబోయిన గొంతుతో.

ఆ మాట ఆమె ఏ అర్థంలో అందో.. నాకు అర్థం కాలేదు.

“మీ మనసూ.. అమ్మాయిల మనసుల్లాగే లోతేక్కువనుకుంటాను” అంది.

“ఏమో.. మీరు ఏంటో అర్థం కాకుండా.. నన్ను నేను చులకన చేసుకొని, మీ మీదున్న అభిమానాన్ని తుడిచేసుకునే కంటే.. దానిని నాలోనే ఎప్పటికీ.. సజీవంగా ఉంచుకోవాలనే చిన్న స్వార్థం” అన్నాను.

“కానీ మీరు మీ వైపు నుంచే ఆలోచించారు. మా వాళ్ళు ఇంట్లో నా పెళ్లి ప్రస్తావించినప్పుడు మీరే గుర్తొచ్చారు. ఇంట్లో వాళ్లకి నా నిర్ణయం చెప్పే ధైర్యం లేదప్పుడు.”

“……..” ఆమెకు ఏం చెప్పాలో అర్ధం కాలేదు.

“ఇందులో మీరు రాసిన మాటలు ఎన్ని వందల సార్లో చదివాను. ఇప్పటికీ అర్థం కాలేదు” అంది.

చిన్నగా నవ్వి.. “మన ఇద్దరి మౌనంలో ఒకటే ప్రశ్న, కానీ అందులో ఒకరంటే ఒకరికి అభిమానం, ప్రేమ ఉన్నాయి.. అదే జవాబు. ఇన్నేళ్లకి తెలుసుకున్నాం. అందుకే దూరం మనుషుల్ని వేరు చేయలేకపోవచ్చు కానీ మౌనం మాత్రం వేరు చేయగలదని అనడానికి మనమే ఉదాహరణ” అన్నాను.

నా మాటకు ఆమె అప్పట్లోలాగే.. హాయిగా నవ్వింది. ఆమె కళ్ళలో తడి. కన్నీళ్ళు కలగలసిన ఆ తడి నవ్వు జవాబు దొరికిన ప్రశ్నలా ఉంది.

ఆపై ఎక్కువసేపు కూర్చోలేక “ఇక వెళ్తా నండీ” అన్నాను భారంగా.

నాతో ఆమె గేటు వరకూ వచ్చింది. ఇప్పుడు ఆమె కళ్ళలో తడి కనిపించలేదు.

“వెళ్తాను కాదు… వెళ్ళొస్తాను అనండి. మీరు ఇటువైపు వచ్చినప్పుడు ఎప్పుడైనా నిరభ్యంతరంగా రావచ్చు” అంది.

ఆ మాట ఆమెపై ఇన్నేళ్లు నేను పెంచుకున్న అభిమానానికి ఆమె నాకు ఇచ్చిన ‘ఆటోగ్రాఫ్’లా అన్పించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here