Site icon Sanchika

అవధానం ఆంధ్రుల సొత్తు-10

[box type=’note’ fontsize=’16’] తెలుగువారి వెయ్యేండ్ల సారసత్వంలో అవధాన ప్రక్రియ విశిష్టమైనది. ఈ శీర్షిక ద్వారా అవధాన విద్య గూర్చిన సమగ్ర సమాచారాన్ని అందిస్తున్నారు డా. అనంత పద్మనాభరావు. [/box]

సంగీత నవావధానం:

[dropcap]అ[/dropcap]వధాన ప్రక్రియ బహుముఖాలుగా విస్తరిల్లింది. రకరకాల భేదాలతో స్వీయముద్రలతో అవధానాలు ఆరంభించి పలువురు ప్రచారంలోకి తెచ్చారు. విశాఖపట్టణంలో స్థిరనివాసం ఏర్పర్చుకొన్న డా. మీగడ రామలింగస్వామి ‘సంగీత నవావధానం’ పేర వివిధ దేశాలలో 150 ప్రదర్శనలిచ్చి సత్కృతులందుకోవడం విశేషం. 1955 ఫిబ్రవరిలో శ్రీకాకుళం జిల్లా రాజాంలో జన్మించిన రామలింగస్వామి సుప్రసిద్ధ విజయనగరం సంస్కృత కళాశాలలో భాషా ప్రవీణ చేశారు. ఆపైన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తెలుగు ఎం.ఎ., ఎం.ఫిల్, పి.హెచ్.డి పట్టాలు పొందారు. ప్రభుత్వ కళాశాల తెలుగు లెక్చరర్‌గా మూడు దశాబ్దాలు పాటు విశాఖపట్టణం, పాడేరు కళాశాలల్లో పని చేశారు. 2010లో ఆముదాలవలస కళాశాల ప్రిన్సిపాల్ పదవి నధిష్టించి 2013లో పదవీ విరమణ చేశారు. మానాప్రగడ శేషసాయి వంటి పండితుల వద్ద విద్య నభ్యసించడం వీరి ప్రతిభను మెరుగులు దిద్దింది.

ఎందుకీ అవధానం?

మీగడ వారు సేవ టి.వి – యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో (4.1.2022) ఈ ప్రశ్నకు సమాధానం వివరంగా చెప్పారు. యువతకు తెలుగు పద్యంపై మక్కువ పెంచడమే ధ్యేయం. అందుకే 70కి పైగా డిగ్రీ కళాశాలలు/ఇంజనీరింగ్ కళాశాలల్లో ఈ ప్రదర్శన లిచ్చి విద్యార్థులను ఉత్తేజితుల్ని చేశారు. విదేశాలలో విస్తృతంగా ప్రదర్శనలిచ్చారు. ఇంగ్లండ్, అమెరికా, సింగపూర్ దేశాలలో వీరికి సత్కారాలు జరిగాయి. ఏలూరులో కనకాభిషేకం, విశాఖలో స్వర్ణ కిరీటధారణ, వివిధ సంస్థలచే స్వర్ణకంకణాల బహుకరణ వీరి కీర్తికి నిదర్శనాలు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుండి దాదాపు 25 నంది అవార్డులు నటన/రచన/దర్శకత్వాలకుగా అందుకొన్నారు. ‘మీరా కళాజ్యోత్స్న’ అనే నాటక సంస్థ ద్వారా వివిధ ప్రాంతాలలో ప్రదర్శనలిచ్చారు.  శ్రీకాళహస్తి మహత్యం, చిరుతొండనంబి, అశ్వత్ధామ, గుణనిధి వంటి 19 ప్రబంధ నాటికలు, 25 పద్య నాటకాలు, రెండు సినిమాలు, 26 సాంఘిక నాటకాలు రచించారు. దర్శకత్వం వహించారు. వీరి రచనలపై 3 పి.హెచ్‌డిలు, రెండు ఎం.ఫిల్‍లు అవార్డు అయినాయి.

డా. మీగడ రామలింగస్వామి

ఏమిటీ అవధానం కొత్తదనం:

సంగీత నవావధానం తెలుగు సాహిత్య మధురిమల ‘మీగడ’. కొత్త ప్రక్రియ. ఇందులో 7 ప్రాశ్నికులుంటారు. అష్టావధానంలో వీరిని పృచ్ఛకులంటారు. ఏడు విభాగాలలో 20 చొప్పున 42 మంది కవుల పద్యాలను మీగడ ఎంపిక చేసుకొన్నారు. మొత్తం 20 X 7= 140 పద్యాలు. అలానే 20 రాగాలు ఎంపిక చేశారు. ఏడు విషయాలు – పురాణాలు, శతకాలు, ప్రబంధాలు, నాటకాలు, ఆధునిక కవిత్వం, అవధానాలు, సంస్కృత కావాలు. వీటిలో 20 చొప్పున పద్యాలు ముందుగా ప్రాశ్నికులకు అందజేస్తారు. అవధాని, సభాసంచాలకులతో కలిసి తొమ్మిది మంచి వేదికపై ఆశీనులవుతారు. సంగీత ప్రధానం కాబట్టి సంగీత నవావధానం.

ఉదాహరణకు ‘అట జనికాంచె భూమిసురుడు’ అనే మనుచరిత్ర లోని పెద్దన పద్యాన్ని శంకరాభరణం రాగంలో పాడమని ఒక పండితుడు ప్రశ్నిస్తారు. వెంటనే దానికి రాగం కట్టి పద్యం రాగయుక్తంగా, భావయుక్తకంగా అవధాని గానం చేస్తారు. మరో పండితుడు ఒక్కొక్కసారి అదే పద్యాన్ని శివరంజని రాగంలో పాడమని అడగవచ్చు. ఈ గానానికి వాద్య సహకారం వుండదు. కేవలం శ్రుతిపెట్టె వుంటుంది. పద్యం పాడబోయే ముందు అవధాని ఆ రాగంలో లోగడ వచ్చిన ఒక సినిమా పాటను ప్రేక్షకులకు గుర్తు చేస్తారు. సంగీతజ్ఞులు కాకపోయినా, ఆ సినిమా పాటలు వినగానే వారు ఉత్తేజితులవుతారు.

ఉదాహరణకు శంకరాభరణం రాగంలో ‘కానరారా కైలాస నివాసా!’ అనే పాట లేదా ‘ఓంకారా నాదానుసంధానమౌ గానమే’ అనే పాట గుర్తు చేస్తారు.

2006లో ఈ ప్రక్రియను మీగడ మొదలుపెట్టి గత 15 సంవత్సరాలుగా ఈ ప్రక్రియను వ్యాప్తిలోకి తెచ్చారు. సంఖ్యను పెంచి 100 మంది విద్యార్థులలో శతావధానం కూడా విజయవంతం చేశారు. అవధాన విభాగంలో వివిధ అష్టావధానాలలో పద్యాలను గుర్తు చేస్తారు. స్వయంగా నటుడు మీగడ. నాటకాలు దర్శకత్వం వహించారు. నాటక రచయితగా సుప్రసిద్ధులు.

తెలుగు విశ్వవిద్యాలయం వారి ఉత్తమ నాటక రచయిత పురస్కారం, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వారి స్థానం నరసింహారావు అవార్డు, కందుకూరి పురస్కారం, గిడుగు పురస్కారం, కళారత్న (హంస) పురస్కారం, లోక్‌నాయక్ ఫౌండేషన్ పురస్కారాలు లభించాయి. అమెరికాలో గురజాడ పురస్కారం అందుకొన్నారు. ఈ సంగీతనవావధానాన్ని రెండో తరం వారు అందుకోవలసి వుంది.

హాస్యావధానం:

తెలుగువారికి హాస్యం పాలు తక్కువ.

పురాణాలలో, కావ్యాలలో, ప్రబంధాలలో హాస్య ప్రస్తావన లేశమాత్రం. తిక్కన నవ్వుల మీద పరిశోధనలే జరిగి పదుల సంఖ్యలో ఆయన వాడిన చిరునవ్వు మొదలు అట్టహాసం వరకు గల వివరాల భోగట్టా లెక్క తేల్చారు. పెద్దన ప్రవరుడు ‘ఈషదంకురితహసనగ్రసిష్ణుగండయుగళు’డయ్యాడు. తెనాలి రామకృష్ణుని చతురోక్తులు సరే సరి. చాటు పద్యాలలో హాస్యం వెల్లివిరిసింది.

ఆధునిక కవులు తమదైన శైలిలో పాత్రలను సృష్టించారు. గురజాడ వారి గిరీశం, మొక్కపాటి వారి బారిస్టరు పార్వతీశం, చిలకమర్తి వారి గణపతి అజరామరులు. తరువాత తరువాత హాస్యం ఒక విభాగంగా పరిణతి చెంది హాస్యకథలు వెల్లివిరిశాయి. ఈ నేపథ్యంలో శంకరనారాయణ ఈనాడు దినపత్రికలో పని చేస్తూ హాస్యాన్ని పండించే ఒక కొత్త ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.

హాస్యబ్రహ్మ శంకరనారాయణ

‘కిష్కింధలో అవధానం’

‘నవ్వేందుకు షరతులేల సిరిసిరి మువ్వా!’

అది 1997 డిసెంబర్ మాసం, తొలి పక్షం. ఒక రోజు సినీ హాస్య నటులు బ్రహ్మానందం శంకరనారాయణకు ఫోన్ చేసి, “1997 డిసెంబరు 31 రాత్రి మా ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్ వారి నూతన సంవత్సర వేడుకలలో మీరు హాస్య ప్రసంగం చేయాలి” అని అడిగారు. “మా కిష్కింధలో మీరు ప్రసంగించి అలరించాలి” అన్నారు. తనికెళ్ళ భరణి సభా నిర్వహణ చేశారు. సభాసదుల కరతాళ ధ్వనుల మధ్య ఈ ప్రక్రియకు ‘హాస్యావధానం’ అని నామకరణం చేశారు బ్రహ్మానందం. ఎన్.ఎఫ్.డి.సి. ఛైర్మన్ డి.వి.యస్. రాజు సన్మానించారు. అలా అరంగేట్రం పూర్తి అయింది. అది మొదలు గత 25 సంవత్సరాలుగా ఏకచిత్రాధిపత్యంగా హాస్యావధాన రజతోత్సవం జరుపుకొంటున్నారు. దేశంలోనే గాక, విదేశాలలో – అమెరికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, కువైట్, సింగపూరు, అబుదాబి దేశాలలో ప్రదర్శనలిచ్చి మెప్పించారు. సత్కృతులందుకొంటున్నారు.

‘రసవశంకరం’

హాస్యబ్రహ్మ శంకరనారాయణ ప్రకాశం జిల్లా మంగినపూడిలో 1956 అక్టోబరు 3న జన్మించారు. మార్కాపురం కళాశాలలో విద్యనభ్యసించారు. అక్కడి చెన్నకేశవస్వామి ఆలయంలో 1974 నవంబరు 16న తొలి అష్టావధానం చేశారు. జర్నలిస్టుగా ఆంధ్ర ప్రదేశ్, ఈనాడు తదితర పత్రికలలో మూడు దశాబ్దులకు పైగా పని చేశారు. నాగార్జున విశ్వవిద్యాలయంలో ఎం.ఏ. చదువుకున్నారు (1976-78). 50 దాకా ఉద్యోగాలు చేశానని చమత్కరిస్తారు.

హాస్యావధాన ప్రక్రియ:

ఇది మరీ హాస్యం. దీనిలో అంశాలు ఉండవు. కాల పరిమితి లేదు. నవ్వించడమే ప్రధాన లక్ష్యం. అందుకే పెద్దలు అన్నారు – నవ్వించడం ఒక యోగం, నవ్వడం ఒక భోగం, నవ్వకపోతే రోగం – అని. డా మాడుగుల నాగఫణిశర్మ అవధానాలలో శంకరనారాయణ అప్రస్తుత ప్రసంగం ప్రేక్షకులను ఆకట్టుకునేది. అవధూత గణపతి సచ్చిదానంద స్వామి వారు స్వర్ణ కంకణ ప్రదానం చేశారు. మదరాసు, బెంగుళూరు, హైదరాబాదు నగరాలలో పలుమార్లు ప్రదర్శనలిచ్చారు. అల్లు రామలింగయ్య, భమిడిపాటి రాధాకృష్ణ, పి. సుశీల, కాంతారావు ఇత్యాది సినీ ప్రముఖులు వీరి హాస్యపు జల్లుల్లో తడిసి విరిశారు. సమస్య, దత్తపది వంటి అంశాలుండవు. వేదిక మీద పెద్దల కోరిక మేరకు హాస్యం పండించడమే లక్ష్యం. గుమ్మడి తన జీవిత చరిత్రను శంకర నారాయణచే అడిగి వ్రాయించుకున్నారు.

15 దాకా అష్టావధానాలు, 430 హాస్యావధానాలు ప్రదర్శించారు. 18 గ్రంథాలు ప్రచురించారు. చొప్పరవు శ్రీనివాసరావు నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి వీరి రచనలపై పి.హెచ్.డి. పొందారు. తాను చదివిన యూనివర్శిటీ నుంచి మరొకరు తనపై పరిశోధన చేయడం గర్వకారణం. వీరి గ్రంథాలు – ఫన్ పరాగ్, అగ్ని సంగీతం, అప్రస్తుత ప్రసంగాలు, కన్నెకంటి వారి కవితా సమీక్షలు, చమక్కులు, ఫన్ టానిక్ తదితరాలు. వివిధ పత్రికలలో కాలమ్స్ నిర్వహించారు. లిమ్కా బుక్ రికార్డులు, రెండు గౌరవ డాక్టరేట్లు, దీనారాభిషేకం వీరిని వరించాయి. పలు గౌరవ పురస్కారాల ప్రతిమలు ఇంటిని అలంకరించాయి. పబ్లిక్ రిలేషన్స్ చదివే రోజులలో నేను (పద్మనాభరావు) వీరికి గురువును.

(మళ్ళీ వచ్చే వారం)

Exit mobile version