Site icon Sanchika

అవధానం ఆంధ్రుల సొత్తు-11

[box type=’note’ fontsize=’16’] తెలుగువారి వెయ్యేండ్ల సారసత్వంలో అవధాన ప్రక్రియ విశిష్టమైనది. ఈ శీర్షిక ద్వారా అవధాన విద్య గూర్చిన సమగ్ర సమాచారాన్ని అందిస్తున్నారు డా. అనంత పద్మనాభరావు. [/box]

అచ్చ తెనుగు అవధానం:

[dropcap]వి[/dropcap]జయవాడ వాస్తవ్యులు డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ 2018లో విళంబి నామ సంవత్సర ఉగాది ఉత్సవాలలో భాగంగా కాలిఫోర్నియా, లివర్‍మోర్ శివవిష్ణు దేవాలయ ప్రాంగణంలో విదేశాలలో తొట్టతొలుత అచ్చ తెనుగు ఎనుకుదురాట (అష్టావధానం) చేశారు. ఆయన అప్పటికే 500ల అవధానాలు చేశారు. ఆయన కొత్తగా తయారు చేసిన అచ్చ తెనుగు పదాలు:

కుదురరి (అవధాని), నడుపరి (సంచాలకులు), అడుగరులు (పృచ్ఛకులు), నుడికట్టు (వర్ణన), వ్రాకట్టు (నిషిద్ధాక్షరి), నుడిచిక్కు (సమస్య), వ్రాపెట్టు (చిత్రాక్షరి), ప్రానుడి (పురాణం), నుడిపెట్టు (దత్తపది), వడికట్టు (ఆశువు), నుడికొట్టు (అప్రస్తుత ప్రసంగం).

తెలుగు పదాలనే అర్థం చేసుకోలేని వారున్న రోజులివి.

ఆ అవధానంలో దత్తపదిలో ఇచ్చిన పదాలు నాలుగు – తిరుగలి, రోలు, రోకలి, పొత్రము – ఇంటి యజమాని కోపం తగ్గిస్తూ నచ్చజెప్పమని అడిగారు. శ్యామలానంద ప్రసాద్ పూరణ:

“రోలు మద్దెల మ్రోలమై ప్రోల చెప్ప
ఎవ్వరో కలికమ్మిట నిచ్చువారు
తిరుగలిని అల్క బోయుచు త్రిప్పువారు
పొత్రమున రుబ్బువారల పొగరునెల్ల”

“రోలు మద్దెలతో మొరపెట్టుకొందటా!” అని చమత్కరించారు.

2018లో తిరుపతి మహతి ఆడిటోరియంలో జరిగిన త్రిగళావధానంలో ప్రసాద్ అచ్చ తెనుగు అవధానం చేశారు. నేను (పద్మనాభరావు) అప్రస్తుత ప్రసంగం నిర్వహించాను. అమెరికాకు చెందిన శ్రీ చరణ్ సంస్కృతంలోనూ, రాంభట్ల పార్వతీశ్వర శర్మ తెలుగులోను అష్టావధానాలు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి యల్.వి.సుబ్రమణ్యం ముఖ్య అతిథి. ఆచార్య రాణి సదాశివమూర్తి సభాసంచాలకులు.

తిరుపతిలో త్రిగళావధానం కార్యక్రమం

పాలపర్తి వారి ప్రస్తుతి:

శ్యామలానంద ప్రసాద్ గుంటూరు జిల్లా పొన్నూరులో 1957 అక్టోబరు 3 న జన్మించారు. మండలి బుద్ధ ప్రసాద్ వీరికి అవనిగడ్డ పాఠశాలలో సహాధ్యాయి. శ్యామలానంద పొన్నూరు భావనారాయణ సంస్కృత కళాశాలలో విద్యాభ్యాసం చేసి సంస్కృతాంధ్రాలలో ఎం.ఎ. పట్టాలు పొందారు. రెండింటిలోనూ పి.హెచ్.డి. చేశారు. విశ్వనాథ సత్యనారాయణ రూపకాలపై పరిశోధించి సంస్కృతంలో డాక్టరేట్ సాధించారు. విజయవాడలోని సయ్యద్ అప్పలస్వామి కళాశాలలో సంస్కృతాంధ్ర శాఖాధ్యక్షులుగా, ప్రధానాచార్యులుగా పని చేసి ఉద్యోగ విరమణ చేశారు.

శ్రీ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్

1995లో విజయవాడలో ఏకదిన సంస్కృతాంధ్ర శతావధానం చేసినప్పుడు నేను (పద్మనాభరావు) విజయవాడ ఆకాశవాణి డైరక్టర్‌గా ముఖ్య అతిథి హోదాలో పాల్గొన్నాను.  ఆ అవధానం గ్రంథస్థం చేశారు. 2009లో విజయవాడలో అచ్చ తెనుగు అష్టావధానం అరంగేట్రం జరిగింది. 2013లో డల్లాస్‌లో జరిగిన 19వ తానా సభలలో గరికపాటి నరసింహారావుతో కలసి అవధాన యాత్ర చేశారు. 2014లో లండన్ పార్లమెంట్ హౌస్‍లో ఆశుకవితా ప్రదర్శన హైలైట్.

కనకాభిషేకం:

2016లో అమెరికాలోని ఆస్టిన్‌లో అచ్చ తెనుగు అవధానాంతరం వీరికి కనకాభిషేకం వైభవంగా జరిగింది. ఆ సంవత్సరమే హ్యూస్టన్‍లో అసమాన అవధాన సార్వభౌమ బిరుడు ప్రదానం చేశారు. 2017లో డల్లాస్‍లో అవధాన శిరోమణి అయ్యారు. శతావధాన శేఖర, అవధాన శారద వీరి బిరుదులు. 2015వ సంవత్సరం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ కళారత్న, విళంబి నామ సంవత్సరం హంస (అత్యున్నత) పురస్కారం లభించాయి.

సిలికానాంధ్ర సుజనరంజని వారు – ఎనుకుదురాట – అనే శీర్షికతో వీరి అచ్చ తెనుగు అష్టావధానాన్ని గ్రంథంగా ప్రకటించారు. సిలికానాంధ్ర పుట్టిన వేడుకలు 2001 ఆగస్ట్ 4న లివర్‍మోర్‍లో గరికపాటి నరసింహారావు అవధానంతో ప్రారంభం కావడం విశేషం. ‘తగినాట’ అనే ముందు పలుకుతో రాంభట్ల పార్వతీశ్వర శర్మ ఇలా ప్రస్తుతించారు:

“ఆటల మేటి ఆట! కుదురాటగా పేరునుబడ్డ ఆట! ము
న్నీటికి సాటి లోతు గల నిచ్చలు పల్కెడి మాట మూట…” అంటూ శ్యామలానంద ప్రసాద్‌ను ప్రశంసించారు.

నాట్య’ధారా’ రామనాథ శాస్త్రి:

అవధాన ప్రక్రియలలో ఒక కొత్త ఒరవడిని సృష్టించి యావద్భారతంలోనూ, విదేశాలలోనూ నాట్యావధాన ప్రదర్శనలతో అఖండ కీర్తి గడించారు డా. ధారా రామనాథ శాస్త్రి. ఒంగోలులోను సి.యస్.ఆర్.శర్మ కళాశాల తెలుగు శాఖాధ్యక్షులుగా మూడు దశాబ్దులు పనిచేసి శాస్త్రి పదవీ విరమణానంతరం ఒంగోలులో స్థిరపడ్డారు. 85వ ఏట 2016 ఆగస్టు 7న పరమపదించారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వారి ఉగాది పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం, పి.యస్.ఆర్.ఫౌండేషన్ ఆవార్డు, అప్పాజోశ్యుల విష్ణుభట్ల అవార్డు, అనంతలక్ష్మీకాంత పీఠం (ఢిల్లీ) పురస్కారం వీరిని వరించాయి.  కృష్ణకథ, రామలహరి, కృష్ణచేతన, కృష్ణలహరి, కృష్ణంవందే జగద్గురుం, కృపానందలహరి వంటి 30 గ్రంథాలను రచించారు. నాట్యావధాన కళాపీఠం, ఎర్రన పీఠం, వర్ధమాన సమితి వంటి సంస్థలు స్థాపించి ఎందరో కళాకారులను, సాహితీవేత్తలను సన్మానించారు.

ఆంధ్ర విశ్వవిద్యాలయం తెలుగు శాఖ ఆచార్యులైన మాస్టర్ ఎక్కిరాల కృష్ణమాచార్య వీరికి మార్గదర్శి. ‘నాట్యావధాన స్మృతిపీఠం’ ఒక ప్రత్యేక సంచిక వెలువరించారు. 60 ఏళ్ళ నాటి నాట్యావధాన పురోగతిని తటస్థంగా సమీక్షించారు. నాట్యావధానానికి అవసరమైన అంశాలు – ఆహార్యము, భావప్రకటన, సన్నివేశ నిర్వహణ, సమాప్తి – ప్రస్తావించారు. నాట్యావధాన విద్యా సాధన చేసె యువకులకు ఇది కరదీపిక. ‘నాట్యావధానం లక్ష్య-లక్షణ సమన్వయం’ మరో గ్రంథం.

ఏభై ఏళ్లకు పైబడి ఆ కళను ఉపాసించి, దర్శించి, ప్రదర్శించి, అద్భుతము, జ్ఞానసముపేతము, చిత్త సాధకమైన నాట్యావధాన ప్రక్రియా రూపకల్పన చేశారు. వివిధ, వినూత్న రీతులలో ఆంగిక, ఆహార్య, వాచిక, సాత్వికాలకు నెలవైన ఈ నాట్యాభినయ కౌశల విశిష్ట ప్రక్రియలో అవధాన రీతులను అన్వయించి రససిద్ధిని సాధించేలా తీర్చిదిద్దారు శాస్త్రి గారు. అంతరంగ కథనంలో అపారమైన తమ అనుభవసారాన్ని, తన జ్ఞాపకాలలోని ఆత్మీయ స్పర్శను నటకులకు విశదీకరించారు. పాఠములను – పాఠ్యాంశాలను రూపొందించి అందించారు. ఈ గ్రంథాన్ని – అజో-విభ-కందాళం ఫౌండేషన్ వారు శాస్త్రి గారికి ప్రతిభా పురస్కారం అందజేసినప్పుడు ప్రచురించారు. ఊర్వశి (వేదకావ్యం), యోగవాశిష్ఠ కథాలహరి శాస్త్రి గారి పాండిత్యానికి ప్రతీకలు. ఈ నాట్యావధాన ప్రక్రియ వారితోనే అంతరించింది. తొలి రోజుల్లో స్వర్ణరాజ హనుమంతరావు (మచిలీపట్టణం), రాళ్లబండి కవితా ప్రసాద్ ఈ ప్రక్రియలో ప్రదర్శనలిచ్చారు. తర్వాత శాస్త్రి గారి సోదరులు, కుమారుడు శాస్త్రిగారికి సహాయకులుగా నిలిచారు. సనాతన ధర్మ ట్రస్టు (హైదరాబాదు) నిర్వాహకులు సద్గురు శివానందమూర్తిగారు శాస్త్రిగారిని 2014 శ్రీరామ నవమి నాడు ప్రతిభా పురస్కారంతో సత్కరించారు.

సాహిత్యము, నటన జోడించి ఈ ప్రక్రియను రామనాథ శాస్త్రి రూపకల్పన చేశారు. 1932 జూన్ 11న ఒంగోలులో జన్మించారు. మదరాసు విశ్వవిద్యాలయంలో ఎం.ఏ. చేసి, 1970లో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో కె.వి.ఆర్. నరసింహం పర్యవేక్షణలో ‘తెలుగులో కృష్ణకథ’ అనే అంశంపై పి.హెచ్.డి. పొందారు. 1953-95 మధ్య ఒంగోలు కళాశాల అధ్యాపకులు.

2010లో తిరుమలలో భువన విజయం కవులు

ప్రదర్శనా విధానం:

నాట్యావధాన ప్రదర్శన ప్రారంభంలో అవధానికి నలుగురు పృచ్ఛకులు నాలుగు అంశాలను కాగితంపై వ్రాసి ఇస్తారు. సాంఘిక, చారిత్రక, ఆధ్యాత్మిక, పౌరాణిక అంశాలతో కూడిన వాటిని అవధాని స్వీకరించి, గ్రీన్ రూమ్ లోకి వెళ్ళి పది నిమిషాల్లో, తగిన వేషం ధరించి తన సహాయకునితో స్టేజి మీదకు వస్తారు. నాట్యావధాని నటుడు, రచయిత, దర్శకుడు, మేకప్‌మేన్ – నాలుగు పాత్రలు పోషిస్తారు. ఆశువుగా సంభాషణలు, పద్యాలు చెబుతారు.

ఉదాహరణకు రావణుడు కైలాసరిగిని ఎత్తడం – అని అడిగారనుకొందాం. రావణ వేషం ధరించి సంభాషణలతో ప్రేక్షకులని ‘జటా కటాహ విభ్రమ’ స్తోత్రంతో అలరింపజేస్తారు. 1953లో మొదలెట్టి  500ల ప్రదర్శనలకు పైగా ఇచ్చారు. రెండో అంశం గిరీశం – శ్రీశ్రీ సంవాదం అనుకొందాం. తాను గిరీశం వేషంలో వస్తారు. తన కుమారుడు వశిష్ఠ (న్యాయవాది) శ్రీశ్రీ డ్రస్సులో వస్తారు. ఇద్దరూ నటన పండిస్తారు. మూడూ అంశం అల్లూరి సీతారామరాజు వేషం. ఇలా పాత్రోచిత, సమయోచిత సంభాషణలు ఆశువుగా చెప్పడం కష్టసాధ్యం.

 

వీరిని ప్రశంసించిన ప్రముఖులు – రాష్ట్రపతి వి.వి.గిరి, పుట్టపర్తి సత్యసాయిబాబా, కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి, పండిట్ రవిశంకర్, ఎన్.టి.రామారావు ప్రభృతులు. నాట్యావధాన కళాపీఠ స్వర్ణోత్సవాలు హైదరాబాదులో 2015లో రవీంద్రభారతిలో జరపడానికి ప్రయత్నం జరిగింది గాని, అది ఫలప్రదం కాలేదు. అరుదైన నాట్యావధాన ప్రక్రియ వారితోనే అంతం కావడం దురదృష్టకరం!

(మళ్ళీ వచ్చే వారం)

Exit mobile version