[box type=’note’ fontsize=’16’] తెలుగువారి వెయ్యేండ్ల సారసత్వంలో అవధాన ప్రక్రియ విశిష్టమైనది. ఈ శీర్షిక ద్వారా అవధాన విద్య గూర్చిన సమగ్ర సమాచారాన్ని అందిస్తున్నారు డా. అనంత పద్మనాభరావు. [/box]
కన్నడంలో అవధానం:
[dropcap]తె[/dropcap]లుగువారికే ప్రత్యేకమైన అష్టావధాన ప్రక్రియ ద్రావిడ సోదర భాషలైన కన్నడ, మలయాళాలలో కూడా ప్రాచుర్యం సంపాదించుకుంది. తెలుగు, కన్నడ భాషలు లిపి విషయంలోను, ఛందస్సు లోనూ సామ్యం కలిగి వున్నాయి. తెలుగు, కన్నడ భాషలకి కలిపి టైప్ రైటింగ్ కీబోర్డు ప్రయత్నాలు జరిగాయి. హిందీలో అవధానం చేశారు. తమిళంలో కూడా జరిగాయి.
కన్నడ ఛందస్సులో జాతులు ప్రశస్తం. ఆరు వరుసలు (పాదాలు) గల షట్పది, ఆటవెలది, త్రిపది ప్రముఖాలు. వేమన వలె సర్వజ్ఞుడు సర్వజ్ఞ వచనాలు వెలయించాడు. కన్నడంలో ప్రాస వుంది గాని, యతిస్థానం లేదు. ఈ విధానంలో అష్టావధానం గత నాలుగు దశాబ్దులుగా కర్నాటకలో రాజ్యమేలుతోంది. దీనికి ప్రవర్తకుడు అనంతపురానికి చెందిన డా. జోస్యుల సదానంద శాస్త్రి.
1981 నాటి మాట:
సదానంద శాస్త్రి తొలిసారిగా 1981లో బెంగుళూరులో సగం కన్నడం, సగం తెలుగులో అష్టావధానంతో గజ్జె కట్టారు. కేవలం కన్నడ భాషలోనే వందకు పైగా అవధానాలు చేసిన ఘనత ఆయనకుంది. తొలి అవధానానికి కర్నాటక రాష్ట్ర హైకోర్టు విశ్రాంత రిజిస్ట్రారు లంకా కృష్ణమూర్తి అధ్యక్షత వహిచారు. యాదృచ్ఛికమే అయినా 1976 ఆగస్టు 15న బెంగుళూరులో తెలుగు భాషా సమితి ఆధ్వర్యంలో నేను (పద్మనాభరావు) అష్టావధానం చేసినప్పుడు కృష్ణమూర్తిగారే ముఖ్య అతిథి. శతావధాని నరాల రామారెడ్డి అధ్యక్షులు.
అవధానంలో అంశాలు:
సదానంద శాస్త్రి కన్నడ అవధానంలో తెలుగులో వలె నిషిద్ధాక్షరి, సమస్య, దత్తపది, వర్ణన, ఆశువు, పురాణ పఠనం, అప్రస్తుత ప్రసంగం అంశాలను ఎంచుకున్నారు. ఛందోనువాదం అనే అంశంలో పృచ్ఛకుడు కన్నడ పద్యం చెబితే, దానికి అవధాని తెలుగు పద్యం ఆశువుగా చెప్పేవారు. మరొక అంశం – కీర్తనానువాదం. ఇందులో పృచ్ఛకుడిచ్చిన కన్నడ కీర్తనకు తెలుగు వ్యాఖ్యానం అవధాని చెప్పాలి. యతి విరామం లేకపోవడాన్ని ‘యతి విలంఘన విందరి దలు కన్నడన్’ అని ఛందోకారులు ప్రకటించారు.
సదానంద శాస్త్రి వైద్యుష్యం:
70 ఏళ్ళ సదానంద శాస్త్రి కర్నూలు జిల్లా ఆలూరు తాలూకా కమ్మరచేడులో జన్మించారు. తిరుపతి శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య కళాశాల నుండి పట్టభద్రులై వేంకటేశ్వర విశ్వవిద్యాలయం వారి ఎం.ఎ. పరీక్షలో నెగ్గారు. బెంగుళూరు విశ్వవిద్యాలయంలో ఆచార్య తంగిరాల వెంకట సుబ్బారావు పర్యవేక్షణలో ‘పంప-నన్నయ తులనాత్మక అధ్యయనం’ అనే అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ సంపాదించారు.
ఉద్యోగ ప్రస్థానం:
అనంతపురంలో సాయిబాబా నేషనల్ జూనియర్ కళాశాలలో 33 సంవత్సరాలు అధ్యాపక వృత్తి నిర్వహించి 58వ ఏట 2010 జూన్‍లో రిటైరయ్యారు. అవిశ్రాంత రచనా వ్యాసంగంలో కన్నడాంధ్ర భాషలలో రచనలు వెలువరించారు. కన్నడం నుండి తెలుగుకు 20కి పైగాను, తెలుగు నుండి కన్నడకు ఏడు గ్రంథాలు అనువదించారు. స్వతంత్ర రచనలు – తెలుగు – కనక సాహిత్య సౌరభం, ఉమా మహేశ్వర శతకం, కన్నడంలో మూడు గ్రంథాలు.
హరికథకులుగా ఆంధ్ర, కర్నాటక, మహారాష్ట్ర, తమిళనాడు తదితర ప్రాంతాలలో పేరు తెచ్చుకొన్నారు. అష్టావధానాలు, ఆధ్యాత్మికోపన్యాసాలు, పురాణ ప్రవచనాలు వీరికి ఖ్యాతి తెచ్చాయి. మంత్రాలయ మహాసంస్థానం వారు ‘విజయ విఠల ప్రశస్తి’ గౌరవం, ఉడిపి పీఠాధిపతుల విద్యావిశారద బిరుదు, శ్రీ భండారికేరి పీఠాధిపతులు సాహిత్య శిరోమణి బిరుదులు వీరికి లభించాయి. హేమారెడ్డి మల్లమ్మ చరిత్ర, హరిభక్తసార, మోహనతరంగిణి తదితర కృతులు వీరి పాండితీ ప్రకర్షకు నిదర్శనాలు.
బహుభాషావధానీ! ఔ’రా!’ గణేష్!:
బెంగుళూరుకు చెందిన రా. గణేషు అష్టావధాని. ‘అవధానం ఆంధ్రుల సొత్తు’ అనడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. సంస్కృతంలో తొలుత అవధాన ప్రక్రియ ఉందనీ, తర్వాత తరిగొండ ధర్మన్నతో తెలుగులో మొదలైందనీ ఇతర భాషలలోనూ ప్రాచుర్యంలో వుందనీ వివరణ ఇచ్చారు. రా. గణేష్ వృత్తిరీత్యా కొంత కాలం ఇంజనీరింగ్ కళాశాల ఆచార్యులు. సంస్కృతం, కన్నడ, తెలుగు, ప్రాకృతం, ఆంగ్లం, తమిళ, హిందీ భాషాలతో కూడిన అంశాలతో గణేష్ అవలీలగా అవధానం నిర్వహించడం విశేషం. 1200 అవధానాలు చేసి రికార్డు సృష్టించారు.
బంధకవితా ధురీణుడు:
అష్టావధానంతో బాటు అనేక శతావధానాలు కూడా చేశారు. నిషిద్ధాక్షరి, సమస్య, దత్తపది, వర్ణనాంశాలకు తోడు చిత్రకవితలో భాగమైన బంధకవిత్వం కూడా వీరి ప్రత్యేకత. కాగితం కలం పట్టుకుని కూర్చొని బొమ్మలు గీసుకొని గంటలు కుస్తీ పడితే గాని సాధ్యం కాని బంధకవిత్వం అలవోకగా అవధానంలో భాగంగా చెప్పడం సర్కసులో పులి నోట్లో తల దూర్చడం వంటిది. వీరు చేసిన శతావధాన పూరణలను ఐదు సంపుటాలు – శతావధన శారద, శతావధాన శ్రీవిద్య, శతావధాని రచనా సంచయనం, శతావధాన శాశ్వతి వెలువరించారు. కన్నడదల్లి అవధాన కళ గ్రంథంలో అవధాన పూర్వపరాలు సమీక్షించారు. ఆంగ్లంలో The Art and Science of Avadhanam in Sanskrit అనే గ్రంథాన్ని గణేష్ మరియు బి.ఎస్. శశికిరణ్ ఇటీవలె ప్రచురించారు.
అరంగేట్రం:
నలభై ఏళ్ళ నాటి మాట. 1981లో లేపాక్షి ప్రాచ్య కళాశాల అధ్యాపకులు మేడవరం మల్లికార్జున శర్మ బెంగుళూరులో లంకా కృష్ణమూర్తి (హైకోర్టు రిజిస్ట్రారు) అధ్యక్షతన అష్టావధానం చేశారు. యువకుడిగా (19 ఏళ్ళు) రా. గణేష్ సభకు హాజరై అవధాని చెప్పిన పూరణలన్నీ తన గురువు రంగనాథ శర్మ ముందు ఆనాటి సభానంతరం గణేష్ వల్లిమ్చారు. గురువు ఇచ్చిన ప్రోత్సాహంతో కొద్ది రోజులలో గణేష్ అవధాన అరంగేట్రం చేశారు. తర్వాత త్రిగుణిత అష్టావధానం – సంస్కృతం, కన్నడ, తెలుగు భాషలలో సునాయసంగా చేశారు.
1991లో సంపూర్ణ శతావధానం ఒక్క రోజులో పూర్తి చేశారు. 8 భాషలలో పద్యాలు చెప్పారు. కొందరు అసహనంతో హేళన చేశారు. 2012 డిసెంబరులో సంపూర్ణ శతావధాన ప్రదర్శనిచ్చారు. అందులో నాలుగో వంతు సంస్కృతం, మిగతా కన్నడ అంశాలు ఎంచుకొన్నారు. 2012లో సంపూర్ణ శతావధానాన్ని గణేష్ సమర్థవంతంగా ప్రదర్శించారు. అందులో సంస్కృత, తమిళ, కన్నడ భాషలతో బాటు ప్రాకృతం కూడా చోటు చేసుకొంది. వీరి శిష్యులు, యువకులు అయిన కొప్పలతోట గణేశ్ భట్ట కూడా కన్నడావధాని. డా. రామకృష్ణ పెజత్తయ్య సంస్కృతావధాని. మహేశ భట్ట మరో సంస్కృతావధాని. రా. గణేష్ 2014 ఫ్రిబ్రవరిలో 1000వ (వెయ్యి) ప్రదర్శన బెంగుళూరులో ఇచ్చారు.
వైవిధ్యం:
వ్యస్తాక్షరి, నిర్దుష్టాక్షరితో బాటు చిత్రకవిత్వం విరివిగా వాడతారు. అన్యోక్తి, చిత్రలేఖనం, భావప్రకాశం, శ్లోకాభియనం, గీత రచనం, మానసి విశేషం. శ్లోకానువాదం, ఇతర భాషల పద్యాలకు అనువాదాలు చేశారు. సంస్కృత నాటకంలోని పద్యాలు చదివితే, గణేష్ వాటికి కన్నడానువాదం ఆశువుగా చెప్పేవారు. అది క్లిష్టం. వాచకాభినయంతో, ఆశువుగా కన్నడంలో పద్యం చెప్పే శక్తి ఉంది. కావ్య పఠనంలో పృచ్ఛకుడు ఏ రాగంలో పద్యం చదివితే దానికి సమాధానం కూడా అదే రాగంలో అవధాని చెప్పడం బహుముఖ ప్రజ్ఞకు నిదర్శనం. శతావధానాలు ఐదు ప్రదర్శించారు. పదివేలకు పైగా సభా ప్రసంగాలు చేశారు.
ఇతర కన్నడ ప్రాంత అవధానులు:
పండిత సుధాకర్ కల్లూర్‌కర్ (ఉత్తరాది మఠ్) – సంస్కృతావధాని.
విద్వాన్ గుండిబయలు సుబ్రహ్మణ్య భట్ (ఉడిపి)
తమిళంలో అవధాన ప్రక్రియ:
తమిళ దేశంలోను అవధాన ప్రక్రియ బహుళ ప్రచారంలో వుంది. స్వాతంత్ర సమరయోధులు, తమిళ కవి అయిన శతావధాని షేక్ తంబి పావలార్ 1907 మార్చి 10న మదరాసు విక్టోరియా టౌన్ హాల్‍లో శతావధానం చేశారు. ఆయన స్మారకార్థం 2008 డిసెంబరులో ఒక పోస్టల్ స్టాంపు విడుదలైంది. కనగ సుబ్బరత్నం, కలి చెరియన్ తమిళంలో అవధానులు. జైన భాషా కవి, గుజరాత్ వాసి అయిన రాయ్‍చంద్ భాయ్ కవితా నైపుణ్యంతో కూడిన శతావధాన విద్యను చూసి గాంధీజీ ప్రభావితులయ్యారు.
కనగ సుబ్బరత్నం షోడశావధాని (తమిళంలో). 16 అంశాలలో అవధాన ప్రదర్శనలిచ్చారు. ‘కావనగర్ ముళక్కం’ అనే తమిళ మాసపత్రిక ప్రచురిస్తున్నారు.
జైన అవధానులు:
తొమ్మిది భాషలలో ప్రవీణులైన ముని మానక్ మహారాజ్ (రాజస్థాన్); ముని రాజకరణ్ (బికనేర్); ముని మహేంద్ర కుమార్ (రాజస్థాన్); ముని అజిత్ చంద్ర సాగర్ (సంయుక్తావధాని, నేత్రావధాని, మహాశతావధాని – 200 పృచ్ఛకులకు).
ఈ విధంగా అవధాన ప్రక్రియ ఆంధ్రులకే గాక ఇతర ప్రాంతాల వారికీ ఆదరణీయమైంది.
(మళ్ళీ వచ్చే వారం)