Site icon Sanchika

అవధానం ఆంధ్రుల సొత్తు-15

[box type=’note’ fontsize=’16’] తెలుగువారి వెయ్యేండ్ల సారసత్వంలో అవధాన ప్రక్రియ విశిష్టమైనది. ఈ శీర్షిక ద్వారా అవధాన విద్య గూర్చిన సమగ్ర సమాచారాన్ని అందిస్తున్నారు డా. అనంత పద్మనాభరావు. [/box]

ఆశుకవితా ధురీణులు:

[dropcap]ఆ[/dropcap]శు-బంధ-గర్భ-చిత్ర కవితలనేవి చతుర్విధ కవితలు. పింగళి సూరన నంద్యాల కృష్ణభూపతి ఆస్థానంలో ఆశు-మధుర-చిత్ర-విస్తార కవులున్నారన్నాడు. అల్లసాని పెద్దన – చతుర్విధ కవితామతల్లికాల్లసాని పెద్దమాత్యుడు. భట్టుమూర్తి చతుర్విధ కవితా నిర్వాహకుడు. శేషము వెంకటపతి – చిత్ర – విస్తర – మధుర – ఆశు కవితలు రచియింప నేర్పు గలవాడు. తంజావూరు విజయరాఘవనాయకుడు – చతుర్విధ కవితా నిర్వాహక సార్వభౌముడు. కంకంటి పాపరాజు – చతుర్విధానపద్యకవిత్వవిద్యావధానాధునాతన భోజరాజు.

‘గడియకు నూరు పద్యములు గంటము లేక రచింతు’నని అడిదము సూరకవి చెప్పినాడు. శ్రీనాథుడు చాటు పద్య రచనా ధురంధరుడు. అల్లసాని పెద్దన ‘పూతమెరుంగులు’ ఆశురచన. భట్టుమూర్తి ‘లొట్ట యిదేటి మాట’ తిట్టు కవిత్వ మాలిక. నానా రాజ సందర్శనంలో తిరుపతి వెంకట కవులు ‘వీనుల విందు సేయ గల విద్య కవిత్వము’ అనే మాలిక ప్రసిద్ధం.

కాశీ కృష్ణమాచార్యుల ‘పొలుపుల నొల్కు లే ముగుద మొల్క చనుంగవ’ వలె మేలి కవిత చెప్పాలని సుదీర్ఘ మాలిక నల్లారు. వేంకట రామకృష్ణ కవులు 1909లో ప్రహ్లాద చరిత్రపై ఆశువుగా గంటలో వంద పద్యాలు ‘శత విధానం’ పేర చెప్పారు. ‘శతప్రాసం’ అనే పేర మరో నూరు పాదాలు పిఠాపురం సంస్థాన కవులుగా ఒకే ప్రాసలో చెప్పారు కొప్పరవు సోదర కవులు. ‘ఆశుకవితోద్యద్రాజ్యపట్టాభిషిక్తులు’ పిశుపాటి చిదంబర శాస్త్రి ఆంధ్రాభ్యుదయోత్సవాలలో (1940 జూన్)-

“ఆంధ్రుల వేషముల్ మరియు నాంధ్రుల భాషయు ఆంధ్ర గౌరవం

బాంధ్రుల భోజనక్రమము, ఆంధ్రుల రాజ్యవిధానకౌశలంబు –

అంటూ సుదీర్ఘ మాలిక పలికారు. గాడేపల్లి వీరరాఘవ శాస్త్రి, అవ్వారి సుబ్రమణ్యశాస్త్రి ఆశు కవితా ప్రవీణులు. ‘శతావధానములో అష్టావాధానము గర్భితము చేసి గర్భావధానము చేయుద’నని వేలూరి శివరామశాస్త్రి తమ 18వ ఏట ప్రతిజ్ఞ చేశారు.

డా. మేడసాని మోహన్ తిమ్మరసుగా, డా. పద్మనాభరావు న్యూనెజ్‌గా 2007లో తిరుమలలో

తొలి శతావధానం:

డా. రాపాక ఏకాంబరాచార్యులు ప్రపంచ తెలుగు మహాసభలు (2012) సందర్భంగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురించిన ‘ఆశు కవిత్వం – అవధానాలు’ అనే గ్రంథంలో ఇలా విశ్లేషించారు.

“తెలుగు సాహిత్య చరిత్రలో ప్రథమంగా శతావధానం చేసిన కవిగా కొలిచెలమ మల్లినాథసూరి (కాళిదాస కావ్య వ్యాఖ్యాత మల్లినాథ సూరికి తాత) గోచరిస్తున్నారు. ఆయన రెండవ ప్రతాపరుద్రుని ఆస్థాన కవి. “కొలచెల్మాన్వయా బ్బీందుర్మల్మల్లినాథో మహాయశః, శతావధాన విఖ్యాతో వీరరుద్రాభివర్షితః” అని వేటూరి ప్రభాకరశాస్త్రి ప్రశంసించారు.

అష్ట-శతావధానాలకు మాడభూషి వెంకటాచార్యులు లక్షణాలను ఏర్పాటు చేశారు. వారు స్వయంగా ఆగిరిపల్లిలో (1872), పిఠాపురంలో (1879) శతావధానాలు చేశారు. శతావధానంలో సర్వసాధారణంగా 19వ శతాబ్ది ఉత్తరార్ధం, 20వ శతాబ్ది పూర్వార్థంలో – (1) సమస్య (2) దత్తపది (3) వర్ణన (4) అనువాదం – అనే అంశాలలో సంస్కృతాంధ్ర భాషలలో ప్రదర్శించారు.

20వ శతాబ్ది ఉత్తరార్ధంలోని శతావధానాలలో – సమస్య, దత్తపది, వర్ణన, ఆశువు, అప్రస్తుత ప్రసంగం అనే అంశాలు ఎంచుకోబడ్డాయి.

డా. నాగఫణిశర్మ – పద్మనాభరావు గారు ఢిల్లీ ఆకాశవాణి స్టేషన్ డైరక్టర్‌గా ఉండగా 2000లో వారి కార్యాలయంలో

వేంకట రామకృష్ణ కవులు:

వీరు పిఠాపురం సంస్థాన కవులు. శతావధానానికి సుమారు 16 గంటల సమయం పడుతుంది. ప్రభువులు అంతసేపు తిలకించలేరు. విసుగు పుట్టవచ్చు. నాలుగు గంటలలో శతావధానం పూర్తి చేస్తామని పిఠాపురం రాజావారికి వినతి పత్రం పంపారు:

“చేయుట కొక్క గంట, అది చెప్పిన చొప్పున తప్పకుండగా
వ్రాయుట కొక్క గంట, సరివారలలో అవధాన పాండితీ
స్థేయత కొక్కగంట, అరుదెంచిన పెద్దల గారవింపు నొం
డో యరగంటయో వ్యవధి యుండవలెన్ ధరణీపురంథరా!”

కవితాఖండికా శతావధానం:

మరో సహస్రావధాని, పద్మశ్రీ గరికపాటి నరసింహారావు 1997 ఆగస్టులో శతావధానాన్ని కాకినాడ సూర్యకళామందిరంలో రెండు రోజుల్లో పూర్తి చేశారు. ఆచార్య బేతవోలు రామబ్రహ్మం ఈ నూతన విధాన ప్రణాళిక రూపకల్పన చేశారు. పది మంది పృచ్ఛకులకు ఒక్కొక్క విషయంపై పది పద్యాలు ఆరు ఆవృత్తాలలో చెప్పడం విశేషం. అది ఆశువుగా వెలువడతాయి. వంద పద్యాలతో అది ఒక ఖండకావ్యమవుతుంది.

ఆ సందర్భంగా వెలువడిన కవితాంశాలు ఇవి: (1) భీష్ముడు – త్యాగి, యోగి (2) ప్రాచీన కవితా సౌరభం (3) భువన విజయం (4) గాంధీజీ మరణం (5) భార్యా వియోగం (6) విశ్వనాథ సాహితీ వైభవం (7) అవధాన కాలుష్యం (8) లంచం (9) నవతరం స్పందన (10) కాకినాడలో స్వాతంత్ర్య స్వర్ణోత్సవాలు. ఆ పద్యాలు ధారాశుద్ధితో రసరమ్యంగా విలసిల్లాయి.

శంకరంబాడి ఆంగ్ల పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడిగారికి అందజేస్తూ

సహస్రావధానం:

సుబ్రహ్మణ్యశాస్త్రి చేసిన సహస్రావధానంలో వెయ్యి కార్డుల పై భాగాన అంకెలు వేస్తారు. ప్రతి సంఖ్య క్రింద రెండు పద్యాలుంటాయి. ఈ కార్డులపై అంశాలను అవధాని రోజుకు 200 చొప్పున ఐదు రోజులు ధారణ చేస్తారు. ఒక రోజు విశ్రాంతి.

తరువాత రెండు రోజులలో ఆ సంఖ్య చెప్పగానే అందులో రెండు పద్యాలను అవధాని ధారణ చేసి సభకు తెలుపుతారు. ఇదే విధంగా శ్రీరాం వీరబ్రహ్మకవి చేశారు. పంచ సహస్రావధానం కూడా ఇదే ధోరణి.

నూతన సహస్రావధానాలు:

గత మూడు దశాబ్దుల కాలంలో ఐదు సహస్రావధానాల గూర్చి రాపాక ఏకాంబరాచార్యులు ప్రస్తావించి స్తుతించారు. (1) డా. మేడసాని మోహన్ (తిరుపతి, 1996) (2) డా. మాడుగుల నాగఫణిశర్మ (హైదరాబాదు, 1996) (3) గరికపాటి నరసింహారావు (కాకినాడ, 1996) (4) డా. వద్దిపర్తి పద్మాకర్ (ఏలూరు, 2003) (5) కడిమళ్ళ వరప్రసాద్ మరియు కోట వెంకట లక్ష్మీనరసింహం జంటకవులు (తణుకు, 2004). నాగఫణిశర్మ 1997లో హైదరాబాదులో బృహత్ ద్విసహస్రావధాన ప్రదర్శననిచ్చారు. మేడసాని మోహన్ 2007లో హైదరాబాదులో పంచ సహస్రావధానాన్ని చేసి చివరి మూడు రొజులు ధారణతో పద్యాలు అప్పగించారు.

ఆశు కవితా ధోరణి:

అవధానాలలో ఆశుకవితా ఒక అంశం. ధారగా, ధారాళంగా, నాలుగు పాదాలు అవధాని ఒకే పర్యాయం చెప్పడం ఇందులో విశేషం. కడపలో నేను చేసిన అష్టావధానంలో ఆశువు ఇలా వెలువడింది.

అంశం: అప్సరసలతో నహుషుని దర్పం.

“ఆమని వేడి పొంగుల నొయారము లొల్కగ నిల్చి రంభ విం
జామర వీచె, మంజులప్రశాసనమేనకజేసె, ఓయి! నా
స్వామి! మృదూక్తులన్ బలికి స్వాంతము రంజిల రాగధార మ
మ్మోమవె యంచుబల్కెను తిలోత్తమ పాదము లొత్తువేళలో!”

వేగంగా పద్యం చెప్పడం వల్ల భావయుక్తంగా రసప్రధానంగా చెప్పడానికి ప్రయత్నించడం కుదరకపోవచ్చు.

రాయప్రోలు వారి ఆశుకవితా సన్యాసం: 2022 మార్చి13న వంశీ ఇంటర్నేషనల్ వారు నిర్వహించిన సదస్సులో నేను, వోలేటి పార్వతీశం తదితరులం రాయప్రోలు జయంతి సభలో (వెబినార్) మాట్లాడాము. పార్వతీశం మాట్లాడుతూ రాయప్రోలు వారు బుచ్చిరెడ్డిపాళెం అవధాన సభలో ఆశుకవితా సన్యాసం ఇప్పించమని వాగ్దేవిని కోరిన చక్కని పద్యం గుర్తు చేశారు. ఆశుపద్యాలు గాలికి పోతాయి. తర్వాతి కాలంలో వారు తృణకంకణము, కష్టకమల, ఆంధ్రావళి, రమ్యలోకము, తెనుగుతోట వంటి అద్భుత ఖండకావ్యాలు వ్రాసి నవ్యాంధ్ర కవితా పితామహులుగా ప్రసిద్ధికెక్కారు. ఆశుకవితా సన్యాసం గూర్చి రాయప్రోలు సుబ్బారావు చెప్పిన పద్యమిది. బుచ్చిరెడ్డిపాళెంలో దొడ్ల వెంకట్రామిరెడ్ది సాహితీప్రియులు. ఎందరో అవధానులను, కవులను సత్కరించారు. పద్యమిది:

“తెనుగే తీయనిదంచు పద్యపద రీతిక్రీడ లత్యంత మో
హనముల్ శోభనముల్ తదీయ రసరక్తాలాపనంబుల్ లభిం
చిన వాగర్థ కలాకలాప జయలక్ష్మిన్ గాలికిం బుత్తురే
జననీ! ఏమిటి కింక, అశుకవితా సన్యాస మిప్పింపవే!”

 

(మళ్ళీ వచ్చే వారం)

Exit mobile version