అవధానం ఆంధ్రుల సొత్తు-2

0
4

[box type=’note’ fontsize=’16’] తెలుగువారి వెయ్యేండ్ల సారసత్వంలో అవధాన ప్రక్రియ విశిష్టమైనది. ఈ శీర్షిక ద్వారా అవధాన విద్య గూర్చిన సమగ్ర సమాచారాన్ని అందిస్తున్నారు డా. అనంత పద్మనాభరావు. [/box]

సమస్యతో వస్తుంది సమస్య:

[dropcap]అ[/dropcap]ష్టావధానంలో సమస్యాపూరణ ఒక అంశం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారు 1963 నుంచి సరస వినోదిని – సమస్యాపూరణ కార్యక్రమం ప్రసారం చేసేది. సరస వినోదిని స్వర్ణోత్సవాలు కూడా జరుపుకుంది. వారం వారం ఒక సమస్యనిచ్చి శ్రోతల దగ్గర నుండి పూరణలు కార్డుపై తెప్పించుకొని 15 నిమిషాల వ్యవధిలో 40కి పైగా పూరణలు చదువుతారు. కాకినాడ నుండి వేమూరు రామనాధం గారి పూరణ అని పేరు చదివేవారు. బి.ఎ. మొదటి సంవత్సరం విద్యార్థిగా 1964లో నా తొలి సమస్యాపూరణ ప్రసారమైంది. రేడియోలో మన పేరు వినడం గొప్ప థ్రిల్.

సమస్య: కన్యకు ఏడు కన్నులట కల్పకవల్లి కన్నతల్లికిన్

నా పూరణ:

మాన్యరమాకుమారి కడ మన్నన లందుచునుండు భారతీ
కన్యకు; లోకపావనియు కామితదాయినియౌ సముద్రరాట్
కన్యకు; ఫాలలోచనుని కామినియైన ధరాధరాధరాట్
కన్యకు – ఏడు కన్నులట కల్పకవల్లికి కన్నతల్లికిన్

ఇక్కడ త్రిమూర్తుల భార్యలకు ముగ్గురికీ కలిపి ఏడు కన్నులని పూరణ చేశాను.

అప్పట్లో వి.ఆర్. అళాశాల, నెల్లూరు తెలుగు అధ్యాపకులు, ప్రముఖ పండితులు అయిన శ్రీ పిసుపాటి విశ్వేశ్వరశాస్త్రి నాకీ సరస వినోదిని గూర్చి తెలిపి ప్రోత్సహించారు. వారి సోదరులు శతావధాని పిసుపాటి చిదంబరశాస్త్రి సూర్యరాయాంధ్ర నిఘుంటు నిర్మాణంలో ప్రముఖులు.

చిదంబరశాస్త్రి (1892-1951):

ఆ రోజుల్లో సంస్థానాధీశ్వరులు అవధానుల సభలు ఏర్పరిచి పండిత సన్మానాలు చేసేవారు. తిరుపతి వెంకట కవులు జైత్రయాత్రలు కొనసాగించి అవధాన కళకు పట్టం గట్టారు. చిదంబరశాస్త్రి 1910 ఫిబ్రవరి 16న తొలి అవధానం కృష్ణాజిల్లా ఆగిరిపల్లిలో చేశారు. ఆ పైన ఆంధ్ర కర్నాటక రాష్ట్రాలు పర్యటించి సత్కారాలు అందుకొన్నారు. మైసూరు మహారాజా శ్రీ కృష్ణ ఒడయార్ మహారాజా చిదంబరశాస్త్రికి ‘ఆస్థాన శతావధాని’ పదవినిచ్చి గౌరవించారు. అయితే ఈ అవధానులందరూ కుటిల పండితుల కుతంత్రాలకు లోను గావలసి వచ్చేది. గద్వాల సంస్థానాధీశులు పలువురు పండితులకు రాజాశ్రయం కల్పించారు.

అనంతపద్మనాభరావు అవధానం తిలకిస్తున్న బెజవాడ గోపాలరెడ్డి 1973

పూరణలో క్లిష్టత:

సమస్యలను పూరించడానికి అవధానికి పాండిత్యస్ఫూర్తి అవసరం. పృచ్ఛకుడు సమస్యనిచ్చిన తర్వాత అవధాని ఆ సమస్యను ఎలా పరిష్కరించాలో ఒక్క క్షణం ఆలోచిస్తాడు. ఇంతకు ముందు నేను పూరించిన సమస్యలో క్రమాలంకారం ఎంచుకోబడింది. ఒక్కొక్కసారి ప్రశ్నార్థకంగా పూరణ చేస్తారు. ఉదాహరణకు –

“రాముని మాని రావణు ధరాసుత ప్రీతివరించె భర్తగన్”

అనే సమస్యకు 1966లో తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం సభలో సి.వి. సుబ్బన్న శతావధాని “ఏ గతిన్ రాముని మాని రావణు ధరాసుత ప్రీతివరించె భర్తగన్” అని పూరించారు.

ఆధునిక కాల సమస్యలు:

యువత ఆధునిక కాలంలో అనేక సమస్యలు ఎదుర్కుంటారు. వాటికి పరిష్కారానికి వివిధ ప్రయత్నాలు చేస్తారు. పరీక్షా సమయంలో హాలులో ఆ ప్రశ్నలకు సమాధానం ఎలా వ్రాయాలో తోచక తికమక పడతారు. ప్రత్యేకించి సివిల్స్ పరీక్షల్లో ప్రిలిమ్స్ పరీక్షల్లో A, B, C, D గుర్తించాలి. మూడు సమాధానాలు ఒకేలా వుంటాయి. రెండు గంటల వ్యవధిలో 120 నిమిషాల్లో వంద ప్రశ్నలకు సమాధానాలు వ్రాయగలగాలి. దానికి అభ్యాసం అవసరం. అవధానిగా కూడా రెండు గంటల వ్యవధిలో ఎనిమిది మంది పృచ్ఛకుల్ని సమాధానపరచాలి.

పాండిత్య ప్రకర్ష:

అవధానికి అసాధారణ పాండీతీ పటిమ అవసరం. సమస్యలో వుండే క్లిష్టతను గుర్తించి, ఒక అక్షరం కలపడంతో ఆ విషమ సమస్య తొలగి పోతుంది.

సమస్య: పంది కటుక్కునం గొరికె పైదలి చెక్కిలి ఎంత తీపొకో

ఇక్కడ పందిని, పెంపంది, లేదా ఇంపంది వంటి పదబంధాలతో పూర్తి చేయడం సహజం. ప్రముఖ పండితులు కొండవీటి వేంకట కవి 1971 ఫిబ్రవరిలో జరిగిన జగ్గయ్యపేట భువనవిజయ సభలో ఇలా పూరించారు.

“విందులు విందులంచు పదివేవుర ఇండ్లకు పోయి పోయి, గో
విందలు కొట్టి కొట్టి, వడ వేసిన విస్తరిలోని భక్ష్యముల్
బందరు లడ్లు తింటిని భళా! రుచింపవటంచునెంచి ఇం
పంది కటుక్కునన్ కొర్కె పైదలి చెక్కిలి ఎంత తీపొకో!”

అలా సమస్య విడిపోయింది.

దుష్కర ప్రాసలు:

సమస్యనిచ్చేటప్పుడు పృచ్ఛకుడు అవధానిని తికమక పెట్టడానికి దుష్కర ప్రాస గల సమస్యనిస్తాడు. కొందరు పృచ్ఛకులైతే మల్లయోధుల్లా తయారై వస్తారు. రెండు గంటల వ్యవధిలో అవధాని ధారణ, ఆశువు, ధోరణి కలిగి ఎంతో చాకచక్యంగా మెలగాలి. మొదటి పాదం అందరికీ చెప్పి మొదటి వరస పూర్తి చేస్తాడు. రెండో రౌండ్ వచ్చినప్పుడు ముందు లైన్లో తానేమి చెప్పాడో అడగకూడదు. మొదటి పాదం గుర్తుకు తెచ్చుకొని రెండో పాదం పూరించాలి. పృచ్ఛకుడు పెన్ను, పేపరు దగ్గర పెట్టుకుని వ్రాసుకొంటాడు. అవధాని మెదడులో అన్నీ నిక్షిప్తమై వుంటాయి. మధ్యలో ఒక వైపు గంట కొడతారు.

అప్రస్తుత ప్రసంగం:

అవధాని బాగా ఆలోచిస్తున్న సమయంలో అప్రస్తుత ప్రసంగ పృచ్ఛకుడు ఉన్నట్లుండి ఒక వాక్యం అంటాడు – “మోడీ స్థానంలో మీరు కూచొంటే మొట్టమొదట ఏం పని చేస్తారు?” అని. అవధాని షాక్ తింటాడు. అనుకోని పదవి. “జైలులో వున్నవారిని వదిలేస్తాను” అని ఠక్కున సమాధానమిస్తాడు. సభలో వుండేవారు గొల్లున నవ్వుతారు.

పీఠాధిపతుల సభ

“లక్ష్మీమాధవ సింహవాహనల వాల్లభ్యంబు సంభావ్యమౌ” అనే సమస్యలో ప్రాసలో ‘క్ష్మ’ అనే సంయుక్తాక్షరం ఇచ్చారు. పై మూడు పాదాలలో ‘క్ష్మ’ రావాలి. అంటే నిఘంటు పరిచయం బాగా ఉండాలి. అప్రస్తుత ప్రసగంకర్త నోరు కట్టించాలి. సభాసదులను రంజింపజేయాలి. సభలో కేవలం పండితులే కాదు, సాహితీ ప్ర్రియులైన సాధారణ జనం కూడా ఉంటారు. వారిని మెప్పించడానికి అప్రస్తుత ప్రసంగంలో చేసే చమత్కార సంభాషణమే ఉపయోగకారి. దీనిని ‘రిపార్టీ’ అంటారు. పృచ్ఛకుడిని నొప్పించకుండా మాట్లాడాలి. సమ వయస్కులు కాని పక్షంలో అవధాని ఆ పృచ్ఛకుడిపై తూటా పేల్చడానికి సందేహిస్తాడు. కొందరు అదే పనిగా అంతరాయం కలిగిస్తారు. ధారణ చేసే సమయంలో అప్రస్తుత ప్రసగం సామాన్యంగా చేయరు. కాని ఆ నియమన్ని స్వేచ్ఛగా ఉల్లంఘించే ఘనులున్నారు. ఊరూరా ఈ అప్రస్తుత ప్రసంగానికి పనికి వచ్చే పెద్దలు తయారయ్యారు. వాళ్ళ దగ్గర గుప్త భాండాగారం వుంటుంది. అవి వదలుతారు. సభలో చప్పట్లు.

వివిధ రకాల అవధానాలు:

తెలుగునాట అనేక రకాలైన అవధాన ప్రక్రియలు ప్రజలకు వినోదం కలిగిస్తున్నాయి. కేవలం కవిత్వ ప్రధానమైనవి గాక, ఇతర ప్రక్రియలు పలువురు అభ్యాసం చేసి ప్రదర్శన లిస్తున్నారు. ముందుగా కవిత్వానికి సంబంధించినవి ఇవీ:

  1. అష్టావధానం – 8 మంది పృచ్ఛకులతో జరిపేది
  2. ద్విగుణిత, చతుర్గుణితాష్టావధానం (8 x 2 లేదా 8 x 4 మంది పృచ్ఛకులు)
  3. శతావధానం (నూరుమంది పృచ్ఛకులు)
  4. ద్విశతావధానం (రెండు వందల మంది పృచ్ఛకులు)
  5. సహస్రావధానం (వెయ్యిమంది పృచ్ఛకులు)
  6. ద్విసహస్రావధానం (రెండువేలమంది పృచ్ఛకులు)
  7. పంచ సహస్రావధానం (అయిదువేలమంది పృచ్ఛకులు)

ఇవి గాక దశావధానం (10మంది), త్రితయాష్టావధానం వంటివి ఆయా సందర్భాలలో పలువురు ఎంచుకొంటున్నారు.

20వ శతాబ్ది చివరి భాగంలో ఆంధ్ర దేశంలో పలువురు యువ పండితులు పోటాపోటీగా ఈ శతావధాన, సహస్రావధానాలను చేసి ‘సెభాష్’ అనిపించుకొన్నారు. సభకు నూరుమంది సభ్యులు రావడమే గగనం. వచ్చినా, చివరి వరకు కూర్చొని వినే ఓపిక వారికుండదు. పొరుగూరు నుంచి పృచ్ఛకులను తెస్తే వారి దారిభత్యాలు, వసతి సౌకర్యాలు కల్పించడం నిర్వాహకులకు తలనొప్పి.

పాత రోజుల్లో శతావధానికి వందమంది పృచ్ఛకులను ఏరికోరి తెచ్చేవారు. వారు అవధానిని ఒక పట్టుపట్టి చూడాలని కూచొనేవారు. ఒకవేళ ఆ ప్రశ్నను/సమస్యను అవధాని పూరించలేకపోతే పృచ్ఛకులు తయారు చేసుకొనివచ్చిన సమాధానం చెప్పేవారు. అవధాని ప్రదర్శన నల్లేరుపై బండి నడక కాదు. అందుకే తిరుపతి కవులు ‘అవధాన విద్య నల్లేరుపై బండి నడక మాకు’ అని సగర్వంగా చెప్పారు.

(మళ్ళీ వచ్చే వారం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here