Site icon Sanchika

అవధానం ఆంధ్రుల సొత్తు-20

[box type=’note’ fontsize=’16’] తెలుగువారి వెయ్యేండ్ల సారసత్వంలో అవధాన ప్రక్రియ విశిష్టమైనది. ఈ శీర్షిక ద్వారా అవధాన విద్య గూర్చిన సమగ్ర సమాచారాన్ని అందిస్తున్నారు డా. అనంత పద్మనాభరావు. [/box]

అవధాన శేషఫణి నాగఫణి:

[dropcap]అ[/dropcap]వధాన విద్య ద్వారా అఖండ ఖ్యాతి నార్జించిన వ్యక్తులలో మాడుగుల నాగఫణిశర్మ విశిష్ఠులు. కొద్ది కాలం అక్కడక్కడా ఉద్యోగించినా, అవధాన సరస్వతీ పీఠాన్ని హైదరాబాదులో నెలకొల్పి గురుస్థానం పొందిన వ్యక్తి.

అనంతపురం జిల్లా తాడిపత్రి తాలూకా, పుట్లూరు మండలంలోని కడవకొల్లు గ్రామంలో నాగఫణిశర్మ 8 జూన్‌ 1959న నాగభూషణశర్మ, సుశీలమ్మ దంపతులకు జన్మించారు. ఆ గ్రామంలోనే పదవ తరగతి పూర్తి చేశారు. ‘సాహిత్య శిరోమణి’ చదవడానికి తిరుపతిలో శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య కళాశాల గడప తొక్కారు. అక్కడ గౌరిపెద్ది రామసుబ్బశర్మ వంటి మహా పండితుల వద్ద శిష్యరికం చేశారు. అక్కడే సరస్వతీ పాద మంజీరాల ఘలంఘలలు శర్మ మస్తిష్కంలో నర్తించాయి.

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో P.O.L. పూర్తి చేశారు. మైసూరు విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఏ. చదివారు. ఢిల్లీ లోని రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ నుంచి ‘శిక్షాశాస్త్రి’ పట్టం లభించించి. విద్యార్జనాతృష్ణలో తిరుపతి రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం వారికి సిద్ధాంత గ్రంథం సమర్పించి పి.హెచ్.డి. పొందారు.

కొన్నాళ్ళు ఉద్యోగ పర్వం:

కడప రామకృష్ణా జూనియర్ కళాశాల విద్యారంగంలో సుప్రసిద్ధం. పద్మశ్రీ పుట్టపర్తి నారాయణాచార్యుల వంటి దిగ్దంతులు పని చేసిన విద్యాసంస్థ. అడ్వకేట్ రంగనాథం సారథ్యంలో రామమూర్తి ప్రిన్సిపాల్‍గా ఆ సంస్థ పేరు గడించింది. 1985-90 మధ్య నాగఫణిశర్మ అక్కడ సంస్కృతాధ్యాపకులుగా పని చేశారు. శర్మలోని పాండితీ ప్రతిభను గుర్తించిన తిరుమల తిరుపతి దేవస్థానం వారు ధర్మప్రచార పరిషత్ అదనపు కార్యదర్శిగా 1990లో నియమించారు. డా. అప్పజోడు వెంకటసుబ్బయ్య కార్యదర్శి. పదవీ బాధ్యతల నుండి రెండేళ్ళకు విడుదలయ్యారు. పూర్తి కాలం అవధాన ప్రదర్శనలకే కేటాయించారు.

సెహభాష్ నాగఫణీ:

1990-2000 దశకంలో నాగఫణిశర్మ కీర్తి ప్రతిష్ఠలు అవధాన శేఖరుడిగా దిగ్దంతాలకు వ్యాపించాయి. ఆ దశకంలోని అవధానులు ‘స్పర్ధయా వర్ధతే విద్యా’ అనే నినాదంతో సంఖ్యాపరంగా ఒకరిని మించి మరొకరు అవధాన ప్రదర్శనలిచ్చారు. నాగఫణి అవధాన సహస్రఫణి అయ్యారు. బృహత్ ద్విసహ్రావధానాన్ని హైదరాబాదులో అఖండ దీప్తితో ప్రదర్శించారు. పి.వి. నరసింహారావు, అటల్‌ బిహారీ వాజ్‌పేయి ప్రధాన మంత్రుల సమక్షంలో శర్మ దిగ్విజయంగా అవధాన సంచాలనం చేశారు. రాష్ట్రపతి శంకర్‌దయాళ్‌ శర్మ ఆంధ్ర ప్రదేశ్ గవర్నరుగా ఉన్న సమయం నుండి శర్మ అవధాన విద్య పట్ల ముగ్ధులై సత్కరించారు.

బిరుదావళి:

నాగఫణిశర్మను పలు ప్రాంతాలలో పలు సంస్థలు అనేకానేక బిరుదులతో ఘనసత్కారం చేశాయి. అవధాన సహస్రఫణి, బృహత్‌ ద్విసహస్రావధాని, శతావధాని సమ్రాట్‌, శతావధాన చూడామణి, కళాసాహిత్య కల్పద్రుమ ఇత్యాది బిరుదులు లభించాయి. పలుచోట్ల కనకాభిషేకాలు, స్వర్ణశారదా ముద్రిక, ముత్యాలజల్లు, ఆందోళికా భోగం, స్వర్ణ కంకణం, గండపెండేరాది సత్కారాలు పొందారు.

శర్మ అమెరికాలో విస్తృతంగా పర్యటించి పలు నగరాలలో అవధానాలు చేశారు. ఆంధ్ర దేశం నుంచి పలువురు అవధానులు అమెరికాలో సత్కృతులందుకొన్నారు.

డా. అనంతపద్మనాభరావు దంపతులతో డా. మాడుగుల నాగఫణిశర్మ

అధికార భాషా సంఘాధ్యక్షులు:

ఆంధ్ర ప్రదేశ్‍లో రాష్ట్ర ప్రభుత్వం తెలుగు భాషాభివృద్ధికై అధికార భాషా సంఘాన్ని ఏర్పాటు చేసింది. సర్వశ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య, వందేమాతరం రామచంద్రరావు, అబ్బూరి వరద రాజేశ్వరరావు, డా. సి. నారాయణ రెడ్డి, డా. నండూరి రామకృష్ణమాచార్య, గజ్జెల మల్లారెడ్డి ప్రభృతులు ఆ సంస్థ అధ్యక్షులుగా వ్యవహరించారు. నాగఫణిశర్మ అధ్యక్షులుగా 1999-2001 మధ్య వివిధ జిల్లాలలో పర్యటించి భాషాభివృద్ధిని సమీక్షించారు. ఈ అధ్యక్షుల నందరినీ రేడియోకి నేను ఇంటర్వ్యూ చేశాను.

అవధాన సరస్వతీ పీఠం:

నాగఫణిశర్మ 14వ ఏటనే అతి చిన్న వయసులో తొలి అష్టావధానం నిర్వహించారు. అవధాన ప్రదర్శనలు దేశంలోను, ఇతర దేశాలలోనూ దిగ్విజయంగా ప్రదర్శించారు. ఈ విద్య అంతరించి పోకుండా యువతరాన్ని ఉద్దీప్తం చేయడానికి హైదరాబాదు నగరంలో హైటెక్ సిటీలో అవధాన సరస్వతీ పీఠాన్ని (1995లో) స్థాపించారు. తొలుత బర్కత్‍పురాలో స్థాపించబడిన ఈ పీఠం బంజారాహిల్స్‌లో శాశ్వత భవనాలు ఏర్పర్చుకుంది. సరస్వతీ మాత ఆలయానికి నిత్యం పూజలు నిర్వహిస్తున్నారు. భారతీయ సంస్కృతి, వేద సంప్రదాయాలు, ధారణాశక్తి అలవరుచుకోవడానికి ఈ పీఠం దోహదపడుతుంది. ఈ పీఠం పక్కనే అన్నమాచార్య కళావాహిని పేర గాయని శోభరాజు అన్నమాచార్య కీర్తనల వ్యాప్తి, ప్రచారము కొనసాగిస్తూన్నారు. అవధాన సరస్వతీ పీఠం ప్రపంచం నలుమూలల నుండి వచ్చే ఆధ్యాత్మిక జిజ్ఞాసువులకు పర్యాటక కేంద్రమైంది. అవధాన విద్య నేర్పే పాఠశాలలు, గురుకులాలు లేవు. మూలా నక్షత్రం, శ్రీ పంచమి పర్వదినాలలో ఇక్కడికి భక్తులు విశేషంగా వస్తారు.

లక్ష్యాలు:

అవధాన సరస్వతీ పీఠ లక్ష్యాలను నాగఫణిశర్మ తమ వెబ్‍సైట్‍లో ఇలా పేర్కొన్నారు.

విశ్వభారత మహాకావ్యం:

‘నానృషిః కురుతే కావ్యం’. ఋషి కాని వాడు మహా కావ్యకల్పన చేయలేదు. అష్టాదశ కల్పనతో కూడిన ‘విశ్వభారత’ సంస్మృత మహా కావ్యాన్ని నాగఫణిశర్మ 2021లో రచించారు. దాని హిందీ అనువాదాన్ని ప్రఖ్యాత ఆచార్యులు వై.వి. రమణారావు (కేంద్రీయ విశ్వవిద్యాలయం) కొనసాగిస్తున్నారు. ఈ కావ్య నాయకుడు ధర్మపురుషుడు. భారతాంబ కావ్యనాయిక. ఈ ఇరువురి సంయోగ వియోగాలు అద్భుత రచనా ప్రణాళికగా శర్మ విస్తరించారు.

ఈ విశ్వభారతంలో లేనిదంటూ లేదు. సమస్త విషయాలను కథాసంవిధానంలో రచయిత సుప్రతిష్ఠితం చేశారు. 350 ఛందో రీతులతో కథాగమనం సాగిపోయింది. 18 ప్రకరణాలకు శీర్షికలు ఎంచుకోవడంలో మహాకవి పాండితీ వైభవం ద్యోతకమవుతుంది.

హిందుత్వమనినా, భారతీయత అనినా ఈ మహాకవి పులకితగాత్రులవుతారు. శ్రీశ్రీ శృంగేరీ పీఠాధీశులు, కంచి కామకోటి పీఠాధిపతులు, దత్త పీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి తదితరుల ఆశీస్సులు వీరికి మెండు. ‘మేరా భారత్ మహాన్’ అన్న నినాదంతో భారతమాత ఘనతను నాగఫణిశర్మ కావ్యస్థం చేశారు. ఈ కావ్యంలోని విశిష్టతలు:

  1. ఛందో వైవిధ్యంతో కూడిన పాండితీ ప్రకర్ష
  2. మహనీయుల స్మరణ
  3. నదీనద ప్రాశస్త్యం
  4. పురాతనాధునాతన కథా సమ్మేళనం
  5. వ్రతకల్ప సమాదరణం
  6. పుణ్యతీర్థ సంసేవనం
  7. పురాణేతిహాస కథా సంకలనం
  8. వివిధ మత సమన్వయం
  9. వర్ణనా చమత్కారం

ఈ కావ్య ప్రచురణ ద్వార నాగఫణిశర్మ ఉత్తర భారతదేశంలోనూ, ప్రపంచం నలుమూలా కీర్తి ప్రతిష్ఠలు పొందగలరు. అవధాన విద్య కది కీర్తి తోరణం!

శుభం

(ఈ శీర్షిక సమాప్తం)

Exit mobile version