అవధానం ఆంధ్రుల సొత్తు-7

0
5

[box type=’note’ fontsize=’16’] తెలుగువారి వెయ్యేండ్ల సారసత్వంలో అవధాన ప్రక్రియ విశిష్టమైనది. ఈ శీర్షిక ద్వారా అవధాన విద్య గూర్చిన సమగ్ర సమాచారాన్ని అందిస్తున్నారు డా. అనంత పద్మనాభరావు. [/box]

ప్రతిభాపాండిత్యాలు:

[dropcap]అ[/dropcap]వధాన ప్రదర్శన సాముగారడీ వంటిది. దానికి విద్వత్తు, నానా పురాణ పరిచయముతో బాటు భగవదనుగ్రహం అవసరం. పూర్వం కొప్పరపు సోదర కవులు – వేంకట సుబ్బరాయకవి (1885-1932), వేంకట రమణకవి (1887-1942) గుంటూరు మండలానికి చెందిన విద్వత్కవులు. ఆంజనేయస్వామి, దుర్గాదేవి ఉపాసకులు. అత్యంత వేగంగా ఆశువులో వీరు పద్యాలు చెప్పడంలో సుప్రసిద్ధులు.

కొప్పరపు కవులు శతావధాన ప్రారంభానికి ముందు చేసిన ఇష్టదేవతాస్తుతి:

“ఎవ్వని నమ్మి దేశములకెంతయు బోయి జయంబు గంటిమో
ఎవ్వని నమ్మి ఈ సభ నహీనధృతిన్ జరిగించుచుంటిమో
ఎవ్వని నమ్మి ఏమిట నొకింతయు సందియ మందకుంటిమో
అవ్వర కీర్తిశాలి పవనాత్మజుడేలుత మిమ్ము మమ్ములన్.”

ఆంజనేయ వరప్రసాద కవితాఝరితో ఒకసారి గన్నవరం సభలో షేక్‌స్పియర్ రచించిన ‘సింబలైన్’ కావ్యాన్ని 400 పద్యాలలో కావ్యంగా ఆశువుగా చెప్పారు. పద్యాలన్నీ ప్రబంధగతిలో సుగంధాలు వెదజల్లడం వీరి కవితా ప్రత్యేకత.

ధారణా వైదుష్యం:

కొప్పరపు సోదరుల ధారణాబలం అనితర సాధ్యం. శతావధానంలో వరుసగా మూడు రకాలుగా ధారణ చేసి చూపించేవారు. (I) ఒకటి నుండి 100 వరకు (II) వంద నుంచి ఒకటి వరకు (III) అస్తవ్యస్తంగా 3, 9, 15, 21, 13, 97, 18 సంఖ్య పద్యాలు అడిగితే ధారణ చేసి చెప్పడం. “అరిస్తే పద్యం, స్మరిస్తే పద్యం” అని శ్రీశ్రీ అన్నట్లు, మామూలు పలకరింపులు కూడా పద్యాలలో చేసేవారు.

“పలికిన పలుకులన్నియు పద్యము లయ్యెడు, ఏమి చెప్పుదున్” అని కొప్పరపు సోదర కవుల గూర్చి ప్రసిద్ధ విమర్శకులు వేటూరి ప్రభాకరశాస్త్రి ప్రశంసగా పలికారు.

పద్యాలు భద్రపరచడం:

అవధానానంతరం ఆ పద్యాలను ఒకచోట భద్రపరచే ప్రక్రియకు ఆ రోజుల్లో కవులు ప్రయత్నించలేదు. అడిగిన వెంటనే పద్యాలు చెప్పడంతోనే సరిపోయేది. వ్యవధి లేకుండా అవధానాలు చేసిన సందర్భంలో వాటి స్ఫురణ తరువాత వుండేడి కాదు. తిరుపతి వెంకట కవులు అవధానాలతో పాటు పాండవోద్యోగ విజయాది నాటకాలు కూడా వ్రాయడం వల్ల అవి చిరస్థాయిగా నిలిచిపోయాయి. కొప్పరపు సోదరులు 1912 మే నెలలో కాకినాడలో గంజాం వేంకటరత్నం పంతులు ద్వితీయ పుత్రికా కళ్యాణ మహోత్సవ సమయంలో సీతాకళ్యాణాన్ని ఆశు ప్రబంధంగా చెప్పారు. సీతా స్వయంవర ఘట్టాన్ని వర్ణిస్తూ

“గజదనుజ వైరి ధనువున్
గజిబిజి లేకుండ విరించి ఖ్యాతింగను అం
గజమూర్తి రాము గళమున్
గజసుమదామము వైచె గజగమన తగన్.”

సద్యఃస్ఫూర్తితో అల్లిన ఈ పద్యం అతి మధురం. కొప్పరపు సోదరుల వలె పద్యం వేగంగా చెప్పడం అలవరుచుకొన్నానని డా. మేడసాని మోహన్ ఒక వ్యాసంలో ప్రస్తుతించారు. వారి పద్యధారను బోలిన సీసమొకటి తాను అల్లానని మోహన్ గుర్తు చేస్తూ –

“ఏ దేవి సుకుమార పాదాబ్జ మకరంద
మమరుద్రుమంబుల కమరు ధార”

అన్నారు.

స్రగ్ధర వంటి వృత్తాలను కూడా కొప్పరపు సోదర కవులు ఆశువుగా చెప్పేవారు. ఆ ప్రభావం తరువాతి అవధానులపై వుండటం విశేషం.

మాడభూషి విశిష్టత:

శతావధానాలను బహుళ వ్యాప్తిలోకి తెచ్చినవారిలో మాడభూషి వెంకటాచార్యులు (1835-1895) అగ్రగణ్యులు. గంటకు వందల కొద్దీ పద్యాలు చెప్పగల నేర్పరి. ఒక గదిలో 100 చెంబులు పెట్టి పుల్లతో ముందు వరుసగా వాయించగా, మరొక గదిలో వున్న మాడభూషి నడుమ ఏ చెంబుపైన దెబ్బ కొట్టినా, అది ఫలానా సంఖ్య గల చెంబు గని చెప్పేవారని మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి తమ గ్రంథం ‘ఆంధ్ర రచయితలు’లో ఉటంకించారు. అదొక అద్భుత శబ్ద విన్యాసం.

మాడభూషి వారు ప్రభువులకు నెలవైన ‘నూజివీడు’లో నివసించారు. తోచినపుడెల్ల ఒక్కొక్క ప్రభువును దర్శించి ప్రతిభ చూపి కానుకలు తెచ్చుకుని ఇంట్లో కూర్చుని గ్రంథరచన చేశారు. 1879లో పీఠికాపుర మహారాజు గంగాధర రామారావు వీరి అవధానానికి మహాశ్చర్య భరితులై ఘనంగా సత్కరించారు.

ప్రతిభామూర్తులు:

ధర్మవరం రామకృష్ణమాచార్యులు (1853-1912) ఆంధ్ర నాటక పితామహులుగా ప్రసిద్ధులు. అష్టావధాన శతావధాన ప్రదర్శనలు చేసి కొక్కొండ వెంకటరత్నం పంతులు వంటి వారిచే మెప్పు పొందారు. బళ్లారిలో న్యాయవాదవృత్తి నెరపి ధనార్జన చేశారు. పద్యనాటక రచనలో సిధ్ధహస్తులు. సారంగధర, చిత్రనళీయం వీరి నాటకాలు.

సోదరకవులుగా కొందరు కీర్తి గడించారు. అందులో దేవులపల్లి సోదరకవులు పేరెన్నికగన్నవారు. దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి (1853-1909), సుబ్బరాయశాస్త్రి (1856-1902). (సినీకవి దేవులపల్లి వేరొకరు). 1879లో మాడభూషి వెంకటాచార్యులు పిఠాపురం సంస్థానంలో అవధానం చేశారు. అప్పుడు గంగాధర రామారావు గారు “మన ఆస్థానంలో ఇటువంటి ప్రతిభావంతులున్నారా?” అని ప్రశ్నించారు. మరునాడు దేవులపల్లి సోదరకవులు శతావధానం మొదలుపెట్టి అద్భుతంగా పూర్తి చేశారు. ఇద్దరూ సంస్కృతంలోనూ చేయి తిరిగిన కవులు.

దాసు శ్రీరాములు (1846 – 1908) కృష్ణా మండలంలో నివసించేవారు. అప్పట్లో మాడభూషి వారు నూజివీడు సంస్థాన కవి. వారి పేరుప్రతిష్టలు విన్న శ్రీరాములు శతావధానం చేయాలనే సంకల్పంతో ఒకనాటి తెల్లవారు జామున తల్లిదండ్రులకు తెలియకుండా నూజివీడు వెళ్లారు. మాడభూషి వారి ఆదరంతో ఒక అవధానం చేశారు. ఆయన వయసు 12 సంవత్సరాలు.

“పది రెండేడుల ఈడునన్ కవిత చెప్పం జొచ్చి వ్యస్తాక్షరీ” అని మాడభూషిచే ప్రశంస లందుకొన్నారు. ఆ విధంగా మాడభూషి అటు దేవులపల్లి సోదరకవుల అవధాన ప్రతిభకు, ఇటు దాసు శ్రీరాములు అవధాన ప్రతిభకూ మార్గదర్శి అయినారు. చెళ్లపిళ్ల వారు దాసు శ్రీరాముల కవిత జనరంజకమని ప్రశంసించినారు.

చిన్నతనంలో అవధానాలు చేసిన ప్రొఫెసర్ బేతవోలు రామబ్రహ్మంగారితో రచయత

గణితావధానం:

ఇదొక ప్రత్యేక ప్రక్రియ. గణిత మేధావులను గన్న మన దేశంలో ఈ ప్రక్రియను వ్యాప్తికి తెచ్చినవారున్నారు. ఇటీవలి కాలంలో 2006లో విజయనగరానికి చెందిన 11 ఏళ్ళ బాలుడు – నిశ్చల నారాయణ వందలాది వస్తువులను ధారణ చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించాడు. 225 వస్తువులను గుర్తు పెట్టుకుని చెప్పగలిగాడు. కళ్ళకు గంతలు కట్టుకుని చదరంగం ఆడి ఆట కట్టించగలిగాడు. ఈ సందర్భంలో ఒక దివ్యాంగుడు స్మరణకు వస్తాడు.

లక్కీ లక్కోజు:

శ్రీపాద సుబ్రమణ్య శాస్త్రి కథలలో వడ్లగింజల ప్రస్తావన చాలామందికి తెలుసు. రాజుగారు చదరంగం పోటీ పెట్టారు. ఆయనను ఆటలో ఓడిస్తే బహుమానంగా మొదటి గడిలో ఒక వడ్లగింజ, రెండో గడిలో రెండు గింజలు, మూడో గడిలో నాలుగు, ఐదో గడిలో ఎనిమిది, ఇలా 24 గళ్ళల్లో నింపి ఇవ్వమని ఒక చదరంగ పండితుడు రాజును కోరాడు. తీరా ఎన్ని గింజలు ఇవ్వాలో లెక్క తేల్చి ఆశ్చర్యపోయారు. గణిత మేధావి లక్కోజు సంజీవరాయశర్మ ఇలా దానికి సమాధానం చెప్పారు. 1,84,46,74,40,73,70,95,51,615 వడ్ల గింజలు కావాలి. పది మీటర్ల వెడల్పు గల ఒక గాదెలో ఆ ధాన్యం నింపాలంటే ఆ గాదె పొడవు ఒక కోటీ నూట యాభై కిలోమీటర్లుండాలి. ఈ దూరం భూమికి, సూర్యుడికీ మధ్యనున్న దూరానికి 20 రెట్లు అధికం. ఈ సమాధానం చెప్పిన లక్కోజువారు మేధావి.

అంకెలు ఎలా వుంటాయో కూడా తెలియని అంధులు. ఆ రోజుల్లో బ్రెయిలీ లిపి కాని, అంధుల పాఠశాలలు కానీ లేవు. తన సోదరి బిగ్గరగా చదివే పాఠాలు మననం చేసి గుర్తు పెట్టుకునేవారు. గణితంలో అపార పరిజ్ఞానం పెంచుకొన్నారు. 1907 నవంబరు 22న సంజీవరాయశర్మ కడప జిల్లా ప్రొద్దుటూరు మండలంలోని కల్లూరులో జన్మించారు. కల్లూరులో రైతులకు ధాన్యం ధర, భూమి కొలతలు చెప్పేవారు. గణితావధానంలో పుట్టిన తేదీ ఇస్తే అది ఏ వారమో చెప్పేవారు. అంతేకాదు సమయం, ప్రదేశం చెప్పగానే, తిథి, వార, నక్షత్ర, కరణ, యోగ, వర్జ్యం, రాశి – చెప్పి అబ్బురపరచేవారు.

మానవ గణన యంత్రంగా పేరు గాంచిన భారతీయ గణితవేత్త శకుంతల దేవి – “తన కంటే అపార గణిత ప్రజ్ఞ గల వ్యక్తి” అని ప్రశంసించారు. 1923లో ఒకసారి గణితావధానం చేశారు. 1995 వరకు అనేక ప్రాంతాలలో గణితావధానం చేశారు. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం వారు గౌరవ డాక్టరేట్ ఇచ్చారు. చివరి రోజుల్లో శ్రీకాళహస్తీశ్వరుని సన్నిధిలో వయోలిన్ వాయిస్తూ జీవించారు.

(మళ్ళీ వచ్చే వారం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here