అవధానం ఆంధ్రుల సొత్తు-9

0
2

[box type=’note’ fontsize=’16’] తెలుగువారి వెయ్యేండ్ల సారసత్వంలో అవధాన ప్రక్రియ విశిష్టమైనది. ఈ శీర్షిక ద్వారా అవధాన విద్య గూర్చిన సమగ్ర సమాచారాన్ని అందిస్తున్నారు డా. అనంత పద్మనాభరావు. [/box]

పద్యధారణావధానం:

[dropcap]ప్ర[/dropcap]కాశం జిల్లా జాండ్రపేట నివాసి డాక్టరు వొలుకుల శివశంకరరావు 37 ఏళ్లు తిమ్మసముద్రంలోని గోరంట్ల వెంకన్న సంస్కృత కళాశాల అధ్యాపకులుగా, ప్రిన్సిపాల్‍గా పనిచేశారు. ధారణారాక్షసుడు – అనే బిరుదు లభించింది. వందల కొలది పద్యాలను ధారణ చేసి వల్లించగలరు. తెలుగు పద్య మోహిని అమృత ధారలు కురిపిస్తూ శరవేగంగా సాగిపోతుంది. అర నిమిషానికో పద్యం శరచ్చంద్రికా కిరణంలా వెన్నెల వెదజల్లుతోంది. 10 గంటల్లో 1120 తెలుగు పద్యాలు శ్రోతల్ని పరవశుల్ని చేస్తాయి. ఛందస్సు బంధాల్లో ఒదిగిన అక్షరాలు భావనా వలువలు ధరించి రసరాణి వయ్యారంగా నర్తిస్తుంది. తెలుగు భాష గొప్పదనాన్ని చాటి చెబుతుంది.  పలు ప్రాంతాలలో శివశంకరరావు ఈ ప్రదర్శనలిచ్చి సన్మానితులయ్యారు. ఇటీవల ఆయన సన్యాసాశ్రమ స్వీకారం చేసి విశ్వంభరానందగిరిస్వామిగా వ్యవహరించబడుతున్నారు.

అవధాన ప్రక్రియ:

ధారణావధాన ప్రక్రియను శివశంకరరావు స్వయంగా రూపొందించి ప్రచారంలోకి తెచ్చి 1978 నుండి దాదాపు 400 ప్రదర్శనలను దేశవిదేశాలలో యిచ్చారు. నన్నయ్య మొదలు జంధ్యాల పాపయ్యశాస్త్రి వరకు ఉన్న కవుల పద్యాలను 1200 పద్యాలను ఎంపిక చేసుకుని సభకు ముందుగా పృచ్ఛకులకు అందజేస్తారు. ముద్రిత  కాపీలు పంచుతారు. తొమ్మిది మంది పృచ్ఛకులు ఈ ప్రక్రియలో వ్యవహరిస్తారు. వారిని మూడు రకాలుగా విభజించవచ్చు. కొందరు పద్యం వేగంగా చెప్పమని అడుగుతారు. మరో ముగ్గురు ఆ పద్యపాదంలో తొలి పదం సూచించి, దాని అర్థము, సామాజిక సందేశం వివరించమని అవధానిని కోరుతారు. సభకు ముందుగా ఇచ్చిన లిస్టు లోంచి పద్యాలను మాత్రమే అడగాలి. మరికొందరు పృచ్ఛకులు పద్యంలోని మూడో పాదమో, నాలుగో పాదమో ఒక కొంత సూచిస్తారు. అవధాని మొత్తం పద్యం చెప్పాలి. అవధానం అని దీనికి పేరు ఎందుకు పెట్టారు? అని ఒక విదేశీ సభలో సినీ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు అవధానిని ప్రశ్నించారు. అవధానం అంటే హెచ్చరిక అనే అర్థంలో తిక్కనాదుల ప్ర్రయోగాలున్నాయని శివశంకరరావు సమర్థించారు.

శ్రీ వొలుకుల శివశంకరరావు గారికి సత్కారం

పృచ్ఛక సరళి:

అవధాని సభలో 9 మంది పృచ్ఛకులకు ఒక్కొక్కరికి 112 పద్యాలు ముద్రిత కాపీలు ముందుగా ఇచ్చేస్తారు. 112 ఎందుకని అడిగితే, గంటకి 112 పద్యాలు వేగంగా చెప్పగలనని నిరూపించుకోడానికే. ఈ అవధాన ప్రదర్శన విద్యాసంస్థలలో నిర్వహించడం వల్ల విద్యార్థులకు జ్ఞాపకశక్తి, ధారణా పటుత్వంపై ఆసక్తి పెరుగుతుంది. పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకిది మార్గదర్శి. ఈ ప్రదర్శనకు ఒక న్యాయనిర్ణేతను ఎంచుకొంటారు. ఆయన టెస్ట్ క్రికెట్ అంపైర్ లాంటివాడు. ఏదైనా పద్యధారణలో తేడా వస్తే మరొక పద్యం అవధాని చెబుతారు. ఉదాహరణకు మహాభారతంలోని నన్నయ చివరి పద్య – చివరి పదం ‘అంబర చుంబితంబులై’ అనే పదాన్ని పృచ్ఛకుడు సూచిస్తే, అవధాని ‘శారద నీరదేందు ఘనసార పటీర మరళా మల్లికా హార’ అనే నాలుగు పాదాలు వేగంగా, రాగయుక్తంగా, భావయుక్తంగా చెబుతారు.

అవధాని ప్రతిభ:

శివశంకరరావు తిమ్మసముద్రం ఓరియంటల్ కళాశాలతో తెలుగు అధ్యాపకులుగా 1975లో ప్రవేశించారు. 1978-79 నుండి ఈ వినూత్న ప్రక్రియకు రూపకల్పన చేసి ప్రదర్శన మొదలెట్టారు. తొలుత గంటకు 112 పద్యాలతో ప్రారంభించారు. ఆ తర్వాత 6 గంటలలో 666 పద్యాలు చీరాలలో ధారణ చేశారు. శతావధానాలు, సహస్ర, పంచసహస్రావధానాలుగా సంఖ్యాబలం పెరిగినట్టు ఈ ప్రక్రియలో కూడా సంఖ్య పెరిగింది. ఒంగోలులో 9 గంటలలో 1008 పద్యాలు చెప్పారు. అది ఉన్నత స్థాయికి చేరి 10 గంటలలో 1116 పద్యాలు చెప్పి ప్రశంసలందుకొన్నారు.

పురస్కారాలు:

శివశంకరరావు ప్రతిభకు సంస్థలు పట్టం గట్టాయి. తెలుగు సాహిత్యానికి అఖండ ఖ్యాతి తెచ్చిన వీరిని ‘జ్ఞానదేవత’గా సత్కరించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ తాళపత్ర గ్రంథాలయ సంస్థ అధిపతి ఆచార్య జయధీర్ తిరుమలరావు తెలుగు విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన సభలో వీరి ప్రతిభను పండితులు ఘనంగా ప్రశంసించారు. అమెరికాలో తానా సభలలో మూడు మార్లు ప్రదర్శనలిచ్చి వీణాపాణి సత్కారం అందుకున్నారు.

అక్కినేని ప్రశంస:

హైదరాబాదు తెలుగు విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ధారణావధానానికి జ్యోతి ప్రజ్వలన చేయడానికి విచ్చేసిన నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు తమ ప్రసంగంలో ఇలా చమత్కరించారు:

“నా జీవితంలో ఉదయం 8 గంటలకు ఏ సభకూ ముఖ్య అతిథిగా వెళ్లలేదు. ఈరోజు శివశంకరరావు ప్రదర్శన తిలకించాలని అంగీకరించాను. విశ్వవిద్యాలయం వారు నన్ను ఎందుకు పిలిచారా? అని ఆలోచించాను. శివశంకరునికి మెడలో పాములున్నట్లే, నాగేశ్వరునికీ ఉంటాయి. నేను చిన్నప్పుడు కొన్ని మాటలు వొంటబట్టించుకున్నాను. పల్లెటూరిలో ‘అమ్మ! అక్క!’ అని బూతు మాటలు అలవాటయ్యాయి. ఈయన ‘ధారణా రాక్షసుడు'” అన్నారు.

సభలో విశిష్ట అథిథిగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మోతీలాల్ నాయక్ విచ్చేసారు. ముగింపు సమావేశానికి విచ్చేసిన జ్ఞానపీఠ అవార్డు గ్రహీత పద్మభూషణ్ డా. సి. నారాయణరెడ్డి అవధాని ధారణను మెచ్చుకొన్నారు.

రికార్డు:

‘గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు’ ఘనత శివశంకరరావు సాధించారు. అంతేగాక, ‘Man of the World Record’ కూడా సొంతం చేసుకొన్నారు. తెలుగు విశ్వవిద్యాలయం వారు ‘కీర్తి పురస్కారం’ అందించారు. ప్రముఖ పండితులు ఆచార్య శలాక రఘునాథశర్మ ఒక సభలో అవధానికి ప్రశంసిస్తూ – “చిన్నతనంలో నేనూ ఈ ప్రక్రియ పట్టుకుని వుంటే ‘సెభాష్’ అనిపించుకొనేవాడిని” అన్నారు. శివశంకరరావు ఎందరో యువకులలో ఉత్తేజాన్ని కలిగించారు. ఆకాశవాణి వారికి శ్రీశైలం శివరాత్రి ఉత్సవాల వ్యాఖ్యాతగా ఎన్నో సంవత్సరాలు పాల్గొన్నారు.

రెండేళ్ళ క్రితం వీరి ధర్మపత్ని అకాలమరణంతో వీరు ఆధ్యాత్మిక రంగంవైపు మొగ్గు చూపారు. అబ్బాయి, అమ్మాయి అమెరికాలో ఉన్నారు. సన్యాసాశ్రమం స్వీకరించిన శివశంకరరావు ప్రకాశం జిల్లా కారంచేడు లోని శ్రీ వశిష్ఠాశ్రమం ఉత్తర పీఠాధిపతిగా ఎంపిక చేయబడి 2021 నుంచి ఆధ్యాత్మిక ప్రవచనాలు అందిస్తున్నారు.

సన్యాసాశ్రమం స్వీకరిస్తున్న శ్రీ వొలుకుల శివశంకరరావు

ధారణావధానిగా రాజమండ్రిలోని నన్నయ విశ్వవిద్యాలయం తెలుగు ఆచార్యులు డా. కర్రి నాగార్జునశ్రీ వసుచరిత్రలో పద్యాలతో ప్రదర్శనలు పలు ప్రాంతాలలో ఇచ్చారు.

యువతలో అవధానాసక్తి:

విదేశాలలో యువకులు (తెలుగువారు) దేశ భాషా సంస్కృతులపై అభిమానంతో పద్య రచనపైనా, కావ్య సృష్టి పైనా, అవధాన విద్య పట్ల ఆసక్తి చూపడం విశేషం. శృంగేరీ పీఠాధిపతుల ఆశీస్సులతో అమెరికాకు చెందిన గన్నవరపు లలితాదిత్య శతావధాన ప్రదర్శనలు విజయవాడ, రాజమండ్రిలో ఇచ్చారు. సంస్కృతాంధ్రాలలో ప్రతిభ గల లలితాదిత్య యువకుడు. పలువురు అమెరికాలోని తెలుగువారు కూడా, శ్రీచరణ్ వంటి వారు సంస్కృతావధానం చేయడం అభినందనీయం. తెలుగు భాషపై మక్కువ పెంచుకోవడానికి విదేశాలలోనూ ఈ ప్రదర్శనలు నిర్వహించబడడం సంతోషం.

డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్

డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ శిష్యులు గన్నవరపు లలితాదిత్య. శతావధాని గన్నవరపు లలితాదిత్య రాజమండ్రిలో 2019 డిసెంబరులో చేసిన శతావధానంలో ఒక దత్తపది పూరణ.

హస్త, చిత్త, స్వాతి, మూల – తెలుగు విందు భోజనం.

పూరణ:

హస్తగతమైన బూరెలో ఆజ్యమిడగ
చిత్తమొప్పంగ జఠరాగ్ని చిందులేయ
కందమూలంబు లొల్లని ఘన భుభుక్ష
స్వాతిశయమున తనిసిరి అతిథులెల్ల.

అదే అవధానంలో శతావధాని డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ యిచ్చిన సమస్య:

‘వృశ్చిక పుచ్ఛ గోత్రులను పృచ్ఛక కోటులు మెచ్చరేటికిన్’

పూరణ:

దుశ్చరితమ్ము లేదు, పద దోషము లెందును చూడలేవు, వై
పశ్చిత ముగ్ధభావ పరిభావము లేదు, వధాని నేతకున్
పశ్చిమ బుద్ధి లేదు, మరి వాసిని గాంచెను జ్యేష్ఠజాతుడై
వృశ్చిక పుచ్ఛ గోత్రులను పృచ్ఛక కోటులు మెచ్చరేటికిన్.

అవధాని జ్యేష్ఠా నక్షత్ర జాతకుడు అనేది ప్రధానాంశం. ఈ విధంగా యువత అవధానాల పట్ల ఆసక్తి చూపి ప్రతిభావంతులుగా ప్రదర్శనలివ్వడం హర్షదాయకం.

(మళ్ళీ వచ్చే వారం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here