అవకతవక రాజు

0
3

[dropcap]ఒ[/dropcap]కప్పుడు ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకి వేపకాయంత వెర్రి ఉండేది. ఎప్పుడూ అన్యాయం వైపే తీర్పులు ఇస్తూండేవాడు. అయన చేసే పనులు కూడా అన్యాయం గానూ, అక్రమంగానూ ఉండేవి. క్రమక్రమంగా ప్రజలు కూడా అలాగే అలవాటు పడిపోయారు.

ప్రతిరోజూ రాజు తన దగ్గరకు వచ్చిన ఫిర్యాదులు చూసి, తీర్పులు ఇస్తూండేవాడు. ఆరోజు కూడా ఒక దొంగ వచ్చాడు. “నీ అభియోగం ఏమిటి?” అని అడిగాడు రాజు.

“మహారాజా! నిన్న రాత్రి నేను ఒక ఇంటికి దొంగతనానికి వెళ్లాను. ఇంటికి కన్నం వేస్తూండగా గోడ రాళ్ళు ఊడిపోయి నా చేతిమీద పడి గాయం అయింది. కాబట్టి ఆ ఇంటి యజమాని చేత నాకు నష్ట పరిహారం ఇప్పించాలి” అన్నాడు.

ఇంటి యజమాని ముందుకు వచ్చి “మహారాజా! నా ఇంటిగోడ కూలిన మాట నిజమే! గోడ గట్టిగా కట్టినట్లయితే ఈ ప్రమాదం జరిగిఉండేది కాదు.  కానీ ఇల్లు నేను కట్టలేదు. అది కట్టిన తాపీ పనివాడిదే తప్పు. అతనిని శిక్షించండి” అన్నాడు.

“అవును. నువ్వు చెప్పింది సబబుగానే ఉన్నది. ఇందులో నీ తప్పేం లేదు. వెంటనే వెళ్లి ఇల్లు కట్టిన తాపీ పనివాడిని  తీసుకురండి” అని ఆజ్ఞాపించాడు. వెంటనే భటులు ఆఘమేఘాల మీద వెళ్లి తాపీ పనివాడిని  పిలుచుకుని వచ్చారు. వాడు విషయం అంతా విన్నాడు.

“ప్రభూ! నాదేముంది? అడుసు వేసి వరసగా రాళ్ళు అతికించడమే నా పని. అడుసు సమపాళ్లలో వేసి కడితే రాళ్ళు చక్కగా అతుక్కుంటాయి. అడుసు సరిగా కలిపితే ఈ ఘోరం జరిగేది కాదు. అడుసు కలిపిన వాడిదే ఈ తప్పు. అతడే శిక్షార్హుడు” అన్నాడు.

రాజు అడుసు కలిపే వాడిని పిలిపించాడు. “మహారాజా! నేను అడుసు తొక్కేటప్పుడు అతిలోక సౌందర్యవతి యైన రాజనర్తకి అటుగా వెళుతున్నది. ఆమె అందాన్ని చూసి మైమరచి పోయాను. ఇంతలో ఈ తాపీవాడు త్వరగా ఈ అడుసు తీసుకురమ్మని కేకేశాడు. ఆ కంగారులో అడుసు సరిగా తొక్కకుండా తీసుకువెళ్లాను. నాదేం తప్పు లేదు. రాజనర్తకినే శిక్షించండి” అని వినయంగా అన్నాడు.

“నిజమే! నీదేం తప్పులేదు. ఆమెదే తప్పు. కానీ ఆమె నా ప్రియురాలు. ఆమెని శిక్షించటం నాకిష్టం లేదు. ఎలా?” అంటూ యోచనలో పడ్డాడు రాజు.

ఈ వ్యవహారం అంతా చూస్తున్న ప్రజలలో ఒకడు “దొంగతనం చేయటం తప్పు అని చెప్పి దొంగను శిక్షించాలి గానీ ఇదంతా ఏమిటి? ఏం రాజు? ఏం తీర్పు?” అన్నాడు.

ఆ మాట వినగానే రాజుగారి కోపం వాడివైపు మళ్ళింది. “రాజుగారిని విమర్శించటం నేరం. వీడిని ఉరి తీయండి” ఆజ్ఞాపించాడు. రాజుగారికి భయపడి సభలోని వారెవరూ అడ్డుకోలేదు. భటులు అతడిని పట్టుకుని ఉరికంబం దగ్గరకు తీసుకువెళ్ళి, మళ్ళీ వెనక్కు తీసుకువచ్చారు. “ప్రభూ! వీడు ఉరికంబం కంటే ఎత్తుగా ఉన్నాడు. ఉరి తీయటానికి వీలుగా లేదు” అని చెప్పారు.

“అయితే ఎత్తు తక్కువగా ఉన్నవాడిని, ఉరి తీయటానికి వీలుగా ఉన్నవాడిని పట్టుకొచ్చి ఉరి తీయండి” అని చెప్పాడు రాజు. అలాంటి వాడిని వెతుక్కు రావటానికి భటులు పరుగెత్తారు.

“అధికారంలో ఉన్నవాడు తప్పు చేసినప్పుడు దాన్ని ఖండించాలి. ఎదిరించాలి. అతడి అధికారం చూసి భయపడో, ఇంకొక కారణం చేతో హర్షించి ఊరుకుంటే ప్రజలు కష్టాలు పాలవుతారు” అని దుర్యోధనుడి గురించి దృతరాష్ట్రుడికి ఈ కధ చెబుతాడు విదురుడు.

మూలం:- మహాభారతం లోని విదుర నీతులు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here