[dropcap]వీ[/dropcap]రయ్యకు చదువు లేదు కాని కండబలం ఉంది. దానికి తోడు మూర్ఖత్వం ఉంది. తనకు బలం ఉందనే గర్వంతో బలహీనులను బెదరించి డబ్బు తీసుకునేవాడు. అతని బలానికి, మూర్ఖత్వానికి భయపడి కొందరు డబ్బు ఇచ్చేవారు. కొందరు ప్రతిఘటించి అతని చేత తన్నులు తినేవారు. అన్నిరోజులు ఒకటిగా ఉండవు కదా! ఏదో ఒక సంఘటన వలనో, ఒక మహానుభావుని పరిచయం వలనో ఇటువంటివారు మారవచ్చు.
ఒకసారి వీరయ్య భార్య దారిలో పోతూ ఉంటే ఆమెను ఒక బలమైన ఎద్దు కుమ్మింది! ఆమె తీవ్రంగా గాయపడి కన్ను కొంత భాగం దెబ్బ తినింది. డొక్కలో కొమ్ము తగలడం వలన రెండు మూత్రపిండాలు దెబ్బతిన్నాయి. రక్తం ఓడుతూ పడిపోయిన ఆమెను అక్కడివారు కొందరు ఆ ఊరి పెద్దాసుపత్రిలో చేర్పించారు. అక్కడి వైద్యులు ఆమెకు పరీక్షలు చేసి చెడిన కన్నుకు బదులు మరొక కన్ను, పాడైపోయిన మూత్రపిండాలకు బదులు వేరొకరివి వైద్యపరంగా పనికిరాని మూత్రపిండాలు అమర్చుతే ఆమె తిరిగి మామూలు మనిషి అవుతుందని నిర్ధారించారు.
ఈ విషయం వీరయ్యకు తెలిసి పరుగున ఆసుపత్రికి వచ్చాడు. ఆమె విషయం వైద్యులు వీరయ్యకు వివరించారు, అవయవ దానానికి పనికి వచ్చే వ్యక్తి దొరికితే మారుస్తామని చెప్పారు, అందుకోసం కొంత డబ్బు ఖర్చు అవుతుందని చెప్పారు.
వీరయ్య ఎవరిని డబ్బు అడిగినా, అతని కండ కావరం తెలిసిన వారు కనుక ఎవరూ సహాయం చేయలేదు. అదృష్ట వశాత్తు ఒక డబ్బు గల వ్యక్తి మటుకు మానవతా దృక్పథంతో సహాయం చేయడానికి ముందుకు వచ్చాడు.
ఆసుపత్రికి రెండో రోజు మెదడు పరంగా మరణించిన వ్యక్తిని తీసుకువచ్చారు. ఆ శవం తాలూకు బంధువులు గొప్ప మనసుతో అవయవ దానానికి ఒప్పుకున్నారు. అన్ని పరీక్షలు చేశాక వైద్యులు మెదడు పరంగా మరణించిన వ్యక్తి కన్ను, మూత్ర పిండాలు వీరయ్య భార్యకు సరిపోతాయన్న నిర్ణయానికి వచ్చారు.
వైద్యులు వీరయ్య భార్యకి కన్ను, మూత్రపిండాలు అమర్చి పది రోజుల తరువాత ఇంటికి పంపివేశారు.
ఈ సంఘటన వీరయ్యలో ఎంతో మార్పు తెచ్చింది! తను బలవంతుడనని గర్వంతో, మూర్ఖత్వంతో ఎందరినో భయపెట్టాడు. సమాజంలో చెడ్డపేరు తెచ్చుకున్నాడు, అందుకే అవసరమైనపుడు ఎవరూ డబ్బు ఇవ్వలేదు. కానీ తన భార్యను ఎద్దు కుమ్మినపుడు అక్కడ ఉన్న జనం మంచిమనసుతో వైద్యశాలలో చేర్పించారు. ఎవరో వైద్యపరంగా చనిపోయి తన కళ్ళు, మూత్రపిండాలు ఇచ్చి తన భార్యను బతికించాడు! ఇది ఎంతో గొప్ప విషయం. ఆ రోజు తన నడత మీద తీవ్రంగా ఆలోచించాడు. బలం ఉందికదా అని భయపెట్టడం, దోచుకోవడం గొప్పకాదు, ఒకరిని ఆదుకోవడం, తన పరిధిలో అవసరమున్నవారికి సహాయం చేయటమే గొప్ప అని ఆలోచించాడు.
తాను కూడా తన నడవడిక మార్చుకుని మంచిపేరు తెచ్చుకోవాలనుకున్నాడు. వెంటనే తన భార్యకి చికిత్స జరిగి ఆసుపత్రికి వెళ్ళి ఒకవేళ తాను ప్రమాదంలో చనిపోయినా, లేక మామూలు మరణం సంభవించినా తన అవయవాలు అవసరం ఉన్నవారికి అమర్చాలని తెలిపాడు. వైద్యులు అతని మంచి మనసును మెచ్చుకుని తగిన విధంగా పత్రాలు నింపి అతని వేలి ముద్రలు వేయించుకున్నారు. ఈ విషయం వీరయ్య వీధిలో అందరికీ తెలిసి వీరయ్యలో కలిగిన మార్పుకి సంతోషించారు.
కాలం జరిగిపోతూనే ఉంటుంది కదా! వీరయ్య ముసలివాడైనాడు. అతనికి మరణం సంభవించింది. అతని కోరిక మేరకు అతని శవాన్ని అన్ని వివరాలతో వైద్యశాలకు పంపారు. అన్ని పరీక్షల అనంతరం అతని కళ్ళు తీసి ఇద్దరికి, మూత్రపిండాలు వేరొక వైద్యశాలలో ఉన్న అవసరం ఉన్న ఇద్దరు రోగులకు వైద్యులు పంపారు.
అతనిని యమలోకానికి యమ భటులు తీసుక వెళ్ళారు. ఎందుకంటే అతను అందరినీ భయపెట్టడం వలన అతనికి యమలోకం ప్రాప్తించింది.
అప్పుడే అక్కడికి వచ్చిన శ్రీకృష్ణ భగవానుడు వీరయ్యకు ఏ శిక్షా వేయవద్దని, కొన్నాళ్ళు స్వర్గంలో ఉంచమని చెప్పాడు. యమధర్మరాజు ఆశ్చర్యపోయి అతనిని గురించి వ్రాసిన చిత్రగుప్తుడి చిట్టా చూపించాడు.
“యమధర్మరాజా నీవు చూపినది నిజమే, కానీ ఇతడు తన నడవడికను మార్చుకున్నాడు. అతనిలో ఒక ఉత్తమగుణం నెలకొంది, అదే ‘అవయవదాన గుణం’. దాని మూలంగా నలుగురు వ్యక్తులను కాపాడాడు. ఇంతకంటే పుణ్యకార్యం ఏముంటుంది? అందువలన అతనికి సద్గతి లభిస్తుంది. కానీ చేసిన పాపాలకు మూలంగా అతను స్వర్గ లోకంలో గడిపాక తిరిగి భూమి మీద పుట్టి పుణ్య కార్యాలు చేస్తాడు” అని యమధర్మరాజు సందేహం నివృత్తి చేశాడు.
శ్రీకృష్ణుని విశ్లేషణకు యమధర్మరాజు అనేక నమస్సులు సమర్పించి వీరయ్యను కొంతకాలం స్వర్గంలో గడపమని పంపాడు. మనం చేసే ప్రతి మంచిపనికి ఒక మంచి పర్యవసానం ఉంటుంది.
చూశారా అవయవ దానం వలన ఇతరుల ప్రాణాలు నిలబడటమే కాకుండా, ఆ అవయవాలు మరొకరిలో బతికి మంచి చేస్తూ దానం చేసిన వ్యక్తికి మరికొంత ఆయస్సు తోడై ఉన్నట్టే కదా! అందుకే అందరూ అవయవ దానాన్ని ప్రోత్సహించాలి.