Site icon Sanchika

అవి ఎన్నటికీ మరువరాని తలపులు

[box type=’note’ fontsize=’16’] ది 20 సెప్టెంబరు 2021 న అక్కినేని నాగేశ్వరరావు గారి జయంతి సందర్భంగా, వారితో తమ కుటుంబానికి ఉన్న స్నేహాన్ని గుర్తు చేసుకుంటున్నారు ఏ. అన్నపూర్ణ. [/box]

[dropcap]మ[/dropcap]నిషికి జీవితంలో మరువలేని అపురూప సంఘటనలు ఉంటాయి. కొందరు గొప్ప వ్యక్తులతో అనుకోకుండా పరిచయాలు ఏర్పడుతాయి. అలాంటి అనుభవం మాకు కలిగింది. ఆ వ్యక్తి ఆనాటి సినీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు గారు.

సినిమాలు చూడటం చిన్ననాడే తల్లి తండ్రులు అలవాటు చేస్తారు. అప్పుడు వారి ఒడిలో కూర్చుని చూస్తే ఎదుగుతూన్నకొద్దీ సినిమా కథ, పాటలు, నటుల నటన అర్థం చేసుకుంటూ ఒక అభిప్రాయం అభిమానమూ ఏర్పాటు చేసుకుంటాం. అందులో ఆనాటి కథల్లో ఒక సందేశం ఉండేది. సమస్య పరిష్కారం చెప్పేవారు. కొన్ని సందేశాలు పాటించ తగ్గవిగా ఉండేవి. ఇప్పటికీ ఆణిముత్యాలుగా నిలిచిపోయాయి.

అంతటి ప్రతిభాశాలి అయిన నటులుగా ఏ.ఎన్.ఆర్ పేరు తెచ్చుకున్నారు. అలా చరిత్రలోనూ కోట్లమంది హృదయాలలోను నిలిచిపోయిన వ్యక్తి ANR. సినీ నటులుగా ఒక కీర్తి ఆలా ఉంచితే, వ్యక్తిగానూ స్నేహపాత్రుడు. గొప్ప నిబద్ధత సంస్కారమూ గల వ్యక్తి.

సినీనటులు నటించినంత కాలము అభిమానం ఉంటుంది. ప్రేక్షకులు తర్వాత మరచిపోతారు సాధారణంగా.

కానీ మా విషయంలో వారు జీవించినంత కాలమూ మా మధ్య పరిచయం కొనసాగడం ఒక్క వారిపట్లనే సాధ్యమైంది. మావారు అక్కినేనికి అత్యంత అభిమానులు. అనుకోకుండా హైదరాబాదు బంధువుల ఇంట్లో పెళ్ళిలో వారిని ప్రత్యక్షంగా దగ్గరనుంచి చూసి పరిచయం చేసుకునే అవకాశం కలిగింది. అప్పుడు మావారు విజయవాడ కాలేజీలో లెక్చరరుగా పనిచేస్తూవున్నారు.

తరువాత కొంతకాలానికి కాలేజీ గర్ల్స్ హాస్టల్ ప్రారంభోత్సవానికి కాలేజీ యాజమాన్యం ANR గారిని ఆహ్వానించారు. మావారిని డైరెక్టర్ గారు పరిచయం చేసినప్పుడు వెంటనే గుర్తుపట్టి, ”ఓహో నా అభిమాని ఈ కాలేజీలో పనిచేస్తారా….” అంటూ పలకరించారు (అంతకుముందు కలిసినపుడు మావారు తాను లెక్చరరుగా పనిచేస్తున్న అని చెప్పలేదు). అంతే కాకుండా “మనం మళ్ళీ కలుద్దాం, ఐలాపురంలో వుంటాను. ఆదివారం హోటల్‌కి రండి….. రాగలరా?” అన్నారు. మావారి ఆనందానికి అంతేలేదు. నిజమో కలో నమ్మలేక పోయారు. కాస్సేపటికి తేరుకుని “అలాగే వస్తానండి….” అన్నారు. ఇంటికి రాగానే అక్కడ కాలేజీలో జరిగిన విషయాలు చెప్పేరు.

అంతటి గొప్ప వ్యక్త్తి మా అయనను గుర్తుపెట్టుకోడమేకాదు మళ్ళీ కలుద్దాం అన్నారు అంటే, నిజమే ఆ సంతోషం పట్టరానిది చెప్పలేనిది.

ఆదివారం నాడు మేమిద్దరం ముందుగా ఏ టైముకి రమ్మంటారని ఫోను చేసి అడిగి ఐలాపురం వెళ్ళాం. మామూలుగా పత్రికలకు సంబంధించిన వారిని తప్ప కలవరట. మేము వస్తామని రిసెప్షన్‍లో చెప్పి వుంచారట. వాళ్ళు ప్రత్యేకంగా కూడా వచ్చి రూము దగ్గిర విడిచి వెళ్లారు. ఆయన మా పట్ల అంత శ్రద్ధ తీసుకోవడం ఆశ్చర్యం కలిగించింది. కారణం చదువుకున్న వారిపట్ల వుండే సదభిప్రాయం. అభిమానుల పట్ల వారికీ ఉన్న గౌరవం. మేము గంట సేపు మాటాడి వారితో బాటు లంచ్ చేయడం గొప్ప అనుభూతి. ఆలా రెండవ సారి కలియడం జరిగింది. అప్పటినుంచి వారి బర్త్‌డే నాడు వుత్తరం రాయడం, గ్రీటింగ్స్ పంపడం చేసేవాళ్ళం. ఆయన వెంటనే జవాబు ఇచ్చేవారు. అలా వారితో పరిచయం స్నేహంగా మారింది.

ఆ తరువాత నాలుగేళ్లకు మాకు హైదరాబాదు షిఫ్ట్ అయ్యే అవకాశం వచ్చింది. ఆ అవకాశం నాకు 25 ఏళ్ల పాటు జీవితంలో ఒక అందమైన మలుపుకి దోహదం చేసింది. అందులో ఒకటి ANR గారితో అనుబంధము వారిని మరింత దగ్గిరచేస్తూ కొనసాగింది. అదెంతగా అంటే వారి మనవడు సుమంత్ పెళ్ళికి ఆహ్వానించడం; వారి పేరున ఇచ్చే అవార్డు ఫంక్షన్‌కి ప్రతి సంవత్సరం పిలవడం; వారి జన్మదినం రోజు విందుకి కుటుంబ సభ్యులతో పాటు మాకు ఒక అవకాశం….. ఇలా ఎన్నో. వారికీ అత్యున్నత పురస్కారం ‘పద్మ విభూషణ్’ వచ్చినపుడు ఇచ్చిన విందుకి ఎందరో అతిరథ మహారథులతో బాటు మమ్ములను కూడా ఆహ్వానించడం….. ఏమనాలో తెలియని వారి ఆత్మీయ స్నేహానికి అనిర్వచనీయమైన…. ఆదర్శవంతమైన అతి సామాన్యులమైన మాకు ఊహించని అపురూపమైన వరం అంతే! కొన్ని అనుభూతులకు అనుబంధాలకు మాటలు వుండవు. అవి తలుచుకుంటూ గుర్తు తెచ్చుకుంటూ ఆనందించడమే!

మాకు ఇంత మంచి మనిషి స్నేహితుడిగా ఉండటం కన్నా ఏమి కావాలి? అనుకున్నాం. ఇవే ఎన్నటికీ మరువరాని తలపులు. ముఖ్యంగా ANR గారి పుట్టినరోజు మాకెంతో ముఖ్యమైనది. వారికీ మా ఎన్నో పరిమళ జ్ఞాపకాల సుమాంజలి.

~

నాగేశ్వరరావు గారు నటించిన ‘భలేరాముడు’ సినిమాలో ఆయన కోసం పాడిన “ఓహో మేఘమాలా….” పాట చాలామంది ఇష్ట పడతారని అనుకుంటా. నాకు మరింతగా ఇష్టం. ఎందుకంటే ఇందులో నటించిన ANR , సావిత్రి నా అభిమాన నటులు ఐతే…. మా అన్న ఈ పాటని ఈలతో పాడేవాడు….. (వాడు చిన్న వయసులోనే బ్రెయిన్ హెమరీజితో చనిపోడం విషాదం). వాడికి నేను అంటే అభిమానం. నేను బాబాయి కూతురిని. మా ఇద్దరికీ 20 ఏళ్ళు తేడా.

అసలా దృశ్యం చిత్రీకరణ ఎంత అద్భుతం! వాటి విలువలే వేరు అనుకోండి.

మరో సంగతి! బాలూ గారు సాధారణంగా ఘంటసాల పాటను పాడరు. అది గౌరవంతో. ‘స్వరాభిషేకం’లో బాలూగారు ఒకసారి పాడారు. ఎంత బాగుందో…. ఎన్నిసార్లు వింటానో….

అవునండీ ఇవన్నీ ‘ఎన్నటికీ మరువరాని తలపులు’ కావూ….!

‘సంచిక’తో అవన్నీ మరోసారి గుర్తు చేసుకోడం నాకు ఆనంద దాయకం.

Exit mobile version