Site icon Sanchika

కాజాల్లాంటి బాజాలు-30: అవిడియా బాగుందా!

[box type=’note’ fontsize=’16’] ఉదయం లేస్తే చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఇంకొక్కసారి సంభ్రమాన్నీ కలిగిస్తున్నాయని, వాటిని అక్షరమాలికలుగా చేసి సంచిక పాఠకులకు అందిద్దామనే ఆలోచనే ఈ శీర్షికకు నాంది అంటున్నారు ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి. [/box]

ఇవాళ నా అవస్థ యేం చెప్పమంటారూ.. అవధరించండి..

నాకు వరసకు వదినయ్యే ఒకావిడ చెప్పా పెట్టకుండా వచ్చేస్తుంటుందనీ, వచ్చి హాల్లో కూర్చోక వంటింట్లో కొచ్చి అన్నీ సవరించేస్తుంటుందనీ, నాకు ఒళ్ళు మండిపోతున్నా కూడా ఉచిత సలహాలు కూడా ఇచ్చేస్తుంటుందనీ మీకు ఇదివరకే చెప్పేను కదా..

ఇవాళ ఆ వదినగారు మాకు మూడువీధుల అవతలున్న మా చుట్టాలింటికొచ్చిందన్న మాట. మామూలుగా అయితే చెప్పాపెట్టకుండా వచ్చేసును కానీ ఆవిడ నన్ను మా ఇంటిదగ్గర ఊరగాయకారం కొనమంది. అది కొన్నానో లేదో కనుక్కుందుకు ఫోన్ చేసింది. కొన్నాననగానే పదినిమిషాల్లో వచ్చి తీసుకుంటానంది. సరే నన్నాను.

అప్పటికి నా వంట చివరి అధ్యాయంలో వుంది. గబగబా వంటిల్లు, స్టౌ నీట్‍గా తుడిచేసుకున్నాను. ఇంక పచ్చడిలో పోపు వేసేస్తే పనయిపోతుంది. అదెంత పని.. రెణ్ణిమిషాలు..

ఎప్పుడూ ఆ వదినగారు వచ్చేటప్పటికి సగం సగం వంటలో ఉంటూ తడీపొడీగా అయిన నలిగిన చీరతో కనిపిస్తుంటాను. ఇవాళ వస్తున్నానని ముందే ఫోన్ చేసింది కనక గబగబా మొహం తొలిచేసుకుని, పోపువాసనలొచ్చే ఈ చీర మార్చేసుకోవచ్చనీ, నేను కూడా ఇంట్లో నీట్‍గానే వుంటాను అని చూపించుకోవచ్చనీ తెగ సంబరపడిపోయేను.

హు.. యేంలాభం.. టమోటాలు ఇంకా మగ్గనేలేదు. ముచిక దగ్గర ఇంకా పచ్చిగానే వున్నాయి. యేం చెయ్యడమా అని ఆలోచించేసి, వాటిని మిక్సీలో గ్రైండ్ చేసేస్తే మెత్తగా అయిపోతాయికదా అనుకుని, నా ఆలోచనకి నేనే మురిసిపోతూ, ఆ సగం వుడికిన టమోటాముక్కల్ని జార్‍లో వేద్దామనుకుంటే ఇంకా వేడిగా వున్నాయి. సరే.. అవి చల్లారేలోపల చీర మార్చేసుకుని, జుట్టు కాస్త పైపైన సద్దుకుని, మరీ బాగా రెడీ అయినట్టు కాకుండా మామూలుగా వున్నట్టు కనపడుతూ, వదినొచ్చేలోపు ఆ పోపు కాస్తా వేసేద్దామని టమోటాముక్కలు జార్‍లో వేసి, మిక్సీ ప్లగ్ పెట్టేను. అంతే..

“జూయ్” అన్న శబ్దంతో మిక్సీ ఆన్ అయిపోయి, జార్ మీద మూత గట్టిగా పెట్టకపోవడంవల్ల అది పైకి లేచిపోయి, టమోటా ముద్దలు ముద్దలుగా వంటిల్లంతా విసిరేసినట్టు పడిపోయింది. అది యెంత అందంగా పడిందంటే ఏ చిత్రకారుడూ అంత అందంగా చిత్రించలేడన్నమాట. స్టౌమీదా, ఆపక్కనున్న కుక్కర్‍మీదా, వెనక గోడమీదా, ఈ పక్కన వున్న బిందె మీదా, అప్పుడే మార్చుకున్న నా చీరమీదా, ఇంకా నేలమీదా.. “ఇందుగలడందులేడన్నట్టు..” పడిపోయింది.

ఒక్కసారిగా నా మైండ్ బ్లాంక్‍ అయిపోయింది. యేం చెయ్యాలో తోచలేదు. అవతల వదినొచ్చేస్తుంటుంది. ఈ వంటిల్లు కడుక్కుంటుంటే వదినొచ్చేస్తే..ఛీ..మరి ఇవన్నీ యెలా తుడవడం.. చుక్కలచీర కట్టుకున్నట్టు చీరంతా కూడా టమోటాచుక్కలు. ఆలోచించేను.. ఆలోచించేను.. హా అవిడియా అనుకున్నాను.

వెంటనే వంటింటి తలుపేసేసి గడియ పెట్టేసేను. చటుక్కున ఇంకో చీర హడావిడిగా చుట్టబెట్టేసుకుని, వదిన కిచ్చే ఊరగాయ కారం ఓ ప్లాస్టిక్‍కవర్లో పెట్టేసుకుని, సెల్‍ఫోనూ, పర్సూ చేతిలో పట్టేసుకుని, వీధిగుమ్మం తాళం పెట్టేసుకుని, ఇంటిముందు వదిన ఆటో దిగేటప్పటికి హడావిడిగా..”ఇదిగో వదినా నీ కారం, నీకోసవే చూస్తున్నాను. మా ఫ్రెండ్ హాస్పిటల్‍కి వెడుతున్నానూ.. అర్జంట్‍గా రమ్మంది. నన్ను సందుమొగన దింపెయ్యి..” అంటూ అదే ఆటోలో ఆవిణ్ణి మళ్ళీ మాట్లాడనీకుండా కూర్చోబెట్టేసి, సందుమొగన దిగిపోయి, ఆవిడ ఆ సందు మలుపు పూర్తిగా తిరగడం చూసాక, ఇంటికొచ్చి, అన్నీ తీరుబడిగా శుభ్రం చేసుకున్నాను.

అవిడియా బాగుందా!

Exit mobile version