Site icon Sanchika

అవిడియాలు అను చోర పురాణం

[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన పి.వి.ఆర్.శివకుమార్ గారి ‘అవిడియాలు అను చోర పురాణం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]పొ[/dropcap]ద్దుట్నించీ ఫాలాక్షుడి మనసేo బాలేదు. కారణం గత కొద్ది నెలలుగా వ్యాపారం బాలేదు. మార్కెట్ టైటయిపోయింది. క్యాష్ ఫ్లో బొత్తిగా మందగించింది. ఎవడి చేతిలోనూ కాసులు గలగలలాడటం లేదు. ఇదివరకు కనీసం నెల మొదట్లోనైనా నిండుగా ఉండే జేబులు ఇప్పుడు నిత్యమూ చిక్కిపోయే ఉంటున్నాయి. నోట్ల కట్టలు కలలోనో, మీడియాలో అవినీతి నిరోధక శాఖల వారి దాడుల తాలూకు ప్రసారాలలోనో తప్ప కనబడటం లేదు. ఇదివరకు కంటికింపుగా కదలాడిన కస్టమర్లు ఇప్పుడు కoటకింపుగా, శత్రుమూకల్లా కనిపిస్తున్నారు. ఎందరి వెంట పడినా శ్రమకి తగ్గ ఫలితం ఉండటం లేదు.

‘దేశాన్ని ఆధునికత వైపు నడుపుతున్నామంటూ సంతోషిస్తోంది తప్ప, తమ వంటి చిల్లర వృత్తి కళాకారుల జీవితాలని చీకట్లోకి నెడుతున్న విషయం ప్రభుత్వం గమనించటం లేదు. తమ వృత్తి ఎంత రిస్కుతో కూడుకున్నది అయినా, తమకి ఏ బీమా, సంక్షేమ పథకాలూ ఏ ప్రభుత్వమూ ప్రకటించదు. తమ వోట్లు మాత్రం ప్రతి పార్టీ కోరుకుంటుంది. అలాగని, బయటపడి సహాయం చేయమని, వాళ్ళని నిలదీసి అడగటానికి కూడా వెసులుబాటు లేని జీవితాలు తమవి! రెండుచేతులా కష్టపడినా, ఒక్క చెయ్యి నోట్లోకి పోవటం గగనంగా ఉంటోంది. రోజులు ఇలాగే సాగితే, తమ వృత్తివిద్యకి నీళ్ళు వదులుకోవలసిందేనా? దేశంలో అంతరించిపోతున్న రాబందుల్లా తాముకూడా అంతరించిపోక తప్పదా?’

చింతాక్రాంతుడై, ఆలోచనలతో సతమతమైపోతున్న ఫాలాక్షుడు చివరి ఊహతో మరింత డీలా పడిపోయాడు.

‘ఈ వృత్తి తప్ప తమకి ఇంకే పనీ రాదే! ఇది కిట్టుబాటు కాకపోతే, ఇంక బతకటం ఎలాగా?’

కంగారుగా, పక్కనే కొద్ది దూరంలో కూర్చుని ఉన్న పార్ట్‌నర్ కేసి చూశాడు.

కొద్ది దూరంలో కూర్చున్న పార్ట్‌నర్, ఫాలాక్షుడి చింత తనకేమి పట్టనట్టు తీరిగ్గా ఏదో పత్రిక తిరగేస్తున్నాడు. అది చూసి, చిర్రెత్తి అరిచాడు ఫాలాక్షుడు,

“ఏం చేస్తున్నావురా తింగరోడా! పొద్దుటినుంచి కస్టపడి, పదారు పరుసులు కొట్టుకొచ్చాo. అన్నిట్లో కలిపి వంద రూపాయలైనా దొరకలేదు. రేపటి సంగతి తెలవదు. ఈ కార్డు పేమెంట్లూ, పేటియములూ, గూగులు పే లూ వచ్చి, మన బుర్రని పేలు కొరికినట్టు గొరిగేస్తూ, బొత్తిగా బిజినెస్ లేకుండా చేసేశాయి. ఎవడి జేబు కొట్టినా, ప్లాస్టిక్ కార్డులే తప్ప పట్టున పది రూపాయలు దొరకటం లేదు. రాబడి పడిపోతోందే అని నేనేడుస్తుంటే, కొత్త యాపార పథకాలు ఆలోచించేది మాని, పెద్ద సాహితీపరుడి లాగా, పత్రిక చదువుతూ కూర్చొన్నావా!”

తింగరోడు తలెత్తి, బిగినెస్ పార్ట్‌నర్ వైపు చూశాడు.

“అదే ఆలోసిత్తన్నానన్నా! రాను రాను ఈ జేబులు కొట్టే యాపారం పాత పరుసులు అమ్మే దుకాణం పెట్టుకోవటానికి తప్ప, మరెందుకూ పనికి వచ్చేటట్టు కనబడటం లేదు. కాస్త పెద్ద దొంగతనాలు ప్రాక్టీసు చేసే లోగా, పార్ట్ టైమ్ బిగినెస్‌గా ఈ పత్రికలోళ్ల కతల పోటీలకి కతలు రాసుకున్నా పదో, పాతికో దొరుకుద్ది కదా అని సూత్తన్నా.”

ఏడుపు మూడ్ లోంచే నవ్వాడు ఫాలాక్షుడు,

“ఎవుడ్రా నీకు సెప్పింది, పత్రికల్లో కతలు రాస్తే డబ్బులొస్తాయని?”

ఉడుక్కున్నాడు తింగరోడు. వాడు ఇంటర్ పాస్. న్యూస్ పేపర్లే కాక, పత్రికలు కూడా, కొట్టేసి మరీ చదువుతాడు. చోర కళ మీద పత్రికలకి కొన్ని ఆర్టికల్స్ కూడా రాసిన అనుభవం ఉంది. (ఆ ఆర్టికల్స్‌కి అచ్చుమొహం చూసే యోగం పట్టకపోవటం ఆయా సంపాదకులకి చోరకళ మీద ఉన్న చిన్న చూపే తప్ప, వాడి తప్పు కాదు.)

ఫాలాక్షుడు హైస్కూలు గడప తొక్కలేదు. అందుకే, తింగరోడి దృష్టిలో అతడో నిరక్షర కుక్షి.

“నీకు తెలవదులేన్నా, మన పక్క ఈధి ‘ఇంజామర’ని సూడు, అదాడి కలం పేరులే, ఇట్టా నవల రాత్తాడు, అట్టా లచ్చ పడతాడు. ఇట్టా కత రాత్తాడు, అట్టా పదేలు పడతాడు. రాసేవోడుంటే, ఏసే పత్రికలూ ఉన్నాయి, అయిచ్చే బగుమతులూ ఉన్నాయి. ఈ చీకటి కస్టం కంటే, పత్రికలో ఎలుగు సూడ్డమే తేలిక గదన్నా.”

“ఆడికి దేముడిచ్చిన బుర్ర ఉందిరా, మన ఇద్దరికీ కలిపినా నాలుగు సేతులు తప్ప ఏమున్నాయి?”

“ఆడికి దేముడిచ్చిన బుర్ర మనం తెచ్చేసుగుందాం. ఈ పత్రికోళ్ళు కొత్త కతల పోటీ ఎట్టారు. పాతిక ఏల ప్రైజు. ఆ ఇంజామర ఎలాగూ ఓ కత రాసేసి ఉంటాడు. ఈ రేత్రికి ఎల్లి, ఆ కత మన తెచ్చేసుకుని, పత్రిక్కి పంపేద్దాం. పాతిక ఏలు పట్టేద్దాం.”

తింగరోడి ఆలోచన తింగరగానే తోచింది ఫాలాక్షుడికి. అయితే, అంతకన్నా మెరుగైన ఆలోచన రెడీమేడ్‌గా ఏది తట్టలేదు. మరో అవిడియా ఏదీ తయారుగా లేకపోవడాన, అయిష్టంగానే అయినా, తింగరోడి అవిడియానే ఒప్పుకునేశాడు.

జేబులు కొట్టే చిల్లర వృత్తి నుంచి, ప్రమోషన్ తీసుకుని, దొంగతనాలకి దిగటం ఇదే ఆరంభం.

ఆ రాత్రే ఇద్దరూ పక్కింటి గేటు ఎక్కి, వణుకుతున్న కాళ్ళని బుజ్జగించి కాంపౌండ్ లోకి దూకారు. పాతకాలపు పద్ధతే అయినా, సాంప్రదాయ బద్ధంగా ఉంటుందని ఇంటి గోడకి కన్నం వేశారు. మెల్లగా లోపలికి దూరారు. ముహూర్తం మంచిది. తంతే బూరెల బుట్టలో పడ్డట్టు, నేరుగా డ్రాయింగ్ రూమ్ లోకే దారితీసింది ఆ చోర మార్గం. సెల్ ఫోనులో టార్చ్ వేసుకుని, అడుగులో అడుగు వేసుకుని, అక్కడున్న టేబుల్ చేరుకుని, దాని సొరుగు లాగాడు తింగరోడు. అందులో కనబడిందొక డైరీ లాంటి నోట్ బుక్. దానిమీద, ‘ఇతివృత్తాలు-సారాంశాలు’ అని వుంది.

“ఇదిగిందులో ఉంటాయి కతలు. పట్టుకుపోదాం.” అన్నాడు.

ఇంతలో ఆ డ్రాయర్ లోనే కనబడింది, అయిదొందల నోట్ల కట్ట. ఆత్రంగా దాన్ని, బయటకు తీసి లెక్క పెట్టాడు ఫాలాక్షుడు. ఇరవై రెండు వేలు ఉన్నాయి.

“ఆహా.. మనకింక డొంకతిరుగుడు అవసరం లేదు. కతా వొద్దు, గితా వొద్దు, నేరుగా నచ్చిందేవే కరుణించేసింది. పద, పద..” అంటూ, తింగరోడి చెయ్యి పట్టి లాగాడు.

తింగరోడి చేతి లోని పుస్తకం కింద పడిపోయింది. ఆ ఊపుకి టేబుల్ సొరుగు పూర్తిగా బయటకు వచ్చి, పెద్ద శబ్దంతో వాడి కాలిమీద పడింది.

“సచ్చాను” అంటూ తింగరోడు పెట్టిన కేకకి బెడ్ రూమ్‌లో పడుకుని, నిద్ర లో ‘కథ’ గంటున్న ‘వింజామర’కి మెలకువొచ్చేసింది. చటుక్కున లేచి, డ్రాయింగ్ రూమ్ లోకి వచ్చాడు. క్రింద పడ్డ సొరుగు మీదా, ఆ వెంటనే ఫాలాక్షుడి చేతిలోని డబ్బుకట్ట మీదా పడింది అతడి దృష్టి.

వింజామరని చూస్తూనే, డబ్బు కట్ట విసిరేసి, బయటకు పరుగెట్టాడు ఫాలాక్షుడు. కిందపడ్డ తింగరోడు, వింజామర చేతికి చిక్కాడు.

“ఎబ్బే, డబ్బు కాదు. అవిడియాల కోసం వచ్చాం – బగుమతి దొరికింది. అంతే..” తడబడుతూ చెప్పాడు తింగరోడు.

వాడేమన్నాడో ఆవగింజంతైనా అర్థం కాక అయోమయంగా చూశాడు ‘వింజామర’.

అతడు అయోమయంలో పడ్డ క్షణాలని సద్వినియోగం చేసుకుంటూ, ఊరకుక్కలాగా అతడి చేతిని కొరికి, వేట కుక్కలాగా గోడకి పెట్టిన కన్నం లోనుంచే బయటికి దూసుకుపోయాడు తింగరోడు.

“సచ్చాను” అంటూ పిచ్చికుక్కలాగా అరవడం ఇప్పుడు ‘విoజామర’ వంతైంది.

పళ్ళు దిగిన చేతిమీద మూతితో గాలి ఊదుకుంటూ వంగి, కిందపడ్డ డబ్బు ఏరుకుంటుండగా అతగాడి కంట బడింది, కిందపడి ఉన్న నోట్ బుక్.

‘యదవలు. ఇది పట్టుకుపోయారు కాదు, బోలెడు ‘ఇతివృత్తాలు, పాయింట్లు’ మిస్సయి పోయేవి. మళ్ళీ మళ్ళీ ఆ ఇంగ్లీష్ నవలలన్నీ చదవలేక చచ్చేవాడిని.’ అనుకుంటూ, నోట్ బుక్ తీసుకుని కళ్ళ కద్దుకున్నాడు.

“లచ్చిందేవి చంచలం గానీ, సరస్పతీ దేవి అలాక్కాదురా, మనకి అంత తేలిగ్గా చిక్కదు. ఇంకెప్పుడూ ఇలాటి పనికిమాలిన సలాలు చెప్పమాకు.”

అనేశాడు ఫాలాక్షుడు ఇంటికి తిరిగొచ్చాక, తింగరోడి మీద మండిపడుతూ.

Exit mobile version