[శ్రీ గోపగాని రవీందర్ రచించిన ‘అవిశ్రాంత జీవనయానంలో..!’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]అ[/dropcap]ప్పుడప్పుడు ఏవేవో
విడువని జ్ఞాపకాలు కొన్ని
గాయల్లా సల్పుతుంటాయి
అనంతమైన ఆకాశాన్ని
ఆక్రమించిన మేఘల్లా
దిగులు నీడలు కమ్ముకొని
వేటగాడిలా వెంటాడుతుంటాయి
ఏది ఏమైనా సరే
ఆచితూచి వ్యవహరించాలని
పగడ్బందీగా యోచించినా సరే
అభిప్రాయాలు మారుతూనే ఉంటాయి..!
కలవరపాటుల జల్లులు
కురిసినప్పుడల్లా
ఒళ్లంతా తిమ్మిరెక్కిపోతుంది
గాలి వీచినప్పుడల్లా
చెట్ల కొమ్మల ఆకులు
ఒళ్ళు విరుచుకున్నట్లుంటుంది
ఉత్తేజకరమైన పలుకులు
విన్నప్పుడల్లా మనసంతా
తన్మయత్వంతో పులకరిస్తుంది..!
పసికట్టే వాళ్ళు మనతో
నడుస్తూనే వుంటారు
పెత్తనం చేసేవాళ్ళు
నిఘా నేత్రాలతో గమనిస్తూనే ఉంటారు
కుతంత్రాలతో అన్వేషించే వాళ్ళు
తమను తాము మరిచిపోతూ ఉంటారు
ఈ ముప్పేట దాడులను ఎదుర్కోవడానికి
ప్రతి నిత్యం అప్రమత్తతోనే వుండాలి..!
ఎలాంటి హెచ్చరికలు లేకుండానే
పొద్దు కనుమరుగవుతుంది
ఆదేశాలెవ్వరు జారీ చేయకుండానే
నల్లని రాత్రి అలుముకుంటుంది
ఒక రోజు కనమరుగవుతూ
నూతన అధ్యాయానికి ఆలంబనమౌతూ
కొత్త చిగుళ్ళకు పట్టాభిషేకమౌతుంది..!
అంతరంగంలో గూడు కట్టుకున్న
మాటల ముల్లెను విప్పుకోడమే కావాలిప్పుడు
విభిన్నమైన పాత్రల్లో మునుగుతుంటేనే కదా
ఫలవంతమైన అనుభూతికి లోనవుతాము
అవిశ్రాంత సంక్లిష్టమైన జీవన యానంలో
పదునెక్కిన ఆలోచనలతోనే
అనంతమైన జ్ఞాన సుమాలు వికసిస్తాయి
ఇక్కట్ల ముళ్ళ బాటలెన్ని గుచ్చుకున్నా కానీ
నిర్భయంగా సాగిపోవడమే కావాలెప్పుడూ..!