[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన పొత్తూరి సీతారామరాజు గారి ‘అవ్యక్త గాయం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]సా[/dropcap]యంకాలమైంది.. బహుశా వేసవికాలం వలన తొందరగా.. ఇంకా చీకటి ముసురుకోలేదు. స్టేషన్‌లో రైలు దిగేసరికి ఆరు అవుతుంది. మిత్రుడు ప్రభుని రమ్మని ఫోన్ చేసాను. వస్తాను అన్నాడు. ఇంకా రాలేదు. ఎందువల్ల ఆలస్యం జరిగిందని మళ్ళీ కాల్ చేసాను. “స్కూల్లో ఎగ్‌స్ట్రా క్లాస్ తీసుకున్నాను. పిల్లలకు సిలబస్ అవ్వక.. సారీ..” అని, “నీవు సరాసరి ఇంటికి వచ్చేయ్. అడ్రస్ ఆటోవాడికి చెప్పు. గాంధీనగర్ గాంధీ బొమ్మ దగ్గర దింపమను. తూర్పు వైపు వీధిలోకి సరాసరి నడిచి వచ్చేయ్.. చివరన కనిపించే గులాబీ రంగు బిల్డింగ్ మనదే.. అక్కడకు వచ్చి ఎవర్ని అడిగినా చెపుతారు.. మన ఇల్లు. స్నానం చేసి నీవు రెస్ట్ తీసుకో.. ఈలోపుగా నేను వచ్చేస్తాను.”
ఎప్పుడో వచ్చాను ఇక్కడకు. బహుశా పది సంవత్సరాలయి ఉంటుందనుకుంటున్నాను. మళ్ళీ ఇంత కాలానికి.. ఇదే రావడం. నేనూ ప్రభూ ఒకే కాలేజీలో చదువుకున్నాం.. అతనికి ఇక్కడే టీచరుగా ఉద్యోగం వచ్చింది. పి.ఆర్. స్కూల్‌లో పనిచేస్తున్నాడు. నాకు ఢిల్లీలో ఉద్యోగం వచ్చింది. నాకు ఇంకా పెళ్లి కాలేదు. ప్రభుకు మాత్రం పెళ్ళయి రెండు సంవత్సరాలయింది. ఒక పాప.. ఆరు మాసాలయిందనుకుంటాను. నాతో రోజుకి ఒక్కసారయినా ఫోన్లో మాట్లాడతాడు. చాలా మంచివాడు. అభ్యుదయవాది.. ఇక్కడ అతనికి మంచి పేరుంది. కవిత్వం.. కథలు రాస్తుంటాడేమో.. అప్పుడప్పుడు పత్రికలలో చూస్తుంటాను. మనిషి మితభాషి. ఎక్కువ మాట్లాడడు. నేను మాత్రం ఎక్కువ మాట్లాడతాననే చెప్పాలి. ప్రతి విషయాన్ని చదివిన తరువాత ప్రభు లాంటి మంచి మిత్రునితో కలసి పంచుకుంటాను. వాటి లోతులు తెలుసుకుంటాను.
ఆలోచిస్తూనే ఆటో ఎక్కి ఎడ్రస్ చెప్పాను. దారిలో పరిసరాలన్నీ మారిపోయాయి. కాకినాడకు ఫేమస్ సుబ్బయ్య హోటల్ దారిలో తగిలింది. ఏమీ మారలేదు. అలాగే చిన్న మేడకింద సందులోనే దేశంలో అన్ని ప్రాంతాల వారికీ భోజనం పెడుతున్నారు. ఎవరొచ్చినా ఇక్కడ భోజనం చేసి వెళ్లాల్సిందే, అంత రుచికరంగా ఉంటుంది. ‘వీలుంటే రేపు మధ్యాహ్నం భోజనానికి ఇక్కడకు రావాలి’ అనుకున్నాను.
“సార్ .. గాంధీబొమ్మ వచ్చింది.” అంటూ ఆటో డ్రైవర్ అన్నాడు. “అప్పుడే వచ్చేసిందా. ఎప్పుడో చూసిన మారిపోయిన ఆనవాళ్ళ జ్ఞాపకాలు దూరాన్ని మరిపించాయి.” అంటూ ఆటో దిగి డబ్బులిచ్చి, బేగ్ తీసుకుని బయలుదేరాను.
అప్పుడే వీధిలైట్లు వేసారు.. ఇబ్బంది లేకుండా ప్రభు చెప్పిన తూర్పు రోడ్డు నాకు స్వాగతం పలికింది. నడుస్తున్నాను. నాకు ఏదో కొత్తగా ఉంది ఇక్కడకు రావడం.. చాలా కాలమయిన తరువాత ఇలాగే ఉంటుందేమో.. నాకు పరిసరాలను పరిశీలిస్తూ నడవడం అలవాటు..
అలా నడుస్తూనే ఒకచోట ఆగాను.. దారిలో ఒక శిథిల భవంతి.. చాలా విశాలంగా ఉంది. శతాబ్దాల చరిత్ర కలిగిన ఆ పురాతన భవనం నన్ను అబ్బురపరిచింది. అక్కడక్కడ పిచ్చిమొక్కలు మొలిచి ఉన్నాయి. లోపలి ఎత్తైన గోడలకు పెచ్చులూడి వాటి రంగులపై వర్షపు నీరు జారిన ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. అక్కడక్కడా జారిన ఇటుకల మధ్య రావి మొక్కలు మొలిచి ఉన్నాయి. అలా కాసేపు ఆగిపోయాను. ఒకప్పుడు ఎన్నో అందాలతో ఎంతమందో పరివారంతో సంచరించే నాటి రాజుల కాలం నాటి భవనం నా మదిలో మెదిలింది. మనిషికైనా భవనానికైనా భోగం కొన్నాళ్లే.. ఈ రెండూ ఏనాటికైనా కాలగర్భంలో కలవాల్సిందే.. ఆనాడు వేసిన వీధి దీపపుస్తంభం ఇంకా అలాగే ఉంది. అటు ఇటు నడిచే మనుషులకు దారి చూపిస్తుందని ఎవరో దాతలు బాగు చేసుంటారు. చాలా అందంగా ఇంకా ఆనాటి కంటే బాగా వెలుగునిస్తుంది. దాని పక్కనే ఓ పెద్ద పారిజాతం చెట్టు. పరిమళం గుప్పుమని కొట్టింది. ఆగిపోయాను.. అడుగులు పడటం లేదు. ముందుకు శరీరం కదలనంటుంది. రెండు కళ్ళు నా వైపు తదేకంగా చూస్తున్నాయి. నా గుండె జల్లుమంది. ఎందుకోసమో.. ఎవరి కోసమో.. అనుకున్నాను. అటు ఇటు చూసాను.. ఎవరూ లేరు. నాకు సిగ్గుతో భయం వేసింది. మనసు వెళ్లమని చెబుతుంది. మనిషిని కదల్లేక పోతున్నాను. భారంగా అడుగులు ఆమె వైపు వేసాను దగ్గరగా ఆ కళ్ళలోకి చూసాను. ఎందుకలా నిలబడిందో నాకప్పుడర్థమయింది. ఆమె సౌందర్యం పారిజాత సువాసనను మరిపిస్తుంది. ఇంకా పెళ్లి కాలేదని మెడలో ఒంటరిగా వేలాడుతున్న ముత్యాలదండ చెబుతుంది. ఇంకా దగ్గరగా వెళ్ళాను. దూరంగా ఒక పక్కకు ఒరిగిపోయిన సిమెంటు బెంచీ వైపుకు దారి చూపించింది. నేను అటువైపు నడిచాను.. నేను ఏదో లోకంలో ఉన్నట్లు భ్రమలో ఉన్నాను. ఇప్పటి వరకూ ఇంత సౌందర్యాన్ని చూడలేదు. నాకు నోటిలోనుండి మాటలు రావడం లేదు.
“అలా నిలబడిపోయారేం కూర్చోండి ఎక్కడనుండి వస్తున్నారు” అంది.
బలవంతాన నోరు పెగల్చుకుని, “ఢిల్లీ నుండి” అన్నాను.
“అలా నిలబడిపోయారే కూర్చోండి” అని మళ్లీ అంది. ఇక తప్పదన్నట్లు కూర్చున్నాను.
“మీ పేరు..”
“మహీధర్..”
“ఏం చేస్తుంటారు..?”
“భూమి లోపల ఏమి ఉంటాయో తెలుసుకునే ఉద్యోగం.”
“అంటే..” అంది అర్థం కానట్లు.
“ఆర్కియాలజీ డిపార్ట్మెంట్..”
“అయితే మీకు చాలా విషయాలు తెలిసుంటాయి.”
“మీ పేరు..” అన్నాను. ఎందుకో ఆమెను చూడగానే గౌరవించాలని అన్పించింది.
“మల్లిక..” అంటూ చిరునవ్వు నవ్వింది.
“ఎందుకు నవ్వుతున్నారు..” అన్నాను.
“పారిజాతం పూలమీద కూర్చున్నాను. అందుకని ఇక్కడ పూలు గాలిలో సుగంధాలు వెదజల్లుతాయి. ముళ్ళు గుచ్చుకున్న కాళ్ళతో పూరేకులపై నిలబడి ఉన్నాను కదా, అందుకని నవ్వొచ్చింది.”
“మీ మాటలు విచిత్రంగా ఉన్నాయే..” అన్నాను.
“చేదు గతం గుండెకు ముల్లె గుచ్చుకుంటే ఇలానే మాట్లాడతారు”
“మీకు పెళ్ళయిందా..” అంది మల్లిక.
“లేదు..” అన్నాను.
“ఎందుకు ఇంతకాలం చేసుకోలేదు..” అంది.
“నచ్చిన అమ్మాయి దొరక్క..” అన్నాను.
“ఆడపిల్లలు దొరకరు.. వెతుక్కోవాలి.” అంది చాలా మృదువుగా.
“నేను దేన్నీ అన్వేషించను. నాకు ఆ సమయంలో ఏది దొరికితే అదే తింటాను. నా హృదయం స్పందించినప్పుడు నా కాళ్ళు వాటికవే ఆగిపోతాయి.. మనస్సు మూగపోతుంది. ఎవరైతే నన్ను అర్థం చేసుకుంటారో వారిని పెళ్లాడాలనుకుంటున్నాను.”
“బాగుంది మహీధర్ గారు.. మీరు చెప్పింది.” అంటూ ఆకాశంలోకి చూసింది. మేఘాలు కురవబోతున్న చినుకుల వానను ఇక ఆపలేము.. అన్నట్లు.. సన్నని వర్షపు జల్లు మొదలయింది.
“రండి.. లోపల కూర్చుందాము.. వర్షం తగ్గిన తరువాత బయలుదేరవచ్చు” అంటూ లోపలికి తీసుకెళ్ళింది. లోపల పాతకాలం నాటి మంచం.. ఎప్పటిదో రంగులు వెలిసిపోయిన చెక్కతో చేసిన పాత బీరువా.. తిరిగీ తిరగనట్లుండే ఒక ఫ్యాను.. దూరంగా పాత బీరువాలో పెద్ద పెద్ద న్యాయశాస్త్రానికి సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి. పూర్వకాలంలో పల్లెలలో వాడే వస్తువులు కూడా అక్కడక్కడా కనిపిస్తున్నాయి.
“ఇక్కడ మీరు ఒక్కరే ఉంటున్నారా?” అన్నాను.
“ఔను మహీగారు, నేను ఒక్కదాన్నే ఉంటున్నాను.”
“మీకు భయం వేయడం లేదా?” అన్నాను.
“చాలా కాలం నుండి నేనొక్కదాన్నే ఉంటున్నాను. లోపలికెవరూ రారు.” అని,
“అయ్యో మాటల్లో పడి మర్చిపోయాను. మీకు కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు. వంట చేస్తాను. భోంచేస్తారా?” అంది.
“లేదు మల్లిక గారూ. నా మిత్రుడు ప్రభు ఇల్లు ఇక్కడే. వెళ్ళిపోతాను. సారీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేను. అయ్యో.. అప్పుడే తొమ్మిదయింది.” సైలెంట్‌లో పెట్టిన ఫోన్ తీసిచూసాను. ప్రభు మిస్డ్ కాల్స్ చాలా ఉన్నాయి. “నేను బయలుదేరతాను..” అని చెప్పి బయటకు అడుగులు వేసాను.
“రేపోసారి ఇదే సమయానికి రాగలరా..” అంది ముఖం బేలగా పెట్టి.
“ఆఁ.. తప్పక వస్తాను.”
“మర్చిపోకండి మరి..” అంటూ నిశ్శబ్దంగా నడచుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది.
***
జరిగిందంతా చెబితే పడిపడి నవ్వాడు ప్రభు.. “ఏమయిపోయావు అని కంగారుపడ్డాను. కాల్ ఎత్తడం లేదు.. ఏమయిందోనని..” అన్నాడు.
భోజనాలయ్యాయి. మేమిద్దరం మేడ మీద గెస్ట్ రూమ్‍లో కూర్చుని మాట్లాడుకుంటున్నాం. ప్రభు భార్య సౌజన్యను, చిన్నారి పాపను పరిచయం చేసాడు. చాలా సంతోషంగా ఆమె స్వాగత సత్కారం నాకు లభించింది.. మంచి గృహిణి, చక్కటి భార్య దొరికింది ప్రభుకని నా మనస్సు ఆనందించింది.
“మహీ .. రేపు నీ ప్రోగ్రామ్ ఏమిటి” అన్నాడు ప్రభు.
“నేను పిఠాపురం దగ్గరలో చదలాడ తిరపతి అని ప్రముఖ పుణ్యక్షేత్రముందట.. శృంగార వల్లభస్వామి.. ఆ గుడి మీద శిలా శాసనాలు ఉన్నాయి.. వాటిని పరిశోధించడానికి వచ్చాను. రేపు నాకు అది చాలా ముఖ్యమైన పని.”
“అయితే మనం సాయంకాలం కలుస్తామన్న మాట..” అన్నాడు ప్రభు.
“అవును నీవు ఆ పుణ్యక్షేత్రాన్ని దర్శించలేదా..” అన్నాను.
“లేదు.. వెళ్ళలేకపోయాను.. నేనూ విన్నాను ఆ గుడి గురించి చాలా వింతలు, విశేషాలు..”
“ఏమిటో నీకు తెలిసిన ఒక విశేషం నాకు చెప్పు..” అడిగాను ఆసక్తిగా.
“ఆ గుడి లోపల స్వయంభూ విగ్రహం.. చాలా వేల సంవత్సరాల నాటిదని.. ఇంగ్లాండ్ రాణి.. ఒక ఇంజనీర్‍ను పంపిందట.. ఆ విగ్రహాన్ని పరిశీలించి.. దాని కొలతలు దూరం నుండి తీసుకుని రమ్మని అతను అలాగే చేశాడు. ఎందుకో రాణి గారికి ఇంజనీరు మాటల మీద నమ్మకం లేక మరొకరిని పంపించింది. ముందు తీసుకున్న ఆ విగ్రహం కొలతలు.. ఆరు అడుగులు అయితే.. ఇప్పుడు ఏడు అడుగులు అని తేలింది. ఆశ్చర్య పోయి ఆమే స్వయంగా ఇండియా వచ్చిందట.. విగ్రహాన్ని చూసి ఆమె షాకయింది. తను ఎంత పొడవుందో.. అంతే ఎత్తులో ఆ దివ్యస్వరూపం దర్శనమిచ్చింది. అంటే ఏ మనిషి ఏ ఎత్తులో ఉంటే ఆ స్వామి అంత ఎత్తులోనూ మనకు కనిపిస్తారు. ఇదీ ఆ క్షేత్రం యొక్క మహిమ. ఇక చాలా.. ఈ వివరాలు.. ఇంకా ఏమైనా కావాలా” అన్నాడు ప్రభు.
“చాలా గొప్ప సమాచారమిచ్చావు. మిత్రమా..” అన్నాను.
“ఇక పడుకుందాం..” అని కిందకు వెళ్లిపోయాడు ప్రభు.
***
“చెప్పిన సమయానికే వచ్చారే..” అంది మల్లిక.
“అవును.. ఈ రోజు మిమ్మల్ని కలిసి రేపు ఉదయమే బయల్దేరాలి.. అందుకనే తొందరగా వచ్చాను.”
“ఇంకోరోజు ఉండటానికి వీలుకాదా.. ఉండొచ్చుగా..” అంటూ ప్రేమగా అడిగింది మల్లిక.
“లేదు, వెళ్ళాలి తప్పదు మల్లిక గారూ. మా ఆఫీసులో రిపోర్ట్ చేయాల్సినవి కొన్ని ఉన్నాయి. అందుకే ఉండటానికి వీలవడం లేదు. ఏమిటీ మీరు అదోలా ఉన్నారు నీరసంగా..” అన్నాను.
“చిన్నతనం నుండీ అందినవన్నీ చేజారిపోతున్నాయి. ఇది నా దురదృష్టమేమో బహుశా” అని నిరాశగా అంటూ కాఫీ కలిపి ఇచ్చింది.
“బాధపడకండి.. మల్లిక గారూ.. బాధలు చీకటిరాత్రుల్లాంటివి. వాటికి ఉషోదయమనే అనే ఆశను కలిగిస్తూ వెలుగు అనే ధైర్యాన్ని నింపుకోవాలి. మళ్లీ నన్ను ఎందుకు రమ్మన్నారు. మిమ్మల్నో ప్రశ్న అడగవచ్చా.. ఏమీ అనుకోకపోతే సుమా..” అన్నాను సంకోచంగా.
“ఫరవాలేదు.. అడగండి” అంది మల్లిక.
“ఉన్న ఈ రెండు రోజుల్లో నేను మిమ్మల్ని చాలాసార్లు గమనించాను. మనుషులు నడిచే దారి వైపు.. ఎవరూ లేని ఆకాశం వైపు చూస్తూ ఎందుకు నిలబడతారు..”
బాధగా నవ్వింది. “వాకిట్లో పారిజాతం పువ్వు ఎగురుతూ.. వర్షపు నీటిలో కొట్టుకుపోతుంది. అది అలా ఎక్కడికి పోతుందో.. చూశారా దృశ్యాన్ని..” అంది.
“చూసాను..”
“జీవితం కూడా అలానే సాగిపోతుంది.”
“మీరు మాట్లాడుతుంటే ఒకోసారి ప్రకృతి సమాధానం చెబుతుంది. మొన్న మిమ్మల్ని కలిసినపుడు మధురమైన శబ్దాలు వినిపించేవి.. మీరు ఒక్కో మాట ఒత్తి పలుకుతుంటే.. పక్షుల కుహకుహలు.. గుడిలో గంటల శబ్దాలు.. నేను ఆరోజు ఆశ్చర్యపోయాను. మళ్ళీ ఈ రోజు స్వయంగా చూస్తున్నాను. మల్లిక గారు మీరు మాట్లాడుతున్నప్పుడు ఆ ధ్వనికి ప్రతిధ్వని కలిసి సమాధానమిస్తుంది.”
“ఏమోనండి.. నాకయితే మనసులో అన్పించినదే చెబుతాను. అది మీరు తిరిగి ప్రకృతి స్పందనల్లో చూసుంటారు.”
“మల్లిక గారూ.. నేను అడిగిన ప్రశ్న అదే.. శూన్యం లోకి చూస్తున్న మీ కళ్ళు దేని కోసమని..”
“బాధపడరుగా! మరి.. నేను అంతా చెప్పిన తరువాత..”
“నాకు తిరిగి చెప్పడానికి వీల్లేని బాధయితే.. మౌనంగా నడిచి వెళ్ళిపోతాను.” అన్నాను.
“నా బాల్యం, చదువు ఇక్కడే పూర్తయింది. అమ్మ చిన్నతనంలోనే పోయింది. నాన్నగారు.. ప్రముఖ న్యాయవాది అంకాల రాజుగారు.. ఈ చుట్టుప్రక్కల గ్రామాల్లో ఆయనకు చాలా పలుకుబడి, పరపతి ఉండేవి. ఆయన దగ్గర వైభవ్ జూనియర్‍గా జాయిన్ అయ్యాడు. నేను వైభవ్ ప్రేమించుకున్నాము. నాన్నకు తెలిసింది. మా ఇద్దరి ప్రేమకు ఏనాడూ అడ్డు చెప్పలేదు. మంచివాడు – చదువుకున్న యోగ్యుడు. ఇంతకంటే బుద్ధిమంతుణ్ణి మళ్లీ నేను ఎక్కడని వెతకను అని వైభవ్‌ని పిల్చి మీ ఇద్దరి పెళ్లికీ సమ్మతమేనని ఆయన చాలా ఆనందంతో నీవు ఇక్కడే పెళ్లి చేసుకుని ప్రాక్టీస్ కూడా పెట్టుకో అన్నారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన వైభవ్ ఆ మాటలకెంతో సంతోషించాడు. ఇంతకాలం అనాథాశ్రమం నాకు విద్య, గురువు, దైవం అయితే ఇప్పటినుండి మీరే నాకు దైవం అని నాన్న కాళ్ళకు నమస్కరించాడు. ఇద్దరం సంతోషంతో రాబోయే జీవితాన్ని ఊహించుకుని ఎన్నో కలలు కన్నాము. ఇది జరిగిన రెండు నెలల తరువాత మద్రాస్ కోర్టులో ఏదో కేసుందని వెళ్ళాడు. వారంలో తిరిగొస్తానని.. నెలలు, సంవత్సరాలు గడిచిపోయాయి. అతను మాత్రం తిరిగి రాలేదు. ఎవరితో చెప్పుకోను నా బాధను.. గుండెను అదిమిపెట్టుకుని అలానే ఉన్నాను. మాతో ఇక్కడే ఉంటూ మాలో విడదీయరాని బంధంగా మారిపోయి దూరమవడంతో చాలా కాలం మనిషిని కాలేకపోయాను. నాన్న నాకు చాలా సంబంధాలు చూసారు. కొంతకాలం ఆగుదాము నాన్నా అనేదాన్ని. కాలం మనకోసం ఆగదుగా. ఒకరోజు నాన్న హఠాత్తుగా నన్నొదిలి వెళ్లిపోయారు. మబ్బులు కమ్మిన ఆకాశంలా ఆరోజు నుండి దగ్గరగా ముడుచుకుపోయాను. ఇంతకాలమూ నాన్న ఉన్నరనే ధైర్యంతో ఉన్నాను. ముందు వైభవ్ నన్ను విడిచిపెట్టిన తరువాత నా గుండెపై ఎవరో పెద్ద సుత్తితో మోదినట్లయింది. నాన్న దూరమయిన తరువాత ప్రాణం లేని బొమ్మనయ్యాను. చిరునవ్వుకు దూరమయ్యాను. ఆకాశం లాంటి నాన్న జీవితాన్ని మేఘంలా కరిగించి, నన్ను ఇంతదాన్ని చేసిన నాన్న కోసం నా హృదయం ఈ శిథిల గోడల మధ్య ఒంటరిగా రోదిస్తూంది. పనిమనిషి జోగులమ్మ బయటకి వెళ్ళి అన్నీ తెచ్చిపెడుతుంది. నేను మాత్రం బయట కాలుపెట్టి చాలా ఏళ్ళయింది. అప్పటినుంచి వైభవ్ కోసం అందరూ నడిచే రోడ్డు వైపు చూస్తూ.. ఎప్పటికీ తిరిగిరాని నాన్న కోసం ఆకాశం వైపు చూస్తూ కాలం గడిపేస్తున్నాను.”
“మళ్లీ వైభవ్ కలవలేదా..” అడిగాను.
“కలవకే.. కలిసాడు, నాన్న డైరీ రూపంలో.. ఒకరోజు నాన్న మరణించిన చాలా కాలం తరువాత బీరువా తీసి పుస్తకాలు సర్దుతుంటే, ఆయన డైరీ కనిపించింది. దానిలో ఒక పేజీ చివర మడత పెట్టిఉంది. వైభవ్ ఫొటో కూడా పిన్ చేసి ఉంది. గుండె బరువుతో తెరిచి చూశాను. ‘మద్రాసు నుండి పని పూర్తిచేసుకుని తిరిగి వస్తున్నపుడు తన మిత్రుని కారులో బయలుదేరిన వైభవ్ మార్గమధ్యంలో యాక్సిడెంట్ అయి చనిపోయాడు. ఈ విషయం మా చిన్నారి మల్లికకు తెలిస్తే ప్రాణాలు విడుస్తుంది. ఆమె జీవించాలంటే ఈ నిజాన్ని నా గుండెల్లో సమాధి చేయాలి. ఈ నిజం నాతోనే అంతమయిపోవాలి. ఇంతకాలం రాకుండా ఏమయిపోయాడన్న సందిగ్ధావస్థలో ఉన్న ఆమెను కాలం మరిపిస్తే, వివాహం చేసి పంపించాలన్నది నా ఉద్దేశం. జీవితం ఒక క్షణంలో ముగిసిపోతుందని ప్రాణంతో ఉన్న ఏ మనిషికీ గ్రహించే శక్తి ఇంకా రాలేదు. బహుశా ఎప్పటికీ రాదేమో కూడా’. డైరీ చదివి ఒక్కసారిగా కుప్పకూలిపోయాను ఎందుకిలా జరిగిందని అడుగుదామని నోరు తెరిస్తే ప్రాణం ఉన్న అక్షరాలు కళ్ళెదుట కనిపించి నన్ను ఓదారుస్తూ ‘నన్ను క్షమించు తల్లీ.. ఈ కన్నీటితో భయంకర నిజం నీకు చెప్పకుండా దాచినందుకు’ అని తన చేతులతో నాన్న నా తల నిమురుతూ నన్ను ఓదారుస్తున్నట్లుంది. ఇదంతా చెప్పి మిమ్మల్ని బాధపెట్టినందుకు క్షమించండి. దూరమైన బంధాలన్నీ ఎండమావుల్లాంటివి.. దగ్గరగా వచ్చి దూరమవుతాయి.. కొన్ని జీవితాలింతే.”
మౌనంగా ఉన్న నేను.. “మిమ్మల్ని ఒక మాట అడగమంటారా?” అన్నాను.
“అడగండి” అంది.
“మళ్లీ వసంతం మీ ముందు వాలితే ఆహ్వానిస్తారా..?”
“ఏమో.. చెప్పలేను. దైవం నిర్ణయిస్తే కాదనలేను. ఇందాక మీరే అన్నారుగా ప్రకృతి నీవు కలిసి మాట్లాడుతున్నారని.. మీ మనసులో మాట అడగండి” అని కళ్లు మూసుకుంది.
“నేను మిమ్మల్ని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను.”
ఆమె ఇంకా కళ్ళు మూసుకునే ఉంది. బహుశా ఇంతకాలం ఏకాంతంలో ఉండి ధ్యానం అలవాటై ఉంటుంది.
“మీకు సమ్మతమయితేనే పెళ్లి చేసుకుంటాను. నన్ను మరోలా భావించకండి. ఒకవేళ మీరు కాదన్నా మౌనంగా ఇక్కడనుంచి వెళ్లిపోతాను. నాకు మిమ్మల్ని చూసిన తరువాత ఎగసిపడే అలల అంచున ఒంటరి తీరంలా కనిపించారు. ఉషోదయాన కిరణకాంతిలో మెరిసే శ్వేతశంఖంలా నన్ను పలకరించారు. అదిగో.. ఇప్పటిదాకా చూసిన ఆ పారిజాతం పూలు రాలి వాడిపోవచ్చు. నా మనసులోని మీ రూపం ఎప్పటికీ చెదిరిపోదు. మీ మాటల్లోని అనుభూతి మరో అనుభూతికి దారిచ్చింది. బహుశా అది మీతో కలిసి పంచుకునే జీవితానికేమో..” అంటూ ఆగాను.
మెల్లగా కళ్ళు తెరిచింది. ప్రశాంతంగా విచ్చుకున్న పద్మంలా మెరిసాయి ఆమె కనులు. అప్పుడే మబ్బులు కమ్మిన ఆకాశం నుండి వర్షపు చినుకులు పారిజాతం చెట్టుపై రాలుతున్నాయి. చాలా అందంగా ఉంది ఆ దృశ్యం.
దూరంగా వేణుగోపాలస్వామి గుడిలో గంటలు మ్రోగుతున్నాయి. ఆ గుడిపైపు చూపిస్తూ రెండు చేతులూ జోడించి నమస్కరించింది.