అయిదు అణాలు

0
2

[box type=’note’ fontsize=’16’] తన వచో వైదగ్ధ్యంతో తనను మెప్పించిన సుందరికి దండి కవి ఏం బహుకరించాడో చెబుతున్నారు జొన్నలగడ్డ సౌదామిని “అయిదు అణాలు” కథలో. [/box]

కవికుల గురువు, కాళిదాసూ, పద లాలిత్య ప్రభాకరుడు దండీ కలిసి సాయంత్రం వ్యాహ్యాళికి బయలు దేరారు.

ఒక్కసారి ఊహించుకుంటేనే గుండెలు గబగబా కొట్టుకుంటయ్యి. రసికావతంసుడూ, మహా కవిశేఖరుడు కాళిదాసు మంచి జరీ అంచు ఉన్న చీనా నుంచి తెప్పించిన పట్టు పంచ(చీనాంబరం) కట్టుకుని పైన పట్టు ఉత్తరీయం కప్పుకుని మెడలో, చేతులకీ మరువం కలిసిన మల్లెల మాలలూ, వాటిమధ్య ధగద్ధగాయమానంగా వెలిగిపోతున్న వజ్రాల హారాలూ, మరకత మణిభూషలూ ధరించి అన్నిటి మధ్యా స్పష్టంగా కొట్టోచ్చెట్టు కనిపించే నవరత్న ఖచిత ఏకముఖి రుద్రాక్షమాలతో, నడుముకి వైఢూర్యాలతోనూ పుష్య రాగాలతోనూ చేసిన బంగారపు మొలతాడు పెట్టుకుని తెల్లటి శరీరం మీద స్ఫుటంగా కనిపించేట్టు విభూతి రేఖలు ఉంచుకుని, దాచినా దాగని క్రితం రాత్రి తాలూకు దంత క్షత, నఖ క్షతాల గుర్తుల్ని చందనం పూతలతోనూ, తాంబూలపు రాగంతోనూ రంజితాలు చేసి సవిలాసంగా, నవ్వుతూ దాదాపు అంతే విలాసంగా తయారైన దండితో కలిసి అలా నడిచి వెళుతుంటే, ఓహ్, తలుచుకుంటేనే ఒళ్ళు గగురు పొడవటల్లేదూ. మనస్సు ఆనంద తరంగితం కావట్లేదూ.

ఉపమా కాళిదాసస్య, భారవే రర్ధ గౌరవం, దండినః పద లాలిత్యం(కాళిదాసు ఉపమాలంకారాలూ, భారవి మాటల్లో అర్ధాలూ, దండి పదాల లాలిత్యమూ) అని పెద్దలు ప్రస్తుతించిన ఆ మహానుభావుల అలంకారాలూ, పద లాలిత్యాలూ ఒక్కసారే వింటే ……

వాళ్ళిద్దరూ అలా వెళుతూ ఉంటే వాళ్ళ మధ్య ఎన్ని సరాగాలూ, వ్యంగ్యాలూ, వక్రోక్తులూ, దెప్పి పొడుపులూ, చమత్కారాలూ అటూ ఇటూ తిరిగాయో, ఎన్నెన్ని శ్లేషలూ, అలంకారాలూ, శాస్త్రాలూ, శృంగారాలూ,విరహాలూ, వయారాలూ ఆ వీధుల్లో పడిపోయాయో, ఎన్నెన్ని మలయానిలాలూ, మంచుతెమ్మెరలూ, మేఘ నిస్వానాలూ, వయసు పైకొస్తూన్న పడుచు పిల్ల వాళ్ళ కొంటె ప్రశ్నలూ, పుష్పలావికల ఘాటు సమాధానాలూ అలా ఇలా తేలిపోయాయో, ఓ, ఓహ్ ఓ భగవంతుడా. ఊహించుకుంటేనే వయస్సు ఒక పది ఇరవై ఏళ్లు తగ్గినట్టులేదూ.

ఇప్పటి కవిత్వప్పుస్తకాల లాగా ముందు మాటలు మరీ ఎక్కువైనట్టున్నయ్యి. కధలో కొద్దాం.

సరే కాళిదాసూ, దండీ కలిసి బయలు దేరారు వ్యాహ్యాళికి. ఇద్దరి చేతిలోనూ రత్న ఖచితమైన తాంబూలం వస్తువులన్నీ పెట్టుకునే చిన్నపెట్టెలున్నయ్యి.

ఎదురుగుండా వొచ్చిన వాళ్ళ మీదా, రాజు మీదా, వీళ్ళ మీదా, వాళ్ళ మీదా కబుర్లు చెప్పుకుంటూ, వాదులాడుకుంటూ మెల్లిగా వీధి మలుపు తిరిగారు. అక్కడున్నది నవనవోన్మేషమైన వేరే ప్రపంచం. అక్కడ వెన్నెల సంపంగి పువ్వు వాసన వేస్తోంది. చంద్రుడు నవ్వుతున్నాడు. మన్మదుడికి రెండు చేతులూ చాలట్లేదు. ఒక పక్క మేడ మీద నించి భరతం వినిపిస్తోంటే, ఇంకో పక్క నించీ వీణానాదం సంభ్రమింప చేస్తోంది.

యవ్వనం విరజిమ్ముతున్న ఒక పిల్ల తూనీగలాగా రివ్వున వొస్తుంటే చూసి “తన్వీ శ్యామా” అని దండి అన్నాదు. “మధ్యే క్షామా” అని కాళిదాసు నవ్వాడు. చామన చాయలో ఉన్నా ఆ అమ్మాయి ముఖం కళకళ లాడి పోతోంది. ఆ అమ్మాయి వొంటి నిండా నగలే. పైనుండి కింద దాకా సగం పైన దేహం అంతా బంగారపు ఆభరణాలు మెరిసిపోతున్నయ్యి. ఆ అమ్మాయి వొచ్చి కాళిదాసుకి నమస్కరించబోయింది. “ముందర పెద్దవాళ్ళకి” అని దండి వైపు చూపించాడు కాళిదాసు. దండి కాళ్ళకి నమస్కరించి తరవాత కాళిదాసుకి నమస్కరించింది. “దీర్ఘాయుష్మాన్ భవ, సకల విద్యా ప్రాప్తిరస్తు” అని దండి దీవిస్తుంటే కాళిదాసు గొంతు కలిపాడు.

ఆ పిల్ల వెనక్కి తిరిగి వెళ్ళిపోసాగింది.

దండి తన తాంబూలం పెట్టె తీసి మిగిలిన తమలపాకులు చేతిలోకి తీసుకుని చూస్తె తాంబూలం పెట్టెలో సున్నం అయిపొయింది.

“పిల్లా” అని పిలిచాడు దండి. ఆ పిల్ల వెనక్కితిరిగింది. తాంబూలం పెట్టె చూపిస్తూ “ తూర్ణమానీయతాం చూర్ణం పూర్ణ చంద్ర నిభాననే(ఓ పూర్ణచంద్రుడి లాంటి మొహం కల పిల్లా, తొందరగా సున్నం తీసుకురా)” అన్నాడు. ఇంతలో కాళిదాసు పెట్టె తెరిచి చూస్తే ఆకులు లేవు. వెంటనే ఆ పిల్ల వైపు తిరిగి నవ్వుతూ విలాసంగా “పర్ణాని స్వర్ణ వర్ణాని కర్ణాంతాకీర్ణ లోచనే( చెవులదాకా కళ్ళున్న పిల్లా, బంగారం రంగులో ఉన్న ఆకులు కూడా)” అన్నాడు. ఆ కవి ద్వయం ఆ ఇంటి బయట ఆగారు.

ఆ పిల్ల నవ్వుకుంటూ పరిగెత్తుకుని ఇంట్లో కెళ్ళింది. ఆ పిల్ల నడుం ఉందా లేదా అని ఆ పండిత శేఖరులు ఒక్క నిమిషం వాదోపవాదాలు చేసి లేదని స్థిరపడ్డారు. ఇంట్లో ఏవో గుసగుసలూ, ఎవరో ఏదో ఆ పిల్లతో మాట్లాడుతున్నట్టు వినిపించింది. ఇంతలో ఒక్కసారి కలకూజితాలూ పెద్దపెట్టున నవ్వులూ వినిపిస్తే ఏమా అని ఆలోచించేంతలో ఆ పిల్ల ఆకులూ సున్నం పట్టుకొచ్చి కాళిదాసు దగ్గిరికి వెళ్ళి ముందర ఆయనకీ ఆకులు ఇచ్చి తరవాత దండికి సున్నం ఇచ్చి ఇద్దరికీ నమస్కరించింది.

“ఇదేంటి పిల్లా, ఇందాక వీడు చెప్పినట్టు పెద్దవాణ్ణీ, ముందర అడిగిన వాణ్ణీ నన్ను వొదిలేసి మావాడికి ముందర సత్కారం చేశావు” అన్నాడు దండి నవ్వుతూ.

 ఆ అమ్మాయి నవ్వి త్రిభంగిగా నిల్చుని తల దించుకుని కాలి బొటనల వేలితో భూమి మీద రాస్తూ సిగ్గు ప్రదర్శిస్తూ విలాసంగా మనో మోహనంగా “అడిగే పధ్ధతి బట్టి ఇచ్చే పధ్ధతి ఉంటుంది కదా కవీశ్వరా” అంది. కవులిద్దరూ మొగమొగాలు చూసుకున్నారు. కాళిదాసు ముఖంలో చిరునవ్వు ఉదయించింది. దండి అదేమీ గమనించకుండా “అదెట్లా. ముందర అడిగింది నేనే కదా” అన్నాడు.

ఆ అమ్మాయి కాళిదాసు కేసి సాకూతంగా చూసింది. చిరునవ్వు నవ్వుతూ దండితో “మహా కవులు మీకు చెప్పదగ్గ దానిని కాదు. నేను అమ్మాయిని. అమ్మాయిల దగ్గిరినుంచీ ఏమన్నా కావాలంటే అధికారం చెలాయిస్తూ అడిగేకంటే అడిగీ అడగనట్టు అడిగితే ఫలితం ఉంటుందని తమకు తెలీదా. మీరు ఫలానాది తెమ్మనీ అందులోనూ తొందరగా తెమ్మనీ పురమాయించారు. ఆయనగారు తెమ్మనీ, ఇమ్మనీ కాకుండా ఆ వస్తువు పేరు చెప్పి మటుక్కు ఊరుకున్నాడు. అందుకని ముందర ఆయనకీ ఇవ్వటమే ధర్మం అనిపించింది” అని ఒక్క క్షణం ఆగింది. దండి ముఖంలో విభ్రాంతీ, ఆశ్చర్యమూ,ఆనందమూ ఒక్కసారే కనిపించాయి. ఆయన ముఖంలో ఉత్తేజమూ, కళ్ళల్లో మెరుపూ స్పష్టంగా చూసి ఆ పిల్ల గొంతు సవరించుకుని సిగ్గులు వొలకబోస్తూ

“ఇంకోటి. నేను వార కాంతని. మీకంటే ఆయన నాకు రెండణాలు ఎక్కువ ఇచ్చారు. ఎవరు ఎక్కువిస్తే వాళ్ళని ముందర తృప్తి పరచటం మా కర్తవ్యం కదా కవీంద్రా” అని విలాసంగా జుట్టుని సవరించుకుంది.

 “ఇదేంటి, డబ్బులు ఎప్పుడు ఇచ్చావు నువ్వు” అని దండి కాళిదాసుని అడిగాడు.

“నేనేమీ ఇవ్వలేదు” అంటూ చిరునవ్వునవ్వుతున్న కాళిదాసు వైపు సందేహం తో చూసాడు దండి.

“ఆయనా ఇచ్చారు, మీరూ ఇచ్చారు” అని రాగచ్చాయలో ప్రస్ఫుటంగా శ్లోకం చదివింది ఆ తూనీగ.

తూర్ణ మానీయతాం చూర్ణం పూర్ణచంద్ర నిభాననే

పర్ణాని స్వర్ణ వర్ణాని కర్ణాంతా కీర్ణ లోచనే

అని శ్రావ్యంగా పాడి దండి వైపు తిరిగి “మీరు చెప్పిన పాదంలో మూడణాలున్నయ్యి, ఆయన చెప్పిన పాదంలో అయిదణాలున్నయ్యి. ఎవరు మాకు ఎక్కువణాలిస్తే వాళ్ళని ముందర గౌరవించటం వార కాంతగా నా ధర్మం కాదా కవీంద్రా” అని సవినయంగా మాట్లాడిన మాటలకి దండి పరవశుడైపోయాడు. అక్కడే ఉన్న అరుగు మీద కూలబడుతూ “ఇదిగో వెళ్ళి మీ ఊరూ వాడా అందరినీ ఇక్కడికి త్వరగా పిలుచుకురా” అన్నాడు.

కాళిదాసుని పక్కన కూచోబెట్టుకుని ఏవో మాటలు మాట్లాడుతూ ఉంటే చటుక్కున ఆ ప్రదేశం అంతా వేల మెరుపు తీగలు ఒక్కచోటే మెరుస్తున్నట్టై చకచ్చకితమై పోయింది. ఎప్పుడూ మేడలు దిగని అసూర్యంపశ్యలు కూడా కవులిద్దరినీ చూడటానికి దిగి వొచ్చి బిలబిల్లాడుతూ ఆ ఇద్దరిచుట్టూ చేరి కబుర్లాడుతున్నారు. ఇంతలో ఇందాకటి తూనీగ ఇంకాసిని ఆభరణాలు ధరించీ జుట్టు సద్దుకునీ వొచ్చి ఎదురుగా నిలుచుంది. దండి లేచి నిలుచుంటుంటే కాళిదాసు కూడా లేచి నిలబడ్డాడు.

తూనీగని దగ్గిరికి పిలిచి తన ముంజేతి కంకణాన్ని తీసి “ఇది విక్రమార్క మహారాజు నా కావ్యాన్ని విని బహూకరించిన నవరత్న ఖచిత కంకణం. ఈ సుందరి నన్ను తన వచో వైదగ్ధ్యంతో మెప్పించింది. ఈమెకు ఈ కంకణాన్ని బహుకరిస్తున్నాను” అంటూ అందరికీ కనపడేలాగా ఆ కంకణాన్ని ఎత్తి పట్టుకుని చూపించి ఆమె చేతికి తొడుగుతుంటే కాళిదాసు ఆశీర్వచన పనసలు చదివాడు. చుట్టూ ఉన్న సుందరీ జనాల కేరింతలతో ఉజ్జయిని మార్మోగిపోయింది. పక్కనే ఉన్న క్షిప్రా నది పరవశించి పొంగి పొర్లింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here